ఆపన్న హస్తం - బుద్ధవరపు కామేశ్వరరావు

help hand

జగన్నాధగిరిలో కొత్తగా పెట్టిన మా బేంకు బ్రాంచికి నన్ను మేనేజర్ గా వేసారు. ఊర్లోనే ఓ మంచి ఇల్లు చూసి, కుటుంబాన్ని కూడా తెచ్చేసుకున్నాను. ఆ రోజు ఆదివారం. ఉదయం కూరగాయలు కొనడానికి వెళ్దామని నా స్కూటర్ స్టార్ట్ చేస్తే, అది మొండికేసింది. ఇంక లాభం లేదని, ""రావు గారూ, బండి స్టార్ట్ అవ్వడం లేదు. మన ఊర్లో మెకానిక్కులు ఎవరైనా ఉన్నారా ? లేకపోతే ఏ గొల్లపాలెమో, ద్రాక్షారామమో తీసుకెళ్ళాలా ?""అడిగేను మా ఇంటి యజమానిని. పాపం, ఆయన కూడా నాలుగైదు సార్లు ప్రయత్నం చేసి, ఆఖరికి, ""అబ్బే, ఇది మన వల్ల అయ్యే పనికాదండీ ! ఓ పనిచేయండి. మెయిన్ రోడ్డు మీద బస్ స్టాప్ దాటిన తరువాత శివా బైక్ సర్వీస్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళండి. ఈ రోజు మా ఇంట్లో పూజలు ఉన్నాయి. లేకపోతే నేనే వద్దును."" అంటూ ఉచిత సలహా పడేసి, ఇంట్లోకి దూరేడు. ***** ***** ***** ***** ఆ శివ బైక్ సర్వీస్ షెడ్డు.... చుట్టూ ప్రహారీలా ఎండిన కొబ్బరి ఆకులతో కట్టిన దడి. దానికి ఓ చిన్న చెక్క గేటు. అది తీసుకుని లోపలికి వెళ్ళగానే, ఓ నాలుగు రిపేరు కోసం వచ్చిన స్కూటర్లు. కొంచెం దూరంలో సర్వే రాట్ల మీద తాటాకులతో కట్టిన షెడ్డు. మధ్యలో కొంచెం ఖాళీ ఉంచి, రెండు వైపులా కొబ్బరి తడక లతో కట్టిన గదులు. లోపలికి అడుగు పెట్టిన నేను "లోపల ఎవరూ లేరాండీ ?"" కొంచెం గట్టిగానే అరిచాను. ""వస్తున్నా సార్ !"" అంటూ, ఓ నలభై ఏళ్ల వ్యక్తి, పోలియో వల్ల చచ్చుబడి పోయిన కుడి కాలుని కుడి చేత్తో పైకి లేపుకుంటూ, భారంగా నడుచుకుంటూ వచ్చాడు, కుడి వైపు ఉన్న గదిలోంచి. అతడిని చూసి, "ఇతను నా బండి రిపేరు ఏం చేస్తాడు?" అని మనసులో అనుకొని, ""శివ అంటే మీరేనా ? బండి స్టార్ట్ అవ్వడం లేదు. కొంచెం చూడండి."" అన్నాను. ""మా ఓనరు గారి పేరు శివ. నా పేరు చంద ర్రావండి. అందరూ సొట్టచంద్రన్న అనే పిలుస్తారు. ఈ షెడ్డు పెట్టగానే మా ఓనర్ గారు నన్నే మొదటగా ట్రైనింగ్ ఇచ్చి తీసుకున్నారు. అంతకు ముందు సైకిల్ షాపులో పనిచేసేవాడినిలెండి."" అడగకుండానే అన్ని వివరాలు చెప్పేసి, ""కొంచెం బండి స్టాండ్ వెయ్యండి."" అని బండి పార్టులు విప్పుతూ, నా గురించిన వివరాలు రాబట్టాడు చంద్ర. ""ఒరే ! నాగూ, లోపలి నుంచి ఓ కుర్చీ తీసుకురా ! అయ్యగారు కూర్చుంటారు."" పురమాయించేడు చంద్ర. ***** ***** ***** ***** ఈ లోగా ఓ పాతికేళ్ల కుర్రాడు, జాగ్రత్తగా తడుముకుంటూ నడుస్తూ వచ్చి, ఓ కుర్చీని తీసుకుని వచ్చి ఖాళీ జాగాలో వేసాడు. ""కూర్చోండి సార్ ! ఏ మొండి బండైనా సరే , మా చంద్రన్న చేతిలో పడిందంటే చాలు, పది నిమిషాల్లో మళ్ళీ ప్రాణం పోసుకుం టుంది."" ఆనందంగా చెప్పాడు నాగు. ""నీ పేరేంటి ? నువ్వు పుట్టుకతోనే అంధుడివా?"" లోపలినుంచి తన్నుకొస్తున్న బాధను దిగమింగుకుంటూ అడిగాను. ""నా పేరు నాగరాజు అండీ ! నేను పుట్టు గుడ్డిని. ద్రాక్షారామం బస్ స్టాపులో భిక్షాటన చేసుకుంటూ ఉండే వాడిని. ఓ రోజు స్కూటర్ స్పేరు పార్టులు ఖరీదు చేయడం కోసం వచ్చిన మా ఓనర్ గారు, నన్ను చూసి, మా తల్లి తండ్రులను ఒప్పించి ఇక్కడ పని కల్పించారు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది సార్, కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని !"" మొహం మీద కళ్ళు స్థానంలో గుంతలు ఉన్నప్పటికీ అతని మొహంలో యజమాని మీద ఉన్న కృతజ్ఞత స్పష్టంగా కనిపిస్తుం డగా, చెప్పాడు నాగు. ""ఏడిసావులే సన్నాసి ! ఇలా వచ్చి ఇదిగో అయ్యగారి బండి పార్టులన్నీ పెట్రోలుతో కడుగు."" అంటూ నాగరాజుకి పని అప్పచెప్పేడు చంద్రరావు. ***** ***** ***** ***** ఈలోగా బయటనుండి ఎవరో, ""చంద్రన్నా ! కొంచెం టైర్ కి గాలి పెట్టు"" అంటూ ఓ బైక్ దొర్లించుకుంటూ వచ్చేడు. ""అమ్మాయ్, గంగా ! ఆ టైర్ పంక్షరు తరువాత వేద్దువుగాని, ముందు బయట ఉన్న ఈ బండికి గాలి పెట్టమ్మా !"" అంటూ పురమాయించేడు చంద్రన్న. ఈ లోగా సుమారు ఓ ఇరవై ఏళ్ళ ఉన్న ఓ అమ్మాయి, రెండు అరచేతులూ నేలమీద ఆనించుకుంటూ, ఆ బండికి గాలి పెట్టడానికి వచ్చింది. చొక్కా, ఆఫ్ నిక్కరు వేసుకున్న ఆ అమ్మాయికి రెండు కాళ్ళూ లేవు. కేవలం తొడలు, చేతులు సాయంతో డేక్కుంటూ వచ్చింది. వికలమైన మనసుతో, నోట మాటరాక అలాగే చూస్తున్న నన్ను ఉద్దేశించి, ""ఆ పిల్ల నా మేనకోడలు సార్ ! రెండేళ్ల క్రితం ఓ రైలు ప్రమాదంలో మా అక్క బావ చనిపోయారు సార్. ఇది ప్రాణాలతో బయటపడింది కానీ, సెప్టిక్ అయ్యాయని రెండు కాళ్ళూ తీసేసారు. నేను మా ఇంటికి తీసుకు వచ్చేసి మా ఓనర్ గారితో చెప్పి ఇక్కడ పనిలో పెట్టాను సార్."" చెమర్చిన కళ్ళతో చెప్పాడు చందర్రావు. ""నిజంగా, మీకు ఆశ్రయం కల్పించి, పట్టుదల ఉంటే ఏ పనైనా చేయగలం అని మీలో ధైర్యం నింపిన మీ ఓనరు గారి కృషి నిజంగా మెచ్చుకోవాలి."" అభినందన పూర్వకంగా నా మనసులో మాట చెప్పేను. ""ఔను సార్, నిజంగా దేవుడు సార్ ! అసలు మా అమ్మానాన్నలు పోయి, నా కాళ్ళు తొలగించిన తరువాత ఇంక బతకడం వృధా అనుకున్నా సార్. కానీ మా మావయ్య ఇక్కడికి తీసుకొచ్చి, మా ఓనర్ గారికి పరిచయం చేసిన తరువాత నా జీవితమే మారిపోయింది సార్. కొంచెం కృషి, బతకాలన్న పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని తెలుసుకున్నా సార్ ! "" డేక్కుంటూ వచ్చి, నా కుర్చీ దగ్గర కింద కూర్చుని చెబుతున్న గంగ మొహంలో ఏదో సాధించేనన్న తృప్తి కనపడింది. ""అదిగో సార్, మాటల్లోనే మా ఓనర్ గారు వచ్చారు."" అన్న చంద్ర మాటలు ఏదో లోకంలో ఉన్న నన్ను ఉలిక్కిపడేలా చేసాయి. ***** ***** ***** ***** నా చూపులు అప్పుడే స్కూటర్ మీద వచ్చిన ఓ ముప్పై ఏళ్ళ వ్యక్తి మీద పడ్డాయి. ""శివన్నా ! ఈయన కొత్తగా వచ్చిన బేంకు మేనేజర్ గారు."" పరిచయం చేసాడు చంద్ర. ""ఔనా ! నమస్కారం సార్. ఏమీ అను కోకండి, కొంచెం ఆలశ్యం అయ్యింది."" అంటూ ఎడం చేత్తో నమస్కరించి, నన్ను తన గదిలోకి తీసుకుని వెళ్ళాడు. ***** ***** ***** ***** ""ఏమిటి శివ గారూ, ఇదంతా ! నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు మీ చేతికి ఏమైంది ?"" కుతూహలం ఆపుకోలేక అడిగేసా !! ""సార్ ! మాది కుండలు తయారుచేసే వృత్తి. నేను చిన్నతనం నుంచీ కొంచెం అల్లరి పనులు చేస్తూ ఉండేవాడిని. తెలిసి తెలియని పదేళ్ల వయసులో ఓ రోజు మా ఫ్రెండ్స్ తో కరెంటు తీగలు పట్టుకొనే పందెం కట్టి, ఇదిగో ఈ కుడి చెయ్యి పోగొట్టు కున్నాను. "" అంటూ భుజం వరకూ తెగిపోయిన చేతిని చూపించాడు. ""అరెరే, మరి ఆ తీగల్లో కరెంటు ఉంటుం దని తెలియదా ??"" ""కొంచెం ఐడియా ఉంది సార్. కానీ ఆ రోజుల్లో గ్రామాల్లో పగటి పూట కరెంటు ఉండేది కాదు. నా కర్మ కొద్దీ ఆ రోజు ఉంది. అంతేకాదు, స్తంభంమీంచి కాలు జారుతున్న అనుమానం వచ్చి, ఆ కంగారులో రెండు తీగలూ పట్టేసుకున్నా ! కొన్నళ్ళపాటు అందరూ సానుభూతితో బాగానే చూసేరు సార్. ఆ తరువాత నుంచి నాకు ఇంటా బయటా సాధింపులు, హేళనలు మొదల య్యాయి నేను ఏ పనికీ పనికి రానని. ముఖ్యంగా మా కులవృత్తికి."" ""అలా కించపరచడం చాలా ధారుణం అండీ."" ఉండబట్టలేక అన్నాను. ""లేదు సార్. ఆ మాటలే నాలో కసిని పెంచాయి. నెమ్మదిగా ఎడమచేత్తో అన్ని పనులు చేయడం ప్రాక్టీసు చేసా. తరువాత కొన్నాళ్ళకి ఒంటి చేత్తో సైకిల్ తొక్కడం నేర్చుకొని, పాల వ్యాపారం మొదలెట్టా ! నా పట్టుదల చూసి అందరూ మెచ్చుకోవడం మొదలెట్టారు. సరిగ్గా ఆ సమయంలోనే నా జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన జరిగింది."" చెబుతూ కాసేపు ఆగేడు. ""ఏం జరిగింది??"" కుతూహలంగా అడిగేను. ""పాల వ్యాపారం బాగా ఉండడంతో, ఒక స్కూటర్ కొనాలని నిశ్చయించుకుని, ద్రాక్షారామం వెళ్ళాను, మా ఫ్రెండ్ అబ్బులు నడుపుతున్న షెడ్డులో ఓ సెకండ్ హేండ్ బండి తీద్దామని. కేవలం ఎడంచేత్తోనే బ్రేక్, యాక్సిలేటర్, హారన్ మేనేజ్ చేసేలా చేసి ఆ బండి తయారు చేసి ఇచ్చాడు మావాడు. అదిగో, అప్పుడే నా మదిలో ఈ స్కూటర్ మెకానిజం నేర్చుకోవాలన్న ఆలోచన వచ్చింది. మా అబ్బులు దగ్గరే సుమారు ఐదు సంవత్సరాలు మెళకువలు అన్నీ నేర్చుకుని, వాడి ప్రోద్బలంతో మా ఊర్లో ఈ షెడ్డు కట్టేను సార్."" విజయగర్వంతో చెప్పాడు శివ. ""ముందుగా మీ కృషికి, నేర్చుకోవాలి అన్న తపనకు నిజంగా హేట్సాప్. కానీ ఈ చంద్ర, గంగ, నాగు ఇలాంటి వాళ్ళనే తీసుకోవాలని మీకెందుకు అనిపించింది."" ""సార్, వీళ్ళందరూ కూడా నాలాగే విధి వంచితులు. కానీ, వాళ్ళు అలా కుమిలి పోకుండా, కృషి ఉంటే నాకు లాగ ఏదైనా సాధించవచ్చు అన్న ధైర్యం వారిలో నింపడం కోసమే అలాంటి వారిని చేర దీసా !"" ఎంతో హుందాగా చెప్పేడు శివ. ""సార్, మీ బండి రెడీ !"" గట్టిగా అరుస్తూ చెప్పేడు నాగు. ""మరి, ఈ షెడ్డు విస్తరించే ఆలోచన ఏమైనా ఉందా ??"" కుర్చీ లోంచి లేస్తూ అడిగేను. ""షెడ్డు మాత్రమే కాదు సార్, నాలాంటి విధి వంచితులని ఇంకా చాలా మందిని తెచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలన్న ఆలోచన కూడా ఉంది సార్ !"" ""మీ ఆశయం తప్పకుండా నెరవేరుతుంది. మీ కృషి వృధా కాదు. రేపు ఓ సారి బేంకుకి రండి. మా పై అధికారులుతో మాట్లాడి మీకు లోన్ గ్రాంటు చేయిస్తా."" అంటూ, అతని గది లోంచి బయటకు వచ్చి, రిపేరు ఛార్జీలు పే చేసి, బండి తీసుకుని బయటకు వచ్చేను, ఓ మంచి పనికి సహకారం చేయబోతున్నాను అన్న ఆనందంతో. ""కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. మహా పురుషులవుతారు."" దూరంగా ఎక్కడి నుంచో పాట వినిపిస్తోంది. నాకైతే ఋషిలా కాదు కానీ, చంద్రుడిని, గంగను, నాగరాజును తన ఒంటి మీదే ఉంచుకున్న శివుడులా కనిపించేడు, ఈ చంద్ర, గంగ, నాగులకు తన వద్దే ఆశ్రయం కల్పించిన ఈ మెకానిక్ శివుడు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు