అనగనగగా ఒక ఊరిలో బుద్ధిమాన్ అనే ఒక ముసలాయన ఉండేవాడు. అతడు స్వామి వివేకానందుడి(అప్పటికి నరేంద్రుడు) చిన్ననాటి స్నేహితుల్లో ఒకడు. అయితే బుద్ధిమాన్ తండ్రి ఉద్యోగరీత్యా మద్రాసు ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వటంతో అతడు మరి ఎన్నటికీ వివేకానందుల వారిని కలవలేదు. కానీ తరువాతి కాలంలో స్వామిజీ చికాగో, యూరోప్ ప్రాంతాలకు వెళ్ళటం, అద్భుతమైన ఉపన్యాసాలు ఇవ్వటం, గొప్ప హితబోదలు చెయ్యటాన్ని ఇతడు రేడియోలో వినేవాడు. అతని బోధనలను చదివి ఆచరించేవాడు. తరువాత కాలంలో వివేకానందుని మరణవార్త విని ఎంతో సోఖించాడు. అప్పటికే బుద్ధిమాన్ కి రాజేష్ అనే ఇరవయేళ్ళ కొడుకున్నాడు. అతడిని పెళ్లి చేసి అప్పటికే రెండేళ్లయ్యింది. కోడలు నిండుగర్భవతి. ఆ రోజున డెలివరీ డేట్ ఇవ్వటంతో ఆమెను హాస్పిటల్లో చేర్చారు. ఆమెకు మగబిడ్డ పుట్టాడు. అదేరోజు వివేకానందుడు మరణించిన రోజు అవ్వటంతో, తన మనవడికి 'వివేకానంద' అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాడు బుద్ధిమాన్. ఇష్టం లేకపోయినా అతని మాట కాదనలేక ఒప్పుకున్నారు రాజేష్ దంపతులు. కాలం గడుస్తుంది. బుద్ధిమాన్ అతని మనవడిని స్వామి వివేకానందుని ఆలోచనలతో పెంచసాగాడు. మంచివాడిగా తయ్యారుచేశాడు. ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజేష్, ఒకసారి లంచం తీసుకుని ఆ సొమ్ముతో ఇంటికి వచ్చాడు. తాను ఆ విషయం ఇంట్లో చెప్పకుండానే అతని పదేళ్ల కొడుకు వివేకానంద పసిగట్టేసాడు. "ఇది మొదటిసారి కాదు నాన్న. నీవు తప్పుచేసిన ప్రతిసారీ ఆ విషయం నాకు నీ ముఖంలో తెలిసిపోతుంది!" అని చెప్పి నవ్వుతూ చెప్పేసరికి కోపంతో ఊగిపోయాడు రాజేష్. "వీడిని ఇలాగే తయారు చేసి చెడగొట్టు! నేటి సమాజంలో వివేకానందుడిలా బ్రతికితే మిగిలేది అడుక్కునే చిప్ప!" అని అతను బుద్ధిమాన్ పైన అరిచాడు. అది విని వింవేకానంద నవ్వుకుని తన గదిలోకి పోయి ధ్యానం చేసుకున్నాడు. అప్పటికే రాజేష్ కి హరి అనే నాలుగేళ్ళ మరో కొడుకు ఉన్నాడు. వాడిని ఎట్టి పరిస్థితుల్లో బుద్ధిమాన్ వద్దకు పంపేవారు కాదు. "వీడిని నేటి ప్రంపంచానికి తగ్గట్టుగా పెంచుతాం!" అని బుద్ధిమాన్ తో అన్నారు. పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. ఇద్దరూ ఒకే ఇంట్లో పెరిగినా ఎంతో విభిన్నమైన వ్యక్తిత్వాలను పొందారు. వివేకానంద ఒక ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా చేరి అతని భార్య పిల్లలతో కలిసి అవసరమన్నవారికి వీలైనంత సహాయం చేస్తూ సంతోషంగా జీవిస్తున్నాడు. బుద్ధిమాన్ కూడా వారితోనే ఉండేవాడు. హరి మాత్రం దేశంలోనే అతిపెద్ద వ్యాపారవేత్తగా మారాడు. అతడు చెయ్యని మోసమంటూ లేదు కానీ అతడిని ప్రేశ్నించేవాడే లేడనేది అతని భావన. అతడు ముంబైలో ప్రపంచంలోనే అతి ఖరీదైన ఇంట్లో అతని భార్య పిల్లలతో విలాసంగా జీవిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు అతనితోనే ఉంటున్నారు. కాలచక్రం అలా తిరిగింది. బుద్ధిమాన్ స్వర్గస్తుడయ్యాడు. అప్పుడు ఇతర కుటుంబసభ్యులతో సహా పరమర్శకు వచ్చిన హరి, "వదినమ్మ చీర బాగా మాసిపోయింది అన్నయ్య. కొత్త చీరకు డబ్బులేమైన ఇవ్వమంటావా!" అని ఎగతాలిగా అన్నాడు. అది విన్న వివేకానంద పదిహేనేళ్ల కొడుకు నవ్వుతూ, "వద్దులే చిన్నాన్న! చావు కార్యానికి, పెళ్లికి పోయినట్టు భారీగా ముస్తాబైన పిన్నిగారికి మేమె మంచి హితబోధ చేసి పంపిస్తాములే!" అన్నాడు. అది విన్న జనమంతా ఒళ్ళంతా బంగారంతో మెరిసిపోతున్న హరి భార్యను చూసి తిట్టుకోవడం మొదలుపెట్టారు. సంవత్సరాలు గడిచాయి. ఉపద్యాయుడి వృత్తి నుంచి ప్రమోట్ అయ్యి వివేకానంద ఎమ్.ఈ.ఓ గా కొంతకాలం పనిచేసి డి.ఈ.ఓ అయ్యాడు. తన జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్ధి, కొన్ని వేల మంది గొప్ప విద్యార్థుల్ని అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వారిగా తీర్చిదిద్దాడు. జిల్లా మొత్తం ఇంటికొక వివేకానందున్ని తయారు చేసాడు. దేశంలోని విద్య రంగానికి సంబందించిన గొప్ప మేధావులు, విద్యావేత్తలు, ఉన్నతాధికారులంతా అతని వద్ద శిక్షణ తీసుకుని అదే పద్దతిని దేశమంతా అమలు పరిచి రెండు శతాబ్దాల్లో దేశాన్ని ప్రపంచంలోనే ఉన్నత దేశంగా మార్చారు. వీటంతటికి కారణమైన వివేకానందున్ని దేశ రాష్ట్రపతి చేతులమీదుగా భారతరత్న వరించింది. అదే సమయంలో, అంతకు మునుపువరకు అత్యుత్తమ వ్యాపారవేత్తగా ఉన్న హరి, ఒక్కొక్క ఫ్రాడ్ కేస్ లో బయటపడటం జరిగింది. అన్ని స్కాములు ఋజువయ్యాక అతడి అన్ని వ్యాపారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొనవలసిందిగా సుప్రీం కోర్టు ఆదేశించి అతడికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. ఈ రెండు కధలకు మూలము నుంచి ప్రత్యక్ష సాక్షి అయిన రాజేష్, తన తండ్రిని గుర్తుకు తెచ్చుకుని ఏడ్చాడు. ఎవడు వివేకానందుడిని ఎవడు అవివేకానందుడిని తయారు చేసాడో అర్థం చేసుకున్నాడు. కానీ అప్పటికే సమయం చెయ్యిదాటిపోయింది.