శ్రమించే ముసలమ్మ - కృష్ణ చైతన్య ధర్మాన

hard working old woman

చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ ఇవాళ మా పొలానికి వెళ్ళాను. వెళ్లే దారిలో నాన్నగారిని మా పొలాల సంగతులు అడిగి తెలుసుకున్నాను. అతను చెప్పిన ప్రకారము మాకు మొత్తం ఎనిమిది ఎకరాల పొలం ఉంది, అందులో మూడు ఎకరాల ముప్ఫై సెంట్ల స్థలంలో మేమే ప్రతి ఏటా వరిని పండిస్తున్నాం. మిగతా పొలాన్ని కౌలుకు ఇవ్వటం జరుగుతుంది. ఇది గత ముప్ఫై సంవత్సరాలుగా జరుగుతుందంట. అంటే నేను పుట్టక మునుపు నుంచే. ఆ పొలాల మధ్యలోంచి, గట్లపై నడుస్తుంటే ఎదో తెలియని అనుభూతి కలిగింది. వాటికి నాకు మధ్య ఎదో దగ్గర సంబంధం ఉన్నట్టు అనిపించింది. బహుషా అందులోనే కదా ఎప్పటికైనా కలవాల్సిందన్న విషయం నా సుప్తచేతనాత్మక మనసుకి గుర్తొచ్చిందేమో? నేను మా పొలానికి వచ్చి సుమారు ఇరవై సంవత్సరాలు అయ్యింది. ఈ రెండు దశాబ్దాలలో ఎంత మార్పు! టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ బాగా అభివృద్ధి చెందింది. లేబర్ బాగా తగ్గిపోయారు. నాకు తెలిసిన సమయంలో కనీసం నలభై మంది పొలంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు పట్టుమని నలుగురు లేరు. ఈరోజుల్లో లేబర్ దొరకడం చాలా చాలా కష్టం, అంటారు నాన్నగారు. ఈరోజుల్లో ఎవడికి కావాలి వ్యవసాయం, అన్నం మాత్రమే కావాలి, అని దెప్పుతారు కూడా. నాన్నగారు, నేను పొలానికి చేరుకునేసరికే కోత పరికరంతో ట్రాక్టర్ సిద్ధంగా ఉంది. ట్రాక్టర్ యజమానే డ్రైవర్. అతడు నా చిన్ననాటి స్నేహితుడు కూడా. మేమంతా లేబర్ కోసం ఎదురుచూస్తున్నాం. కాసేపట్లోనే ఐదుగురు ఆడవాళ్లు అక్కడకి చేరుకున్నారు. అందులో నలుగురి వయసు ముప్ఫై ఐదు నుంచి నలభై ఐదు మద్యలో ఉంటుంది. వారెవరూ నాకు తెలీదు. కానీ ఆ ఐదో ఆవిడ నాకు బాగా తెలుసు. నేను ఇరవై సంవత్సరాల క్రితం మా పొలానికి వచ్చినప్పుడు ఆమెను ఇదే చోట చూసాను. పని మొదలైంది. నేను మాత్రం ఆమెను ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాను. ఆమె వయసు ఎనభై ఏళ్లకు ఏమాత్రం తక్కువ ఉండదు. "ఏటి మనవడా, నాకేసి అలాగే సూత్తన్నావు? మనువాడుతావా ఏంది?" అంటూ చెమత్కరించింది ఆ ముసలావిడ. వెంటనే మిగతావారంతా తనివితీరా నవ్వారు. "బామ్మ ఇరవై సంవత్సరాల క్రితం కూడా నేను నిన్ను ఈ పొలంలో ఇలా పని చేస్తుండగానే చూసాను. అదే చమత్కారం... అదే నవ్వు... నీలో ఏమంత మార్పు కనిపించలే! నీ ఇద్దరు మనవళ్లు నాకు బాగా తెలుసు. వారు వైజాగ్లో మంచి వ్యాపారం చేస్తూ కోట్లు సంపాదించారు. ఇప్పుడు నువ్వు ధనవంతురాలివి! అయినా ఇంకా ధాన్యం ఎగరబోస్తున్నావేంటి? వారు ఏది కావాలంటే అది పెడతారు కదా! నాలుగు ముద్దలు తింటూ తీర్థయాత్రలు చేయొచ్చు కదా! నీకేల ఈ కష్టం... ఈ వయసులో?" అలా నేను ఆపకుండా ప్రశ్న మీద ప్రశ్న అడిగాను. "నాకు ఇదొక్కటే తెలుసు మనవడా! నాకు ఇదే ఇష్టం! నేను చచ్చేదాకా నా కూడు నేనే కూడబెట్టుకుంటాను. ఆల్లు నన్ను పెంచుడేంది? నేను పెంచితే పెరిగిన పిల్లకాయలు! నేను ఈ పని చూస్తుండగానే చస్తాను తప్ప ఏ పని సెయ్యకుండా ఎవడో యెట్టింది తింటూ అందరిలా ఆస్పత్రిలో సావను మనవడా!" అని చెప్పింది ఆ ముసలావిడ. ఆమె అలా చెప్పేసరికి నా ఒళ్ళు గగురులు పొడిచాయి. సూర్యుడు చాలా చిన్నగా అనిపించాడు. ఒక్కసారిగా ఎ. పి. జె. అబ్దుల్ కలాం గారు గుర్తొచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన తనకి ఇష్టమైన ఉపాధ్యాయ పనిని చేస్తూ స్వర్గస్థులైన సందర్భం గుర్తొచ్చింది. తన భవిష్యత్తుని ముందుగానే అద్భుతంగా ప్లాన్ చేసుకున్నాడతను; అదేవిధంగా ఈ ముసలావిడ కూడా, అని నాకనిపించింది. వారిద్దరి గొప్పతనానికి పెద్ద తేడా ఏమి కనిపించలేదు నాకు. అన్నిటికి మించి మొత్తం జీవితానికి కావలిసిన ప్రేరణ ఒక్క అరగంటలో దొరికినట్టైంది.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు