[అ]పుత్రస్య గతిర్నాస్తి ! (కథానిక) - M. Srinivasa Rao

aputrasya gatirnaasti

'ఓ నాన్న.. నీ మనసే వెన్న..' మా నాన్న మీద ప్రేమతో నా ఫోన్లో నేను పెట్టుకున్న రింగ్టోన్ అది. ఫోన్ రింగ్ అవుతుంది. అది ఊరు నుండి మా నాన్న చేసిన ఫోన్ అని అనుకున్నాను. ఏడు పదులు వయస్సు దాటిన మా నాన్న మేము గుర్తుకు వచ్చినప్పుడల్లా ఫోన్ చేస్తుంటాడు. అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి టీపాయ్ మీద పెట్టిన ఫోన్ అందుకొని మా నాన్నే అనుకొని "హలో నాన్నా" అన్నాను. ఈసారి ఆ ఫోను మా నాన్న నుండి రాలేదు, మా 'నాన్న మరి లేడని' మా బంధువు ఒకాయన మా నాన్న ఫోన్ నుండే చేశాడు. నమ్మశక్యం కాకుండా ఉంది. కనీ, పెంచి నన్ను ఇంత వాడిగా చేసి, నా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన మా నాన్న అకస్మాత్తుగా మరణించాడని తెలిసి చిన్న పిల్లాడిలా ఆ క్షణంలో ఏడ్చాను. నా ఏడుపు చూసి మా శ్రీమతి కళ్ళలో కన్నీళ్ళు పెట్టుకుంది. ఆ మరుక్షణమే అమెరికాలో ఉన్న మా అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాను 'గ్రాండ్ ఫాదర్' చనిపోయాడని. రెండు నిమిషాలు గడిచాక మూడే మూడు ఇంగ్లీష్ అక్షరాలతో మా అబ్బాయి నుండి మెసేజ్ వచ్చింది 'RIP' అని !


చేసేది లేక నేను, నా శ్రీమతి కారులో బయలుదేరి ఊరు చేరేటప్పటికే మా నాన్న 'కపాలమోక్షం' ఒకరిద్దరి బంధువుల సమక్షంలో జరిగిపోయింది. మా అమ్మా నాన్న ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఆ పల్లెటూరి కొంపలో ఎలాగోలా పది రోజులు ఉండి చేయవలసిన కర్మకాండలు అన్నీ పూర్తి చేశాను. ఈ కర్మకాండల తంతు అంతా మా వాడు వీడియో తీసి పంపించమంటే వీడియో తీసి అమెరికా పంపించేశాను. ఆ వీడియో చూసి వీరంతా ఎవరు అని మా అబ్బాయి అమెరికా నుండి వీడియో కాల్ చేసి నన్ను అడుగుతుంటే వీళ్లంతా మన రక్త సంబంధీకులే అని చెప్పలేక పోయాను. ఆ క్షణంలో గతంలో నేను చేసిన తప్పిదాలు నాకు గుర్తుకు వచ్చి గతంలోకి జారుకున్నాను.


మా బంధువుల పేదరికపు వాసనలు గాని, పల్లెటూరి ఛాయలు గానీ మా అబ్బాయి దరికిరానియకూడదని భావించి పట్టణంలోనే పెద్ద చదువులు చదివించి, అటునుండి అటే అమెరికా పంపించాను. ఊర్లో మా బంధువులు చివరికి మా అమ్మానాన్నలు కూడా మా అబ్బాయిని చూడాలని ఉంది అంటే, వాడి పెళ్ళికి పట్టణం వస్తారు కదా అప్పుడు చూస్తారు లే అని దాట వేశాను. అప్పటి నుండి మా వాడి పెళ్లి ఎప్పుడు అవుతుందా వాడిని ఎప్పుడు చూస్తామా అని మా అమ్మా నాన్నతో పాటు మా బంధువులు ఎదురు చూశారు!


మావాడి పెళ్లి సమయం రానే వచ్చింది. మా వియ్యంకుడు సిటీలో పేరున్న సివిల్ కాంట్రాక్టర్. ఏకైక కుమార్తె, అపరంజి బొమ్మ! మా వాడికి నచ్చింది. వారం రోజుల్లోనే మా బంధువులెవరూ లేకుండానే ఘనంగా నిశ్చితార్థం జరిగిపోయింది. పెళ్లి ముహూర్తం పదిహేను రోజుల్లోనే నిర్ణయించేశారు. పెళ్లి సిటీలో ఓ పెద్ద స్టార్ హోటల్లో జరపాలని మా వియ్యంకుడు నిర్ణయించి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈలోగా మా బంధువులకి మా అమ్మానాన్నలకు మా అబ్బాయి పెళ్లికి పిలవడానికి నేను ఊరు బయలుదేరాను. ఇంతలో మా వియ్యంకుడు, వియ్యంకురాలు, మా అబ్బాయి వచ్చి "పెళ్లి పెద్ద స్టార్ హోటల్లో జరుపుతున్నాము. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు వస్తారు. పల్లెటూరి బంధువులు ఇక్కడికి ఎందుకు? కావాలంటే మీరు వారందరికీ పెళ్ళికి ముందు ఆ వూరు లోనే రిసెప్షన్ అని చెప్పి అక్కడే అందరికీ పెళ్లి భోజనాలు పెట్టించేయండి" అని ముక్తకంఠంతో ముగ్గురు అనేసరికి కాదనలేకపోయాను. వారు చెప్పినట్లే పెళ్ళికి ఒక వారం ముందు నేను నా శ్రీమతి ఊరు వెళ్ళి పెళ్లి రిసెప్షన్ అంటూ ఒక వందమంది బంధువులకి సరిపడా భోజనాలకి క్యాటరింగ్ వాళ్లకి చెప్పి ఏర్పాటు చేసాము. " పెళ్లికి బంధువులంతా పట్టణం వచ్చేస్తారేమోనని ఈ రిసెప్షన్ ఊళ్ళో ఏర్పాటు చేశారా?" అని ఒకరిద్దరు బంధువులు మా మొహం మీదే అనేసరికి నాకు మా శ్రీమతికి మనసు చివుక్కుమంది. ఆ రోజు మా ఊరిలో మా అబ్బాయి పెళ్లి రిసెప్షన్ భోజనాలకి ఎవరూ రాకపోయేసరికి కేటరింగ్ వాడికి డబ్బులు చెల్లించి భోజనాలు అంతా సాధువులుకు, కుక్కలకు పెట్టవలసి వచ్చింది. ముసలివారైన మా అమ్మా నాన్నకు ఏవో సాకులు చెప్పి, మేము మా ఊరు నుండి ఆ సాయంత్రమే పట్టణము వచ్చేసాము. పట్టణంలో స్టార్ హోటల్ లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సెలబ్రిటీల సమక్షంలో మా వియ్యంకుల వారి ఆధ్వర్యంలో మా వాడి పెళ్లి ఘనంగా జరిగిపోయింది మా బంధువులు ఎవరు లేకుండా!


ఆ తర్వాత పెళ్లి అయిన వారం రోజుల్లోనే కోడలితో అబ్బాయి అమెరికా వెళ్ళిపోయాడు. మా బంధువులు ఎవరూ లేకుండానే మా అబ్బాయి పెళ్ళి జరిపించేశానని మనసులో కించిత్ బాధ ఉన్నా కాలక్రమేణా ఆ విషయం మర్చిపోయాను. అక్కడికి సరిగ్గా మా నాన్న చనిపోయిన ఆరు నెలలకు మా అమ్మ చనిపోయింది అని మా ఊరు నుండి మా బంధువు ఒకాయన ఫోన్ చేశాడు. ఆ క్షణమే అమెరికాలో ఉన్న మా అబ్బాయి కి ఫోన్ చేశాను. మా అమ్మ అంటే 'నాన్నమ్మ' చనిపోయిందని. కొన్ని క్షణాలు గడిచాక మా వాడి నుంచి RIP అని మెసేజ్ వచ్చింది. నేను నా శ్రీమతి హుటాహుటిన మా ఊరు బయలుదేరాము. అప్పటికే మా అమ్మకు బంధువులంతా దహన కార్యక్రమాలు జరిపించేసారు. పది రోజులు మా ఊర్లోనే ఉండి కర్మకాండలు అన్ని పూర్తి చేశాము. మా వాడు మా అమ్మ 'డెత్ సెర్మనీ' కార్యక్రమాలన్నీ వీడియో తీసి పంపించు అన్నాడు వాడు చెప్పిన వెంటనే వీడియో తీసి అమెరికా పంపించాను. అక్కడ ఆ వీడియో మూడేళ్ల వయస్సు ఉన్న వాళ్ళ అబ్బాయికి మా అమ్మ చిత్రపటాన్ని చూపించి కోడలితో ఆ వీడియోలో తతంగమంతా వివరిస్తున్నాడు. నాకు వీడియో కాల్ చేసి ఆ కార్యక్రమంలో హాజరైన వారి వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు.


రోజులు నెలలు, నెలలు సంవత్సరాలుగా మారిపోతున్నాయి. ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి వాళ్లు అమెరికా వెళ్లి. అప్పుడప్పుడు మా మనవడిని వీడియో కాల్ లో నేను నా శ్రీమతి చూడ్డమే తప్ప స్వయముగా చూసే భాగ్యం కలుగలేదు. అబ్బాయి, కోడలు, మనుమడు అమెరికాలో. ఇక్కడ లంకంత కొంపలో నేనూ నా శ్రీమతి ఈ పట్టణంలో బంధువులకు, ఆత్మీయులకు దూరంగా!


మా శ్రీమతికి కొడుకుని కోడల్ని ముఖ్యంగా మనవడిని చూడాలన్న కోరిక రోజు రోజుకీ ఎక్కువవుతోంది. ఆ బెంగతో ఏమో మా శ్రీమతి ఆరోగ్యము రానురాను క్షీణిస్తూ వస్తుంది. ఎలాగైనా అందరూ కలిసి రావాలని మా అబ్బాయితో, మా శ్రీమతి మంచం మీద నుండి ఆయాసంగా లేస్తూ ఫోను చేసింది. అబ్బాయి కి బదులుగా కోడలే జవాబు చెప్పింది మా ఆయనకి సెలవులు లేవు అని ఇప్పట్లో రావడం కుదరదని నిర్మొహమాటంగా చెప్పేసి ఫోన్ పెట్టేసింది. మా శ్రీమతికి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. నాకు దుఃఖం ఆగలేదు. దగ్గరలో బంధువులు గానీ, ఆత్మీయులు గాని లేరు. ఏం చేయాలో తోచలేదు ఆ క్షణములో అనుబంధాలు ఆత్మీయతలు విలువ ఏమిటో అర్థమవుతుంది. అర్ధరాత్రి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ నా ఒడిలోనే నా శ్రీమతి కన్నుమూసింది. దుఃఖాన్ని దిగమింగి కుంటూ మా అబ్బాయికి ఆ క్షణమే ఫోన్ చేశాను మమ్మీ మనకు మరి లేదని. కొద్ది క్షణాలు మా ఇరువురి మధ్య నిశ్శబ్దం. మళ్లీ నేనే గద్గద స్వరంతో మాట్లాడాను. ఏడుపు ఆగలేదు. దుఃఖాన్ని ఆపుకుంటూ "ఏడ్చేవారు చివరికి నన్ను ఓదార్చే వారు లేరని ఆ క్షణమే చిన్నపిల్లాడిలా ఏడ్చేశాను. నా ఏడుపు విని ఏమనుకున్నాడో ఏమో" డోంట్ వర్రీ డాడ్ మమ్మీ దగ్గర ఏడవడానికీ, మిమ్మల్ని ఓదార్చడానికీ మనుషులు వస్తున్నారు" అని చెప్పి మరేమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు. అంతలోనే ఆ రాత్రి సమయంలో మా భవంతి కాంపౌండ్ వాల్ గేట్లు తెరుచుకుంటూ ఆరుగురు గేటు బయట నుండే ఏడుపు మొదలు పెట్టి విగతజీవి అయినా మా శ్రీమతి దగ్గరకు వచ్చి బిగ్గరగా ఏడుస్తున్నారు. వీరంతా మా వియ్యంకుల తరుపున బంధువులు అని అనుకున్నాను. ఒక అరగంట ఏడ్చాక ఒక మూలకు పోయి పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు. అక్కడికి ఓ పది నిమిషాలు గడిచాక గేట్లు తెరుచుకుంటూ మరో నలుగురు వచ్చి నన్ను ఓదార్చి అప్పటికే తయారు చేసి తెచ్చిన పాడిని మా శ్రీమతి పక్కన ఉంచి, అరగంటలో చేయవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి నా శ్రీమతిని పాడెపై పెట్టి, నా చేతికి నిప్పులతో ఉండే చిన్న కుంపటి ఇచ్చి నన్ను ముందుకు నడవ మంటూ పేలాలు జల్లుతూ గేటు బయటకు వచ్చారు నన్ను స్మశానం వైపు దారి చూపిస్తూ!

దహన కార్యక్రమాలు అన్నీ పద్ధతి ప్రకారం జరిపించేశారు. నన్ను మా లంకంత కొంపలో కి తిరిగి తీసుకువస్తూ ఎవరి దారిన వాళ్లు వెళ్ళిపోయారు. నా భార్య దశావహం కార్యక్రమానికి నా కోడలు కొడుకు మనవడు తో పాటు వస్తారని ఎదురు చూశాను. బుజ్జిగాడికి ఎల్కేజి ఎగ్జామ్స్ అని, మా వాడికి కంపెనీలో ముఖ్యమైన అసైన్మెంట్లు ఉన్నాయని అత్తగారి డెత్ సెర్మనీకి రాలేమని మూడు రోజుల ముందే మా కోడలు ఫోన్ చేసి చెప్పేసింది.


ఆత్మీయ బంధాలు కన్నా ఆర్థికవనరులు ముఖ్యమని ఇన్నాళ్ళుగా రక్తసంబంధీకులని దూరం చేసుకుని, వారందరికీ దూరంగా ఉన్న నాకు తగ్గట్టు కొడుకే దొరికాడని ఆ భగవంతుడు తగిన శాస్తే నాకు జరిపాడని లోలోపలే కుమిలి కుమిలి ఏడ్చాను.


ఆత్మీయులు ఎవరు అందుబాటులో లేక బంధువులెవరూ లేక నా భార్య దశావహం కార్యక్రమాలన్నీ ఇంతకుముందు ఏడవడానికి వచ్చిన వారు, మరియు నా శ్రీమతిని పాడిపై తీసుకెళ్లిన వారే కాకుండా మరో ఆరుగురు వచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆ కార్యక్రమాల తతంగమంతా వీడియో తీస్తున్నారు నా కళ్ళముందే నా శ్రీమతి తిరుగుతున్నట్టు అనిపించి నా కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. అంతా అయిపోయింది ఎవరి దారిన వారు వెళ్లిపోయారు, వారు నాకు ఏమవుతారో తెలియదు తెలుసుకోవాలనే కోరికా నాకు లేదు.


అక్కడ అమెరికాలో వాళ్ళుండే అపార్ట్మెంట్లో మా అబ్బాయి మా కోడలు నా భార్య డెత్ సెర్మనీ వీడియో చూస్తున్నారు. మా మనవడు ఆ వీడియోలో ఉన్న నన్ను చూసి వాళ్ల డాడీకి మమ్మీకి అడుగుతున్నాడు. "హూ ఇస్ థిస్ ఓల్డ్ మాన్?" మా కోడలు చెబుతుంది "హి ఈజ్ యువర్ గ్రాండ్ పా". ఆ వీడియోలో పూలమాల వేయబడిన చిత్రపటాన్ని చూస్తూ "హూ ఇస్ థిస్ ఓల్డ్ ఉమెన్?", "షి ఈజ్ యువర్ గ్రాండ్ మా". తన కొడుక్కి దగ్గరకు తీసుకుంటూ మావాడు చెబుతున్నాడు. ఆ దృశ్యం అంత తిరిగి వీడియో కాల్ లో నాకు చూపిస్తూ ఉంటే దుఃఖము తెరలు తెరలుగా పెల్లుబుకుతుంది. కళ్ళ నిండా నీళ్ళు తిరుగుతున్నాయి ఇంటిలో ఆవిష్కరించబడిన నా భార్య చిత్రపటం నుండి వచ్చి నన్ను ఓదార్చుతున్నట్లుగా నాకు భావన కలిగింది.


రోజులు గడుస్తున్నాయి ఇక్కడ లంకంత కొంపలో నేను ఒంటరి వాడిని. అందరూ ఉన్నా నా అన్నవాళ్లు లేని ఒంటరి వాడిని. ఇదంతా నా స్వయంకృతాపరాధం. ఆస్తులకు, అంతస్తులకు అర్రులు చాచి అనుబంధాన్ని, ఆత్మీయతలకు తిలోదకాలు ఇచ్చిన వాడిని. నెల తిరిగాక ఎవరో ఇద్దరు వ్యక్తులు గేట్ తెరిచి వస్తున్నారు. ఎవరో తెలియదు. నా ఆత్మీయులు లాగా ఒక ట్రంకుపెట్టెలో నా బట్టలు వగైరా సర్ది నా భుజంపై చేయి వేస్తూ "ఇక బయటికి నడవండి" అన్నట్లుగా నన్ను గేటు బయటకు తీసుకు వెళుతున్నారు. అలా తీసుకు వెళుతుంటే బ్రతికుండగానే నన్ను స్మశానం వైపు తీసుకు వెళ్తున్నట్లు అనిపించింది.


అలా గేటు బయటకు వచ్చి కొంత దూరం వచ్చాక ఎదురుగా ఒక పెద్ద భవంతి కనిపించింది. అక్కడ ఆ గేటు దగ్గర నన్ను ఆపి ఆ ఇద్దరూ ఆ భవంతి గేటు తెరచి నన్ను లోపలికి తీసుకువెళ్ళి ఎదురుగా వస్తున్న ఒక పెద్దాయనకు నన్ను పరిచయం చేశారు. అప్పుడు కానీ నాకు తెలియదు అది ఒక వృద్ధాశ్రమం అని, అందులో నన్ను చేర్చుతున్నారు అని. అసలు ఎవరు వీరు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు?


ఎంతో అధునాతనంగా అందంగా నిర్మించుకున్న ఇంద్రభవనం లాంటి ఇల్లు, నా భార్యకు ఎంతో ఇష్టమైన ఆ శాంతి నిలయం! , నలబై ఏళ్లుగా నివాసం ఉంటున్న ఆ ఇల్లు విడిచి నేను ఈ వృద్ధాశ్రమంలో చివరిదశలో గడపడం ఏమిటి? అసలు వీరంతా ఎవరు? దుఃఖాన్ని ఆపుకోలేక అమెరికాలో ఉన్న మా అబ్బాయి కి ఫోన్ చేశాను. త్వరలో ఫ్యామిలీతో వస్తానని అన్ని విషయాలు అప్పుడు మాట్లాడుకుందామనీ అంతవరకూ వృద్ధాశ్రమంలో నే ఉండమని చెప్పి మారు మాట్లాడకుండా ఫోన్ పెట్టేసాడు!


నెల రోజుల తర్వాత నేను ఉంటున్న విశ్వంభర వృద్ధాశ్రమానికి భార్య తన ఐదేళ్ళ కొడుకుతో అమెరికా నుండి వచ్చాడు. వారు వచ్చిన ఆనందం ఒక పక్క, ఇన్నాళ్ళు నా తోడు నీడగా ఉన్న నా జీవిత భాగస్వామి నన్ను విడిచి అనంతలోకాలకు వెళ్లిపోయింది అని బాధ మరోపక్క. కుశల ప్రశ్నలు అయ్యాక మా అబ్బాయి తన సూట్కేసులో ఉన్న ఏవో పేపర్స్ తీసి వాటిపై సంతకాలు చేయమని చెబుతున్నాడు. అప్పుడే వచ్చిన మా వియ్యంకుడు, వియ్యంకురాలు నన్ను పరామర్శిస్తున్నారు. కోడలు నావైపు జాలి చూపులు చూస్తుంది. మనవడు చెవిలో ఇయర్ఫోన్స్ పెట్టుకుని పాశ్చాత్య సంగీతం ఆస్వాదిస్తున్నాడు లౌక్యం తెలియని ఆ పసివాడు! టైం వేస్ట్ ఎందుకని అంటూ మా అబ్బాయి నా ముందు కాగితాలు పెట్టి సంతకాలు పెట్టమని ఒత్తిడి చేస్తున్నాడు. కోడలు, వియ్యంకురాలు, వియ్యంకుడు మా వాడికి వత్తాసు పలుకుతున్నారు. ఆ కాగితాల వైపు బాధగా చూశాను. ఎంతో ప్రేమగా కష్టపడి కట్టించుకున్న ఇల్లు నా భార్యకు ఇష్టమైన ఇల్లు, అటువంటి ఆ ఇల్లును అమ్మేస్తాను అంటున్నాడు. కాళ్ల కింద నేల కదిలినట్లు అనిపించింది. కళ్ళ వెంబడి కన్నీరు జాలువారుతుంది. ఎవరికో అమ్మబోతున్నట్లు సేల్ అగ్రిమెంట్ పేపర్స్! ఆ ఇల్లు అమ్మి ఎల్లుండే ఫ్యామిలీతో అమెరికా వెళ్ళిపోతాడట. టైం లేదు తొందరగా సంతకం పెట్టమంటున్నాడు, కోడలూ అదే మాట అంటుంది. ఈ వృద్ధాశ్రమంలో మేనేజర్ తన ఫ్రెండ్ అని ఏ లోటూ రాకుండా చూసుకుంటాడని మా వియ్యంకుడు నాకు భరోసా ఇస్తున్నాడు!


మా అబ్బాయి నాచేత ఎక్కడెక్కడో కాగితాల మీద సంతకాలు పెట్టిస్తున్నాడు. కొన్ని ఖాళీ పేపర్ల మీద, మరికొన్ని మ్యాటర్ టైప్ చేసిన పేపర్ల మీద సంతకాలు నా చేత పెట్టేస్తున్నాడు. ఇవేమీ నా మనసుకి పట్టడం లేదు. ఆమెకన్నా నేను ముందు పోయి ఉంటే ఎంత బాగుండేది? ఈ బాధలు ఏమీ ఆమెకి తెలియవు! ఆమె నాకన్నా ముందే వెళ్లిపోయింది, అదృష్టవంతురాలైయింది!


సంతకాల పర్వం అయిపోయింది. సంసార బంధాలు తెగిపోతున్నాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నమాట ఎక్కడో విన్నట్లు గుర్తు వస్తుంది. దుఃఖం ముంచుకొస్తోంది. భగవంతుడా నా భార్యతో పాటు నన్నూ ఎందుకు తీసుకు వెళ్ళలేదు. ఇన్నాళ్ళు రక్తసంబంధాలకు దూరంగా మా వాడిని వుంచి, చదివించి ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేయాలని కోరుకున్నాను. అనుకున్న దాని కన్నా ఎంతో ఉన్నతంగా ఎత్తు గా ఎదిగాడు కానీ అదే ఎత్తు నుండి నన్ను అధఃపాతాళానికి తోసేసాడు!


ఆ తెల్లవారే కోడలు, మనవడితో అమెరికా ప్రయాణమయ్యాడు. అల్లంతదూరానా వియ్యంకుడు ఎవరికో మా అబ్బాయి సంతకాలు పెట్టిన చెక్కులు అందిస్తున్నాడు. అతను ఇది వరకు మా శ్రీమతి చనిపోయినప్పుడు నన్ను ఓదార్చడానికి వచ్చిన మనిషే. దగ్గరికి వెళ్లి అడగగా చెప్పాడు A to Z ఈవెంట్ మేనేజ్మెంట్ మేనేజర్ను అని. మా శ్రీమతి చనిపోయిన నుండి నన్ను వృద్ధాశ్రమంలో చేర్చే వరకు అంతా ఆ ఈవెంట్ వాళ్ళే చూసుకున్నారని అమెరికా నుండి మా అబ్బాయి వాళ్లతో ఒప్పందం కుదుర్చుకుని ఈ కార్యక్రమాలన్నీ చేయించాడని వాటి తాలూకా పేమెంటే ఈ చెక్కులు అని చెప్పాడు. మా అబ్బాయి ప్రయాణించే విమానం మా విశ్వంభర వృద్ధాశ్రమం వైపు నుండి ఆకాశంలోకి దూసుకెళ్తుంది.


పెల్లుబికిన దుఃఖాన్ని దిగమింగుకుంటూ A to Z ఈవెంట్ వారు కాంప్లిమెంట్ గా ఇచ్చిన ట్రంకు పెట్టె లో ఉన్న నా శ్రీమతి చిత్రపటం చూసుకుంటూ ఆ వృద్ధాశ్రమం వరండా పై చతికిల పడ్డాను.


"అపుత్రస్య గతిర్నాస్తి" అని అంటారు కానీ నాకు మాత్రం "పుత్రస్య గతిర్నాస్తి" అనుకుంటూ మనసులో నన్ను నేను నిందించుకుంటూ విమానం వెళ్లిపోయాక ఆకాశం వైపు చూస్తూ శూన్యమై పోయిన నా ఒంటరి బ్రతుకును తలుచుకుంటూ అలానే చాలాసేపు చూస్తూ ఉండిపోయాను.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు