హిమానికి 15 సంవత్సరాలు ఉంటాయి. తొమ్మిదవ క్లాసు పూర్తి చేసుకొని పదవ క్లాసుకు ప్రమోట్ కూడా అయ్యింది. క్లాసులో చాలా తెలివివంతురాలు. అందుకే క్లాసు టీచర్ హిమానిని ఎక్కువగా అభిమానిస్తుంది.
హిమానికి ఏదో టక్కున గుర్తుకురావడంతో “టీచర్.., మీతో కాస్త పని ఉంది. సహాయం చేయరా అంటూ అర్దిస్తున్నట్టుగా ముఖాన్ని పెట్టింది.”
‘ఏంటి హిమాని చెప్పు?’
‘టీచర్.., మా అమ్మ పేరు మార్చాలి.’
‘మీ అమ్మ పేరు మార్చాలా? ఎందుకు? ప్రోగ్రెస్ కార్డులో అమ్మ పేరు తప్పుగా ఏమైనా ఉందా?’
‘హిమాని.., చిన్న గొంతుతో లేదు టీచర్ అలాంటిదేమీ లేదు.’
‘మరీ? అమ్మ గారి ఇంటి పేరులో మార్పు ఏమైనా ఉందా?’
‘అదేం లేదు టీచర్.’
‘ఈ సారి టీచర్ కాస్త కోపంగానే గొంతు పెంచుతూ మరి ఎందుకు మార్చాలి.’
‘’అమ్మ పేరు కమల, ఇప్పుడు సుధా అని మార్చాలనుకుంటున్న.
‘ఏంటి? హిమాని. ఎందుకు విసిగిస్తున్నావు. మీ అమ్మ గారు.., పేరేమైనా మార్చుకున్నారా?’
‘హిమాని మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది.’
‘చూడు హిమాని.., మీ అమ్మ గారి పేరు ఎందుకు మార్చాలనుకుంటున్నావో చెప్పు. మీ అమ్మ గారు చదువుకున్నారా? చదువుకున్నట్లు అయితే ఆ సర్టిఫికెట్స్ లో ఉన్నది మార్చడానికి కుదరదు.’
‘లేదు టీచర్. మా అమ్మ ఏమీ చదువుకోలేదు.’
‘అలాంటప్పుడు మొన్న పదవ తరగతి హాల్ టికెట్ కోసం నీ వివరాలు అడిగినప్పుడు చెప్పి ఉండాల్సింది. అప్పుడు మార్చేదాన్ని కదా! అక్కడ ఏ పేరు ఇస్తే అదే వస్తుంది.’
‘ఏమో టీచర్? అప్పుడు అంతలా ఆలోచించలేదు. ఎలాగైనా సరే అమ్మ పేరు మార్చాలి బతిమిలాడుతున్నట్టుగా అడిగింది.’
‘ఇలా అడుగుతున్నానని ఏమి అనుకోకు, మీ నాన్న వేరే పెళ్లి చేసుకున్నారా?’
‘హిమాని తల కిందికి దించి.., మౌనంగా ఉండిపోయింది.’
‘హిమాని…, అసలు విషయం ఏంటో చెప్పు? ఎందుకు భయపడుతున్నావు. వివరంగా చెప్తే కదా తెలిసేది.’
‘అవును టీచర్.., మా నాన్న ఇంకొక పెళ్లి చేసుకున్నారు.’
‘అయితే ఏంటి? మీ అమ్మ మాత్రం తనే కదా! నువ్వు మీ అమ్మ గారితోనే ఉంటున్నావు కదా?’
లేదు టీచర్. నేను నాన్న దగ్గరే ఉంటున్నాను. నాన్న.., అమ్మను వదిలేసినాడు. తాను వేరే చోట ఉంటోంది.
‘మరి నువ్వు మీ అమ్మ దగ్గర ఉండాలి కదా. అమ్మను ఎవరు చూసుకుంటారు చెప్పు?’
‘లేదు టీచర్. నేను మా పిన్ని దగ్గరే ఉండాలనుకుంటున్నాను.’
‘అదేంటి. మీ అమ్మ అంటే నీకిష్టం లేదా? నా జీవితంలో మొదటిసారి వింటున్న ఒక బిడ్డ తన తల్లిని వద్దని పినతల్లి దగ్గర ఉంటానని చెప్పడం.’
‘నాకు ఇద్దరు చెల్లెళ్లు కూడా ఉన్నారు. వాళ్లు అమ్మ దగ్గరే ఉంటున్నారు. మా అమ్మ చాలా పేదది. చెల్లెలని పెంచడానికి చాలా కష్టపడుతోంది కానీ.., నేను నా చదువును వదులుకోవాలని అనుకోవడం లేదు.’
‘అదా విషయం. మరి మీ పినతల్లి నిన్ను బాగా చూసుకోకపోతే!’
‘పర్వాలేదు టీచర్. నేను ఇంట్లో సామానులు తోముతాను, కసువు ఊడుస్తాను. పిన్నికి అన్ని పనుల్లో సహకరిస్తాను. అందుకే మా నాన్న నాకు స్కూల్ ఫీజు కడుతున్నాడు.’
‘అది సరే కానీ.., మీ అమ్మ పేరును ఎందుకు మార్చాలనుకుంటున్నావు?’
‘ఎందుకంటే? నేను మా అమ్మ పేరుకి బదులుగా పిన్ని పేరును పెట్టుకోవాలనుకుంటున్నా. లేదంటే పిన్నీ నన్ను చదివించదని భయం.’
నువ్వు చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నావు. మీ అమ్మను అలా వదిలేయడం తప్పు కదా. ఈ సమయంలో నువ్వు అమ్మ గారికి తోడుగా ఉంటే.., ఆమెకు ఎంతో ధైర్యంగా ఉంటుంది.
టీచర్…, “కొన్ని సందర్భాల్లో మనం ఏదైతే చూస్తున్నామో, అర్థం చేసుకుంటున్నామో అది వాస్తవానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.” నేను నాలుగు ఇళ్లలో ఇంటి పనికి కుదిరినాను. మా పిన్నికి తెలియకుండా ఆ డబ్బును అమ్మకు పంపుతూ ఉంటాను. నేనూ నా కాళ్ల మీద నిలబడాలంటే చదువుకోవాలి. చదువుకొని ఉద్యోగం చేసి అమ్మకు సహాయపడాలంటే ఇప్పుడు నేను పిన్ని దగ్గరే ఉండాలి. నాన్న గారు బాగా సంపాదిస్తున్నారు. అయినా అమ్మకు డబ్బు ఇవ్వడం లేదు. “మా నాన్న తన భార్యను మార్చుకోగలడు కానీ నేను మా అమ్మను మార్చుకోలేను కదా కానీ మా అమ్మ తలరాత మార్చడానికి నా సర్టిఫికెట్స్ లో తన పేరును మార్చాలి. అప్పుడే మా అమ్మకు నేను మంచి భవిష్యత్తును ఇవ్వగలను.”
టీచర్.., హిమానిని గట్టిగా కౌగిలించుకొని కన్నీరు కార్చింది.
రికార్డ్స్ నుండి పేరును మార్చడం సులువైన విషయమేమీ కాదు కానీ అది అసాధ్యమైనదైతే కాదు.
ఇంగ్లీష్ మూలం : ట్వింకిల్ తోమర్ సింగ్
స్వేచ్ఛానువాదం : జాని తక్కెడశిల