వికాసం - చెన్నూరి సుదర్శన్

growth

పూర్వం ఒక పల్లెటూళ్ళో సాయమ్మ, ఆమె మనుమడు మల్లేశం పూరి గుడిసెలో నివసించే వారు. మల్లేశం బాల్యంలోనే తల్లిదండ్రులు కాలంచెయ్యడంతో సాయమ్మ చేతిలో గారాబంగా పెరిగాడు. మల్లేశం దాదాపు పెళ్లీడుకు వచ్చాడు గాని బుద్ధి ఏమాత్రమూ వికసించ లేదు. చిన్న పిల్లలతో కలిసి ‘చిర్రగోనె’ (గిల్లి దండ), గోళీలాటలు ఆడుకోవడమే సరిపోతోంది. పెళ్లి చేస్తే బాగుపడుతాడేమోనని ప్రయత్నించింది. పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎలా బాగుపడ్తాడో ఏమో..! ఎలా పెళ్లి చేయాలో ఏమో..! అని అందరితో చెప్పుకుంటూ కంట నీరు పెట్టుకునేది సాయమ్మ.

ఒక రోజు ఉదయమే మల్లేశం లేచే సరికి సాయమ్మ కాలుకు. చేతికి పాత చీర అంచు చీల్చి కట్టిన పట్టీలు.. వాటిపై పసుపు అద్దిన రక్తపు మరకలు అట్టుకట్టి ఉన్నాయి. వాటిని చూడగానే బెంబేలెత్తిపోయాడు మల్లేశం.

“అమ్మమ్మా ఏమయ్యింది” అంటూ గజ, గాజా వణకుతూ అడిగాడు.

“రాత్రి ఆవలకు పొతే జారి పడ్డానురా.. పక్కింటి ప్రమీల వచ్చి పట్టీలు కట్టింది. కాలు కింద పెట్ట రావడం లేదు, చెయ్యి లేవడం లేదు” అంటూ ఏడ్వసాగింది.

“అయ్యో ఇప్పుడు ఎలా? నాకు ఆకలిగా ఉంది” అంటూ బిక్క ముఖం పెట్టాడు మల్లేశం.

“నేను చెప్పినట్టు చెయ్యి” అని మంచంలో పడుకునే బతిమాలింది సాయమ్మ. ఆకలికి తట్టుకోలేక మల్లేశం ఒప్పుకోక తప్ప లేదు.

అన్నం వండే విధానం చెబుతుంటే.. నానా తంటాలు పడుతూ.. చేతులు కాల్చుకుంటూ.. పొయ్యి నుండి వచ్చే పొగతో కంటి నీళ్ళు భరిస్తూ.. అన్నం వండాడు మల్లేశం. సాయమ్మకు జాలి వేసింది కాని తప్పదని గుండె నిబ్బరం చేసుకున్నది. అలాగే పప్పు వండే పద్ధతి గూడా ఒక్కొక్కటిగా చెపుతుంటే.. చేశాడు. మొదటి సారిగా అమ్మమ్మకు తినిపించి తాను తిన్నాడు మల్లేశం. సాయమ్మ కళ్ళల్లో ఆనంద భాష్పాలు చూసి మల్లేశంకు సగం కడుపు నిండి పోయింది. ఆత్మీయకరమైన అనుభూతి చెందాడు.

ఆ మరునాటికి బియ్యం ఉన్నాయో! లేవో! చూడమంది సాయమ్మ. మూలకున్న దొంతి కుండలో చూసి లేవన్నాడు మల్లేశం. మరి రేపు ఎలాగా? అంటూ అడిగింది.

“ఏమో..! నాకేంతెలుసు” అంటూ దేబె మొహం వేసుకుని అరచేతులు వంకర్లు తిప్పుతూ అన్నాడు.

“మరి మనకు ఆకలి వేస్తుంది కదా.. అందుకే బియ్యం షావుకారు కొట్టులో కొనుక్కోవాలి. కొనుక్కోవాలి అంటే డబ్బు కావాలి. మరి డబ్బు ఎలాగా?” అని మళ్ళీ ప్రశ్నించింది.

నాకు తెలియదన్నట్టుగా పెదవి విరిచాడు మల్లేశం.

“నేను అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి అమ్మేదాన్నని నీకు తెలుసు గదా.. అలాగే నువ్వు గూడా ఈ రోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొని తీసుకు రావాలి. అందులో సగం అమ్మి సొమ్ము చేసుకోవాలి. మిగతా సగం

మనం వంట చేసుకోడానికి పనికి వస్తాయి” అంటూ వివరించింది.

నాకు కట్టెలు కొట్టడం తెలియదన్నాడు మల్లేశం.

“ప్రమీలను తోడుగా తీసుకొని వెళ్ళు” అంటూ సలహా ఇచ్చింది.

‘ఈ ముసల్ది ఎప్పుడు మళ్ళీ మామూలు మనిషి అవుతుందో! నాకీ పని పీడ ఎప్పుడు విరగడ అవుతుందో!’ అని మనసులో తిట్టుకుంటూ ప్రమీలను తీసుకొని అడవికి దారి తీశాడు మల్లేశం. ప్రమీల దారి వెంట నడుస్తూ, మల్లేశంకు పొదుపు పాఠాలు వివరించేది. లోకజ్ఞానం కథల ద్వారా నూరి పోసేది.

కొద్ది రోజులు గడిచేసరికి మల్లేశం ఇదివరలా ఆకతాయిగా తిరుగ కుండా ఇంటి పనుల్లో, బయట పనుల్లో నిమగ్నమై, సాయమ్మ బాగోగులు చూసుకోసాగాడు.

ఒకరోజు మల్లేశం వంట చెస్తుండగా ప్రమీల వచ్చింది. సాయమ్మ చెప్పక ముందే.. టీ కాచి ప్రమీలకు, సాయమ్మకు తెచ్చిచ్చాడు మల్లేశం.

టీ తాగడం పూర్తికాగానే.. “సాయమ్మా నీ మునుమని గురించి నీకింకా ఎలాంటి బెంగ అక్కర లేదు. ఇంకా ఎందుకీ నాటకం” అంటూ మంచం మీది నుండి సాయమ్మను లేపింది ప్రమీల.

సాయమ్మ బొక్కి నోటితో ముసి, ముసి నవ్వులు నవ్వుకుంటూ.. లేచి నిలబడింది. చేతికి, కాలుకు కట్టుకున్న పట్టీలు విప్పి పారేసింది. మల్లేశం నిర్ఘాంత పోయాడు.

“మనుమడా.. ఈ నాటకం ఆడించింది ప్రమీలనే. మనిషి కష్టకాలంలోనే అన్నీ నేర్చుకుంటాడని.. అలాంటి పరిస్థితి నీకు కలిగించాలని చెప్పింది. అప్పుడే నువ్వు పనులన్నీ నేర్చుకోవడమే గాకుండా.. నువ్వు మంచి తెలివిమంతుడవు అవుతావని కూడా చెప్పింది. అది నిజమయ్యింది. ఇక నాకు ఏ రందీ లేదు. పనులన్నీ ఇక నేను చేస్తాలేరా..” అంది సాయమ్మ.

“వద్దు అమ్మమ్మా.. ఈ వయసులో నిన్ను ఇంకా బాధ పెట్టుకోదల్చుకో లేదు. నిన్ను కూర్చోబెట్టి సాకటం నాకర్తవ్యం” అన్నాడు మల్లేశం.ఎంతో మానసిక పరిపక్వత చెందిన మాటలతో పరవశించి పోయింది సాయమ్మ.

“సాయమ్మా.. నువ్వు ఇదివరకు కోరినట్లు ఇప్పుడు మల్లేశంను మనువాడడం నాకిష్టమే..” అంటూ సిగ్గు మొగ్గయ్యింది ప్రమీల. మల్లేశంను చూస్తూ కళ్ళతో సైగ జేసింది. దానిని అర్థం చేసుకున్న మల్లేశం.. ప్రమీలతో కలిసి సాయమ్మ కాళ్ళు మొక్కసాగాడు. సాయమ్మ సంభ్రమాశ్చర్యాలతో మగవాని బుద్ధి వికాసానికైనా, వినాశానానికైనా.. ఆడదే మూలకారణమని చిరునవ్వు నవ్వుకుంటూ.. ఆ జంటను మనసారా దీవించింది.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు