అప్పటివరకూ స్ప్రింగ్ మింగినట్టు, ఎగిరెగిరి మరీ పకపకా ఇకిలించిన మధు,ఉన్నట్టుండి తొండ మీద పడ్డట్టు ఉలిక్కిపడి,"వామ్మో,ఇదేంటీ ఇక్కడకొచ్చేసింది" అని ఒళ్ళు గిల్లుకుని, కళ్ళు నులుముకుని చూసాడు."సందేహం లేదు.మా ఆవిడే.ఇక నా పాడే.ఇప్పుడు ఇలా లలితతో చూస్తే పుస్తెలతో ఉరేస్తుంది" అని చేతులు నులుముకుంటూ,"ఆ..అర్జెంటుగా ఇక్కడినుండి పరారైపోతే సరిపోతుంది" అనుకున్నాడు."లలితా,నేను ఇప్పుడే వస్తానూ" అని తారాజువ్వలా లేచి నిబడ్డాడు. "ఎక్కడికీ" అడిగిందామె. "అదే సముద్రంలోకి వెళ్ళి,ఈతకొట్టి,ఆ చేత్తోనే రెండు చేపలు పట్టి తెచ్చేస్తాను.పైగా నా శరీరానికి ఉప్పు కావాలని మొన్న డాక్టర్ గారు చెప్పారు.లో బీపీ కదా" చెప్పాడు చొక్కా విప్పబోతూ. "ఏడిసినట్టే ఉంది మీ మతి.కంగారొస్తే చాలు,ఊరికే ఇలా తత్తరబిత్తరయిపోయి, అయోమయంలా చూస్తూ కొన్ని మరిచిపోతారు". "భలే దానివే.నేనిపుడు ఏం మరిచిపోయానని".అడిగాడు,తనని తాను ఓ సారి చూసుకుంటూ. "సరిపోయింది యవ్వారం.మీకు ఈత రాదనే సంగతి". "అవునేవ్.నా మతి ముండమెయ్యా. వెళ్ళుంటే ,అలలతో పాటు పండుటాకులా కొట్టుకుపోయోవాడ్ని.సర్లే,ఇక గొణగకు. మునిగేసి వచ్చేస్తాను" చెప్పాడు. "అయ్యో..మీరు మునిగితే మీ విగ్గు తడిచిపోతుందని మరచిపోయారా.అయినా ఇందాకట్నుండీ గమనిస్తున్నాను.ఏదో యముడ్ని చూసినట్టు అలా భయపడి చస్తున్నారేం" అంటూ కోపంగా బుగ్గ గిల్లేసింది. "ఇస్సబ్బా"..అని బుగ్గ రుద్దుకుంటూ,"యముడ్ని చూసినా భయపడను.కానీ యమున్ని చూస్తే చాలు చిచ్చుకొచ్చేస్తుంది" అని మధు అంటుండగానే, యమున వచ్చి, "ఎవర్తిది" అడిగిందామె సూటిగా చూస్తూ. "య,య్యయమునా...ఛ,ఛ నువ్వనుకున్నట్టేం కాదు.మామూలుగా ఈరోజు ఆదివారం కదా.అలా బీచ్‌కి వెళదాం అంది.నాకిష్టం లేదనుకో.కానీ తప్పక బలవంతంగా ఇలా వచ్చాను అంతే" అన్నాడు చిన్నగా వణుకుతూ. ఆ మాటలు విన్న లలిత,"ఎందుకండీ ,తేలుకొండెని చూసినట్టు అలా భయపడిపోతున్నారు.నేను మీ భార్యనేగా.ఆవిడే మీ మాజీ భార్య.ఆవిడకెందుకూ భయపడటం.విడాకులు ఇచ్చేసారుగా" అంది బుగ్గలో పొడుస్తూ. "అవును కదూ! అని కొంచెం ధైర్యం తెచ్చుకుని,అవును ఇప్పుడు నేనెవరితో వస్తే నీకెందుకూ?"అని గట్టిగా అనేసరికి- యమున, "ఊ"..అని కళ్ళెరజేసి,"అవును ,నాకెందుకూ,కాకపోతే నాతో ఉన్నప్పుడు,రెండ్రోజులకోసారయినా ఇలా బయటికి వచ్చి చావమంటే వచ్చేవారా అని?.అలాగే బీచ్ కి వెళ్దాం అంటే బ్లీచింగ్ పౌడర్ మింగినట్టు తెల్లమొహం వేయడం.నాల్రోజులకోమారు పార్క్ కి వెళ్దాం అంటే,పార పళ్లేసుకు నవ్వేసి పాడు సాకులు చెప్పడం,సినిమా ఊసేత్తితే సరసాలాడి విషయం దాటేసేవారు.వారానికోసారి స్టార్ హోటల్ కి తీసుకెళ్లమంటే హార్ట్ పట్టుకునేవారు.ముక్కుపుడక కొనడానికి మూడు చెరువుల నీళ్లు తాగారు.దిద్దులు కొని పదిరోజుల పాటు పద్దులు చెప్పారు.నాలుగు పట్టు చీరలు కొన్నందుకే ఆర్థికంగా ఆవిరైపోయారని ఆడి పోసుకున్నారు.ఆపిల్ మొబైల్ కొన్నానని మొహం మాడ్చుకున్నారు. అందుక్కాదూ మిమ్మల్ని వదిలేసింది" అడిగిందామె,గట్టిగా పేద్ద నోరుతో. ఆ అరుపుకి ఎవరో కుదిపినట్టు అదిరిపడి,"అదీ, సరే అనుకో ,కానీ అవన్నీ భర్త సాటి రావేమో" అని నసుగుతుండగా...లలిత, "ఛ,ఛ, ఏవిటి మధూ నువ్వు, కూల్ డ్రిoక్ తాగడం కూడా రాదా.అంతా ఎలా ఫ్యాంటు మీద పారబోసుకున్నావో చూడు" అంటూ తన కర్చీఫ్‌తో తుడవసాగింది. "అది కూల్ డ్రింక్ కాదు లలితా,యమున అలా అరిచి,ఉరిమి చూసేసరికి" అని కొంచెం నీళ్లు నమిలాడు. "ఛీ,ఛీ వెధవ పిరికి సంత" అని ఆ కర్చీఫ్‌ని పక్కన పడేసి,"ఆవిడతో ఉన్నప్పుడు కూడా నలుగురిలో ఇలానే చేసేవారా".అడిగింది లలిత. "నన్ను అంత తక్కువ అంచనా వేయకు.పరువుకోసం ప్రాణం పెడతాను.అందుకే ఆమెతో బయటికెళ్ళినప్పుడు డైపర్ వేసుకునేవాడ్ని తెలుసా".చెప్పాడు అసహనంగా. "పోన్లే..ఈవిడ్నైనా సుఖపెడుతున్నారు.కానివ్వండి".అంటూ వెళ్ళబోయింది యమున. "అదేం లేదక్కా.నన్నూ అలానే డీప్ ఫ్రై చేసుకు తింటున్నారు.కానీ ఏం చేస్తాం.తాటాకు తగిలించుకున్నాక చప్పుడుకి భయపడతామా.నువ్వు వదిలించుకున్నావ్.నేను తెలియక తగిలించుకున్నాను".చెప్పింది లలిత. మధు పళ్ళుకొరికేస్తూ,"షటప్ షేమ్‌లెస్.కేర్‌లెస్‌గా బేస్‌లెస్ ఆరోపణలు చేయకు.ఇంకా ఇలానే రెక్లస్‌గా మాట్లాడితే నీకు పండక్కి నెక్లెస్ కొనను".చిటపటలాడిపోయాడు. అక్కడ్నుండి వెళ్ళిపోతూ,"నీ నంబరు ఇప్వు లలితా" అంటూ తన ఫోన్ అందించింది.వెంటనే లలిత నెంబర్ ఫీడ్ చేసి ఇవ్వగానే అక్కడ్నుండి వెళ్ళిపోయింది యమున. "ఆమె ముందు నా పరువు తీసేసావ్ లలితా.పైగా నీ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేసావ్.నిన్ను కూడా తన లానే తయారుచేస్తుంది" అంటూ వణికిపోయాడు. "ఆవిడ ఏంటో ముందే నాకు అర్దమయింది.అయితే తోటి ఆడపిల్ల .నిన్ను వదిలేయడమే మంచిదయిందనే తృప్తి తనకి అలాగే మిగలాలని అలా మాట్లాడాను".ఇక నంబరంటావా.అందులో తొమ్మిది నెంబర్లే ఫీడ్ చేసాను" అని ఆమె చెపడంతో…"యాహూ" అని మళ్ళీ స్ప్రింగ్ మింగినట్టు ఎగిరి గంతేసాడు.