సమయస్పూర్తి - పద్మావతి దివాకర్ల

smartness

బ్రహ్మపురంలో నివసించే సుబ్బయ్య, సీతయ్య అనే ఇద్దరు స్నేహితులు ఒకసారి తమ పొలంలో పండించిన పంట పట్నంలో అమ్మడానికి బాడుగ బండిలో వెళ్ళారు. అవి అమ్మిన తర్వాత పట్నంలో తమ సరుకులు కొన్న వ్యాపారులనుండి పాత బకాయిలు కూడా వసూలు చేసుకొన్నారు. అనుకున్నదానికంటే ఎక్కువ వసూలు అవటంతో పండగ కానుకగా తమ భార్యల కోసం నగలు కొనాలని అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొన్నారు.

"ఎన్నాళ్ళనుండో మీ వదిన తనకో హారం చేయించమని అంటోందిరా! ఇప్పుడు నేను ఈ బంగారం గొలుసు కనుక హఠాత్తుగా తీసికెళ్ళి పండుగ కానుకగా ఇస్తే మురిసిపోతుందిరా!" అన్నాడు సుబ్బయ్య.

"నీ మరదలు మాత్రం చాలా రోజులుగా తనకి బంగారు గాజులు చేయించమని పోరుతోంది. ఇవాళ మనకి కావలసినంత ధనం వచ్చింది. నేను బంగారు గాజులు గనుక తీసికెళ్తే ఆమె ఆశ్చర్యం, ఆనందంతో తలమునకలవుతుంది." అన్నాడు సీతయ్య.

ఇలా అనుకొని ఇద్దరూ తమతమ భార్యలకోసం బంగారు ఆభరణాలను ఖరీదు చేసారు. అవేకాక పండుగకి అవసరమైన వస్తువులు కూడా కొన్నారు. అయితే వాళ్ళ పనులు తెమిలేసరికి బాగా చీకటిపడిపోయింది. మొదట రాత్రిపూట ప్రయాణం మంచిదికాదేమోనని తలచినా బాడుగబండి చేతిలో ఉండటంతో తమ ఊరికి తిరుగు ప్రయాణం కట్టారు.

తోవలో కౄర మృగాల బెడదలేక పోయినా అప్పుడప్పుడూ దొంగల భయం మాత్రం ఉండనే ఉంది. అయినా ఒకరికొకరు తోడుగా ఉన్నామని ధైర్యంగా బయలుదేరారు స్నేహితులిద్దరూ. సరిగ్గా సగం దూరం వచ్చారేమో, వాళ్ళ దారిని అడ్డగించారు ఇద్దరు దుండగులు. బండితోలే ఆదయ్యకి బండి ఆపక తప్పలేదు. బండి ఆపి భయంతో వణకసాగాడు. ఆ దుండగుల చేతుల్లో తళతళలాడే కత్తులు వెన్నెలలో మెరుస్తున్నాయి. చూస్తూనే వాళ్ళని దారి దోపిడీదారులుగా గుర్తించి మిత్రులిద్దరూ భయంతో వణికిపోయారు. ఇక తమ కష్టార్జితమంతా దొంగలపాలైపోతుందని విచారించారు. తమ దురదృష్టానికి తమని తామే నిందించుకున్నారు.

"ఊఁ...మీదగ్గర ఉన్నదంతా త్వరగా ఇవ్వండి, లేదంటే మీ తలకాయలు తెగిపోతాయి." అని కరుకుగా హెచ్చరించాడు ఆ దొంగల్లో ఒకడు క్రూరంగా ఆ మిత్రులవైపు చూస్తూ.

ఇక తమనెవరూ కాపాడలేరని, తమవద్ద ఉన్న బంగారు ఆభరణాలుతో పాటు, మిగిలిన రొక్కంకూడా దొంగలపాలవుతుందని ఒక్కసారి దుఃఖం ముంచుకొచ్చింది సుబ్బయ్యకి. అతను మనసులోనే కోటి దేవుళ్ళకి మొక్కుకుంటున్నాడు. అయితే సీతయ్య మాత్రం ఈ దొంగలబారినుండి తప్పించుకోవడానికి మార్గమేమైనా ఉందా అని మనసులోనే ఆలోచించసాగాడు.

సుబ్బయ్య విచారంగా తనవద్దనున్న బంగారం ఆభరాణాలు, రొక్కం తీయబోయేంతలో, సీతయ్య ఎక్కడో దూరం నుంచి లీలగా గుర్రం డెక్కల చప్పుడు విన్నాడు. ఎక్కణ్ణుంచో గుర్రంమీద ఎవరో ఆ మార్గాన వస్తూన్నట్లు తెలుసుకున్నాడు. దొంగల నుండి తప్పించుకోవడానికి వెంటనే అతని మనసులో ఓ ఉపాయం తట్టింది.

సీతయ్య వెంటనే సుబ్బయ్యవైపు తిరిగి కోపంగా, "ఒరేయ్ సుబ్బయ్యా!... ఇప్పుడు చూడు ఏం జరిగిందో? నేనెంత చెప్పినా కూడా నువ్వు నా మాట పెడచెవినపెట్టావు. రాజుగారి ఖజానాలోనుండి బంగారం, సొమ్ములు దొంగతనం చెయ్యొద్దురా, చాలా ప్రమాదం అంటే విన్నావా? ఇప్పుడు చూడు ముందేమో వీళ్ళు, మన వెనకేమో రాజుగారి రక్షక భటులు. రక్షక భటులకి దొరికితే ఇంకేమైనా ఉందా? మనకి కఠినమైన శిక్ష పడుతుంది. ఈ నేరానికి మరణ దండన కూడా పడవచ్చు. ముందు నుయ్యి, వెనక గొయ్యిలా ఉందిప్పుడు మన పరిస్థితి." అన్నాడు సమయస్పూర్తిగా. సీతయ్య ఏం చెప్తున్నాడో అర్థం కాక తెల్లమొహం వేసి బిత్తరపోయాడు సుబ్బయ్య. అయితే వెంటనే తన మిత్రుడేదో ఉపాయం పన్ని అలా మాట్లాడి ఉంటాడని భావించాడు సుబ్బయ్య.

ఇప్పుడు గుర్రం వస్తున్న శబ్దం మరికాస్త దగ్గరైంది. ఆ శబ్దం ఆ దోపిడిదొంగలిద్దరూ కూడా స్పష్టంగా విన్నారు. ఇద్దరూ ఒకరి ముఖాలొకరు భయంగా చూసుకున్నారు.

"మీరు రాజుగారి ఖజానాలో దొంగతనం చేసారా? మిమ్మల్ని భటులు వెంబడిస్తున్న సంగతి చెప్పలేదేమీ?" అన్నాడు అందులో ఒకడు.

దానికి జవాబుగా, "మీరు చెప్పనిస్తేగా! నేను వద్దని వారిస్తున్నా నా మిత్రుడే వినిపించుకోక ఈ దారుణానికి ఒడిగట్టాడు. రక్షక భటులనుండి తప్పించుకున్నామని అనుకున్నాము, గాని వాళ్ళు ఎలా కనిపెట్టారో మరి మళ్ళీ మా వెంటపడినట్లున్నారు. అదిగో గుర్రం వస్తూన్న శబ్దం. దగ్గరకి వచ్చేసినట్లున్నారు. ఇప్పుడు మాకేం దారి? పోనీ మీరు ఈ సొత్తు పట్టుకుపోయి మమ్మల్ని వదిలేసి వాళ్లకి దొరకకుండా పొండి. ఇలాగైనా మేం వాళ్ళ నుండి మమ్మల్ని కాపాడుకుంటాం." అని వాళ్ళని ప్రాధేయ పడసాగాడు సీతయ్య.

అప్పటికే గుర్రం డెక్కల శబ్దం దగ్గరైంది. సీతయ్య చెప్పినది నిజమని నమ్మారిద్దరు దొంగలూను. వాళ్ళవద్ద ఉన్నవి రాజుగారి ఖజానా నుండి దొంగతనం చేసినవని కూడా నమ్మారు..

సీతయ్యవైపు కోపంగా చూసి, "ఏం, మీ బదులుగా మేము రక్షకభటులకు పట్టుబడాలనా నీ దురాలోచన. మీ ఆటలేమీ సాగవు. మీ బాధలేవో మీరే పడండి." అని వాళ్ళిద్దరూ అక్కణ్ణుంచి దౌడు తీసారు.

అలా సీతయ్య సమయస్పూర్తి వల్ల దొంగలబారిన పడకుండా తప్పించుకున్నారు స్నేహితులిద్దరూ.

గుర్రం దగ్గరయ్యాక చూసారు మిత్రులిద్దరూ. అది తమ ఊరి రక్షకభటునిదే. అతను రాజధానికి ఏదో పనిపై వెళ్ళి తిరిగి వస్తున్నాడు. మిత్రులిద్దర్నీ పలకరించి ముందుకి సాగాడు. అపాయం తప్పినందున ఆదయ్య అతని వెనుకే బండి తమ ఊరు వైపు నడిపించాడు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు