అరచేతిలో స్వర్గం - పద్మజారాణి అవసరాల

heaven in our hand

బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లొ వున్నాడు... కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు బూచాడమ్మా...అంటూ నా ఫోను రింగ్ అయింది. ఎంతో మురిపెంగా చంటి దానికి నేర్పి రింగ్ టోన్ గా పెట్టుకున్నాను. ఎంత అర్థవంతమైన పాట !!! ఆ కాలంలో బూచాడు ఆ పాప ఊహల్లోనే ఉన్నాడు. మరి ఈ కాలంలో.... అని అనుకుంటూ ఫోన్ ఆన్సర్ చేశాను. ఇక్కడ అంతా బాగానే ఉన్నారు, నువ్వు తొందరగా ఒకసారి ఊరికి రారా తల్లి, మాస్టారు నిన్ను చూడాలని అంటున్నారు అని నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నాన్న ఫోన్ పెట్టేసరికి రెండు నెలల క్రితం జరిగింది గుర్తుకువచ్చి మనసులో ఆలోచనల అలజడి రేగింది. వత్తిలోని నలక వజ్రపు నలక, పత్తిలోని నలక బంగారపు నలక అంటూ అమ్మ దీపం వెలిగించే మంత్రానికి మెలుకువ వచ్చేసింది. అబ్బా అమ్మ అప్పుడే నిద్ర లేచి దేవుడికి మేలుకొలుపు మొదలుపెట్టేసావా? ఆదివారం అయినా దేవుడికి విశ్రాంతి ఇవ్వొచ్చుకదే అంటూ విసుక్కుంటూనే నిద్ర లేచాను. అయ్యో తల్లి అలవాటయిపోయిందే, అప్పుడు , ఇప్పుడు మీకోసమే తాపత్రయం. చంటిది లేచిందా ఏంటి? అని స్వరం తగ్గించి, అయినా మా కాలంలో అయితే అమ్మ వెనకే అందరం లేచి ఐదు లోపలే మా పిల్లల స్నానాలు కూడా అయిపోయేవి. లే లే!! మీ నాన్నగారు లేచి కాఫీ తాగి అప్పుడే కూరలు తీసుకురావడానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి నువ్వు కనిపిస్తే చూశావా నా కూతురు, నా పెంపకం అని నా దగ్గర కాస్త ఎక్కువగానే చెప్పి సంతోషిస్తారు అంటూ అమ్మ నాకూ మేలుకొలుపు రాగం పడింది. ఇక తప్పదురా బాబు అనుకుంటూ, దుప్పటిని సర్ది, పక్కలు సరిచేసి, ఫోన్లో భజగోవిందం పెట్టాను. ఉదయాన్నే సుబ్బలక్ష్మి గారి గొంతు వింటూ ఉంటే కలిగే ప్రశాంతతే వేరు. ఈ లోపు నాన్నగారు వచ్చారు. చేతిలో ఉన్న కూరల సంచి అందుకుంటూ ఏమిటి నాన్నగారు అంత ఆదుర్దాగా ఉన్నారు అని అడిగాను ముందు కొంచెం మంచినీళ్లు తీసుకురా తల్లీ అలాగే ఒకసారి అమ్మని రమ్మని చెప్పు అంటూ కుర్చీలో కూర్చున్నారు. నాన్న ఎప్పుడూ లేనంత విచిత్రంగా ఉన్నారు అని అమ్మకి చెప్పి మంచినీళ్లు తెచ్చి నాన్నకి ఇచ్చాను. ఇంతలో అమ్మ ఏమైందండీ అంటూ వచ్చింది. మన మాస్టారు గారి అబ్బాయి ఉన్నాడుగా, నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడుట!! ఊరంతా అదే విషయం మాట్లాడుకుంటున్నారు. నిన్న రాత్రి పది తర్వాత వార్తల్లో చెప్పారట! రాత్రి నుంచి అదే వార్త అన్ని చానల్స్ లో తిప్పి తిప్పి చూపిస్తున్నారట. మనం ప్రసారభారతి వార్తలతో ఆపేస్తాం కాబట్టి మనకి తెలియలేదు అని ఆగారు నాన్న... అయ్యో మన చంటి ఇలా ఎందుకు చేశాడండి. మంచి ఉద్యోగం వదిలేసి సినిమాల్లో వేషాలు అంటూ వద్దన్నా వెళ్లాడని మాస్టారు చాలా బాధపడేవారు. ఈ మధ్యనే కాస్త నిలదొక్కుకున్నాడు, వేషాలు వస్తున్నాయి అన్నారు. ఇంతలో వాళ్ళ కుటుంబానికి ఏంటండీ ఇలా జరిగింది?? పదండి మాస్టర్ దంపతులను కలిసి వద్దాం అని అమ్మ లేచింది. ఇద్దరు మాస్టర్ గారి ఇంటికి వెళ్లారు. టీవీలో మాస్టర్ ఇంటిముందు చాలా చానల్స్ వాళ్ళు. అవకాశాలు రాక ఆర్థిక ఇబ్బందులతో చనిపోయాడా? ప్రేమ వ్యవహారం ఉందని, మీరు వాళ్ళ పెళ్లికి అంగీకరించలేదని మిమ్మల్ని కాదని పెళ్లి చేసుకుంటే చనిపోతామని బెదిరించారని నిజమేనా అందుకే ఆత్మహత్య చేసుకున్నాడా?? ఇలా.మాస్టర్ని రకరకాల ప్రశ్నలతో తూట్లు పొడిచిన్నట్లుగా చేస్తున్నారు. మాస్టర్ నుంచి మౌనమే సమాధానమైంది. సాటి మనిషి కష్టం అంటే అంత తేలిక అయిపోయిందా?!? చాలా సేపు ఒకే వార్తని ఏ చానల్స్ వాళ్ళు ఆ ఛానల్ కి అనుగుణంగా వాళ్లకి నోటికి వచ్చిన మాటలతో చెబుతారు. గీతాసారాన్ని అయినా ఆకళింపు చేసుకోవచ్చు కానీ వాక్య నిర్మాణం సరిగా లేని వాళ్ల మాటల సారాంశం మాత్రం అర్థం కాదు. మరో ఛానల్లో అంతకు ముందు ఇలాగే జరిగిన మరికొన్ని ఆత్మహత్య సంఘటనలను తీసుకొని ఇప్పటి దానికి కారణం ఏమిటనే దిశగా ఎవరికి తోచినట్లుగా వారు వాదనలు. ఇక అతని చిట్టచివరి సెల్ఫీ వీడియో నుంచి చిన్నప్పటి ఉగ్గుపాల వరకు చర్చే. చర్చలో ఉండేవాళ్ళు కూడా ఒకరితో ఒకరు గొడవపడడం చూస్తుంటే ఆ వ్యక్తి చేసిన పని మన చావుకొచ్చిందే అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. మొత్తానికి మాస్టారు గారి అబ్బాయి శవం రాత్రికి ఊరికి చేరుతుందని తాజా..తాజా.. మొదలయింది. ఇక మాస్టారు గారి అబ్బాయిని స్మశానానికి సాగనంపే వరకు అలా సంచలన వార్తలు, ఏదో ఒక తాజా.. తాజా.. వస్తూనే ఉంటుంది, టీవీ కట్టేయ్ తల్లి అన్నారు నాన్న ఇంటి లోపలికి వస్తూ. ఆ పని చేసి నాన్న దగ్గర కూర్చున్నా. ఎంత కష్టం తల్లి ఈ వయసులో. ఎంతో కష్టపడి పిల్లాడిని ప్రయోజకుడు చేశారు అనుకునే సమయంలో గట్టి ఎదురుదెబ్బ. నువ్వు పుట్టక ముందునుంచే వారి ఇంట్లోనే అద్దెకు ఉండేవాళ్ళం. వాళ్లకి కొంత ఆలస్యంగా సంతానం కలగడం వల్ల చాలా ముద్దుగా చూసేవారు. అలా అమ్మకి, నాకు ఒక పెద్దదిక్కులా ఉండేది ఆ కుటుంబం. నీ చిన్నతనపు ఆనందాలు అన్ని మాస్టారి కుటుంబం మధ్యలో చాలా సరదాగా సాగేవి. తర్వాత వారికి సంతానం కలగడం జరిగింది. మనకి కలిసొచ్చి సొంతింటికి మారడం జరిగింది. అయినా పండగలకి పేరంటాలకి కలుస్తూనే ఉన్నాం అంటూ మాస్టర్ ని తలచుకుని నాన్న చాలా బాధపడ్డారు. నాన్న, అమ్మ, నేను మాస్టర్ ఇంటికి వెళ్తూనే ఉన్నాం. నాకు సెలవులు అయిపోవడంతో వచ్చేసాను. నాన్న అమ్మ ప్రతిరోజు వెళ్లి వస్తున్నాం అని చెప్పారు. ఇంతలో నాన్న ఫోన్ చేయడం నేను ఊరికి బయలుదేరడం జరిగింది. వెళ్లిన వెంటనే మాస్టర్ ఇంటికి వెళ్ళాను. మాస్టర్ దంపతులు ఇంటికి కళ వచ్చింది నీ రాకతో అని ఆత్మీయంగా అమ్మ నా తలమీద చెయ్యి వేసి నిమిరితే మాస్టారు నా చేతిని తన చేతిలోకి తీసుకుని చెప్పడం మొదలుపెట్టారు..ఆలస్యంగా పిల్లాడు పుట్టడం చాలా అపురూపంగా పెంచాం. కొన్నిసార్లు మా తాహతును దాటి వెళ్ళి అడగకుండానే అన్ని అందించాం.. బాగా పెంచుతున్నాం అనుకున్నాం కానీ విలాసాలకు బానిస చేస్తున్నామని అనుకోలేదు. పిల్లాడు బాగా కష్టపడి చదివి ప్రయోజకుడు అయ్యాడు అనుకునే సమయానికి ఇలా అవ్వడం చూస్తుంటే వ్యక్తిత్వాన్ని నిర్మించలేని మా పెంపకాన్ని నిందించుకోవాలో, జీవన విధానాన్ని నేర్పలేని మన విద్యా విధానాన్ని అనాలో, ఆధునిక విజ్ఞానాన్ని తప్పు పట్టాలో మాకు తెలియటంలేదు. ఎన్నింటినో వదులుకొని పిల్లాడే సర్వస్వం అనుకున్నందుకు ఇప్పుడు జరిగిన నష్టానికి అంతకు మించిన బాధ కలుగుతోంది. ఏదీ శాశ్వతం కాదు అని తెలిసినా సరే మనిషి ఎందుకు అలా వెంపర్లాడుతూనే ఉంటాడు అని ఈ మధ్య మమ్మల్ని మేమే ఎన్నిసార్లు ప్రశ్న వేసుకున్నామౌ!! మనిషి ఆశాజీవి కదా. నిరంతర సృష్టి క్రమంలో మనిషి ఉన్నంత కాలం మనుగడ కోసం ఈ పాట్లు తప్పవు అని మాకు మేమే సర్దిచెప్పుకుంటున్నాం. ఇది జరిగిన వెంటనే మేమిద్దరం కూడా శివైక్యం అయిపోదామని నిర్ణయించుకున్నాం కానీ దానిద్వారా మేము ప్రపంచానికి ఇచ్చే సందేశం ఏంటి?? మా విచక్షణ మమ్మల్ని ఆ పని చేయనియ్యకుండా ఆపింది. చిన్నప్పుడు మా నాన్నగారు నా పదమూడవయేట పోతే వారాలుచేసి చదువుకొన్నాను. ఆ వారానికి వెళ్ళిన రోజు వారి ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఆ పూటకి పంపునీరే గతి. నాకంటే పెద్ద వాళ్ళకి కూడా బోధిస్తూ ఆ డబ్బులతో నా పరీక్ష ఫీజులు కట్టుకుంటూ ఇదిగో ఈ స్థాయికి వచ్చాను. ఇక అమ్మ గురించి నీకు తెలుసు. ఇరవై ఏళ్ళ వయసులో వచ్చి నన్ను, నా కుటుంబాన్ని తన అణుకువతో ఆకట్టుకుని, దక్షతతో ఒక్కతాటి మీద నడిపించింది. ఎప్పుడు లేచేదో, ఎప్పుడు పడుకునేదో కూడా తెలిసేది కాదు. కానీ ఏనాడు స్వేచ్ఛ, సమానత్వం వంటి పోరాటాలు చేయలేదు. ఇద్దరం కలిస్తేనే జీవితం అనేది మా తరం. ఇద్దరు కలవడం అంటే రెండు కుటుంబాలు హాయిగా ఉండాలి .ఒక్కొక్కసారి ఒక్కొక్కరిది పైచేయిగా ఒక్కొక్కసారి ఇద్దరం సమానంగా అని మేము అనుకునేవాళ్ళం. దానిలో ఏం లోపం ఉందో మాకు తెలియటం లేదు. ఇప్పటి తరానికి ఉమ్మడి కుటుంబమే పెద్ద గుదిబండ. ప్రతి దానికి మేమే ఎందుకు చేయాలి అనే ప్రశ్న. ఇదిగో ఇక్కడే నేనున్నా అంటూ వచ్చిపడే ఇగోలు. ఇక కలిసి ఉండడంలో ఉన్న మాధుర్యం ఎలా తెలుస్తుంది?? సర్దుకుపోవడం గురించి అసలు తెలిసే అవకాశమే లేదు. స్వేచ్ఛ సమానత్వం అనే ముసుగులో మీరు సాధిస్తున్నది ఏమిటి?? పోగొట్టుకున్నది ఏమిటో తెలిసేసరికి జీవితం కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పినా అర్థం చేసుకునే స్థితి ఇప్పుడు లేదు. ఎవరికి వాళ్ళే హీరో కానీ వాళ్ళు చేసే ఆత్మహత్యలు వాళ్ళని చరిత్రపుటల్లో జీరోని చేసేస్తాయి అని మాస్టారు నిట్టూర్పు విడిచారు. ఈ వయసులో మీకు ఇలాంటి ఎదురుదెబ్బ ఎందుకు ఏంటి అని అందరిలా గుచ్చిగుచ్చి అడగలేకపోయాం. మీరు ఇంత తొందరగా తేరుకోవడం చూశాక ప్రశాంతత కలుగుతోంది మాస్టారు అంటూ ఆగాను. ఇంతలో అమ్మ మాట్లాడటం మొదలు పెట్టారు...తమ్ముడు పరిస్థితి నువ్వే చూసావుగా!! డ్రగ్స్ కి అలవాటు పడిపోయి, ఆ మత్తులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. తను ఇంకా ఆర్థికంగా నిలదొక్కుకోకపోవడం, ప్రేమ విఫలం కావడం లాంటి కారణాలు చెప్పాడు. ఇవేనా మీ సమస్యలు అని నిలదీయాలని ఉంది. దానికితోడు ఈ మీడియా వాళ్ల హడావిడితో అసలు కంటే అక్కరకురానివే ఎక్కువ అవుతున్నాయి అంటూ అమ్మ వస్తున్న దుఃఖాన్ని ఆపే ప్రయత్నం చేశారు. చిన్నపిల్లలకి అమ్మ చెయ్యి మారితే సమస్య, ప్రేమిస్తే సమస్య..ప్రేమించకపోతే సమస్య, అసలు పెళ్లే సమస్య. చదువు, తిండి, కీర్తి, ఆరోగ్యం అన్ని సమస్యలే. అసలు ఏ సమస్య లేకపోతే ఆ మనిషే మన సమాజానికి పెద్ద సమస్య. సమస్యలు లేకపోతే మనిషి మనుగడే లేదు.ఈ సమస్యలన్నీ మనలోనే ఉంటాయి. గెలుపు వెనుక జీవితం, ఓటమి ముందు గెలుపు ఎప్పుడూ ఉంటాయి నా దృష్టిలో ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు నాలుగు గదులతో నవ్వగలిగే నలుగురు మనుషులు. ఆ నలుగురితో చర్చించి మార్చుకోవాల్సిన విషయాలను కూడా సమస్యలుగా అనుకుని చివరికి చావు గా మార్చుకుంటున్నారు ఈ తరం. ఇదివరకు అత్యవసరమైన విషయాలకి వాడే ఫోను ఇప్పుడు చావుకి రుజువులు మిగిల్చే సాధనంగా మార్చేశారు. " అరచేతిలో స్వర్గం " అనే మాటకి ఈ తరం పూర్తిగా అర్థమే మార్చేసింది అంటున్న అమ్మని ఆశ్చర్యంతో చూస్తూ అవునమ్మా, ఆధునిక విజ్ఞానంతో చేరువలో ఉంటూ మానసికంగా దూరమవుతున్నాం. గుర్తింపు, కీర్తి, డబ్బు, పదవి ఇలా నానారకాలుగా పాకులాడడంలో మమ్మల్ని మేం పూర్తిగా కోల్పోతున్నాం. అతి ఎప్పుడూ ప్రమాదమే..కానీ అసలే ప్రమాదంగా మారుతోంది అంటూ ఏకీభవించాను నేను. ఇంతలో మాస్టారు అవునమ్మా, ప్రతిదానిలోనూ మంచి,చెడు ఉంది. కానీ వేగవంతమైన సాధనాలూ, ఇలాంటి వార్త కథనాలు చేసే చెడు ముందు ఆ మంచి మచ్చుకి కూడా కనిపించడం లేదు. పాఠశాల స్థాయి నుంచే విదురనీతి పసి మనసులకు హత్తుకునేలా చెప్పగలిగే స్థాయిలో మన పెంపకం, విద్యా విధానం ఉండాలి. భావప్రకటనా విధానాన్ని పూర్తిగా మార్చాలి. మన సంప్రదాయాలు పిల్లలకి అలవాటుగా చేయాలి. మన రేపటి తరానికి ఆస్తిగా మన పురాణ ఇతిహాసాలను అందించగలగాలి. ఇది ఒక రోజులో సాధ్యం కాదు కానీ మేము ఇద్దరం ఒక నిర్ణయానికి వచ్చాము. మా ఆస్తిని నీ పేర వీలునామా రాస్తున్నాం. మేము కోరుకున్నట్లుగా కొత్త తరాన్ని తయారు చేయడానికి ఇవి ఉపయోగపడాలని మా ఉద్దేశ్యం. గురువుగా పిల్లలను తీర్చిదిద్దుతూ, గృహిణిగా తల్లిగా నీ కుటుంబానికి ఆలంబనగా మారి మన్ననలను పొందుతున్న నువ్వే దానికి అర్హురాలివి. మా కోరికను మన్నిస్తావా తల్లి అన్నవారి మాట పూర్తికాకుండానే వాళ్ళ పాదాలకు నమస్కరించి మీరు కోరుకున్న నవతరం కోసం నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అంటూ దగ్గరికి తీసుకున్నాను.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు