ఆ ఊరి చుట్టుపక్కల పాఠశాలలలో కొత్తపల్లి ప్రాథమిక పాఠశాల అంటే ఆ గ్రామ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల అన్ని గ్రామాల ప్రజలకు ఎంతో ఇష్టం, దానికి కారణం ఆ పాఠశాల ఎప్పుడూ పిల్లలతో ఉపాధ్యాయులతో కళకళలాడుతూ ఉంటుంది, అంతే కాదు ప్రతి వార్షిక పరీక్షలలో ఉత్తీర్ణత శాతం విషయంలో కార్పొరేట్ స్కూళ్ళ కంటే ముందు ఉంటుంది. ఈ పాఠశాల ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం ఓ సాధారణ గవర్నమెంటు ఉపాధ్యాయుడైన రాజశేఖర్, కొన్నేళ్ళ క్రితం ఈ ఊరికి బదిలీపై వచ్చిన రాజశేఖర్ ఇక్కడి పిల్లల అభిమానాన్ని, తల్లిదండ్రుల నమ్మకాన్ని చూరగొని ఒక్కో సౌకర్యాన్ని మెరుగుపరుచుకుంటూ, అవకాశాలను అందిపుచ్చుకుంటూ పాఠశాలను అభివృద్ధి చేసి ఇప్పుడు ఉన్నత స్థితిలో నిలబెట్టాడు. ఈరోజు జరుగబోతున్న కార్యక్రమానికి టీచర్ల పర్యవేక్షణలో స్టేజీని ముస్తాబు చేస్తున్నారు పిల్లలు, అందరూ మౌనంగా ఎవరి పని వారు చేసుకుంటూ స్టేజీని అలంకరిస్తున్నారు, ఆ మౌనంకు కారణం రాజశేఖరుకు వచ్చిన బదిలీ ఉత్తర్వు. ఎప్పుడూ ఉత్సాహంగా, అల్లరి చేస్తూ ఉండే పిల్లలను ఇలా మౌనంగా ఉండడం ప్రిన్సిపాల్ చూడలేకపోయాడు. కానీ ఏం లాభం, ఎన్నో సార్లు రాజశేఖర్ బదిలీ ఆపమని పై అధికారులకు ఉత్తరాలు రాసాడు, విజ్ఞప్తులు కూడా చేసాడు, కానీ కుదరలేదు, ఇప్పటికే పిల్లల విజ్ఞప్తి మేరకు ఓ సంవత్సరం బదిలీ ఆపడం జరిగింది, కావున ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితులలో బదిలీని ఆపలేం అని స్పష్టం చేసారు ఉన్నతాధికారులు. ఆరోజు సాయంకాలం సభలో పెద్దలు, పిల్లలు, తల్లిదండ్రులు ఇలా అందరూ రాజశేఖరును వేనోళ్ళ పొగిడారు. మరుసటి రోజే తన ప్రయాణం, లగేజి అంతా దగ్గరుండి రాజశేఖర్ వద్దంటున్నా పిల్లలే సర్దేశారు, తన వెంట అందరూ బస్టాండుకు రావడం చూసి ఎంతో సంబరపడ్డాడు రాజశేఖర్, ఎదురుచూస్తున్న బస్సు రానే వచ్చింది, భారమైన మనసులతో, బరువెక్కిన గుండెలతో, కనులలో ఉబికి వస్తున్న కన్నీళ్ళతో అణువంత కూడా ఇష్టం లేకపోయినా వీడ్కోలు చెప్పారు రాజశేఖరుకు. బస్సులో రాజశేఖర్ గొప్పతనం తెలిసిన పక్కఊరి గ్రామస్తులు కూడా గౌరవంగా లేచి నిల్చున్నారు.
బస్సు కొత్తపల్లికి దూరం అవుతున్న కొద్దీ, తను వెళ్ళబోయే రామవరం పాఠశాల తాలూకా ఆలోచనలు మొదలయ్యాయి రాజశేఖరుకు. కొత్తపల్లి నుంచి జిల్లా కేంద్రానికి ఓ రెండు గంటలు, ఆ జిల్లా కేంద్రం నుంచి రామవరకు మరో నాలుగు గంటలు, వెరసి ఆరు గంటల ప్రయాణం, జిల్లా కేంద్ర చేరుకునేపాటికే రాత్రి అవడంతో అక్కడే బస చేసి ఉదయాన్నే రామవరం పాఠశాలకు వెళ్ళాడు. రామవరం పేరుకే గ్రామం కానీ, పక్కా ఇండ్లు ఉన్నాయి, పాఠశాల భవనం కూడా చాలా బాగుంది, లోపలికి అడుగుపెట్టి సరాసరి హెడ్ మాస్టర్ గదిలోకి వెళ్ళిన రాజశేఖరుకు, ఆ గది బోసిగా దర్శనమిచ్చింది, ఆ ఒక్క గది మాత్రమే కాదు, పిల్లల క్లాస్ రూములు కూడా బోసిగానే దర్శనమిచ్చాయి, ఆందోళనగా వెనుదిరిగాడు రాజశేఖర్. అటెండర్ దగ్గర హెడ్ మాస్టర్ ఫోన్ నెంబర్ తీసుకుని తను వచ్చిన సంగతి రిపోర్టు చేసాడు. రాజశేఖర్ రిపోర్ట్ చేసిన పది నిమిషాలకు నింపాదిగా వచ్చి సంతకం తీసుకున్నాడు హెడ్ మాష్టర్ సురేష్.
"గుడ్ మార్నింగ్ సర్, నా పేరు రాజశేఖర్, కొత్తపల్లి నుంచి బదిలీపై వచ్చాను" తనను తాను పరిచయం చేసుకున్నాడు రాజశేఖర్.
"తెలుసులేవయ్యా, నువ్వు వస్తావని నాకు వార్త అందింది, ముందు సంతకం చేయి" కసిరాడు హెడ్ మాస్టర్.
"సర్..!!!! మన స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు??"
"ఏ స్టూడెంట్స్??"
"మన పాఠశాలకు వచ్చే స్టూడెంట్స్ సార్..!!!"
"వొఠ్ఠి అమాయకుడిలా ఉన్నావే?? ఇప్పుడు ఈ రోజుల్లో ఈ కాలంలో గవర్నమెంటు పాఠశాలకు ఎవరు వస్తారు రాజశేఖర్, ఇప్పటివరకు నేనొక్కడినే స్టాఫ్, ఇప్పుడు నువ్వు వచ్చావు, ఇక్కడ పిల్లలు రావడం, పాఠాలు చెప్పడం లాంటివేవీ ఉండవు, సంతకం చేసి ఇంటికెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోవడమే"
"సర్, మరి ఎవరైనా చెకింగ్ గానీ, ఇన్స్పెక్షన్ గానీ వస్తే??"
"ఆ....ఆ.... నువ్వేం భయపడవలసిన అవసరం లేదు, అలాంటి కార్యక్రమాలు అన్నీ మనకు ముందే తెలిసిపోతాయి, అప్పటికప్పుడు ఓ పది మంది పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాం, సరే నాకు బయట పని ఉంది నేను వెళ్తున్నాను" అంటూ వెళ్ళిపోయాడు సురేష్.
సురేష్ ప్రవర్తన, పాఠశాలపై ఉన్న ఉద్యోగ బాధ్యతలో నిర్లక్స్యం చూసిన తరువాత రాజశేఖర్ మనసులోనే ఛీ కొట్టుకున్నాడు, అంతే కాదు కోపంగా చెడమడా తిట్టేద్దామనుకున్నాడు, కానీ తొందరపడకూడదని మిన్నకుండిపోయాడు. ఏదైనా ఎంగిలి పడదామని పక్కనే ఉన్న చిన్న హోటల్ లోకి వెళ్ళాడు. ఆ హోటల్లో చిన్న పిల్లవాడు టీలు, టిఫిన్లు సర్వ్ చేస్తూ ఉండడం గమనించాడు.
"ఎవరు సార్ మీరు, కొత్తగా వచ్చారా ఊరికి, ఏ పని మీద వచ్చారు?" అడిగాడు హోటల్ యజమాని రవి.
"నేనెవరో తరువాత చెప్తాను కానీ, పనిలో పెట్టుకోవడానికి ఈ చిన్నపిల్లవాడు తప్ప మరెవ్వరూ దొరకలేదా, చదువుకోవలసిన వయసులో పని చేయిస్తావా, బాలలతో పని చేయించడం పెద్ద నేరమని తెలియదా నీకు??" ప్రశ్నించాడు రాజశేఖర్.
"బాబుగారు, మీరెవరో నాకు తెలియదు కానీ, ఆ పిల్లవాణ్ణి నేను పనిలో పెట్టుకోలేదు బాబూ, వాడి అయ్యే ఇక్కడ పనిలోకి పెట్టి వెళ్ళాడు, ఇంతకూ మీరెవరో చెప్పలేదు??"
"నేను ఈ పాఠశాలకు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుడను" గర్వంగా ఒకింత సంబరంగా చెప్పాడు రాజశేఖర్.
"అయితే మీకు పని సున్నా, జీతం శానా అన్నమాట!!!!" నవ్వుతూ అన్నాడు రవి.
"అవునూ, ఇక్కడ పిల్లలెవరూ స్కూళ్ళకు వెళ్ళరా, చదువుకోరా?" తెలుసుకోవాలని అడిగాడు రాజశేఖర్.
"ఎందుకు వెళ్ళరు బాబూ, రోజూ కరెక్టుగా చివరి గంట కొట్టే టైముకు చేరుకుంటారు" పిల్లలు టైం తప్పరు అన్నట్టు చెప్పాడు రవి.
"మరి ఒక్కరూ కనపడరే??" స్కూల్ వైపు చూపిస్తూ అడిగాడు రాజశేఖర్.
"నేను చెప్పేది ఊరి చివరన ఉన్న ప్రైవేట్ స్కూలుకు వెళ్తారని బాబూ" పక్కనే ఉన్న ప్రైవేట్ స్కూలు గురించి చెప్పాడు యజమాని రవి.
"ప్రైవేట్ స్కూలుకా?? ఎక్కడుంది, నేనొకసారి వెళ్ళి చూడాలి........" అంటూ బిల్లు తాలూకా డబ్బులు చెల్లించి ముందుకు కదలబోయాడు రాజశేఖర్.
"సార్.....ఆ స్కూల్ చాలా దూరం, కావాలంటే నా సైకిల్ తీసుకెళ్ళండి" తన సైకిల్ ఇచ్చాడు యజమాని రవి.
సైకిల్ పై దాదాపు పదిహేను నిమిషాల తరువాత ఆ ప్రైవేట్ స్కూలుకు చేరుకున్నాడు రాజశేఖర్. అక్కడ తనకు కనపడిన మొదటి దృశ్యం, సురేష్ పాఠాలు చెప్తూ ఉండడం, ఆ దృశ్యం చూసిన రాజశేఖర్ కోపం నషాలానికి అంటింది, కానీ ఆవేశపడడం మంచిది కాదని వెనక్కు వచ్చేసి, రవికి సైకిల్ ఇచ్చేసి ఓ అద్దె ఇంట్లో దిగి సామాను సర్దుకుని కునుకు తీద్దామని నేలపై పడుకుని రూము సీలింగ్ చూస్తున్న రాజశేఖరును నెమ్మదిగా ఆలోచనలు చుట్టుముట్టాయి, ఎన్నో ఆశలతో, ఓ చేతిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రశంసా పత్రం, మరో చేతిలో బదిలీ పత్రం పట్టుకుని ఈ ఊరిలో అడుగుపెట్టిన రాజశేఖరుకు నైరాశ్యంలోకి అడుగుపెట్టినట్టు అనిపించింది. మధ్యాహ్నం హోటల్లో భోజనం తెప్పించుకుని, చిన్నపాటి కునుకు తీసి, సాయంకాలం ఊరు చూడడానికి బయలుదేరాడు. తను అలా గల్లీ గల్లీ తిరుగుతూ, ప్రతీ ఇల్లూ చూసుకుంటూ పరిచయం అయిన రవి దగ్గర టీ తాగుతూండగా ఉదయం చూసిన స్కూల్ తాలూకా బస్, పిల్లల్ని దించటానికి వచ్చింది. అందులో దాదాపు ఓ ఇరవై మంది పిల్లలు బస్సు దిగి వారి ఇళ్ళకు వెళ్తున్నారు. ఆ బస్ వెనకాలే వస్తున్న సురేష్ సరాసరి టీస్టాల్ దగ్గరికి వచ్చాడు, సురేష్ రాగానే గౌరవంగా లేచి నిలబడ్డాడు రాజశేఖర్.
"ఏమోయ్ రాజశేఖర్, మొదటి రోజు ఎలా గడిచింది??" అడిగాడు సురేష్.
"చాలా దిగాలుగా, బోరుగా గడిచింది సార్" డీలా పడుతూ జవాబిచ్చాడు రాజశేఖర్.
"దిగులు ఎందుకయ్యా, ఏ పని చేయకుండా గవర్నమెంటు జీతం తీసుకోవడం అంటే ఎంత అదృష్టం ఉండాలో తెలుసా?? ఆ అదృష్టం నీకు తగిలింది, రోజూ ఉదయం ఓ సంతకం, సాయంకాలం ఓ సంతకం, అంతే, గవర్నమెంటు జీతం వచ్చేస్తుంది, ఇంకా ఎక్కువ డబ్బులు కావాలంటే మన ప్రైవేట్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్ పోస్టు ఖాళీగా ఉంది, జాయిన్ అయిపో" సలహా ఇచ్చాడు సురేష్.
“ఓ రెండు రోజుల్లో చెప్తాను సర్" అంటూ పైకి లేచి తన ఇంటికి బయలుదేరాడు రాజశేఖర్.
తన ఇంటికెళ్ళినా కూడా ఇవే ఆలోచనలు, తను పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి తన ఆత్మాభిమానాన్ని చంపుకుని ఏ పని చేయలేదు, ఎవ్వరికీ తల వంచలేదు, కానీ ఇప్పుడు తన ముందుకు వచ్చిన సమస్య తనకు కొత్తది, ఇంతవరకూ రానిది, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియలేదు, కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది అని సర్ది చెప్పుకుని ఈ ఆలోచనలను కొద్దిగా దారి తప్పించి, మనసును శాంతపరచుకోవటానికి తనకెంతో ఇష్టమైన సైకాలజీ పుస్తకం తీసి చదవసాగాడు.
కాసేపటికి భోజనం ముగించి రాత్రి నడకకు బయలుదేరాడు రాజశేఖర్. తనకు రాత్రి నడక చాలా ఇష్టం, ఎందుకంటే, గ్రామాల్లోని ప్రజలు పగలంతా ఎక్కడ ఉన్నా, రాత్రికి ఓ చోట చేరి, హాయిగా లోకాభిరామాయణం మాట్లాడుకుంటారు. అలా నడుచుకుంటూ ఆ ఊరిలోని కోదండరామస్వామి గుడి సందులోకి రాగా, అక్కడ ఓ పది మంది పిల్లలు గుడి వీధి లైటు వెలుగులో, మస్కిటో కాయిల్ పొగ మాటున చదువుకుంటూ కనబడ్డారు. ఈ దృశ్యం చూసిన రాజశేఖర్ ఉత్సాహంగా వారి మధ్యకు వెళ్ళి కూర్చున్నాడు, అందులో రవి హోటల్లో పని చేసే కుర్రాడు కూడా ఉన్నట్టు గమనించాడు.
"ఎవరు మీరంతా? ఇక్కడ ఏం చేస్తున్నారు?"
"నమస్కారం సర్, మేము ఇక్కడ చదువుకుంటున్నాం?"
"ఏ స్కూల్లో చదువుతున్నారు, మీరంతా?"
"మేము ఏ స్కూలుకు వెళ్ళం సార్, పగలు పనికి వెళ్తాం, పక్కనే ప్రైవేట్ స్కూలుకు వెళ్తున్న పిల్లల దగ్గర్నుంచి నోట్స్ తెచ్చుకుని ఇక్కడ రాసుకుంటూ చదువుకుంటాం సర్, మేమంతా రెండో తరగతి వరకు చదువుకున్నాం సర్, తరువాత అందరూ ఆ ప్రైవేట్ స్కూలుకు వెళ్ళగా, గవర్నమెంటు స్కూల్ మూత బడింది, మా అమ్మానాన్నా దగ్గర డబ్బులు లేకపోవడంతో మేము మధ్యలోనే చదువు ఆపేయాల్సివచ్చింది".
రాజశేఖర్ పిల్లలతో ఇలా మాట్లాడుతూండగా రవి కూడా అక్కడికి వచ్చాడు.
"మన స్కూల్లో సురేష్ గారు ఉన్నారు కదా, మీ ఊరిలో చదువు మీద ఆసక్తి ఉన్న పిల్లలందరూ ఆయన దగ్గరికి వెళ్తే పేర్లు నమోదు చేసుకుని పాఠాలు చెప్తారు కదా, అలా ఎందుకు చేయలేదు??" అనుమానంగా అడిగాడు రాజశేఖర్.
రాజశేఖర్ చెప్పిన ఈ సలహాకు పిల్లలూ, వారి పక్కనే కూర్చున్న రవి పగలబడి నవ్వారు.
"ఎందుకు నవ్వుతున్నారు, నేనేమైనా తప్పుగా అన్నానా!!??"
"శేఖర్ బాబూ, అసలు ఆ స్కూల్ మూతబడడానికి, వీళ్ళు పనిలోకి వెళ్ళడానికి, ఇలా ఇక్కడ రాత్రి గుడి ముందర కూర్చుని చదువుకోవడానికి ఆయనే పెద్ద కారణం" అసలు విషయం చెప్పాడు రవి.
"అవునా, అదెలా?"
"ఈ సురేష్ గాడిది మా ఊరే బాబూ, చిన్నప్పుడు బడి ఎగ్గొట్టి బలాదూరుగా తిరుగుతూ, ఒక్క రోజు కూడా బడికి రాలేదు వాడు, ఓ రోజు వాళ్ళ నాన్న కొట్టిన దెబ్బలకు ఇల్లొదిలి పారిపోయాడు, కొన్నాళ్ళకు టీచర్ అవతారం ఎత్తి మా స్కూలుకే వచ్చాడు. ఈ సురేష్ గాడు రాకముందు, ఈ స్కూలు ఉన్నోళ్ళు, లేనోళ్ళు అనే భేదం లేకుండా పిల్లలతో వెలిగిపోయేది,, దానికి కారణం రఘునాథ్ మాస్టర్. ఆయన పాఠం చెప్తే సరాసరి వినేవారి మెదడులోకి వెళ్ళిపోవలసిందే, అంతే, అలా చెప్పేవాడు పాఠం, అప్పుడు ఎక్కడి నుండి వచ్చాడో ఈ స్కూలుకు సురేష్ గాడు బదిలీపై వచ్చి పక్కనే ఉన్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వారు ఇచ్చే కమీషన్లకు ఆశపడి చేతులు కలిపాడు. సురేష్ వచ్చిన నెల రోజులకు ఏం జరిగిందో ఏమో కానీ, రఘునాథ్ మాస్టర్ రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. రఘునాథ్ మాస్టర్ వెళ్ళిపోయాక, సురేష్ రాజ్యం మొదలయింది, స్కూలుకు వచ్చి సంతకం చేసి ఇంటికి వెళ్ళిపోయేవాడు, ఒకవేళ స్కూలులో ఉన్నా కూడా పిల్లలకు పాఠాలు చెప్పేవాడు కాదు, ఇలా ఓ పథకం ప్రకారం పిల్లల్ని స్కూలు నుంచి వెళ్ళిపోయేలా చేసారు. పిల్లల చదువుల మీద బెంగ పెట్టుకున్న తల్లిదండ్రులలో ఉన్నోళ్ళు వారి పిల్లలను ప్రైవేట్ స్కూలుకు, లేనోళ్ళు వారి పిల్లలను పనికి పంపుతున్నారు, పనికి వెళ్ళే పిల్లల్లో చదువుమీద ఆసక్తి ఉన్నవారు ఇదిగో ఇలా రాత్రి పూట ఇక్కడ కూర్చుని చదువుకుంటూ ఉంటారు".
"ఇక్కడ ఇంత జరుగుతున్నా, విద్యాధికారులు ఏం చేస్తున్నట్టు, మీరు వెళ్ళి కంప్లయింట్ ఇవ్వవచ్చు కదా?"
"కంప్లయింట్ ఇవ్వడం జరిగింది, అధికారులు రావడం జరిగింది, కానీ ఇక్కడ ఏమీ మారలేదు, పైగా కంప్లయింట్ ఇచ్చిన వారి మీద బెదిరింపులు దాడులు జరిగాయి, ఆ ప్రైవేట్ స్కూల్ యజమానికి బాగా పలుకుబడి ఉండడంతో మేం ఏమీ చేయలేని నిస్సహాయులమయ్యాము, గవర్నమెంటు స్కూలుకు పిల్లలను పంపలేదని తల్లిదండ్రులను నిందిస్తారే కానీ, ఉచితంగా చదువు చెప్తున్నా పిల్లలు ఎందుకు రావటం లేదు అని ఏ ఒక్కరూ ఆలోచించరు బాబూ, ఎందుకో ఏమిటో?"
రవితో జరిగిన సంభాషణలో ఊరి గురించి, స్కూల్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నట్టయ్యింది రాజశేఖరుకు. స్కూలును ఎలాగైనా మార్చి పిల్లలకు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకుని, కార్యాచరణ గురించి ఆలోచించుకున్నాడు. మరుసటి రోజు ప్రైవేట్ స్కూలుకు వెళ్ళి పాఠాలు చెపుతున్న సురేష్ వీడియో రికార్డ్ చేసి, అజ్ఞాత వ్యక్తి పేరుతో మీడియాకు పంపించాడు, మీడియాలో ఆ వార్త కాస్తా పాపులర్ అయింది. ప్రాథమిక విచారణ చేసి సురేష్ ను సస్పెండ్ చేసారు అధికారులు, అంతే కాదు పాఠశాలకి తాత్కాలిక హెడ్ మాస్టరుగా రాజశేఖరును నియమించారు అధికారులు. తన సస్పెన్షన్ కు కారణం రాజశేఖరే అన్న విషయం తెలుసుకున్న సురేష్, అతనిపై దాడి చేయించాడు. రాజశేఖర్ కోలుకోవడానికి మూడురోజులు పట్టింది, సురేష్ సస్పెండ్ అయిన సుమారుగా నెల రోజులకు సురేష్ ఇంటిముందు పొలీసుల హాడావుడి కనిపించింది, గ్రామస్తులు అందరూ గుమిగూడారు, సురేష్ ను దొంగ సర్టిఫికెట్ల వ్యవహారంలో అరెస్టు చేస్తున్నారని కారణం తెలుసుకున్న గ్రామస్తులు విస్తుపోయారు, సురేష్ అసలు డిగ్రీనే చదవలేదని తెలుసుకున్న గ్రామస్తులు చీదరించుకున్నారు, కేసు నిరూపణ అవడంతో సురేష్ డిస్మిస్ అయ్యాడు.
మరుసటి రోజు ఉదయం స్కూలుకు వెళ్ళాడు రాజశేఖర్, అప్పటివరకు పనిలోకి వెళుతున్న పిల్లలందరూ పలకా, బలపంతో క్లాసురూములోకి వెళ్ళడానికి ఎదురుచూస్తున్నారు, రాజశేఖర్ క్లాస్ చెప్పడానికి అనువుగా ఓ రూమును శుభ్రం చేసాడు రవి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకింది, కానీ అప్పటికే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలను రాజశేఖర్ దగ్గరికి పంపించడానికి తల్లిదండ్రులు ఎవ్వరూ సమ్మతించలేదు. మొదలుపెట్టిన పని ఫలితాలు ఇవ్వడానికి సమయం పడుతుంది అని తన పని తాను చేసుకోసాగాడు రాజశేఖర్. రాజశేఖర్ పాఠాలు వింటూ రఘునాథ్ మాస్టారును గుర్తుచేసుకున్నారు పిల్లలు, క్రమక్రమంగా పిల్లల సంఖ్య పెరగసాగింది. కానీ, రోజులు గడుస్తున్నకొద్దీ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఒత్తిడి ఎక్కువైంది రాజశేఖరుకు, డబ్బు ఆశ చూపించారు, కానీ, లొంగకపోవడంతో వేరే విధంగా భయపెట్టడం మొదలుపెట్టారు. ఓ రోజు ఏకంగా బరితెగించి, స్కూల్లోకి దూసుకువచ్చి అద్దాలు పగలకొట్టి, ఫర్నీచర్ ధ్వంసం చేసి, రాజశేఖర్ పై దాడికి దిగారు, అంతే కాదు పిల్లలపై కూడా తమ ప్రతాపం చూపించారు ఆ నీచులు, అడ్డొచ్చిన గ్రామస్తులను కూడా కొట్టారు. ఎవరైనా స్కూలుకు వస్తే చంపేయమని చెప్పి పంపించారు మా అయ్యగారు అంటూ బెదిరించి వెళ్ళిపోయారు. తీవ్ర గాయాలైన పిల్లలను, రాజశేఖరును ఆసుపత్రికి తరలించారు గ్రామస్తులు. ఆ దుండగులు కొట్టిన దెబ్బలకు రాజశేఖర్ ఓ వారం రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవలసి వచ్చింది, వారం తరువాత, స్కూలు తలుపు తీశాడు, అయితే అక్కడ పిల్లలు ఎవ్వరూ కనపడలేదు, మొన్న జరిగిన సంఘటనకు బెదిరిపోయి స్కూలుకు రాలేదని తెలుసుకున్నాడు. ఈ సమస్యకు ముగింపు ఎప్పుడో అని ఆలోచిస్తూండగా ఫోన్ మోగింది,
"హలో ఎవరూ??”
"రేయ్ మర్యాదగా చెప్తున్నా, స్కూల్ అనే ఆలోచన లేకుండా ఈ ఊరి నుంచి వెళ్ళిపో, నువ్వు మాతో పెట్టుకుని గెలవలేవు, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావంటే మళ్ళీ మనుషులను పంపాల్సి ఉంటుంది, వాళ్ళు ఈసారి నిన్ను చంపి గానీ వెనక్కి రారు" అంటూ బెదిరించి ఫోన్ కట్ చేసాడు ఆ ప్రైవేట్ స్కూల్ యజమాని.
రాజశేఖర్ నవ్వుతూ ఫోన్ పెట్టేసి, ఎలుక బోనులో పడింది అనుకుంటూ, ఆ ఫోన్ రికార్డింగునూ, మొన్న స్కూల్ మీద దాడి చేసినప్పుడు ఎవరికీ తెలియకుండా ఓ సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేసిన దృశ్యాలను అన్నింటినీ కలిపి సోషల్ మీడియాకు వదిలాడు. అవి కాస్త వైరల్ అవ్వడంతో ఉన్నతాధికారుల దృష్టి పడింది, విచారణ జరిపి కేసులు ఫైల్ చేసారు, నేరం నిరూపణ కావడంతో ఆ యజమానినికి శిక్ష పడింది, ఆ ప్రైవేట్ స్కూల్ మూతబడింది. ఈ విషయంలో రాజశేఖర్ ఎప్పుడూ అందుబాటులో ఉంచుకునే పెన్ కెమెరా ఎంతగానో ఉపయోగపడింది.
రాజశేఖర్ మరియు గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు, ఆ పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయులను, కంప్యూటర్లను, సౌకర్యాలను అందజేసారు ఉన్నతాధికారులు. ఇప్పుడు ఆ పాఠశాల పిల్లలతో, ఉపాధ్యాయులతో కళకళలాడుతూ, పిల్లలను అభివృద్ధి వైపు నడిపిస్తూ, మంచి ఫలితాలు సాధిస్తోంది.