బన్ని ఐదవ తరగతి చదువుతున్నాడు. వాడికి టి.వి చూడడమంటే మహా ఇష్టం. చిన్న పిల్లలు ఎక్కువసేపు టి.వి.చూస్తే కళ్ళకి మంచిది కాదని , చదువు కూడా సరిగ్గా సాగదని బన్నీ తల్లి , లలిత అభిప్రాయం.
స్నేహితులందరూ ఎప్పుడూ ‘ఆ కార్టూన్ చూసాము ..ఈ కార్టూన్ చూసాము’ అని గర్వంగా చెప్తుంటే ‘ఇంచక్కా వాళ్ళెన్నో మంచి ప్రోగ్రాములు చూస్తుంటారు. అమ్మే నన్నేమీ చూడనివ్వదు’ అని బన్ని తనలో తనే గునుసుకుంటాడు.
స్కూల్లో అర్థ సంవత్సర పరీక్షలు మొదలవబోతున్నాయి. బన్నీకి పరీక్షల ముందర రెండురోజుల సెలవు వచ్చింది
‘బన్నీ నేను కూరలు తేవడానికి వెళుతున్నాను. తలుపు వేసుకో. ఎవరు వచ్చినా తీయకు. టేబుల్ పైన హార్లిక్సు కలిపి పెట్టాను త్రాగేసి బుద్ధిగా చదువుకో సరేనా?’ అంది లలిత బయటకి వెళుతూ
‘హేయ్! అమ్మ బయటకు వెళుతోంది తిరిగి వచ్చేవరకు నేను హాయిగా టి.వి. చూడొచ్చు’ మనసులో సంబరపడుతూనే పైకి మాత్రం బుద్ధిగా ‘సరేనమ్మా!’ అని తల్లి వెళ్ళగానే తలుపుగడియ పెట్టి గబగబా టి.వి. ఆన్ చేసాడు.
!+!+!+!+!
ప్రతి రోజూ స్కూలునించి వచ్చి హోంవర్కు పూర్తి చేసాక కొంచం సేపు టి.వి. చూడటానికి అనుమతి ఉంది బన్నీకి అయినా సరే అది చాలక ఇంట్లో ఉన్న సమయంలో ఇలా అవకాశం చిక్కినప్పుడల్లా దొంగతనంగా టి.వి. చూస్తుంటాడు.
అమ్మ ఇంట్లో లేని సమయంలో తనేం చేసినా అమ్మకి తెలియదని వాడికొక ధీమా! కానీ చూడకపోయినా అమ్మకి అన్నీ తెలుస్తాయని ఆ చిన్న మనసుకి తెలియదు.
తను ఇంట్లో లేనప్పుడు బన్నీ టి.వి. చూస్తాడని లలితకి తెలుసు. ఎన్నోసార్లు నోటిదాకా వచ్చింది అలా ఎక్కువ సేపు టి.వి. చూడడం మంచిది కాదని చెప్దామా అని కానీ తీరా అడిగాక వాడు చూడలేదని బుకాయిస్తే అనవసరంగా వాడి చేత అబద్ధం చెప్పించినట్లవుతుందని ఊరుకుంటోంది.
అమ్మ చూడటం లేదు కదాని వద్దన్న పని చేయకూడదని వాడంతట వాడికే తెలిసిరావాలని కోరుకుంటోంది లలిత.
!+!+!+!+!
ఒక్క గుటకలో హార్లిక్స్ త్రాగేసి టి.వి. చూడడంలో మునిగిపోయిన బన్ని కాలింగ్ బెల్ మ్రోగిన శబ్దానికి ఉలిక్కిపడి ‘అమ్మో! అమ్మ వచ్చేసినట్లుంది’ అనుకుని హడావిడిగా టి.వి. కట్టేసి, రిమోట్ చేతిలోనే ఉందని మర్చిపోయి తలుపుతీసాడు.
‘బన్నీ హార్లిక్స్ త్రాగావా?’ ఇంట్లోకి అడుగుపెడుతూనే ఆరా తీసింది లలిత.
‘ఓ! అప్పుడే త్రాగేసానమ్మా!’ రిమోట్ ఉన్నదని మర్చిపోయి చేతులు ఊపుతూ చెప్పాడు. అదే సమయానికి యాదృచ్ఛికంగా లలిత చూపు బన్ని చేతిలోని రిమోట్ పై పడింది.
‘అమ్మో! ఇంక నాకు తిట్లు తప్పవు’ అనుకుంటూ తల్లికేసి భయం భయంగా చూసాడు. బన్నివైపు ఒకసారి దీర్ఘంగా చూసి మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది లలిత.
తిట్లు తినాల్సి వస్తుందేమోనని భయపడిన బన్నీకి అమ్మ ఏమీ అనకుండా లోపలికి వెళ్ళిపోయేటప్పటికి ఎందుకో తెలియదు కానీ బాధ అనిపించింది. ఎన్నడూ లేనిది వాడిలో తప్పు చేశాననే భావం!
అర్థ సంవత్సర పరీక్షలు ముగిశాయి. ఫలితాల కోసం ఆరోజు స్కూలులో పేరెంట్ – టీచర్ మీటింగు. బన్ని, లలిత వెళ్ళేటప్పటికే చాలావరకూ పిల్లలు తమ తమ తల్లిదండ్రులతో క్లాసులో కూర్చుని ఉన్నారు.
క్లాసు టీచరు ఒక్కొక్క విద్యార్థినే పిలిచి రిపోర్టు కార్డు ఇస్తున్నారు. మంచి మార్కులు వచ్చిన వారిని అభినందిస్తూ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని మరికొంచం శ్రధ్ధగా చదవమని మందలిస్తున్నారు. టీచర్ అందరితోనూ చెప్తున్నది వింటూ, తన పేరు పిలవడం కోసం ఎదురుచూస్తున్న బన్ని ‘పరీక్షలలో టైం వేస్టు చేసుకోవద్దని అమ్మ ఎందుకు చెప్తుందో ఇప్పుడు తెలుస్తోంది. నేనూ ఈసారి పరీక్షలు అనుకున్నంత బాగా వ్రాయలేదు. నాక్కూడా తక్కువ మార్కులే వచ్చుంటాయి. అమ్మ శ్రద్ధగా చదువుకోమని చెప్పినా వినకుండా టైం వేస్టు చేసుకున్నాను. ఇప్పుడు టీచర్ ఏమంటారో? అమ్మ నా గురించి ఏం చెప్తుందో’ అని భయపడసాగాడు.
‘బన్నీ’ అన్న టీచర్ పిలుపుకి నెమ్మదిగా తల్లితో వెళ్ళి టీచర్ ప్రక్కనే నిలబడ్డాడు.
‘బన్నీకి ఈసారి ఎందుకో ఎప్పటికంటే తక్కువ మార్కులు వచ్చాయి?’ లలితతో అని ‘ఏం బన్నీ నువ్వూ అమ్మతో కూర్చుని టి.వి. చూస్తూ చదువు ప్రక్కన పెట్టావా?’
టీచర్ తనని కోప్పడకుండా అమ్మని అనేటప్పటికి బన్నీకి ఏడుపు తన్నుకు వచ్చి గొంతులోంచి మాట పెగలలేదు. సమాధానం చెప్పక మౌనంగా ఉన్న బన్నీ వైపు ఒకసారి చూసి టీచర్ తో ఏదో అనబోయింది లలిత.
‘లేదు టీచర్ అమ్మ అసలు టి.వి. చూడదు. నన్ను కూడా ఎక్కువ సేపు చూడవద్దనే చెప్తుంది. నేనే అమ్మ మాట వినలేదు. తప్పు నాదే టీచర్. ఇకపై బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటాను. ఈసారికి నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యండి టీచర్’ అన్నాడు ఏడుస్తూ .
‘అరెరే! ఏడవకు. నీ తప్పు తెలుసుకున్నావు కదా. అంతే చాలు. ఇకపై అమ్మ మాట విని బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకో, సరేనా’ అని రిపోర్ట్ కార్డు బన్ని చేతికి ఇచ్చి రిజిష్టర్ లో లలితతో సంతకం పెట్టించుకున్నారు టీచర్.
కళ్ళు తుడుచుకుని ‘అలాగే టీచర్’ అని బుధ్ధిగా తల ఊపాడు ............
ఇంటికి వచ్చాక ‘అమ్మా! ఇకపై నువ్వు చెప్పినట్లే వింటాను. టైం వేస్టు చేసుకోను. ఐ యాం సారీ’ అన్నాడు మళ్లీ ఏడుస్తూ.
‘ఛ ఛ , ఇలా ఏడుస్తారా ఎవరైనా? మా మంచి బన్నీవి కదూ! ఏడుపు ఆపేయ్. అమ్మ ఏం చెప్పినా నీ మంచి కోసమే చెప్తుంది , అవునా?’ అంది
“అవునమ్మా!”
“టి.వి. చూడడం తప్పు కాదు బన్నీ! కానీ అదేపనిగా చూస్తే తలనెప్పి వస్తుంది, కళ్ళు నెప్పిపెడతాయి, సైట్ దెబ్బతింటుంది ఇలా ఎన్నో నష్టాలు. ఏదైనా అతిగా చేయకూడదు. సరేనా?” బన్నీని దగ్గరకు తీసుకుని తన చీర కొంగుతో వాడి కళ్ళు తుడుస్తూ అంది లలిత .
“సరేనమ్మా” అంటూ గాఢంగా తల్లిని కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు అందరిచేతా బన్ని అని ముద్దుగా పిలవబడే భరత్.