ప్రశాంత్ చిన్నవాడు , అందగాడు ముందు ముందు ఎంతో ఉజ్జ్వల భవిష్యత్ ఉన్నవాడు ..
బెడ్రూం అద్దాల కిటికీ లోంచి బయటకు చూస్తున్నాడు, చేతిలో జ్యూసు గ్లాసు పట్టుకుని. ఎదురుగా ఉరుకులెత్తే సముద్రం తన ఆవేశం లాగే .. పోటెత్తే అలలు తన ఆలోచనల లాగే.
పక్కనే బల్ల మీద అమ్మ ఫొటో పలకరించింది నవ్వుతూ. పది ఏళ్ళ కిందట అమ్మ వెళిపోయింది వంటరిని చేసి.. ఇప్పుడుంటుంటే తనకి ఎంత తోడు, ఎంత ఊరట.
నిజానికి వంటరితనం కాదు తన బాధ, పంచుకునేందుకు మనుషులున్నారు. స్వార్ధం మోసం వంచన కు తను బలి అవడం తనని ఎక్కువ బాధిస్తోంది. ఎంత బాధ ఎంత దుఃఖం అంటే , అదిగో కనిపించే ఆ సముద్రమంత.
చిన్నప్పటినుంచి మెరిట్ తను,చదువులోను ఎక్ట్రా కరిక్యులం లోను ముఖ్యంగా డ్రామాలలో తన పెర్ఫార్మెన్స్ అదిరిపోయేది, తన అందం తనకి ఎక్ట్రా క్వాలిఫికేషన్. హీరో అనేవారు అందరూ. అమ్మ నవ్వుతూ మురుసిపోయేదివిని. అమ్మ నవ్వు తనకి ఇంకా గొప్ప, ఎప్పటికైనా పెద్ద సినిమా హీరో నవుతానమ్మా అంటే అమ్మ హాయిగా నవ్వేది, చెప్పకపోయినా అదే తన కోరిక అన్నట్టు.
కాని తను ఇంజనీరింగ్లో ఉండగా తమని వదిలేసి వెళిపోయింది, కుటుంబమే కృంగిపోయింది.
చదువు పూర్తి చేయకుండానే వదిలేసాడు తను, టివిలో ప్రయత్నించాడు, సక్సెస్ అందుకున్నాడు. సినిమాలలోకి వచ్చాడు ఎంతో ఆశతో ఎన్నో కలలో.. కాని ఈ సినిమాలోకం ఎండమావి , స్వార్ధప్రపంచం , అవకాశవాదుల లోకం .. అలాటి వాితో కలసి పరుగెడితేనే గెలుపు .. తనకి లేదు అల్లాటి తెలివి, అమ్మ తనని అలా పెంచలేదు, అవకాశవాదిగా కాదు ఆదర్శవాదిగా పెంచింది.
తాను ఓడిపోతున్నాడు నిలదొక్కుకోలేక జారిపోతున్నాడు , గ్లాసు కిందపెట్టి , మొహం చేతులతో కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు ప్రశాంత్. నాకెందుకీ బతుకు అందమూ నటన సామర్థ్యమూ అన్నీ ఉన్నా.. నన్ను అణగదొక్కేస్తున్నారు వాళ్ళు , వాళ్ళవాళ్ళు పైకి రావడానికి. అయ్యో.. అమ్మా..దేవుడా..
“ ఇంతటి దుఃఖాన్ని తీర్చేవారెవరు ?“.
ఆశాభంగం తట్టుకోలేక, జీవితం లో తనకి ఇక ఏమీ మిగలలేదని నిశ్చయించుకున్నాడు ప్రశాంత్.
చటుక్కున బెడ్షీట్ అందుకు మెలితిప్పుతున్నాడు ,
తనకి మిగిలింది ఆత్మహత్యే.. జీవితంలో అనుకున్నది సాధించలేక ఓడిపోయినవారికి చావే గతి అని నిశ్చయించుకున్నాడు.
దుప్పటి ముడి వేస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అద్దం లో తనకి తనే కనిపించాడు ప్రశాంత్ కి. ఒక్క క్షణం ఆగాడు. అద్దంలోప్రతిబింబం
‘ జీవితంలో ప్రాణం చాలా ముఖ్యమైనది’
అని చెప్పినట్టైంది. ఉలిక్కిపడ్డాడు, అది ఇటీవలి సినిమాలో తన పాత్ర చెప్పిన డైలాగు.ఆత్మహత్య చేసుకోబోతున్నవారికి చెప్పినది .ు అది ఎలా తాను విస్మరించగలడూ.. తనకీ వర్తిస్తుంది కదా.
తల విదిలించి దుప్పటి ఫాను మీదకి విసిరాడు , అలా విసరడం లో కొస బల్ల మీది అమ్మ ఫొటోకి తగిలి కిందపడింది. గబ గబా వెళ్ళి తీసాడు పగలలేదు , కాని ఫొటోలో అమ్మ ఏడుస్తున్నట్టనిపించింది ,
తను చేయాలనుకుంటున్న పనికేనా..
“ నీ చరిత్రను రాయగలగడం నీ చేతిలోనే ఉంది” అమ్మ చెప్పినది గుర్తొచ్చింది.
ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణం ఆగి ఆలోచనలో పడ్డాడు ప్రశాంత్, అదే విలువైన క్షణం , వివేకం జాగృతం అయిన క్షణం , మనసు నిమ్మదించే క్షణం , పిల్ల తెమ్మెరలాగ నెమ్మదైన నదిలాగ చల్లని ఆలోచనలు కమ్ముకున్నాయి అతనిని. దుప్పటి జారిపడింది.
అద్దంలోని ప్రతిబింబంతో మనసు మాటాడింది,
“ అవును, నా జీవితం నాది విలువైనది నాకుదొరికింది, నా ప్రాణం అన్నిటికన్నా ముఖ్యమైనది , ఎవరు నా దుఃఖాన్ని తీర్చేవారు .. నేను తప్ప. నేనే దుఃఖపడాలా సంతోషపడాలా అని నిర్ణయించుకోవలసినవాడిని. అంతా నా చేతులలోనే ఉంది. విజయంసాధించగలను అనుకునే నమ్మకం ఉంటే ఎవరు నన్ను ఆపగలరు, ఇది కాకపోతే ఇంకోటి. ఎంత కష్టమైనా భరిస్తాను , గెలిచి తీరతాను అమ్మను నవ్వుతూనే ఉండనిస్తాను “
ప్రశాంత్ దుప్పటి తీసి సరిచేసాడు. చల్లని నీళ్ళతో మొహం కడుక్కున్నాడు, గడియపెట్టిన తలుపు తీసి నవ్వుతూ బయటకు వచ్చాడు.
హాలులో వేచి ఉన్న మిత్రుడు “ నీ కొత్త సినిమాలో డైలాగుల స్క్రిప్టు వచ్చింది, చదువుతున్నాను, చూడు చివరలో వచ్చే ఈ డైలాగు బావుంది” అన్నాడు.
ప్రశాంత్ అందుకుని ఆ డైలాగు చదివాడు, అతని మొహంలో చిరునవ్వు చిందింది.
“ఎవరో ప్రయత్నించి దుఃఖాన్ని కలిగించగలరు ,
కాని నువ్వు సంతోషంగా ఉండాలి ఎల్లప్పుడూ అని నిర్ణయించుకుంటే ఎవరూ ఆపలేరు”.