పదికాలాల పాటు - శింగరాజు శ్రీనివాసరావు

forever

" బావగారూ మీవైపు నుంచి ఎంతమంది వస్తున్నారు పెళ్ళికి?" " ఒక ముప్ఫై మంది రావచ్చు" " అంతమంది వద్దండి. ఎందుకైనా మంచిది ఓ పదిమందిని తగ్గించుకోండి. అనవసరంగా తరువాత ఇబ్బంది పడతాం" " మా ఇంట్లో మొదటి పెండ్లి ఇది. ఈ కోవిడ్ మూలంగా గాని, లేకుంటే వెయ్యిమందికి తగ్గకుండా వచ్చేవాళ్ళం" " మా అమ్మాయి పెళ్ళి ఘనంగా చేయాలని మాకు మాత్రం ఉండదా బావగారు, కాకపోతే ఇలాంటి పరిస్థితులలో మనమంత రిస్క్ చెయ్యడం అవసరమా అని నా ఉద్దేశ్యం." " యాభై మంది వరకు రావచ్చు కదండీ. మా వైపు నుంచి ముప్ఫై, అదీ రక్తసంబంధీకుల వరకు ఆపితేనే అది. మరికొంత మందిని పెళ్ళికొడుకును చేసే రోజు, ఇంకొంత మందిని వ్రతానికి పిలిచి వెళ్ళబుచ్చుకోవాలి లేకుంటే ఎంత చిన్నబుచ్చుకుంటారు మా బంధువులు" " అంటే వారి మెప్పుల కోసం మీరు చేతులు కాల్చుకుంటారా చెప్పండి. ఏ ఇబ్బందొచ్చినా మీరు, నేను బాధపడాలి. అసలే పోలీసువారు ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నారు. మనం దాచిపెడదామన్నా మండపం వారు ఒప్పుకోవడం లేదు" " ఆ మాత్రం మేనేజ్ చెయ్యలేరటండి ఆడ పెళ్ళి వాళ్ళు, పైగా మీకు రాజకీయంగా పలుకుబడి ఉందంటారు." " సరే బావ గారు. మీ ఇష్టం. మేమే తక్కువమందిమి వస్తాము. ఏంచేస్తాం. ఎంతయినా మగపెళ్ళివారు కదా తప్పుతుందా" ఇదీ కనకారావు, మోహన్ ల మధ్య జరిగిన సంభాషణ. పోయిన మార్చి మొదటి వారంలో నిశ్చితార్థం జరిగింది కనకారావు కొడుకుకు, మోహన్ కూతురికి. అప్పుడే ముహూర్తాలు పెట్టుకున్నారు మే నెలలో. ఇంతలో ఈ పిడుగులాంటి కరోనా వ్యాధి రావడం, అటు నెల్లూరు, ఇటు విజయవాడ రెండూ కంటోన్మెంటు జోనులోకి పోవడంతో భయపడి పెళ్ళి జూలై మొదటి వారంలోకి మార్చుకున్నారు. కానీ కోవిడ్ మహమ్మారి ముఖం చాటేయకపోగా ఎక్కువ కాసాగింది. దీనితో ప్రభుత్వం వారు పెళ్ళికి వచ్చే వారి సంఖ్యను మొత్తం యాభై మందికి కుదించారు. ఇందులో రెండు భిన్న స్వరాలు ఉన్నాయి. ఫొటొగ్రాఫర్, పూజారి గారు, కాటరింగ్, మేళగాళ్ళ, అతిథులు, పెళ్ళివారు అంతా కలిసి యాభై దాటకూడదని ఒక ఉవాచ, మరికొందరేమో అతిథుల సంఖ్య యాభై దాటకూడదని మరో ఉవాచ. ఏదే ఏమైనా లెక్కలో తుది నిర్ణయం పోలీసువారిదే నన్నది తుడపలేని సత్యం. అందుకే చాలా మంది ఇంటి వద్దే వంట చేసుకుని, సెల్ ఫోనులో మేళాలు, మంత్రాలు మ్రోగించుకుని తూ..తూ..మంత్రంగా లాగించేస్తున్నారు. కాకపోతే మధ్యతరగతి బేషజాలు మాత్రం మండపాలు, మోతలతో అక్కడక్కడ కొందరు ఫైన్ లు వేయించుకుంటూ బలయిపోతున్నారు. మన కనకారావుకు ఉన్నది గోరంత, ఆర్భాటం కొండంత. పెళ్ళి ఘనంగా జరిపించాలనే అగ్రిమెంటుతో కట్నకానుకలను తగ్గించుకున్నాడు. అదేదో సినిమాలో పెళ్ళికూతురు తండ్రి చెప్పినట్టుగా అంటాడు కనకారావు. 'కనకారావు గారింట్లో పెళ్ళి అంటే పదికాలాల పాటు నిలిచిపోవాలి' అని. కానీ ఏంచేద్దాం, అతని కొడుకు రాఘవ జాతకం అలాంటిది. ఇదిగాకుండా కనకారావుకు మరో కుళ్ళు ఏర్పడింది. వియ్యంకుడికి పెళ్ళి ఖర్చు తగ్గిందని. ఏదో రకంగా అతడిని ఇరికించాలని. అందుకే మొండికిబడ్డాడు. తన వైపునుంచి ముప్ఫైకి తగ్గకుండా తీసుకెళితే ఎంత లేదన్నా మేళతాళాలు, కాటరింగు జనం పదిమంది పోతే ఇక ఎవరిని పిలవగలడు రోగం కుదురుతుంది అనే వింత నికృష్ట ఆలోచన కనకానిది. అందుకే చెట్టెక్కి కూర్చున్నాడు. అసలు రోజు రానే వచ్చింది. ******** చెప్పిన ప్రకారం ముప్ఫై మందితో పాటు తన వైపు నుంచి పంతులు గారిని, ఫొటోగ్రాఫరును అదనంగా తెచ్చాడు కనకారావు. మోహన్ ఎంత మొత్తుకున్నా వినకుండా మండపంలోకి చేరారు అందరూ. ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా మండపం మేనేజరుతో గొడవపెట్టుకున్నాడు. చివరకు ఎలాగోల ఒక నిర్ణయానికి వచ్చారు. మండపంలోపల యాభై మంది మాత్రమే ఉండాలి. అంతకు దాటకూడదు. అంటే మిగిలిన వారు బయటకు వెళ్ళాలి. లోపల ఉన్న వారు బయటకు వస్తే, మరల అంత మంది బయట వారు లోపలకు వెళ్ళవచ్చు. ఏతావాతా చెయ్యవలసినది యాభై మంది దాటకుండా మండపంలో ఉండడం. మూతికి మాస్కులు ఉంటాయి కనుక వీడియో పోలీసులు వచ్చి చూసినా ఎవరు ఎవరో గుర్తించలేరు. ఈ చావు తెలివి మన కనకారావుదే. చేతిలో కాసులు తక్కువేగానీ, తిరకాసు వ్యవహారాలలో బుర్ర ఎక్కువే మనవాడికి. ఎలాగైతేనేం అందరినీ ఒప్పించగలిగాడు. మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్ల వాడకం యధావిధిగా కొనసాగింది. భౌతికదూరం పాటిస్తూ చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ఈ వ్యవహారమంతా మేనేజరు పర్యవేక్షణలో జరిగింది. పంతులు గారు కూడ మాస్కు వేసుకునే మంత్రాలు చదివారు. అనుకున్నట్లుగానే కొందరు లోపల ఉంటే కొందరు వెలుపల ఉంటూ పెళ్ళిని చూశారంతా. భోజనాలు బఫే అనుకున్నారు ముందు. కానీ మేనేజరు ఒప్పుకొనక పోయేసరికి బంతి భోజనం ఏర్పాటు చేశారు. భౌతిక దూరం పాటిస్తూ కుర్చీలు వేసి, పొడవైన గరిటలతో వడ్డన చేశారు. ఎక్కువ పదార్థాలు లేకుండా రుచికరమైన భోజనం పెట్టారు. రెండు మూడు బంతులతో భోజనాల తంతు ముగిసింది. పోలీసులు రంగప్రవేశం చేయకపోయేసరికి ఊపిరి పీల్చుకున్నారంతా. " బావ గారు. మీరు వేసిన అద్భుతమైన పథకం వలన అందరికీ పెళ్ళి చూసే భాగ్యం కలిగింది. ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు కనుక ఇప్పుడు పోలీసులు వచ్చినా ఇబ్బంది లేదు." అని మోహన్ కనకారావును అభినందిస్తున్నంతలోనే పోలీసులు రానే వచ్చారు. " ఎవరయ్యా పెళ్ళి పెద్దలు ఇక్కడ" అంటూ వచ్చాడు సర్కిల్ సోమయాజులు. " సార్ నమస్తే. నా పేరు మోహన్, పెళ్ళికూతరు తండ్రిని, ఈయన మా బావగారు కనకారావు, పెళ్ళికొడుకు తండ్రి. పెళ్ళి అయిపోయింది సర్. మీ నియమాలను తు.చ తప్పకుండా పాటించాం. ఇదిగోండి ఇంకా మా మూతుల నుంచి మాస్కులు కూడ తీయలేదు" వినయంగా చెప్పాడు మోహన్. " వెరీగుడ్. ఇలా ఉంటే మాకు మాత్రం ఇబ్బందేముంది సర్. పెళ్ళి బాగా జరిగిందటగా. మా కానిస్టేబుల్ మండపం ఎదురుగానే ఉండి అంతా చూస్తున్నాడు మఫ్టీలో. మనలోమాట మొత్తం యాభై మందేనా, ఒకరు అర ఎక్కువగా వచ్చారా" ప్రశ్నించాడు సోమయాజులు. " అబ్బే అలా ఎందుకు చేస్తాము సర్. రూల్సంటే రూల్సే కదా. తప్పితే మీరు ఊరుకుంటారా. మాకు మాత్రం భయం కదా సార్. అందులో పెద్ద మహమ్మారి వైరస్సాయె" అందుకున్నాడు కనకారావు. " మీరు చూడబోతే పెద్దమనుషులలా ఉన్నారు. మా పద్ధతులు మాకుంటాయి. అనుసరించక తప్పదు కదా. ఏదీ ఒకసారి పెళ్ళి వీడియో చూపించండి" అంటూ వీడియోగ్రాఫరును పిలిపించి కంప్యూటర్ లో చూడసాగాడు సోమయాజులు. ఒక పది నిముషాలు అయ్యాక వీడియో అతనితో " ఇదంతా మాకెందుకయ్యా. భోజనాల దగ్గర తీశావుగదా అది చూపించు, అక్కడ మాకు సరైన లెక్క తేలుతుంది." అంటూ ఆర్డరేశాడు. ఉలిక్కిపడ్డారందరూ. అమ్మో అక్కడ చూస్తే వచ్చిన వారి లెక్క తేడా వస్తుందే ఎలా? ఎలా మేనేజ్ చెయ్యాలి? ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. " ఇదేమిటయ్యా. బంతికి పాతికమంది చొప్పున కూర్చోబెట్టారు. ఇప్పటికే రెండు బంతులు చూపించాడు. మరల మూడవబంతిలో కూడ జనం ఉన్నారు. మేము చెప్పింది మండపంలో యాభై మంది కంటే ఎక్కువ ఉండకూడదని. వాళ్ళు ఎవరైనా సరే. కానిస్టేబుల్ మూడవబంతిలో అందరినీ లెక్కవెయ్. కాటరింగ్ వారితో సహా" హుకుం జారీచేశాడు సోమయాజులు. " అది...అది కాదు సర్. మొదటి బంతిలో సరిగా అందలేదని కొంతమంది తిండిపోతులు మరలా వచ్చారు సర్.. అందుకని..." నసిగాడు కనకారావు. " మొత్తం డెబ్భైమంది సర్" చెప్పాడు కానిస్టేబుల్ లెక్కవేసి " అబ్బే చెప్పానుకదా సార్. పొరపాటు మాదే, వెధవలని రెండవసారి రానివ్వకుండా ఉండాల్సింది" కోపం నటించాడు కనకారావు. " సరెలెండి. అయిందేదో అయిపోయింది. ఇంతకూ మీలో పెళ్ళి కుమారుడి తండ్రి ఎవరు?" అడిగాడు సోమయాజులు " నేనే సర్" అంటూ ముందుకొచ్చాడు కనకారావు. " మా లెక్కకు మించి ఇరవై మంది పెళ్ళికి వచ్చిన కారణంగా మనిషికి యాభై వేల చొప్పున ఇరవై మందికి కలిపి పది లక్షల రూపాయలు జరిమానా విధిస్తున్నాము. మావాడు నోటీసు తెచ్చి యిస్తాడు. మీరు సంతకం చేసి నెల రోజుల లోపల అందులో ఇచ్చిన అకౌంటుకు ఆన్ లైన్ లో జమ చేయండి. ఈ తప్పిదం మీదని మాకు తెలుసు. మీరు మేనేజరుతో మాట్లాడం, అతను వీలుకాదనడం, మీరు తెలివిగా యాభై మంది మాత్రమే లోపల ఉండేలా చెప్పిన ప్లాన్ అంతా మా వాడు మీ వెనుకే వచ్చి అంతా ఫోనులో రికార్డు చేశాడు. కరోనా అంటే భయం లేకుండా మీలాంటి వారు నిబంధనలు ఉల్లంఘింస్తారని మాకు తెలుసు. అందుకే మా ఏర్పాట్లలో మేమున్నాం. మరీ పోలీసులను అంత తేలిగ్గా అంచనా వేస్తే ఎలా సర్" అంటూ లేచాడు సోమయాజులు. " సార్... సార్... బుద్ధి గడ్డి తిని అలా చేశాము. అప్పటికీ ఆయనకు చెప్పాను ఎవరినీ పిలవకండి బావగారు అని. మరీ పదిలక్షలంటే మాటలా సార్" బ్రతిమలాడసాగాడు మోహన్. " సార్. అంత డబ్బు నేనెక్కడ తేను సర్. మా వాడికి మళ్ళీ పెళ్ళి చేసినా రాదు సర్" భోరుమన్నాడు కనకారావు. అదిరిపడ్డాడు మోహన్. " మీ వాడికే చేస్తారో, మీరే చేసుకుంటారో మాకనవసరం. మీకు వాయిదాల పద్ధతి కావాలంటే మా యస్. పి తో వచ్చి మాట్లాడుకోండి " అంటూ మరో మాటకు అవకాశమివ్వకుండా వెళ్ళిపోయాడు సోమయాజులు కానిస్టేబుల్ తో సహా. తన అతితెలివికి తనను తాను తిట్టుకుంటూ మోహన్ ను పట్టుకుని బావురుమన్నాడు కనకారావు. " పది కాలాల పాటు నిలిచిపోవాలన్నావుగా" కుదిరింది రోగం బావగారికి అనుకున్నాడు మోహన్ మనసులో.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు