"ఏవండోయ్! వీధిలోకి వెళుతున్నారు కదా, వస్తున్నప్పుడు అలా రైతు బజారుకెళ్ళి క్యారట్, బీట్‌రూట్, కీరా తేవడం మర్చిపోకండేం!" అని అంటున్న భార్య మణి వైపు అదిరిపడి చూసాడు మణ్యం, అదే సుబ్రహ్మణ్యం. ఎప్పుడూ ఆమె అలా పై కూరగాయలు తెమ్మని అనదు, ఆమెకి ఆ కూరలు నచ్చక కాదు, అవి ఎలా వండాలో తెలియక.
అతనలా ఆమెకేసి ఆశ్చర్యపడటం చూసి, "మీరు తీరిగ్గా ఆశ్చర్యపడుదురుగాని, ముందు నేను చెప్పినవి మాత్రం తేవడం మరువకండి." అందామె.
మణి, మణ్యంకి పెళ్ళై రెండేళ్ళయ్యింది. అప్పటివరకూ హోటల్‌కూడు తిని, తన స్వయంపాకం రుచి చవిచూసి అలసిపోయిన మణ్యంకి తన పెళ్ళి కుదురుతుందనేసరికి మొదట ఈ బాధ తప్పుతుందని చాలా ఆశ పడ్డాడు. కానీ అతని ఆశలు అడియాశలు కావడానికి ఎంతోసేపు పట్టలేదు. పెళ్ళైన తర్వాతకానీ మణ్యంకి తెలియలేదు తన భార్యమణికి అసలు వంటిల్లు అంటే ఏమిటో తెలియదని.
అత్తవారింటి నుండి వచ్చిన ఆవకాయ, కందిపొడి, పచ్చడి మెతుకులే గతి పాపం మణ్యంకి ప్రతీరోజూ. పూర్వాశ్రమంలో వంట చేసి చెయ్యి కాల్చుకున్న అనుభవం ఉన్నా పెళ్ళయిన తర్వాత తన కళ భార్యామణి ముందు ప్రదర్శించడానికి జంకాడు. తనకన్నా ముందు పెళ్ళై జనజీవన స్రవంతిలో కలసిన సీనియర్ల సలహా అనుసరించి తన పాకవిద్య పక్కన పెట్టాడు. తనకి వంటావార్పూ వచ్చని భార్యమణికి తెలిస్తే జీవితమే ఓ నూరేళ్ళ వంటవుతుందని ఆ అనువఙుల ఉవాచ మరి. పెళ్ళైన కొత్తలో మణి వండిన వంటను చూసి ఏది కూరో, ఏది పప్పో, ఏది పచ్చడో పోల్చుకోవడం చాలా కష్టంగాఉండేది. రాన్రాను వాటికి తనకి నచ్చిన పేర్లు పెట్టుకొని తిననారంభించాడు. ఆమె కూడా తను వండిన ఆ కూరలు తినలేక చివరికి అవి వండటం మాను కుంది. భార్యామణి చేతి వంటలు రోజూ తినలేక సెలవు రోజుల్లో మాత్రం హోటల్లో భోజన కార్యక్రమం పెట్టేవాడు పాపం మణ్యం. అయితే కరోనా వల్ల విధించబడిన ఈ లాక్‌డౌన్‌వల్ల హోటల్స్ అన్నీ మూతబడ్డాయి. ఈ మధ్య ఆర్డరిస్తే వాళ్ళు ఇంటికే పంపుతున్నా, ఈ కరోనావేళ అది ఆరోగ్యానికి అంత మంచిది కాదేమోనని సందేహించి మానుకున్నాడు మణ్యం. తన కూతురి ప్రఙ తెలిసిన అత్తగారు అల్లుడికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏడాదికి సరిపడా పంపే ఊరగాయలు, పచ్చళ్ళు, కందిపొడి లాంటివి ఈ లాక్‌డౌన్ వేళ ఆధారమైయ్యాయి. ఎలాగూ మణ్యంకి ఇంటికి కూరగాయలు తెచ్చే శ్రమ లేదు. అందులోనూ లాక్‌డౌన్‌వేళ బయటకి వెళ్ళే అవసరమే కలగలేదు ఇన్నాళ్ళూ. మణి కూరలు వండి కూడా చాలా రోజులైంది. ఏదో అన్నం మాత్రం ఎలాగోలా వండి పడేస్తుంది, రైస్ కుకర్ ఉన్న కారణంగా. ఈ రోజు అవసరం ఉండి వీధిలోకి వెళ్ళేసరికి కూరలు- అదీ, క్యారట్, బీట్, కీరా తెమ్మనేసరికి చాలా ఆశ్చర్యపడ్డాడు మణ్యం.
'ఇన్నాళ్ళూ లాక్‌డౌన్‌లో టివి చూస్తూ గడిపిన మణి బహుశా వంటల కార్యక్రమాలు చూసో, లేక యూట్యూబ్ చూసో నేర్చుకొని ఉంటుంది. పోనీలే ఈ లాక్‌డౌన్ పుణ్యాన వండటం నేర్చుకున్నట్లుంది. ఇదీ ఒకందుకు మన మంచికే జరిగింది.' అని ఒకవైపు సంతోషిస్తూనే, 'ఇప్పుడు ఈ కూరగాయలతో తనమీద కొత్త ప్రయోగాలు చేసి తనని గాయాల పాలు చేస్తుందో ఏమిటో ఏమో ఖర్మ!' అని మరోవైపు భయం కూడా వేసింది మణ్యంకి.
తన పని చూసుకొని రైతు బజారుకెళ్ళి మణి చెప్పిన కూరగాయలు తీసుకువచ్చాడు.
చాలా రోజుల తర్వాత పచ్చడి మెతుకులుకాక కూరలతో భోజనం చేయబోతున్నందుకు మనసులో చాలా సంతోషంగా ఉంది మణ్యంకి. టివి చూస్తూ కూర్చున్న మణ్యంకి సరిగ్గా పన్నెండున్నరకి భోజనానికి పిలుపు వచ్చింది మణి నుండి. తినబోతున్న దోసకాయ పప్పు, క్యారట్ బీట్ కూరను తలచుకుంటూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నాడు. మణి భర్తకి వడ్డించి, తను కూడా భోజనానికి కూర్చుంది. ఎంతో ఆశతో భోజనానికి కూర్చున్న మణ్యంకి కంచంలో వడ్డించబడిన పదార్థాలు చూసేసరికి ఎక్కడలేని నిరాశ ఆవహించింది. భోజనం రోజూలాగే ఆమె తల్లి పంపించిన నిమ్మకాయ ఊరగాయ, కందిపొడి, ఎప్పటిలా రంగూ, రుచి, వాసన లేని చారుతో సరిపెట్టింది.
ఆ పదార్థాలు చూస్తూనే మణ్యంకి అప్పటివరకూ ఉన్న ఆకలి లాక్‌డౌన్ వేళ పోలీసుల్ని హఠాత్తుగా చూసి పక్క సందులోకి పారిపోయిన తిరుగుబోతులా ఎటో పారిపోయింది. తను బజారుకెళ్ళి తెచ్చిన ఆ కూరలు ఏమి చేసిందో మరి అనుకొని అడిగాడు ఆమెని, "అదేమిటి, ఇవాళ కూడా రోజూలాగే వండావు. నేను తెచ్చిన కూరలేం చేసావు?" అని.
"ఇప్పటికింతే! భోజనం చేయండి. వాటి సంగతి సాయంకాలం చూస్తాను." అందామె.
"ఓహ్!..." అని ఓ నిట్టూర్పు దీర్ఘంగా విడిచి భోజనం అనబడే ఆ పదార్థాలను ఇష్టపడి... కాదు కాదు… కష్టపడి తినసాగాడు పాపం మణ్యం. సాయంకాలం వాటితో హల్వాకానీ, ఇంకే స్వీట్ గానీ చేస్తుందేమోనని ఆశపడి మరి రెట్టించకుండా ఎలాగోలా భోజనం కానిచ్చేసాడు.
భోజనం పూర్తైన తర్వాత అలవాటు ప్రకారం ఆ మధ్యాహ్నం వేళ నిద్రకి ఉపక్రమించాడు. ఎన్నో కష్ట నష్టాల మధ్య ఈ లాక్‌డౌన్ వల్ల వచ్చిన లాభాల్లో ఇదొకటి. కాకపోతే ఆఫీసులో కన్నా ఇంట్లో మధ్యాహ్న నిద్ర మంచి సౌకర్యవంతమైనదని మణ్యం అభిప్రాయం. మెత్తటి పరుపు, దిండు మరి ఆఫీసులో లభిస్తాయా ఏమైనా!
సరిగ్గా నాలుగు గంటలకి నిద్రలేచి బాత్‌రూంకి వెళ్ళి మొహం కడుక్కొని హాల్లోకి వెళ్ళాడు. అయితే హాల్లోకి వెళ్తూనే అక్కడ సోఫాలో కూర్చొని టివి చూస్తున్న శాల్తీని చూస్తూనే హడలిపోయి, "బాబోయ్! దయ్యం!" అని కేకపెట్టాడు భయంతో గజగజ వణికిపోతూ. సోఫాలో కూర్చున్న ఆ శాల్తీ మొహమంతా రక్తంలాంటి ఎరుపు, పచ్చటి పసుపు వర్ణం కలసిన రంగుతో నిండివుండి, కళ్ళు ఉండే స్థానంలో తెల్లగా గుండ్రంగా ఏదో వెల్తురుకి మెరుస్తూ కనిపిస్తోన్నాయి. మొత్తానికి ఆ శాల్తీ చూడటానికి పరమ భయంకరంగా ఉంది.
వెంటనే ఆ శాల్తీ అతన్ని చూసి నవ్వుతూ దగ్గరికి రావడం చూసిన మణ్యంకి పై ప్రాణాలు పైనే పోయాయి. నోరు తడారిపోయింది. గజగజ వణుకుతున్న మణ్యంని గట్టిగా పట్టుకొని కుదుపుతూ ఉంది ఆ శాల్తీ.
"నేనండీ!...మణిని! మీరెందుకలా భయపడుతున్నారు? ఏదైనా భయకరమైన కలగానీ వచ్చిందా?" అందామె.
అప్పుడు భయంభయంగా ఆ శాల్తీవైపు చూసిన మణ్యం ఆమె తన భార్య మణి అని అతి కష్టంగా పోల్చుకున్నాడు. అప్పుడు ఆమె వైపు పరీక్షగా చూసిన అతనికి మొహమంతా దట్టంగా పట్టించిన బీట్, క్యారట్ కలసిన ముద్ద, కళ్ళ మీద గుండ్రంగా చక్రాలా తరిగిన కీరా కనిపించాయి.
"నువ్వు..నువ్వూ...ఏమిటి ఈ అవతారం?" అన్నాడు గొంతు పెగుల్చుకొని అతి కష్టం మీద.
"ఓహ్!...ఇదా!...ఈ లాక్‌డౌన్‌లో బ్యూటీ పార్లర్లు అన్నీ బంద్‌కదా మరి. బ్యూటీపార్లర్‌కెళ్ళి చాలా రోజులైంది మరి. అందుకే యూట్యూబ్ చూసి ఈ క్యారట్, బీట్‌రూట్, కీరా ఉపయోగించి ఎలా ఫేసియల్ చేసుకోవచ్చో తెలుసుకున్నాను. అంతే!" అందామె నవ్వుతూ.
అప్పుడు అర్థమైంది మణ్యానికి బజారునుండి మణి ఆ కూరగాయలు ఎందుకు తెమ్మందోనని. తనేమో భోజనంలోకి కూర చేయడానికి అని అనుకున్నాడు గాని, అవి ఆమె వాటిని తన సౌందర్య సాధనాలుగా వాడుతుందని ఎంత మాత్రం ఊహించలేకపోయాడు. 'హతవిధీ!' అనుకొన్నాడు. యూట్యూబ్ చూసి వంట చేయడం నేర్చుకోలేని తన భార్యామణి, ఆ యూట్యూబే చూసి ఫేసియల్ చేసుకోగలదని ఏలా అనుకుంటాడు పాపం మణి భర్త మణ్యం.