శుభ పరిణామం - మంత్రిప్రగడ రామకృష్ణ శర్మ

good vibes

భార్గవికి సినిమా పాటలు పాడాలంటే చాలా ఇష్టం. పాడుతా తీయగా, సర్వాభిషేకం మొన్నగు కార్యక్రమాలు క్రమం తప్పకుండా గమనిస్తుంది . వివిధ భారతిలో పాటలు వింటూ కాలక్షేపం చేస్తుంది.


భార్గవి గొంతు వినటానికి బాగుంటుంది . ఎక్కడికి వెళ్లి నేర్చుకోలేదు. వినికిడి ఙ్ఞానంతో పాట పట్టేస్తుంది. తోటి వాళ్ళు మెచ్చుకుంటారు.
అప్పుడప్పుడు ' అహం గురు అహం శిష్య' అనుకుంటా మురిసి పోతుంది.


వాళ్ళ నాన్నగారికి భార్గవి పధ్ధతి నచ్చలేదు. సినీ సంగీత ప్రపంచంలో రాణించడానికి చాలా కృషి చేయాలంటారు. పైగా మనకు ఎంతటి ప్రావీణ్యమున్నప్పటికీ ఆ రంగంలో మనల్ని ప్రోత్సహించడానికి బాగా కావలసిన వ్యక్తి దొరకాలి,
ఆదే ఆంగ్లంలో ' గాడ్ ఫాదర్ ' అంటారు.


దశాబ్దాలుగా కష్టపడితేగానీ గుర్తింపు రాదు. గుర్తింపు పొందినా ఏదో కొద్ది పాటి
అదృష్ట వంతులుకు తప్ప లక్ష్మీ దేవి కరుణించదని
భార్గవి నాన్నగారి అభిప్రాయం.


ఆ తర్వాత పాటల మీద ఆశక్తి పెరిగితే చదువు వెనకబడుతుందని ఆయన అపోహ. ఇప్పుడే ఇంటర్ పూరైంది.


ఎంత వరకు వీలైతే అంతవరకూ చదువు చెప్పించి ఒక అయ్య చేతిలో పెట్టి తన తండ్రి ధర్మాన్ని పూర్తి చేయాలన్న ఆరాటంలో ఉన్నారాయన.


భార్గవికి ఎలాగైనా సినీ సంగీతంలో రాణించాలనేది చిన్న నాటి కోరిక.


భార్గవి మేనమామకి, అందరూ అతన్ని ముద్దుగా బాబ్జీ అంటారు , ఆమె మీద వల్లమాలిన
ప్రేమాభిమానాలున్నాయి. దానికి తోడు అతను మంచి సంగీత ప్రియుడు. చిన్నప్పుడు శాస్త్రీయ సంగీతం గురు ముఖంగా నేర్చుకున్నాడు. బాల్యంలో చిన్న చిన్న సంగీతం పోటీల్లో పాల్గొన్నాడు. బహుమతుల్ని సంపాదించిన సంఘటనలున్నాయి . అతను చదువులో కూడా ఏమి తీసిపోలేదు. ఐ. ఐ. ఐ. టి లో చేరగానే సంగీతానికి స్వస్తి చెప్పి పూర్తిగా చదువు మీద శ్రద్ధ పెట్టాడు .అప్పుడప్పుడు సెలవుల్లో వచ్చినప్పుడు
భార్గవి వాళ్ళతో సమయం గడపటానికి ఇష్టపడతాడు.


భార్గవికి అతని సహాయ సహకారాలు ఎప్పుడూ లభిస్తాయి. ఒక సారి మాటల సందర్భంలో 'చూడు భార్గవి నీవు సంగీతంలో నిజంగా ప్రయోజకురాలివి కావాలంటే ఇలా లొల్లాయి పాటలు పాడితే లాభంలేదు. ఏ విధ్య కూడా గురువు లేకుండా రాణించదు. మా గురువు గారు శాస్త్రి గారు ఇంకా శాస్త్రీయ సంగీతం నేర్పుతున్నారు. నేనడిగితే కాదనరు. 'అన్నాడు.


'మామయ్య నేను సినీ సంగీతం ఇష్ట పడతాను శాస్త్రీయ సంగీతం కాదు' అన్నది భార్గవి


'ఏ సంగీతమైన శాస్త్రీయ సంగీతం పునాది లేనిదే
రాణించదు 'అని బదులు చెప్పాడు భార్గవి మామయ్య.


'అది సరే మామయ్య మా నాన్నగారి సంగతేమిటి ' అన్నది భార్గవి.


'ఆయన విషయం నేను చూస్తాను ' అన్నాడు భార్గవి మామయ్య.


ఒక రోజు భార్గవి తండ్రి బాల్కనీలో పచార్లు చేస్తూ కనిపించాడు. ఇదే మంచి సందర్భమనుకుని భార్గవి ప్రస్తావన తెచ్చాడు ఆమె మామయ్య.
వెంటనే భార్గవి తండ్రికి చిరు కోపమొచ్చింది.
'చూడు బాబ్జీ నీవు అసాధారణ ప్రజ్ఞాశాలి. నీవు సంగీత సాధన చేస్తూ ఐ.ఐ.ఐ. టి. లో చేరావని ,అందరికీ అది సాధ్యం కాదు. భార్గవి సగటు విద్యార్థిని. పగలు రాత్రి కష్టపడి చదివితేనే గానీ మంచి మార్కులు రావు ' అన్నాడు.


భార్గవి తండ్రికి ఒక బలహీనతుంది. జాతకం పై నమ్మకముంది.ఆ ఊర్లో శర్మ గారని ఒక జ్యోతిష్య పండితుడున్నాడు. అతనికి ఏ సమస్య వచ్చినా శర్మ గారిని సంప్రదిస్తాడు . ఈ విషయం బాబ్జీకి స్ఫురించింది. వెంటనే భార్గవి భవిష్యత్
శర్మ గారినడిగి తెలుసుకొంటే ఎలా వుంటుందన్నాడు బాబ్జీ. అందుకు సరే అన్నాడు భార్గవి తండ్రి.


ఒక ఉదయం అందరూ కలిసి శర్మ గారింటికి చేరుకున్నారు. అప్పుడే శర్మ గారు నిత్య పూజ పూర్తి చేసుకుని ముందు గదిలో కూర్చున్నారు.


వాళ్ళొచ్చిన పని తెలుసుకున్న శర్మ గారు
' జాతకమడిగి తీసుకున్నారు. శర్మ గారికి మంచి అనుభవమున్నది.ఏ విషయం దాచరు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పుతారు. తర్వాత ప్రపంచ పరిస్థితులు మరియు శాస్త్రాన్ని కలపి సలహాలిస్తారు. అనేక వర్తమాన విషయాల్లో అవగాహన కలదు .


జాతకం క్షుణ్ణంగా పరిశీలించి ' భార్గవి నీకు సంగీతం
నేర్చుకోవాలనున్నది. మీ నాన్నకి
చదివించాలనున్నది. రెండు సమస్యలకు ఎక పరిష్కారమొకటుంది'. అన్నారు శర్మ గారు.
అందరూ ఉత్కంఠతో ఆయన వంక ఆశ్చర్యంగా
చూసారు.


శర్మ గారు తన దైన శైలి లో ' అమ్మాయిని
బి. ఏ. సంగీతం డిగ్రీ లో చేర్పించండి. సాయంత్రం
శాస్త్రి గారి దగ్గర ప్రత్యేకంగా సంగీత శిక్షణకు పంపించండి '.అన్నారు .


ఈ ప్రస్తావన సర్వ సభ్య ఆమోదకరంగా వున్నది.
భార్గవి ఆనందంగా ఉంది. తన చిరకాల కోరిక తీరుతుందని. భార్గవి తండ్రి సంతోషించాడు. అమ్మాయి డిగ్రీ చేయొచ్చని. బాబ్జీ ఉషారుగా
వున్నాడు. తన పథకం ఫలించిందని. శర్మ గారు
తృప్తిగా వున్నారు. తన సలహాలు ఉపయుక్తంగా ఉన్నందుకు.


శర్మ గారికి ఇతోధికంగా దక్షిణ సమర్పించి అందరూ ఇంటి దారి పట్టారు.


భార్గవి సంగీత కళాశాలలో చేరింది. బాబ్జీ ఒక రోజు సాయంత్రం భార్గవిని వెంట పెట్టుకొని శాస్త్రి గారి దగ్గరకి వెళ్ళాడు.


తన పూర్వ విద్యార్ధి రావటంతో శాస్త్రి గారు బాగా
సంతోషించారు. దానికి తోడు ఇప్పుడతను ఇంజినీరింగ్ చదువుతున్నాడు.


సంగతి తెలుసుకున్న శాస్త్రి గారు భార్గవిని ఒక పాట పాడమన్నారు. ' నాకు శాస్త్రీయ సంగీతం రాదు గురువు గారు ' అన్నది వినయంగా భార్గవి.
' దానిదేముందమ్మా శంకరాభరణం సినిమాలోని
బ్రోచేవారెవరురా పాడు ' అన్నారు శాస్త్రి గారు.


భార్గవి చాలా సంతోషించింది ఆ పాట తనకు చాలా
ఇష్టమైన పాట. ఆ పాటను సినిమా పాటలాగే నేర్చుకున్నది. అది శాస్త్రీయ సంగీతం పాటలా భావించలేదు . మొదటి నుంచి భార్గవికి వినికిడి
ఙ్ఞానం ఎక్కువ. ఎంత కష్టమైన పాటైనా ఇట్టే
పట్టేస్తుంది. సంగతులు, గమకాలు కూడా అప్రయత్నంగా వల్లే వేస్తుంది.


భార్గవి గొంతు సవరించింది. గురువు గారి అనుమతి కోసం. శాస్త్రి గారు ఆరంభించాలన్నట్లు
తలూపారు.


భార్గవి పాట అందుకుంది. మొదట్లో కొద్దిగా పాడించి
చూద్దామనుకున్నారు .కానీ ఆమె గాత్ర మాధుర్యానికి ఆనందించి పూర్తి పాట విన్నారు.


రేపు మంచి రోజు వచ్చి చేరమన్నారు శాస్త్రి గారు.
మరుసటి దినం గురు వందనం , శారదా స్తుతి
తర్వాత సా-పా-సా ల తో తొలి శాస్త్రీయ సంగీతం
పాఠాలు మొదలెట్టారు శాస్త్రి గారు.

భార్గవికి ఇప్పుడు క్షణం తీరిక లేదు. ఉదయం నాలుగున్నర గంటలకి లేచి కాల కృతాలు తీర్చుకుని సంగీత సాధన చేస్తుంది. ఆ తర్వాత
తల్లికి ఇంటి పనుల్లో సహయం చేస్తుంది.
అటు పిమ్మట స్నానం చేసి సంగీత కళాశాలకు
వెళ్తుంది. సాయంత్రం ఇంటికొచ్చి ఫలహారం తీసుకుని శాస్త్రి గారి దగ్గరకి చేరుతుంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి.


ఊర్లో లేని సమయంలో బాబ్జీ చరవాణిలో
భార్గవితో మాట్లాడి సంగీత సాధన గురించి వాకబు
చేస్తాడు.


నెమ్మదిగా ఒక సంవత్సరం గడిచింది. భార్గవి పట్టుదలతో శాస్త్రీయ సంగీతం సాధన చేస్తుంది.
శాస్త్రి గారు తృప్తిగా వున్నారు. కళాశాల డిగ్రీ మొదటి సంవత్సరం పూరైంది. మొదటి శ్రేణిలో
ఉత్తీర్ణమైంది. ఈ సంవత్సర కాలంలో బాగా కష్టపడి సరళీస్వరాలు, జంటస్వరాలు , ధాతు స్వరాలు,
అలంకారాలు నేర్చుకున్నది.


ఒక రోజు భార్గవితో శాస్త్రి గారిలా అన్నారు.
' సినిమా సంగీతంలో రాణించడానికి లలిత సంగీతం కూడా నేర్చుకోవాలి. చారీ గారని నాకు తెలిసిన లలిత సంగీత విద్వాంసుడున్నారు. నేను చీటీ రాసిస్తాను. ఆయనకు చూపిస్తే మిగిలిన విషయాలు ఆయనే స్వయంగా
చెప్తాడు '.


చారీ గారు పెద్ద పేరున్న లలిత సంగీత విద్వాంసుడు .ఆయన శిష్యులు చాలా మంది
సినిమా రంగంలో రాణించారు. ఈ సంగతి భార్గవికి
తెలుసు. గురువు గారు తనయందు సహృదయంతో సహాయం చేసినందుకు భార్గవి మనసులో పొంగి పోయింది.


ఇప్పుడు ఒక రోజు శాస్త్రీయ సంగీతం మరోక రోజు
లలిత సంగీతం నేర్చుకోవడానికి వెళ్తుంది.


ఆ ఏడాది దసరా పండుగ సందర్భంలో ఔత్సాహికులైన గాయనీ గాయకులతో
రవీంద్ర భారతిలో సినీ సంగీత విభావరి ఏర్పాటు చేశారు. గురవుల ఆశీస్సులు తీసుకొని భార్గవి ఆ కార్యక్రమంలో పాల్గొన్నది. మెదటి ఆవృతంలో తిరోగమించింది భార్గవి.


ఇంటికి వచ్చి బాధపడింది భార్గవి . తండ్రి చివాట్లు పెట్టాడు. ఇప్పటి నుంచి సంగీత పోటీలెందుకని.


గురువులు మటుకూ ఏమనలేదు. వాళ్ళకి తెలుసు. విడిగా పాడటం వేరు, అందరి ముందూ
సభాముఖంగా పాడటం వేరు. ఎప్పుడో ఒకప్పుడు
మెదలెట్టాలి. ఎప్పుడు ప్రారంభించినా మొదట్లో
సభాభీతి తప్పదు.


చారీ గారు చెప్పారు ' సభలో మన ముందెంత
మందున్నా పట్టించుకోకుండా కేవలం పాట మీద మనసు లగ్నం చేయాలి. చాలా కొద్ది మంది గాయకులు పసి ప్రాయంలోనే రాణిస్తారు. అది పూర్వ జన్మ సుకృతం. ఎక్కువ శాతం కష్టపడి
అంచలంచలుగా ఎదిగినవారే' అని



శాస్త్రి గారు కూడా భార్గవి పాటని విశ్లేషించారు .
'చూడు భార్గవి నీ కంఠస్వరం మధురం. కానీ కొన్ని సార్లు ఆలాపన తేలిపోతుంది. కొన్ని అక్షరాలు స్పష్టమైన ఉచ్చారణుండదు. పాడటంతో పాటు
భావ ప్రదర్శనుండాలి. భావం హృదయం నుంచి రావాలి. నాదం నాభిలోంచి రావాలి. మదిలో తన్మయత్వంతో పాడాలి. అప్పుడే గాయకుడు
రాణించడానికి అవకాశముంది. తర్వాత గెలుపు
ఓటమిల మీద మనసు పెట్టకుండా మన ప్రదర్శన
మీద ఏకాగ్రతుండాలి. మనస్ఫూర్తిగా ప్రయత్నించాలి. 'అభ్యాసం కూసు విద్య' అన్నారు. గట్టి సంకల్పముంటే విజయ సోపానాలు సహజంగానే అధిరోహిస్తారు.' అన్నారు శాస్త్రి గారు .


కాలం కొంచెం ముందుకు సాగింది. భార్గవి రెండవ
సంవత్సరం పూర్తైంది . డెబ్భై ఐదు శాతం పైన మార్కులు సాధించింది. ఈ సంవత్సర కాలంలో
శాస్త్రి గారి దగ్గర పిళ్ళారి గీతాలు, ఘనరాగ గీతాలు, స్వర జతులు, చిన్న వర్ణాలు, వర్ణాలు
శ్రద్ధగా నేర్చుకున్నది.


ఈ ఏడాది కూడా రవీంద్ర భారతిలో సినీ సంగీత విభావరి ఏర్పాటు చేశారు. భార్గవి గట్టి పోటీ ఇచ్చింది. ఆఖరి ఆవృతం వరకొచ్చింది. ప్రేక్షకుల
మనసు ఆకట్టుకుంది. ఆమెదే అంతిమ
విజయమనుకున్నారు. కానీ న్యాయమూర్తులు నిష్ణాతులు. కొన్ని శాస్త్రీయ మరియు సాంకేతిక లోపాలున్నాయని భార్గవి ప్రత్యర్థిని విజేతగా ప్రకటించారు. భార్గవి కళ్ళలో నీళ్లు వచ్చాయి.
న్యాయమూర్తులు భార్గవిని ఓదార్చి ' నీవు బాగా
పాడావమ్మా , విజేతని ప్రకటించటం చాలా కష్టమైంది. ఒక్క చోట నీవు శృతి తప్పావు. దాంతో సంగం మార్క్ తక్కువ వచ్చింది.' అన్నారు.


ఈ మాటు తండ్రి తిట్ట లేదు. 'పోన్లే రెండవ విజేతగా
వచ్చావు కదా నాకు సంతోషంగా ఉంది అన్నాడు.
ఈ మాటలతో భార్గవికి విచారంపోయి
ఉషారొచ్చింది.


గురువులు కూడా లోలోపల ఆనందించారు. పైకి మాత్రం ఆ పొరపాటు చేయకుంటే బాగుండేదన్నారు.


యధావిధిగా భార్గవి సంగీత సాధన చేస్తుంది .
కళాశాలకు నియమంగా వెళ్తుంది. మూడవ
సంవత్సరం పరీక్షలు రాయాలి. బాబ్జీ ఆఖరి సెమిస్టర్ పరీక్షలు రాయాలి. శాస్త్రి గారు నిరాటంకంగా సంగీతం నేర్పుతున్నారు.
నవరాగవర్ణం, కీర్తనలు, పెద్ద కీర్తనలొచ్చాయి.
నవరాగకీర్తనలు ,పంచరత్న కీర్తనలు తర్వాత
నేర్పుతానన్నారు.


ఇంతలో ఎవరూ ఊహించని విధంగా కరోనా
మహామారి విజృంభించింది. దేశమంతటా
లాక్ డౌన్ విధించారు. కళాశాలలు మూసేసారు.
అప్పటికే బాబ్జీ హైదరాబాదులో వున్నాడు.


అనతి కాలంలో భార్గవికి కళాశాల వాళ్ళు అంతర్జాలంలో సంగీతం పాఠాలు మొదలెట్టారు. శాస్త్రి గారు, చారీ గారు అంతర్జాలంలో
సంగీత శిక్షణిస్తున్నారు. బాబ్జీ కూడా అంతర్జాలంలో ఇంజనీరింగ్ పాఠాలు వింటున్నాడు.


రోజూ సాయంత్రం బాబ్జీ మరియు భార్గవి సంగీత
సాధన చేస్తున్నారు. సినిమా పాటలు కూడా కలసి పాడుతున్నారు. యుగళ గీతాలు పాడే సమయంలో ఉషారుగా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో పాత్రలో లీనమైపోతారు.


లాక్ డౌన్ ప్రభావం వలన ఎక్కడా సభలు సమావేశాలు లేవు. సినిమాలు లేవు. కచేరీలు లేవు.
పాటల పోటీలు లేవు. కొన్ని ఆదర్శ కుటుంబాలు ఈ సమయంలో ఆనందాలు పంచుకున్నాయి.


ఇది ఇలా ఉండగా, ఒక ప్రఖ్యాత సినీ సంగీత సంస్థ
వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చింది. 'వర్చువల్ సినీ సంగీత విభావరి ' కార్యక్రమం ప్రకటించింది. ఔత్సాహిక గాయనీ గాయకులు అంతర్జాలంలో ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొంటారు. బహుమతులు కూడా ప్రకటించారు.
మొదటి బహుమతి లక్ష రూపాయలు మరియు
తమ సంస్థ తరఫున మూడు సంవత్సరాలు సినిమా పాటలు పాడటానికి అవకాశం. ఆ మూడు
సంవత్సరాలు ఇంకెక్కడా పాడ కూడదని షరతు విధించారు. పాటకు పది వేల రూపాయలు పారితోషికం చెల్లిస్తామన్నారు.


ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని భార్గవి ఆలోచన. ఇంట్లో అడిగింది. తండ్రితో సహా అందరూ సమ్మతించారు. గురువులు కూడా
ఆశీర్వదించారు. బాబ్జీ అంతర్జాలంలో ఎలా పాడాలో నేర్పించటానికి సిద్ధమయ్యాడు.


భార్గవి పగలు రాత్రి కష్టపడుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ సాధన చేయాలి .
గురువులు కూడా భార్గవి యందు ఎక్కువ శ్రద్ధ చూపుతారు.


మొత్తం మీద పోటీ రోజు వచ్చింది. ఇంట్లో
ఏర్పాట్లన్నీ చేసాడు బాబ్జీ. కార్యక్రమం మొదలైంది.
భార్గవి వంతొచ్చింది . చాలా ధైర్యంగా పాడింది. ఈ పోటీకి న్యాయమూర్తుల మార్కులతో
పాటు అంతర్జాల వీక్షకుల మార్కులు కూడా కలుపుతారు. సరాసరి చేసి విజేతను ప్రకటిస్తారు.


ప్రత్యక్ష ప్రేక్షకులైనా పరోక్ష వీక్షకులైనా ఎల్లప్పుడూ భార్గవి పక్షమే. అది ఆమె మధుర గాత్ర ప్రభావం. ఈ మాటు న్యాయనిర్ణేతలు భార్గవి వైపు మొగ్గు చూపారు. వెరసి భార్గవి ' వర్చువల్ సినీ సంగీత విభావరి ' ప్రధమ బహుమతి కైవసం చేసుకుంది. లాక్ డౌన్ తర్వాత సినిమాలు మొదలైనప్పుడు పాడిస్తామని చెప్పి లక్ష రూపాయలు అంతర్జాలం ద్వారా బ్యాంక్ లో జమ చేసారు .


ఇప్పుడు అత్యవసరంగా భార్గవి తండ్రికి తన ప్రధమ కర్తవ్యం గుర్తుకొచ్చింది. భార్యతో అన్నాడు
' అమ్మాయి సినిమా రంగంలో ప్రవేశించక ముందే పెళ్ళి చేయాలి , త్వరగా మంచి సంబంధం వెదకాలి ' అని.


'మీ తెలివి తెల్లారి నట్లున్నది. మా తమ్ముడికిచ్చి
చేద్దాము .వేరే బయటి సంబంధం మనకెందుకు ' అన్నది భార్గవి తల్లి.


'మన సంగతి సరే, వాళ్ళ అభిప్రాయమెలాగుందో '
అన్నాడు భార్గవి తండ్రి.


'మీకు ఉద్యోగంలోని చురుకుదనం ఇంటి విషయాల్లో వుండదు వాళ్ళనింతేనా మీరు
గమనించింది. వాళ్ళిద్దరూ యుగళ గీతాలు పాడుతన్న సమయంలో పసికట్టా.' అన్నది భార్గవి తల్లి.


'అమ్మ గట్టి పిండం. నాకు చెప్పలేదు.' భార్గవి తండ్రి.


' నా ఖర్మ మీకన్నీ విడమరిచి చెప్తేగానీ
అర్థం కాదు . ' భార్గవి తల్లి


'అందుకే కదా నిన్ను చేసుకుంది ' భార్గవి తండ్రి


'చాల్లేండి సరసం ' భార్గవి తల్లి.


ఇది ఇలా ఉండగా, పూర్వ పరీక్షా ఫలితా లాధారంగా డిగ్రీ పూర్తైనట్లు భార్గవికి
సమాచారమొచ్చింది. అలాగే మొదటి సెమిస్టర్
మార్కులాధారంగా ఇంజినీరింగ్ పూర్తైనట్లు
బాబ్జీకి సమాచారమొచ్చింది. అంతకు ముందే
క్యాంపస్ సెలెక్షన్లో బహుళ జాతి కంపెనీలో
ఉద్యోగం ఖరారైంది. లాక్ డౌన్ పూర్తిగా తొలగించాక నియామక పత్రం పంపుతాం అప్పుడు ఉద్యోగంలో చేరాలని సమాచారమందింది.


భార్గవి తల్లి తండ్రులు తమ మనోభావాలు బాబ్జీతో
పంచుకున్నారు. బాబ్జీకి కాదనటానికి కారణం కనిపించ లేదు . ఉద్యోగంలో చేరాక వివాహమన్నాడు.


అందరూ ఆ శుభ పరిణామం కోసం ఎదురు చూస్తున్నారు.

రచన:
మంత్రిప్రగడ రామకృష్ణ శర్మ.
🙏🙏🙏








మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు