ఉన్నట్లుండి... - ఎం బిందుమాధవి

suddenly

మీనాక్షి ఉదయం నిద్రలేచేసరికి ఎక్కడి నించో మంత్రాలు వినబడుతున్నాయి. ఇల్లంతా పొగ చుట్టేసింది...ఊపిరాడకనాలుగు పక్కల తలుపులు తీసింది.

భర్త సుందర్ వచ్చి.."ముందు తలుపులేసెయ్యి.. ఇంట్లోకి పొగ ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది" అన్నాడు.

ఏం జరిగిందో అని కంగారుగా వీధి వాకిలి తలుపు తీసి పక్కింటి వారి బెల్ కొట్టింది.

కాలింగ్ బెల్ చప్పుడుకి పాల పేకెట్ అనుకుని ఇందుమతి తలుపు తీసి..పొగ చూసి "ఏమయింది మీనా? ఏమిటీ పొగ? ఫ్లాట్స్ లో ఎక్కడైనా షార్ట్ సర్క్యూటా? అయినా షార్ట్ సర్క్యుట్ అయితే ఇంత పొగ రాదే? " అన్నది.

మీనాక్షి వాళ్ళు నాలుగో ఫ్లోర్ లో ఉంటారు.

మంత్రాలు జోరుగా వినబడుతుంటే..."ఆ(: గుర్తొచ్చింది! ఫస్ట్ ఫ్లోర్ లో వాళ్ళు ఏవో హోమాలుచేయిస్తున్నట్టున్నారు. నిన్నకింద పార్కింగ్ లో కనపడ్డప్పుడు చెప్పింది." అనుకుంది స్వగతంగా.

అధాటుగా లేచిన చికాకుతో.. బ్రష్ చేసుకుని కాఫీ తాగుతూ బాల్కనీలోకి వచ్చింది. అక్కడి నించి ఇందుమతి వాళ్ళబాల్కనీ కనిపిస్తుంది. తను కూడా కాఫీ కప్పుతో వచ్చి...ఆ రోజు ఆదివారం..పొద్దున్నే వంట హడావుడి లేదని... తీరుబడిగాఉయ్యాల్లో కూర్చుని.

"మీనా....ఆ ఫస్ట్ ఫ్లోర్ కళ్యాణి వాళ్ళకి అసలు ఏ నమ్మకాలు లేవంటారు కదా! రెండేళ్ళ క్రితం వాళ్ళ మామగారుచనిపోయినప్పుడు..'మాకు ఇలాంటి తంతులంటే చిరాకు! చనిపోయిన వారు చూడొచ్చారా? ఈ పేరు చెప్పి పంతుళ్ళుడబ్బు గుంజుతారు. అన్నన్ని రోజులు కర్మ కాండలెవరు చేస్తారు?' అని తూతూ మంత్రంగా దహనకాండ ముగించారు! బ్రహ్మగారు చెప్పినా కూడా... నదిలో అస్థి నిమజ్జనం చెయ్యలేదు. గుర్తుందా? ఇహ తరువాయికార్యక్రమాలు సరే సరి!" అంటూ

"ఇప్పుడు తెల్లవారు ఝాము నించి ఒకటే మంత్ర ఘోష! అంతగా ఏం చేయిస్తున్నారంటావు?" అని అడిగింది.

"మొన్న పిల్లకి యాక్సిడెంట్ అయినప్పటి నించీ కళ్యాణి ఒకటే టెన్షన్ పడుతున్నది! ఎవరో జ్యోతిష్కుడికి చూపిస్తే పిల్లగ్రహచారం బాగా లేదని చెప్పాడుట! కళ్యాణి వాళ్ళాయన ఆఫీస్ లో కూడా పరిస్థితులు అంత గొప్పగా లేవుట! అన్నిటికీకలిసొస్తుందని "నవగ్రహ హోమం", "లక్ష్మీ గణపతి హోమం" చేయిస్తున్నారుట!"

"మామగారంటే పరాయి వాడు కనుక..చనిపోయిన వాడు అడగొచ్చాడా అని అప్పుడలా చేశారు! ఇది కన్న పిల్లలవిషయం కదా..నమ్మకాలకి సడలింపులు ఉంటాయి మరి!" అన్నది గూఢార్ధం కళ్ళల్లో ప్రతిఫలిస్తుంటే మీనాక్షి.

ఇంతలో అమెరికా నించి మీనాక్షి కజిన్ పరిమళ ఫోన్ చేసిందని..కార్డ్ లెస్ తెచ్చి చేతిలో పెట్టాడు సుందర్!

"వస్తానోయ్" అని ఇందు దగ్గర సెలవు తీసుకుని హాల్లోకొచ్చి సోఫాలో చేరగిలబడి..కాళ్ళు జాపుకుని..ఒక గంటమాట్లాడటానికి సిద్ధపడి కూర్చుంది.

సాధారణంగా పరిమళ ఫోన్ చేస్తే..వాతావరణ విశేషాలతో మొదలుపెట్టి..దగ్గరలో వచ్చే పండుగలు.. మీనాక్షి కొత్తగాచేసుకుందామనుకుంటున్న వ్రతాలు..వాటికోసం చెయ్యాల్సిన ఏర్పాట్లు...కొత్తగా కొన్న చీరలు, నగలు ..మీనాక్షి పిల్లలఉద్యోగాలు..వారి పెళ్ళిళ్ళ ఏర్పాట్లు...ప్రస్తుతం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉన్నది....ఇలా సాగుతూరెండు గంటలు గడిచి పోయిన విషయం సుందర్ వచ్చి గుర్తు చేసి ఆకలేస్తున్నదనీ..బ్రేక్ఫాస్ట్ చెయ్యమని బలవంతంగాలేపితే తప్ప ఆ వాక్ప్రవాహం ఆగదు.

ఈ రోజు స్పెషల్...పరిమళ కూతురికి అమెరికాలో డెలివరీ అవ్వటం..పదో రోజు చెయ్య వలసిన పుణ్యాహ వచనం..బ్రహ్మగారితో ఏమేం మాట్లాడాలి..ఇత్యాది విషయాలు!

"మీనా...మా అమ్మాయి శ్రియ డెలివరీ అయి రేపటికి పది రోజులే! పురిటాలిని పసివాడితో సహా వేరే రూం లో ఎవ్వరంముట్టుకోకుండా ఉంచానే! పిల్లవాడి పనులన్నీ తనే చూసుకుంటున్నది! పురుడు కదా..ముట్టుకుని మాటి మాటికీ స్నానంచెయ్యాలంటే నాకు జలుబు.... చేస్తుందని ముట్టుకోవట్లేదే! నీకు తెలుసుగా నాకు సైనసైటిస్ ఉన్నదని!"

"పుట్టిన పిల్లవాడిది రోహిణి నక్షత్రం! మేనమామ కి గండం అన్నారు. హోమాలు చెయ్యాలిట!"

"మొన్న మీ బావగారికి చిన్న యాక్సిడెంట్ అయింది. తన గ్రహస్థితి బాగా లేదుట! అందుకే మాకు దగ్గరలో ఉన్నసుబ్రహ్మణ్య స్వామి గుడి లో ఆయన పేరున అర్చన చేయించి దానాలు ఇప్పించాను, ఇప్పుడు వీడేమో గండం తోపుట్టాడు."

"ఒకటికి రెండు అనుభవాలైతే భయమేస్తున్నది. అందుకని నీకు తెలిసిన బ్రహ్మ గారికి మా జాతకాలుచూపించి..శాంతులు ఏమైనా చేయించాలేమో కనుక్కోవే! అందుకే ఫోన్ చేశానే" అన్నది

*********

పరిమళ మామగారు.. కొడుకు గిరీష్ కాలేజ్ లో చదువుతున్నప్పుడే చనిపోయారు. గిరీష్ తల్లి కామాక్షి జాగ్రత్తైన మనిషి. ఆయన ఉండగానే రెండు బెడ్ రూంల ఇల్లు కట్టించారు. భర్త పెన్షన్ డబ్బులతో గుట్టుగా కాపురం నడుపుతూ..ఇద్దరుపిల్లలకి చదువులు చెప్పించి ..పెళ్ళిళ్ళు చేశారు.

పరిమళ ఏకైక సంతానం.... మీనాక్షి బాబాయ్ కి . పరిమళ డిగ్రీ చదువుతూ ఉండగా తల్లి చనిపోయింది. ఆ తరువాతఅన్నీ తనే అయి బాగోగులు చూసి..పెళ్ళి చేశారు, ఆయన.

పరిమళ ఆడపడుచు సుధ కి కొడుకు పుట్టినప్పుడు..ఇరవై ఒకటో రోజు సుధ అత్తగారు "ఆయుష్య హోమంచేయించండి..పిల్లవాడికి మంచిది! బ్రహ్మ గారిని పిలిచి వేద ఆశీర్వచనం చేయిద్దాం" అన్నారు.

ఇంటికి సంబంధించిన ముఖ్య వ్యవహారాల్లో పరిమళ ని కూడా సంప్రదించి, తనని భాగస్వామురాలిని చెయ్యటంకామాక్షమ్మ గారికి మొదటినించి అలవాటు.

పరిమళ కి నమ్మకాలు, సెంటిమెంట్స్...ఆచార వ్యవహారాలపట్ల ప్రత్యేక గౌరవం ఎప్పుడూ లేవు.

"అబ్బా ఇవన్నీ ఎందుకత్తయ్యా..వాళ్ళకి నమ్మకముంటే వారింటికెళ్ళాక చేయించుకోమనండి. మన పిల్లలకి ఇవ్వేమీచెయ్యలేదు! వాళ్ళు బాగానే ఉన్నారు కదా" అన్నది.

పరిమళకి తల్లి లేకపోవటం, స్వయంగా తనకి ఇలాంటి వాటి మీద పెద్దగా ఆసక్తి లేకపోవటం ...ఆడవాళ్ళు శ్రద్ధ పెట్టి చేసేపనులు తండ్రి చెయ్యలేకపోవటం వల్ల పరిమళ పిల్లల విషయం లో ఇలాంటివి జరగకపోవటానికి అసలు కారణం అనేదికామాక్షమ్మ గారికి తెలిసినా పైకి ఆ మాట అనలేదు!

కానీ కూతురు విషయంలో...అవతలి కుటుంబం తో పొరపొచ్చాలు రాకూడదని..కోడలిని ఒప్పించి, జరగవలసిన తంతుజరిపించారు.

కాలంలో అత్తగారు వెళ్ళిపోయారు.

గిరీష్ నడి వయసులో ఉండగా..తలవని తలంపుగా ఒక ఫ్రెండ్ ద్వారా వచ్చిన అవకాశంతో అమెరికా వెళ్ళాడు.

అసలే ఆచార వ్యవహారల పట్ల నమ్మకం..గౌరవం లేని పరిమళ అమెరికా వెళ్ళేసరికి పూర్తిగా ఆ సంస్కృతికి అలవాటుపడింది.

*********

అలాంటి పరిమళ ఇప్పుడు "పురుడు"..ముట్టుకుంటే స్నానం చెయ్యాలి..అనేసరికి ఆశ్చర్యపోయి "నీకెప్పటి నించక్కాఇలాంటి నమ్మకాలు?" అనడిగింది.

ఇరవైయేళ్ళ వయసులో కమ్యూనిజం గురించి మాట్లాడని వాడు..నలభయేళ్ళ వయసులో ఆదిశంకరాచార్య పట్ల భక్తిచూపించనివాడు..సగటు మనిషి కాదని ఎక్కడో చదివిన మీనాక్షి..."అవునులే..ఇప్పుడు బావగారికి అరవై దాటాయికదా..భయం, అభద్రతా భావం తెలియకుండానే అక్క మనసుని ఆవరించి ఉంటాయ్!" అనుకుంది.

"అదంతా తరువాత మాట్లాడతాలే. ముందు కనుక్కుని చెప్పు. పిల్లవాడికి నెల వెళ్ళే లోపే చెయ్యాలి! ముందుగా పదకొండోరోజు పుణ్యాహ వచనం చేయిస్తాను. నువ్వు చెప్పేదాన్ని బట్టి మిగిలిన కార్యక్రమాలు ప్రారంభిస్తాను" అన్నది.

మీనాక్షి తనకి తెలిసిన బ్రహ్మ గారికి ఫోన్ చేసింది. ఆయన " మా బావమరిది... కార్యక్రమాలు నిర్వహించటానికి "తానా" వారి ఆహ్వానంతో వెళ్ళి, ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నాడు. ఆయనకి ఫోన్ చేస్తే వెళ్ళి మీ అక్కగారు వాళ్ళకి కావలసినహోమాలు-శాంతులు చేయించగలరు. ఆయన కి ఫోన్ చెయ్యండి" అని చెప్పి నంబర్ ఇచ్చారు.

అలా పరిమళ తన భర్త కోసం కోరుకున్న గ్రహ శాంతులు..మనవడి బాలసారె కార్యక్రమం..ఇండియా నించి వచ్చిన బ్రహ్మగారి ద్వారా జరిపించుకుని తృప్తి పడింది.

*******

[కన్న పిల్లలు చదువులని, ఉద్యోగాలని పొట్ట చేత పట్టుకుని ఖండాంతరాలకి వెళ్ళి, అక్కడ ఎలా బ్రతుకుతున్నారోతెలియని సందేహం వల్ల అశాంతితో బ్రతుకుతున్న తల్లిదండ్రులు.. అంతకు ముందు ఇలాంటివి నమ్మకపోయినా.... ఇప్పుడు తమలోని అభద్రతని పోగొట్టుకోవటానికి.. శాంతులు..జపాలు..హోమాలని నమ్మకాలు పెంచుకుని వాటినిఆశ్రయించటం పరిపాటి అయింది. ఇది ఎవరినీ విమర్శించటానికి వ్రాసింది కాదు. పరిస్థితులు మనిషిని తన వశంచేసుకుంటాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు అని చెప్పటమే నా ఉద్దేశ్యం!]

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు