'అవంతీ శారీమందిరం' ఓనర్ అవతారం దిగులుగా కూర్చీలో కూర్చున్నాడు. దాదాపు మూడు నెలలయింది లాక్‌డౌన్ కారణంగా అతని షాపు మూసేసి. లాక్‌డౌన్ సడలించిన తర్వాత ఓ వారం రోజులైంది మళ్ళీ షాపు తెరిచి. అసలే ఈ మూడు నెలలు షాప్ మూసేయడంవల్ల చాలా నష్ట పోయాడు. షాప్ తెరిచి అంతా శుభ్రపరిచి మళ్ళీ వ్యాపారం మొదలెట్టినా అనుకున్నంత వ్యాపారం జరగడమే లేదు. ఒకప్పుడు వైభవంగా సాగిన తన శారీమందిరం ఇప్పుడు కష్టమర్లు లేక కళావిహీనంగా ఉంది. రోజంతా తను, తన పని వాళ్ళూ ఖాళీగా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటున్నారు కష్టమర్ల కోసం ఎదురు చూస్తూ. లాక్‌డౌన్ సడలించినా కరోనా భయంతో ప్రజలు వీధిలోకి పెద్దగా రావడంలేదు, వచ్చినా బట్టల షాపులవైపు అసలు చూడటమే లేదు. లాక్‌డౌన్ కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోవడంతో ఆదాయం లేకపోవడంకూడా వ్యాపారం సజావుగా జరగకపోవడానికి ఒక కారణం. అసలు వాళ్ళ వ్యాపారమే కాదు మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ అంతా అస్త్యవ్యస్తంగా తయారైంది ఈ కరోనా కారణంగా. ప్రపంచమే ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. 'ప్రపంచ ఆర్థిక వ్యవస్తే కుదేలవుతున్న తరుణంలో తమ వ్యాపారాలు మాత్రం ఎలాబాగుంటాయి?' అని మనసులో తలపోసాడు అవతారం.
ఉగాది పండుగప్పుడు కూడా లాక్‌డౌన్ ఉండటంవల్ల దుకాణాలే తెరిచిలేవు. ఇప్పుడేమో ఏ పండుగలు లేవు చీరలు అమ్ముడుపోవడానికి. కాకపోతే, ప్రతీ సంవత్సరం ఈ ఆషాఢ మాసంలో 'ఆషాఢం సేల్స్ ' అని ఆకర్షణీయమైన బహుమతులో, తగ్గింపు ధరలో ప్రకటించి జనాల్ని ఆకట్టుకునేవారు. అయితే ఇప్పుడు ఆ సీన్ లేదు. ఈ సంవత్సరం ప్రజలు ఎటువంటి ప్రలోభాలకి లొంగి ఇల్లు వదిలి కదిలేటట్లు లేరు. సర్వత్రా కరోనా భయమే రాజ్యమేలుతోంది.
అలా అవతారం ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వచ్చాడు అతని చిన్ననాటి స్నేహితుడు చిదానందం. పేరుకు తగ్గట్లే చిదానందం ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. ఎంతపెద్ద సమస్య ఎదురైనా చిరునవ్వు చిందించడమే అతని ప్రత్యేకత.
వస్తూనే దిగులుగా మొహం పెట్టుకు కూర్చున్నఅవతారం వాలకం కనిపెట్టి, "ఏమిటి, అవతారం వ్యాపారం సరిగ్గా సాగడం లేదా, నీరసంగా, విచారంగా కనిపిస్తున్నావు?" అన్నాడు.
"ఏం చెప్పమంటావు చిదానందం! మూడు నెలలుగా దుకాణం మూతబడి ఉంది. ఇప్పుడు షాప్ తెరిచినా ఏ మాత్రం బిజినెస్ లేదు. ఇలా మరో రెండు నెలలు జరిగితే నేను దివాలా తీయడం ఖాయం. ఏం చేయాలో అర్థం కావడం లేదు." భారంగా నిట్టూర్చాడు అవతారం.
"పోనీ మీ బట్టల దుకాణదారులు ఆషాడం సేల్స్ అని జనాన్ని ఊదరగొట్టి వ్యాపారం పెంచుకుంటారు కదా, అలా చేయలేకపోయావా?" అన్నాడు.
"అదీ అయ్యింది, అయినా ఫలితం శూన్యం."
ఒక్క క్షణం ఆలోచించి ముఖం మీది మాస్క్ సర్దుకుంటూ, "ఓ పని చెయ్య్! నీ వ్యాపారం పుంజుకుంటుంది." అని స్నేహితుడి చెవిలో ఏదో మత్రం ఊదాడు.
చిదానందం నుండి సరైన మంత్రోపదేశం వినగానే పరమానంద భరితుడయ్యాడు అవతారం. అది వెంటనే ఆచరణలో పెట్టాడు.
అంతే! రెండురోజుల్లో పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు అతని షాపు 'అవంతీ శారీ మందిరం' లో ఇసుక వేస్తే రాలనంత జనం! భౌతిక దూరం పాటింపచేసేందుకు కొత్తగా ఇద్దరు పనివాళ్ళని, మరో అయిదురుగురు సేల్స్‌మేన్లని కూడా చేర్చుకున్నాడు. ఇప్పుడు అతని వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా నడుస్తోంది. తనకి సరైన మంత్రోపదేశం చేసిన చిదానందానికి మనసులోనే కృతఙత తెలుపుకున్నాడు అవతారం.
పదిరోజుల తర్వాత అవతారంని కలసుకోవడానికి వచ్చిన చిదానందం తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. తన సలహా అవతారంకి బాగా పనికి వచ్చినందుకు అతనికి చాలా సంతోషంగా ఉంది. ఓ గంట సేపు వేచిఉన్నాక గానీ అవతారాన్ని కలసుకోలేకపోయాడు చిదానందం.
స్నేహితుడ్ని చూస్తూనే అవతారం సంతోషంగా, "చిదానందం! నీ సలహా అమోఘం! చూసావు కదా, ఇప్పుడు నా వ్యాపారం బాగా పుంజుకుంది. నీవిచ్చిన సలహా ప్రకారమే 'ఆషాడం సేల్స్ ' అని బోర్డ్ పెట్టి, షాపులో చీరలు కొన్న ప్రతీవారికీ అరడజను మ్యాచింగ్ మాస్క్‌లు ఉచితం అని వ్రాయించాను. అంతే! జనం ఎగబడి చీరలు కొనడానికి వచ్చారు. ఈ కరోనా కాలంలో ఏదున్నా లేకపోయినా మాస్కులు మాత్రం తప్పనిసరి కదా! మా బావమరిది దుకాణం నుంచి మాస్క్‌లు టోకున తీసేసుకున్నాను. వాడికీ లాభమే లాభం! ఆ ధర చీరల ధరల్లో కలిపేయడంవల్ల నాకు కూడా బోలెడంత లాభం. మంచి సలహా ఇచ్చినందుకు నీకు నా ధన్యవాదాలురా!" అని తెలిపాడు.
చిదానందం అవతారంని చూసి ఎప్పటిలా చిదానందంగా నవ్వాడు.