అవినీతిలో నిజాయితి - పద్మావతి దివాకర్ల

Honesty in corruption

సాయంకాలం నాలుగు గంటలు దాటింది. ఆ బ్యాంక్‌లో ఖాతాదారులతో లావాదేవీలు పూర్తి చేసుకొని అప్పుడే అంతర్గత పనులు చూసుకోవటంలో నిమగ్నమైయ్యారు సిబ్బంది.

తన క్యాబిన్‌లో కూర్చొని అన్యమనస్కంగా ఫైల్ చూస్తున్న మేనేజర్ అభిరాంని పలకరించాడు ఫీల్డ్ ఆఫీసర్ రాఘవ, "ఏమిటి సార్! పరధ్యానంగా ఉన్నారు, ఎమైనా సమస్యలున్నాయా?" అని.

ఆ మాటలకి ఉలిక్కిపడి ఆలోచనలలోంచి బయటపడి ఈ లోకంలోకి వచ్చాడు అభిరాం.

"ఏమీ లేదండీ! చిన్న వ్యక్తిగత పని ఒకటి చాలా రోజులనుండి ఇబ్బంది పెడుతోంది." అన్నాడు అభిరాం.

"ఏమిటి సార్! నాకూ చెప్పండి వీలైతే తోచిన సహాయం చేస్తాను." అన్నాడు రాఘవ.

"రాఘవగారూ! మీకు తెలుసు కదా నేను ప్రస్తుతం ఉంటున్న ఇల్లు నాకు వారసత్వంగా వచ్చిందని. ఆ ఇంటి పట్టా నా పేరుమీద మార్చడానికి ఎంత ప్రయత్నించినా వీలవడంలేదు. ఎన్నిసార్లు రెవెన్యూ ఆఫీసుకి వెళ్ళినా ఫలితమేమీ కనపడలేదు. ఇంకా తెలిసిన వాళ్ళని కూడా తీసుకెళ్ళినా లాభం లేకపోయింది. ఇదిగో, అదిగో అంటూ ఏళ్ళు గడిచిపోయాయి, గాని ఇల్లు నా పేరు మీద మారలేదు." అన్నాడు అభిరాం.

"సార్! ప్రభుత్వ కార్యాలయాల్లో బరువు పడందే ఏ పని పూర్తవదు. తమ ఆఫీసులో పని చేసి ఉద్యోగ విరమణ చేసిన తోటి ఉద్యోగులనుండే పెన్షన్ ఫైల్ కదలడానికి లంచం ఆశించే రోజులివి. డబ్బులు లేకుండా మీ పని పూర్తవదు సార్! అంతేకాకుండా ఓ మధ్యవర్తిని కూడా చూసి పని జరిపించుకోవాలి." అభిరాం అమాయకత్వానికి జాలిపడ్డాడు రాఘవ.

"అదీ అయింది రాఘవ గారూ! అలాంటి పనికి నేను వ్యతిరేకినే అయినా, నాకు తప్పింది కాదు. ఇంతకు ముందు ఓ రెండు సార్లు ప్రయత్నం చేసాను నాకు తెలిసిన ఒక స్నేహితుడి ద్వారా. డబ్బైతే ఖర్చైంది కానీ పని మాత్రం జరగలేదు. కాకపోతే వెళ్తున్నప్పుడల్లా డబ్బులు ఖర్చుపెట్టవలసి వస్తోంది. ఆఖరికి నా వద్ద డబ్బులు తీసుకున్న వ్యక్తి ఇక్కడ్నించి బదిలీ అయి వెళ్ళిపోయాడు కూడా. నేను ఖర్చుపెట్టిందంతా వృధా అయిపోయింది. తను బదిలీ అయి వెళ్ళిపోతున్నాడని తెలిసి మరీ నా వద్ద డబ్బులు తీసుకొని మోసం చేసాడు." అన్నాడు అభిరాం.

"వాళ్ళ అవినీతిలో నిజాయితీ లేదు సార్!" అన్నాడు రాఘవ.

"అవినీతి, అందులో మళ్ళీ నిజాయితీయా?" ఆశ్చర్యంగా రాఘవ వైపు చూసాడు అభిరాం.

"అవును సార్! మా ఊళ్ళో అయితే కొన్ని కార్యాలయాల్లోప్రతీ పనికీ ఇంత రేట్ అని ఉంటుంది. అది తీసుకొని నిజాయితీగా మన పని పూర్తిచేస్తారు. అదే మరి అవినీతిలో నిజాయితీ అంటే! మీరు చెప్పినది వింటే ఇక్కడి వాళ్ళలో నిజాయితీ లేదని తెలుస్తోంది. బంగారు గుడ్డుపెట్టే బాతుని చంపుకోవడం ఇష్టం లేకపోవడమే అందుకు కారణం కావచ్చు.” అన్నాడు రాఘవ.

"ఏమో! అలా అయితే నా పని ఎలా జరిగేట్లు ఎప్పుడు జరిగేట్లు?" ఆందోళన చెందుతూ అడిగాడు అభిరాం.

హఠాత్తుగా రాఘవకి ఎదో గుర్తొచ్చింది. ఓ క్షణం ఆలోచించి, "ఒక్క నిమిషం సార్!" అని బయటకు వెళ్ళి ఏవో కొన్ని ఫైల్స్ వెతికి అందులోంచి ఒక ఫైల్ తీసుకొని అభిరాం వద్దకు వచ్చాడు. అందులోని కాగితాలు అభిరాంకి చూపెడుతూ, "సార్! చూడండి. ఈ మధ్యనే కొత్తగా ఆ ఆఫీస్‌లో బదిలీపైన వచ్చిన కొత్త అధికారి మన బ్యాంక్‌కి గృహ ఋణంకోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి మనం ఋణం మంజూరు చేసిన తర్వాత, మన సమస్య అతనికి చెప్తే ఆ కృతఙతతోనైనా మనకు సహాయపడవచ్చు." అని అభిరాంకి తన ఆలోచన వివరించాడు రాఘవ.

రాఘవ మాటలతో అభిరాం ముఖంలో వెలుగు తిరిగి వచ్చింది. "అలాగా! మంచి విషయం చెప్పారు. అతని ద్వారా నా పని జరిగితే అంతకు మించి ఇంకేముంది? ఎన్నో ఏళ్ళనుండి వేధిస్తున్న నా సమస్య పరిష్కారమై నాకు మనశ్శాంతి లభిస్తుంది." అని చెప్పాడు అభిరాం.

"అలాగే సార్! మనవంతు ప్రయత్నం చేద్దాం. ఇంకో మాటసార్! ఆ కొత్తగా వచ్చినతని పేరు రాజారావు అని, అతనిది మా ఊరే! నాకు కొద్దిపాటి పరిచయం కూడా ఉంది. ఇక్కడ అతని పిల్లలు చదువుతుండటంతో బదిలీ కోరుకొని మరీ ఇక్కడికి వచ్చాడు. ఈ ఊళ్ళోనే స్థిరపడాలని ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆ ఇంటికోసమే మన బ్యాంక్‌లో లోన్‌కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతని లోన్ మంజూరైన తర్వాత అతనికి మీ విషయం చెప్తాను. మీ పని తప్పకుండా జరుగుతుందని నా కనిపిస్తోంది." అన్నాడు రాఘవ.

రాఘవ మాటలకి సంతోషించాడు అభిరాం.

"ఆ పని కాస్త అతనితో చేయించితే నా చిరకాల సమస్య తీర్చిన వారవవుతారు." అన్నాడు అభిరాం ఆనందంగా.

**** **** **** **** ****

రాజారావు గృహఋణం మంజూరైన తర్వాత రాఘవ అతనికి అభిరాం యొక్క సమస్యని వివరించి చెప్పి సహాయం చెయ్యమని అర్ధించాడు. రాజారావు అందుకు అంగీకరించాడు. ఆ తర్వాత వీలు చూసుకొని ఒకసారి వాళ్ళ ఆఫీసుకి వెళ్ళారిద్దరూ. అభిరాం చెప్పిన ఫైల్ తీసి అతని సమస్యవిని మళ్ళీ అలాగే చూస్తానని చెప్పాడు రాజారావు.

ఇలా ఓ ఆరు నెలలపాటు వాళ్ళ ఆఫీస్‌కి అభిరాం పలుమార్లు వెళ్ళినా ఏమీ లాభం లేకపోయింది. చివరికి ఒక రోజు అతను తన పనికాక నిరాశగా తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అతనికెదురు పడిన ఆఫీస్ ప్యూన్, "సార్! మీరు ఎన్నిసార్లు ఇలా తిరిగినా మీ పని పూర్తి కాదు. చేతులు తడపనిదే మీరు కలుసుకున్న అతను ఏ పనీ చేయడు. అతను అడిగినదేదో ఇచ్చేయండి. మీ పని ఇట్టే పూర్తి చేస్తాడు." అని చెప్పాడు.

ఆ మాటలు విని అభిరాం తెల్లబోయాడు, ఎందుకంటే ఇంతవరకూ రాజారావు తన వద్ద డబ్బుల ప్రస్తావన తేలేదు. అయినా తన వద్ద సహాయం పొందిన రాజారావు తన నుంచి లంచం ఆశిస్తాడని ఊహించలేదు. అదే మాట ఆ ప్యూన్‌తో అంటే అభిరాంవైపు జాలిగా చూసి విరగబడి నవ్వాడు.

"మీరెంత అమాయకులు సార్! స్వంత బంధువులవద్ద, అన్నదమ్ముల నుండి కూడా పనులు చేయడానికి డబ్బులు ఆశించే రోజులు ఇవి. మీ పని అంత సులభంగా ఎలా చేస్తాడనుకున్నారు? కాకపోతే మీవద్ద సహాయం పొందినందుకు కాస్త మొహమ్మాట పడుతున్నాడేమో! అంతే! నా మాటవిని ఆ పని చేయడానికి రేటెంతో కనుక్కొని ఇచ్చేయండి త్వరగా! మీ పని పూర్తవకపోతే అప్పుడు నన్నడగండి." అని చెప్పాడు.

అతని మాటలు విన్న అభిరాం ముందు నివ్వెరపోయినా తర్వాత ఆ మాటల్లోని సత్యాన్ని గ్రహించాడు. తనకు ప్రత్యక్షంగా అడగలేక ఇన్నాళ్ళుగా రాజారావు తిప్పుతున్నాడని, ఎప్పటికైనా తను అతని దారిలోకి వస్తాడని ఎదురు చూస్తున్నాడని తెలుసుకున్నాడు. తనకి సలహా ఇచ్చిన ప్యూన్ మాట వినక తప్పదని అర్ధమైంది అభిరాంకి.

రాఘవతో ఈ విషయం చెప్పినప్పుడు అతను కూడా ఈ విషయం నమ్మలేకపోయాడు.

"అదే మాటైతే నేను రాజారావుతో మాట్లాడతాను. అతను మా ఊరివాడు కదా ఆ విధంగా సహాయమేదైనా చేస్తాడేమో?" అన్నాడు రాఘవ.

అయితే త్వరలోనే రాజారావుకి అలాంటి సెంటిమెంట్స్ లేవని వాళ్ళకి అర్ధమైంది. ఆఖరికి అభిరాంకి తన పని చేయించుకోవడానికి మూల్యం చెల్లించక తప్పింది కాదు. అయితే ఇంతకు మునుపులా కాకుండా ఈ సారి మాత్రం అతని పని సానుకూలమైంది, రాఘవ ఊరివాడైన రాజారావుకి అవినీతిలో నిజాయితీ ఉండటంవలన.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు