ఒకప్పట్లో ఆడపిల్లలకి చదువుకునే రోజుల్లోనో లేక చదువు అయిన వెంటనే పెళ్లి చేయడమో తరతరాలుగా చూస్తున్నదే. అలాగే ఇప్పటికీ జరుగుతున్నదే, కొన్ని సందర్భాలలో అది మంచికైతే కొందరికి అది చేదు అనుభవం మిగిలిస్తుంది. అటువంటి సందర్భం నాకు ఎదురైంది. అయ్యో, అది మంచి అనుభవమే.
నేను చదువు పూర్తిచేసుకున్న వెంటనే మా ఇంట్లో పెళ్లి ప్రస్తావన వచ్చింది. మా నాన్నగారి ఇష్టం అని నేను పెళ్లికి ఒప్పుకున్నాను. కొద్ది రోజులకే పెళ్లి జరిగింది- అబ్బాయి ఎవరు ? ఏంటి ? ఎం చేస్తారు ? అలాంటివి ఏం తెలియకుండానే నేను పెళ్లి చేసుకున్నాను. ఇందులో తప్పు ఒప్పుల గురించి పక్కన పెడితే - నాకు మా నాన్నగారు అంటే ఎనలేని ఇష్టం,ప్రేమ,భక్తి,గౌరవం అన్నీ.. నాకోసం ఏం నిర్ణయం తీసుకున్నా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారు అని తెలిసే అన్నిటికి అంగీకారం తెలిపే చేసుకున్నాను.
అప్పటికి నా వయసు 22 , చదువు పూర్తిచేశాను కానీ ఇంకా చదవాలి అని మనసులో ఉండేది. అందరం కలిసే ఉంటాము కనుక అత్తయ్యగారింట్లో ఒప్పుకుంటారా లేదా అని భయం ఒకవైపు, ఒకవేళ ఒప్పుకుంటే నేను అన్నిటిని సమర్ధవంతంగా చేయగలనా అని సందిగ్ధము మరోవైపు. చివరకి నా మనసులోని మాటను ఎట్టకేలకు ఒక సందర్భము చూసుకుని చెప్పాను. ఒక నిమిషము కూడా ఆలోచించకుండా, ఒక ఇంత సందేహం కూడా లేకుండా వెంటనే నీకు ఎలా నచ్చితే ఆలా చేయి కానీ ఇకనుంచి ఏమి చేసిన మన ఇంటి గురించి అలోచించి చేయాలి అని అందరూ ఒప్పుకున్నారు. అప్పటివరకు మౌనంగా చెప్పిన పని చేసిన నేను.. ఒక్కసారికి నాలోని ఆత్మవిశ్వాసం, వాళ్ళపట్ల అభిమానం పెంపొందింది.
నా భర్త,అత్తయ్యగారు,మావయ్యగారు మరియు మొదలగువారు ప్రతీరోజు ఒక కొత్త పుస్తకము తీసుకుని వచ్చేవారు లేదా నాకు తెలియని ఒక కొత్త విషయము చెప్పేవారు. అప్పటిదాకా నాకు ఉన్న భయం,సందేహం,ఆలోచన అన్నీ మాయం అయిపోయి ఇష్టం, ప్రేమ, ఆప్యాయత కలిగాయి. అవి ఇప్పటికీ అలానే ఉన్నాయి.
ఆరోజు నేను ధైర్యం చేసి చెప్పకపోయి ఉంటే నేను ఈరోజు ఇలా ఉండేదాన్ని కాదేమో. అదో గొప్ప అనుభవం. ఇది చదివే ప్రతి ఒక్కరికి నా మనవి ఏంటంటే - భయపడకుండా మనసులోని మాటని చెప్పండి, మంచికైనా చెడుకైన దేనికైనా అది మనకి అనుభవాన్ని ఇస్తుంది. ఆ అనుభవం మనకు ఎల్లవేళలా తోడుంటుంది కాపాడుతుంది. అలాగే ఎవరైనా ఏదైనా చెప్తే - ఆలోచించండి. ఎందుకు చెప్పారు ? అందులో ఉపయోగం ఏంటి ? అది మంచికొరకేనా అని.
అందరి భావాలని గౌరవించడం, చేసే పనిని ప్రోత్సహించడం, మనం ఆనందంగా ఉండి, అందరూ ఆనందంగా ఉన్నారా లేదా అని చూసుకోవడం కర్తవ్యంగా భావిద్దాం.
సర్వేజనా సుఖినోభవంతు.