అరచేతిలో అజ్ఞానం - శ్రీనివాస్ మంత్రిప్రగడ

Ignorance in the palm of the hand

టైము తొమ్మిదయినా రోడ్ల మీద వాహన రాకపోకలు చాలా పలచగా ఉన్నాయి...ఎవ్వరూ ఇంతకుముందులాంటి దూకుడు చూపించట్లేదు...అదేమంత విచిత్రమైన విషయం కాదు... ఈ రోజుల్లో చాలామంది భయం భయంగానూ, అసురక్షితం గానూ ఉంటున్నారు..ఆ భావాలు అన్ని చర్యల్లోనూ ప్రతిబింబిస్తున్నాయి

"ఈ హైటెక్ సిటీ కి వెళ్లే రోడ్లింత పెద్దవని ఎప్పుడు అనిపించలేదురా.. ఇప్పుడు తెలుస్తోంది" అన్నాడు రామరాజు తాపీగా కారు నడుపుతూ..."ఈ పరిస్థితి ఇలాగే ఉంటే ఈ ప్రపంచంలోంచి బీపీ సుగర్లు పూర్తిగా కనుమరుగై పోతాయి" అన్నాడు

"అదంతా వీజీ కాదు" అన్నాడు వీర్రాజు తనికెళ్ళ భరణిగార్ని అనుకరించే ప్రయత్నం చేస్తూ

"ఏదొక సమస్య ఎప్పుడూ ఉంటుంది.. లేకపోతే సమస్యలు సృష్టించడంలో మనిషిని మించినవాళ్లు లేరుగా...ఆ సమస్యలే బీపీ సుగర్లకి బలవర్ధకాహారం " అన్నాడు

రామరాజు నవ్వి" కొత్త కంపెనీలు రావడానికి మౌలిక వసతులు బానే తయారు చేసారు...దాని కంటే వేగంగా ఈ ప్రాంతాన్ని ప్రజలు ఆక్రమించుకుంటున్నారు..రద్దీ పెరగడం మాములు విషయమే కదా..ఆ రద్దీ వల్లే మనం ఎప్పుడూ ఈ రోడ్డుని పూర్తిగా చూడలేదు...ఆ కరోనా ధర్మమా అని కొన్ని మంచి విషయాలు బయటకు వస్తున్నాయి " అన్నాడు మళ్ళీ రోడ్ల మీదకి దృష్టి మళ్లించి

"అంటే ఆ తప్పు ప్రజలదేనా? పట్టణ ప్రణాళికల్ని తయారు చేసే శాఖ ప్రభుత్వంలో ఉందిగా..వాళ్ళు చూడాలి" అన్నాడు వీర్రాజు

"సరిపోయింది.. నీదో భావవాదం" అన్నాడు రామరాజు

"పూర్వపు రష్యన్ పుస్తకాల అనువాదాలు చదువుతున్నటుంది..కొంచం వాడుకభాషలోకి రారా" ప్రాధేయ పూర్వకంగా అన్నాడు వీర్రాజు

"నా ఉద్దేశ్యం ఐడియలిస్టిక్ అని" అన్నాడు రామరాజు

"వీళ్ళ ప్రణాళికలు దూరదృష్టితో చేసుంటే బావుండేది...ఈ అయిదేళ్ల ప్రజాస్వామ్యం అప్పటికప్పుడు పురోగతికి సంబందించిన నివేదికల మీదే దృష్టి పెట్టేలా చేస్తుంది..దూరాలోచన కుదరదు...రాజకీయ పార్టీలకు ఆ వత్తిడి ఎప్పుడూ ఉంటుంది" పొడిగించాడు

"విరోధించు వారు లేరులే...నిరోధించువారు రారులే....ఆస్తి నాస్తి బేధమేలరా...వాస్తవం వరించి సాగరా" శ్రీ శ్రీ గారి కవితందుకున్నాడు వీర్రాజు

"అంతేలే" నిట్టూర్చాడు రామరాజు

"అది సరేలే గాని రామా...ఈ రోజుల్లో ఆఫీసుల్లో మూడొంతుల మంది కంటే ఎక్కువ ఉండకూడదని కదా రూలు...మిగిలినవాళ్లు ఇంట్లోంచి చెయ్యొచ్చు కదా ...మనిద్దరికీ మాత్రం తరచుగా ఆఫీస్ కి వెళ్లాల్సి వస్తోందేమిట్రా?" అడిగాడు వీర్రాజు

"మనం ఎప్పుడూ బయట మనుషులమే " అన్నాడు రామరాజు నవ్వుతూ "అంచేత మనం ఎక్కువ భారాన్ని మొయ్యాలి" అన్నాడు

"అంటే మనం పీవీ గారి మహేంద్రనాథ్ లా లోపలమనుషులమనుకొనే బయట మనుషులమా?" అడిగాడు వీర్రాజు

"అవును...విషయాలకి లోపల మనిషి...రాజకీయాలకి బయట మనిషి" అన్నాడు రామరాజు నవ్వుతూ

"జోగ్గా అన్నాను గాని...మన ప్రాజెక్టులు కస్టమర్ కి చాల ముఖ్యం కదా..అందరి దృష్టి వీటిల మీదే ఉంది ...మనం కొంచం తీవ్రంగా ఈ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టడానికి ఎక్కువసార్లు రావాల్సొస్తోంది " అన్నాడు కొంచం సీరియస్ గా మొహం పెట్టి

ఆఫీసుకి చేరారు... గేట్లో కారు డిక్కీ చూడడమే కాకుండా నుదిటి మీద ఉష్ణపు తుపాకీ పెట్టి చూసాడు భద్రతా అధికారి ...తరవాత చేతుల్లో వేసిన సబ్బు ద్రావకం రుద్దుకుంటూ పార్కింగ్ లోకి వెళ్లారు స్నేహితులిద్దరూ

"ఇవాళ రోజెలా ఉంది?" లిఫ్టులో అడిగాడు రామరాజు

"ఒకటే మీటింగ్...అది రెండున్నరకు ... ఓ గంట నేను రాసుకునే నోట్స్ తయారు చేసుకోవాలి ... తరువాత మిగతా టీం దగ్గరనుంచి పురోగతి తెలుసుకోవాలి...అంతే" అన్నాడు వీర్రాజు

"ఇవాళ నాకు అన్నీ నేను చెయ్యాల్సిన పన్లే...మీటింగులేవీ లేవు..నీ పనయ్యాక రా ఫ్లాస్క్ లో తెచ్చుకున్న టీ తాగుదాం" అన్నాడు రామరాజు

దాదాపు గంటన్నర పాటు ఇద్దరూ వాళ్ళవాళ్ళ పనుల్లో హడావుడి గా గడిపారు...తరవాత వీర్రాజు మెల్లిగా రామరాజు రూమ్ కి వచ్చాడు

రామరాజు తన లాప్ టాప్ లోకి చూస్తూ నవ్వుకుంటున్నాడు

"ఈ కరోనా కాలంలో అంత వినోదం ఇస్తున్నది ఎవడ్రా?" అడిగాడు వీర్రాజు

"ఉన్నడులే ఒకడు" ఉపోద్ఘాతం ఇచ్చాడు రామరాజు "మనం ఐటీ ఉద్యోగాల్లో చేరిన కొత్తల్లో నర

సింహం అని ఒక గొప్ప ఇంటెగ్రేషన్ స్పెషలిస్ట్ ఉండేవాడు ...ఇంకా ఉన్నాడులే...ఇప్పుడు గొప్పవాడు కాదు...రెండు సాఫ్ట్ వేర్ అప్లికేషన్లు కనెక్ట్ చెయ్యడంలో అందెవేసిన చెయ్యి" పొడిగించాడు

"ఆ రోజుల్లో ఇంటెగ్రేషన్ తెలిసిన వాళ్ళు తక్కువమంది ఉండేవాళ్ళు... వీడు ఉన్న వాళ్లందరికంటే బాగా చేసే వాడు....వీడు కొన్ని సులభతరం చేసే పద్ధతులు కూడా కనిపెట్టాడు ..దానివల్ల రెండు సాఫ్ట్ వేర్ అప్లికేషన్లు ఒకదానితో ఇంకొకటి కలపడం లో బాగా టైం ఆదా అవ్వడం మొదలెట్టింది ...దాంతో మా కంపెనీ లో ఇంటెగ్రేషన్ అంతా వాడి కింద పెట్టేసారు"

"వాడెంత బాగా చేసాడంటే, వరసగా మూడేళ్లు వాడే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కొట్టేసాడు...మూడో ఏడు అనుకుంటా నేను చేరాను. ఆ ఏడు అవార్డు ఫంక్షన్లో పెద్దాయన వీడ్ని చాలా పొగిడాడు...అసలిలాంటివాడి వల్లనే మన కంపెనీ నడుస్తోందనీ, వీడు అందరకి ఆదర్శం అనీ ఇంకా చాలా అన్నాడు"

"నిజం చెప్పాలంటే నాక్కొంచెం అసూయగా అనిపించింది ...దిగమింగుకుని ఆతరవాత రోజున పెద్దాయన దగ్గరకు వెళ్ళాను...అక్కడ ఇతర పెద్దలు కూడా ఉన్నారు....సార్ నర

సింహం చాలా గ్రేట్ ఫెలో అండీ, మేము కూడా ఆలా అవ్వాలంటే ఏం చెయ్యాలి? అనడిగాను"

"అందరు ఘొల్లున నవ్వారు...నువ్వే అంటున్నావు కదా వాడు గ్రేట్ ఫెలో అనీ, అలాంటివాడు పుట్టుక తోనే గ్రేట్ అవ్వాల్సిందే ...నేర్చుకుని అవ్వడానికి లేదు...నర సింహం కి ఆ కొత్త విషయాలు కనుక్కో మని మేము చెప్పలేదు...వాడే ఆలోచించుకుని చేసాడు...

విదేశాల్లోని మన కస్టమర్ చాలా పొగిడాడు...అసలు అలాంటి పని చెయ్యాలని మోటివేషన్ ఎలా వచ్చింది వీడికి అనీ అడిగాడు అన్నాడు అప్పుడు జీత భత్యాలు చూసే అబ్బరాజు

నిజమే, నర సింహం చాలా గొప్పవాడు కానీ నేను కూడా అయిదారు సలహాలు ఇచ్చాను అవి అసలు చర్చకు కూడా రాలేదు ...నా విలువ రుజువు చేసుకోవడం ఎలా? అనడిగాను నేను

నువ్వు మొదటికే మోసం తెస్తావు...మొన్న మనకి ఒక కస్టమర్ ఇచ్చిన డిజైన్ని ఎలా తయారు చెయ్యాలా అని కాకుండా నువ్వు అసలు ఆ డిజైన్ లోనే పెద్ద తప్పు ఉంది అనీ పది పాయింట్లు రాసావు. .. ఆసలు అలాంటి విషయాలు మనం కస్టమర్లని ఎలా అడగగలం? ఆ కస్టమర్ తో మీటింగ్ ఒక వారంలో ఉంది ...వాళ్ళు మన నుంచి ఆశించేది ఆ డిజైన్ వాడి సాఫ్ట్ వేర్ ఎంత బాగా చెయ్యగలం అని, దానికి ఏ టెక్నాలజీ వాడవచ్చు , టైం ఎలా తగ్గించుకోవచ్చు లాంటి క్రియేటివ్ విషయాలు. నువ్వు అసలు వాళ్ళ ఆలోచనే తప్పు అనీ రాసావు అన్నాడు" వీపీ వీరేశం గారు

కానీ నేను అన్నది నిజమే కదా , ఇప్పుడు అందరూ ఆ కొత్త పద్ధతే వాడుతున్నారు ...ఆ కస్టమర్

ఇచ్చిన డిజైన్ పాత పధ్ధతి లో చెయ్యమని ...ఇప్పుడు వాళ్ళు చెప్పి నట్టు చేస్తే మళ్ళీ వచ్చే ఏడు మొత్తం మార్చాల్సి వస్తుంది" అన్నాను నేను

నీకో విషయం అర్ధం కావట్లేదు ...మన దగ్గర నువ్వు ప్రతిపాదించిన ఆ కొత్త టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, అది నేర్చుకుని చెయ్యడానికి ఎక్కువ టైం పడుతుంది ...కస్టమర్ రెండు నెలల్లో ఇమ్మన్నాడు ...మన కంపెనీ ఎప్పుడూ వాళ్ళు ఇచ్చిన డిజైన్ వాళ్ళు అడిగినట్టు, వాళ్లకు కావలసిన టైములో చేసి ఇవ్వడానికి పెట్టింది పేరు ...నీ మాట వింటే మొత్తం డిజైన్ మార్చి, ట్రైనింగ్ ఇచ్చి చేయించాలి ... రెండు నెలల్లో అది జరిగే పని కాదు" ఇరిటేట్ అయ్యారు వీరేశం గారు

సార్ తాపీ మేస్త్రి కి సివిల్ ఇంజనీర్ కీ తేడా ఉండాలి కదా" అన్నాను నేను

"అంటే మనం లో కింది స్థాయి పనివాళ్ళం అంటావా ...ఇదే తలనెప్పి నీతో" అన్నారు పెద్దాయన

"క్షమించండి సార్ ...దారి చూపించండి ...నాకు మంచి ప్రోగ్రాములు రాయాలని, కస్టమర్లకు సాయం చెయ్యాలని చాలా కోరిక" బతిమాలాను నేను

నర సింహాన్ని ఆదర్శంగా తీసుకో ...వాడి పధ్ధతి అనుసరించు" సలహా ఇచ్చారు అబ్బరాజుగారు

వాడు వరసగా మూడేళ్లు బెస్ట్ అవార్డు తీసుకున్నాడు, అసలు వాడి నిబద్ధత గురించి నీకు తెలుసా? నాలుగు నెల్ల క్రితం అనుకుంటా , ఒక కస్టమర్ కి నాలుగు వారాల్లో ఒక కొత్త ఇంటెగ్రేషన్ అవసరమైంది ...దాన్లో అయిదు రకాల ప్రోగ్రామ్లు తయారు చెయ్యాల్సి వచ్చింది. సింహం రాత్రి పగలు పనిచేసి పూర్తి చేసాడు " పరవశించారు అబ్బరాజు గారు. పుత్రోత్సాహం కనపడింది ఆయనలో . సింహం అయన కొడుకు కాకపోయినా, వాడిని కంపెనీ లోకి తెచ్చింది అబ్బరాజుగారే

"అయిదు ముక్కలు విడిగా చెయ్యాలంటే, ఒక దాని మీద రెండో ది ఆధారపడక పొతే, ముగ్గురు నలుగుర్ని వాడితే రెండు వారాల్లో చేయవచ్చు కదా సార్" అన్నాను నేను అమాయకంగా

పెద్దాయనకు కోపం వచ్చింది

"అసలు విషయం నీకు ఏమి అర్ధం కావట్లేదు ...ఆ టెక్నాలజీ నరసింహం ఒక్కడికే తెలుసు" అన్నాడు ఆవేశంగా

"నరసింహం రాత్రీ పొగలు పని చెయ్యాల్సిన అవసరం మాటి మాటి కీ వస్తోంది అని విన్నాను... అదే మనం మరో ముగ్గురు నలుగురికి ఆ టెక్నాలజీలో శిక్షణ ఇస్తే సింహం అంతలా పని చెయ్యాల్సిన అవసరం ఉండదు కదా... అతనిక్కూడా మంచి సౌకర్యాలుఅవసరం కదా " అన్నాను నేను

రూమ్ అంతా నిశ్శబ్దం శ్రీ శ్రీ గారన్నట్టు మహారణ్యంలో మధ్యాహ్నం లాగా స్తబ్దత...నిశ్శబ్దత... , నాకు భయం వేసింది. నిండు సభలో పెద్ద బూతు మాట మాట్లాడినట్టనిపించింది. ఎటూ పాలు పోలేదు

అబ్బరాజుగారు నెమ్మదిగా అందుకున్నారు " రెండు సిస్టములు కలపడం ప్రపంచంలోనే చాలా కొత్త విద్య. అందరూ అది నేర్చుకోలేరు. మనం బలవంతంగా నేర్పినా మనకి కావాల్సిన నాణ్యత రాదు. కస్టమర్ల దగ్గర మనకి చాలా మంచి పేరు ఉంది. ఈ కొత్త ఆలోచనలతో అది పాడిచేసుకోలేం" అన్నారు

"ఏదైతే నడుస్తోందో..దాన్ని గురించి కస్టమర్లకు సమస్య లేదో దాన్ని కదిలించకూడదు....మనం చేసేది బిజినెస్ కూడా...అద్భుతంగా ప్రోగ్రామ్లు చెక్కడం కాదు"విసురుగా అన్నారు వీరేశం గారు

మీటింగ్ ముగిసింది ...ఆరోజు నుంచి కంపెనీలో పెద్ద తలకాయలు వాళ్ళ శిష్యులు నన్ను కోవిడ్ తగిలిన వాళ్ళను ఇతరులు చూసి నట్టు చూడసాగారు

నా మీద నాకు విశ్వసం పూర్తిగా పడిపోయింది ...ఎంతో గొప్ప విషయాలు అర్ధం చేసుకో లేక పోవడం చాలా అవమానంగా అనిపించింది.

పట్టలేక ఒకరోజు నా గోడంతా మా అన్నయ్య పెదబాబు తో చెప్పుకున్నా. అయన గట్టిగా నవ్వేసాడు"ఈ మాత్రందానికి నువ్వు నీ విశ్వాసం పోగొట్టుకోకు. నీ పని నువ్వు చేసుకుంటూ పో , నీ అవకాశం కోసం ఎదురు చూడు" అనీ సలహా ఇచ్చాడు

"అంటే నా ఆలోచనలూ, పద్ధతులూ తప్పు కాదా?" అనడిగాను నేను

"తప్పు కాదు...అవి కరెక్టే కానీ ఇప్పుడు వున్న వాతావరణంలో ఇమడటంలేదు. నువ్వు పని చేసేముందు దాని మంచి చెడ్డలు చూసుకుంటున్నావ్, మనకు అప్పచెప్పిన పనిని ఒక కూలీ లా చేసి పడెయ్యకుండా, నువ్వు ఆలోచిస్తున్నావు. అది మంచి పద్దతి. మనం చిన్నప్పట్నుంచీ అదే నేర్చుకున్నాం ...ఇప్పుడు ఈ పెద్దలకోసం మార్చుకోవడం తప్పు" అన్నాడు పెదబాబు

ఆ మాటల్తో నాకు కొంచెం ధైర్యం వచ్చింది...నా తోటి వాళ్ళు కూడా "ఏం చెప్పేరు సార్, ఆ పాటి ధైర్యం ఎవ్వరికి లేదు, ఎవరో ఒకరు అలంటి ప్రశ్నలు అడుగుతారని ఎదురు చూస్తున్నాం" అనీ పొగిడే టప్పడికి కొంచం కుదుట పడ్డాను" ఆపాడు రామరాజు

అంతవరకూ శ్రద్ధగా వింటున్న వీర్రాజు "తరవాతేమైంది?" అనీ ఆతృతగా అడిగాడు

"ఏముంది, నన్ను కొంచం కిందకి నెట్టారు, కంపెనీ పెద్దలు నాతో మాట్లాడ కుండా, నా పనిని నా మేనేజర్ కి ఇచ్చి చేయించడం మొదలు పెట్టారు" అన్నాను నేను

"సబబుగానే ఉంది కదా?" అన్నాడు వీర్రాజు "మనకి పని ఇచ్చే వాళ్లనే మీకేం కావాలో మీకు తెలుసా అని అడిగినా, మీరు చేసే పని చాలా అసమర్థంగా ఉంది అంటే వాళ్లకు మండదా?" అడిగాడు

"ఈ ఆలోచన ధోరణి వల్లే మనం సివిల్ ఇంజినీర్లు అవకుండా మేస్త్రీలు అయ్యాం. మనం నేర్చుకునేదంతా అంతా మనకు తెలిసిన, కనిపిస్తున్న చిన్న ప్రపంచం లోంచే తీసుకోవడం ప్రారంభించాం. అనుభవం తో నేర్చుకోవడం చాలా ముఖ్యం. కానీ అది పరిమితం. మన ఆలోచనలు పూర్తి స్థాయి కి చేరాలంటే శాస్త్ర బద్ధం గా చదవాలి, ఆలోంచించాలి" అన్నాడు రామరాజు

"అంటే, మనికి పని ఇచ్చి బోలెడు జీతాలు ఇస్తున్న కంపెనీకి వాళ్ళ కస్టమర్ లకి ఏం కావాలో తెలియదా? అసలు వాళ్ళ దగ్గరికి వెళ్లి, మీకేం కావాలో మీకు తెలియట్లేదు సార్, అసలు సమస్య ఏమిటో చెప్పండి...అది ఎలా సాధించాలో మాకు వదిలేయండి అని అడగగలమా? పీకలు ఉత్తరించిపోవూ?" భయంగా అడిగాడు వీర్రాజు

"పోవు" అన్నాడు రామరాజు "అసలు కస్టమర్ కి ఏం కావాలో తెలుసా? వ్యాపార పరమైన ప్రయోజనం . మనం ఇక్కడ పని చెయ్యడానికి తీసుకునే డబ్బు కంటే వాళ్ళ దేశంలో అయితే చాలా రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాలి...అదీగాక ఆ పని తెలిసినవాళ్ళు తక్కువ మంది ఉంటారు. నియంత్రణ ఉండదు. దాని వల్ల వాళ్ళ ఖర్చులు పెరుగుతాయి. మార్కెట్లో పోటీదార్లను ఎదుర్కొనే అవకాశం తగ్గి పోతుంది. మనం ఇక్కడనుంచి చవగ్గా చేస్తే వాళ్ళకి లాభం" అన్నాడు రామరాజు

"జుట్టు రామ్మోహన్ అని ఒక జీనియస్ ఉండేవాడు గుర్తున్నాడా ...వాడిదగ్గర అంతా పనికిరాని పరిజ్ఞానం మాత్రమే ఉంటుంది...నీ మాటలు అలాగే ఉన్నాయి. ఈ గ్లోబల్ డెలివరీ మోడల్ బ్రిటిష్ వాళ్ళు ముందే చేసారు ...మనదేశంలో బట్టలు నేయించి వాళ్ళ దేశంలో అమ్ముకో లేదూ? చదివానులే నేను కూడా" అన్నాడు వీర్రాజు

"ఇవన్నీ మన వేదాల్లోనేవున్నాయష అన్నట్టుంది నీ పొంతన ...అగ్నిహోత్రావధానులూ" అన్నాడు రామరాజు

ముసిముసి నవ్వులు నవ్వాడు వీర్రాజు

"మనకి ఎంతో ఎక్కువలా అనిపించే జీతాలు వాడి లెక్కలో చదువు సంధ్య రాని వాళ్ళకిచ్చేది. అందుకని వాళ్ళు మననుంచి తెలివితేటలు కోరుకోరు...వాళ్ళు చెప్పిన పని చేసే క్రమశిక్షణ మాత్రమే కావాలి" అన్నాడు రామరాజు

"మన పెద్దలు ఈ విషయం ఎందుకు ఆలోచించలేదు?" అడిగాడు వీర్రాజు

"పొగరు అనుకోపోతే నా మనసులో మాట చెప్తాను . మన పెద్దలు చాలా మంచివాళ్ళు ...తెలివైన వాళ్ళు కూడా. కానీ మన దేశంలో ని బెస్ట్ బ్రైన్స్ కాదేమో అనిపిస్తుంటుంది. లేదా పెద్ద మొత్తాల్లో జీతాలు ముడుతున్నాయి కాబట్టి అడిగిన దానికంటే ఎక్కువ ఎందుకు అనుకున్నారేమో కూడా...వాళ్ళ వ్యాపారాలు బాగా నడవాలంటే అంటే వాళ్ళకి కూడా అనుకున్నది అనుకున్నట్టుగా చెయ్యగలిగే వాళ్ళు అవసరం కదా " కొంచం సిగ్గుగా అన్నాడు అన్నాడు రామరాజు...తన మనసులో ఇలాంటి ఊహలు ఉన్నాయని ఒప్పుకోవడం కష్టమే

"అది నిజమేగా, విదేశీ కంపెనీలకి వాళ్ళు అనుకున్న పని అనుకున్నట్టుగా అనుకున్న టైముకి చేసి ఇచ్చే వాళ్ళు అవసరం. దాని వల్ల మన దేశం ఎంతో బాగుపడింది ఆర్ధికంగా" అన్నాడు వీర్రాజు

"ఒకరకంగా అది నిజమే అయినా...వాళ్ళు మన పనులకి డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళ వస్తువులు , బ్రాండ్స్ అమ్మి వెనక్కి తీసుకుంటున్నారు .మనకి సంపద కన్నా అనుభవమే ఎక్కువ మిగులుతోంది" అన్నాడు రామరాజు

"అంటే అసలు తప్పంతా విదేశీ కంపెనీలదేనా ?" అనడిగాడు వీర్రాజు

"కాదు..మనదే. ఈ విదేశీ వ్యాపారాల మీద బాగా దృష్టి పెట్టి మనం చాలా రాజీ పడవలసి వచ్చింది " అన్నాడు రామరాజు

"అంటే సినిమాల్లో చిన్న పాత్రలకు మంచి నటన కన్నా కెమెరా అలవాటు ఉండడం ఎక్కువ విలువైన లక్షణం అని విన్నా అలాగా?" అడిగాడు వీర్రాజు

"ఇంచుమించుగా అలాంటిదే. నడుస్తున్న పద్ధతిని మార్చకుండా నడపడం మన అలవాటు. దీన్నే వ్యాపార గురువులు "ఇఫ్ సమ్ థింగ్ ఈస్ వర్కింగ్, డు నాట్ చేంజ్ ది స్టేటస్ కో" అని నూరి పోస్తారు మనకి" అన్నాడు రామరాజు

"అవును నేను చదివా కొన్ని వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో" అన్నాడు వీర్రాజు ఒప్పుకుంటున్నట్టు తలాడిస్తూ

"నీకోవిషయం తెలుసా...కిందటి సారి నేను విదేశాలకి వెళ్ళినప్పుడు ఆ ఇంటెగ్రేషన్ కస్టమర్ వాళ్ళ పెద్దాయన్ని కలిసాను" అన్నాడు రామరాజు

"అవునా...అప్పుడు చెప్పలేదే?" ప్రశంశా పూర్వకంగా చూస్తూ అడిగాడు వీర్రాజు

"అవకాశం రాలేదు...అయినా కూడా అది మన పెద్దలకు నచ్చదు అనిపించి ఎవ్వరికి చెప్పలేదు" అన్నాడు రామరాజు

"అదెలా జరిగింది రా నువ్వు వెళ్లిన నగరం వేరు కదా...కస్టమర్ ఆఫీస్ వేరే నగరంలో..." ఆసక్తిగా అడిగాడు వీర్రాజు

"అయన ఎదో మీటింగ్ కోసం నేను వెళ్లిన నగరానికి వచాచడు ....నేను ఉన్న హోటల్ లోనే దిగాడు. సాయంత్రం నేను కొంచం గొంతు తడుపుకుందామని బార్ కి వెళ్ళాను. అయన అక్కడ ఉన్నాడు. నేను పలకరిస్తే చాలా మర్యాదగా మాట్లాడేడు. వాళ్ళ కంపెనీ ఎలా ప్రారంభించేడో , ఎలాటి సమస్యలు ఎదుర్కొన్నాడో అవన్నీ విపులం గా చెప్పాడు " అన్నాడు రామరాజు

"అద్భుతం " అన్నాడు వీర్రాజు తానే అయన పక్కన కూర్చుని వింటున్నట్టు

"నేను ఉండబట్టలేక ఇంటెగ్రేషన్ గురించి అడిగేసాను. అయన నిట్టూర్చి అదో సమస్య. ఇప్పుడు సాఫ్ట్ వేర్ సిస్టములు దేని దారిన అది కాకుండా ..మిగతా వాటిల్తో సమాచారం ఇచ్చి పుచ్చుకునే పధ్ధతి ఉండాల్సిన అవసరం ఉంది. మా కంపెనీలో చాలా రకాల సిస్టములు ఉన్నాయి..వాట్లన్నిటిని కలపడానికి మేము ఒక ప్రామాణిక పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. టైం పడుతోంది" అన్నాడు

"నర సింహం చాలా పని చేస్తున్నాడు కదా, అతన్ని ట్రైనింగ్ ఇచ్చి ఒక టీం తయారు చెయ్య మంటే మీ సమస్య తీరుతుందిగా" అనడిగాను అమాయకంగా

"ముళ్ళపూడి వారన్నట్టు నీకు నాలుగు చేతులున్నాయి స్మీ అంటే నవ్విన విష్ణుమూర్తిలా నవ్వాడు అయన, ఒక పెద్ద కంపెనీ లో ముఖ్యమైన పనిచేస్తున్న ఆయనకు తట్టని విషయమా అది?

"నర సింహం చేసే పద్దతి పాతది ...ఇప్పుడు కంపెనీలు దాన్నుంచి దూరం వెళ్తున్నారు ...కొత్త టెక్నాలజీ ఇంకా స్థిరం కాలేదు ...దాంతో నర సింహం మీద ఆధారపడి బండి నడిపిస్తున్నాం. ఒక్కోసారి భయం వేస్తుంది అతను ఉద్యోగం వదిలేస్తానంటే, మేం ఇరుక్కుంటాం...అందుకే

జీతం దండిగా ఇస్తున్నాం" అన్నాడాయన "వాడ్ని ట్రైనింగ్ ఇచ్చి టీం తయారు చెయ్యమంటే అదొక ముప్పులా భావించి ముందే పారిపోవచ్చు..అందువల్లే వాడి చేత ట్రైనింగ్ ఇప్పించి టీం తయారు చెయ్యట్లేదు" అన్నాడు

"ఇది మా పెద్దవాళ్లకు తెలుసా?" అడిగాను నేను

"తెలియదు, వాళ్ళని చూస్తే భయంతో కూడిన వినయ గౌరవం తో నా ఆజ్ఞ కోసం కూర్చున్న ఆంజనేయుళ్ల లా అనిపిస్తారన్నాడు...ఆపాడు రామరాజు

"అయితే రామా, అయన రామాయణం కూడా చదివాడు ట్రా?" అడిగాడు వీర్రాజు

"నీ మొహం...అయన అన్న మాటలకి ఆల్మోస్ట్ అదే అర్ధం.." అన్నాడు రామరాజు

"హారిని, ఇదా నర సింహం గాడి పెరుగుదల కి కారణం? నేనింకా ఇదంతా మన పెద్దల ఆశీర్వాదం అనుకున్నా" అన్నాడు వీరాజు

"ఒకరకంగా ఆశీర్వాదాలు వల్లే వాడు బతుకున్నాడు" అన్నాడు రామరాజు

"మరి మనకెందుకురా ఆశీర్వాదాలు దొరకవు..."అడిగాడు వీర్రాజు

"ద్వారము తెరిచియున్నప్పుడే ఆశీర్వాదాలు ....మనలా నేలమాళిగల్లో మగ్గే వారికీ ఆశీర్వాదాలు ఎలా దొరుకుతాయి? అడిగాడు రామరాజు "నిజమే" ఒప్పుకున్నాడు వీర్రాజు "మన పెద్దలకి మనం మైరావణుల లాంటి వాళ్ళం" అన్నాడు

"ఇంకా విను..నేను ఆయనకి నా ఆలోచనలు చెప్పాను అయన చాలా సంతోషించాడు ...అప్పుడు నేను ఆయన్నో ప్రశ్న అడిగాను "మానుంచి మీరు భౌతికంగా చేసే పనే ఎందుకు కోరుకుంటారు? వ్యూహాత్మకంగా చేసే పని ఎందుకు వద్దు? అని "

ఆయనేమన్నారంటే, మా కంపెనీకి ఏం కావాలో మేము విస్తృతంగా విశ్లేషిస్తున్నాం అందువల్ల మాకు డిజైన్ మీద సలహా అవసరంలేదు.

టెక్నాలజీ ని మెరుగ్గా వాడే పద్ధతులూ, టైం తగ్గించడం ఎలా లాంటి విషయాల్లో మాకు మీ సలహాలు కావాలి. మీ వాళ్ళు అవి కూడా ఇవ్వట్లేదు. అందు చేత మీ టీం ని మేము మాకు కావాల్సిన పనులు చెప్పి చెప్పిచేయించుకుంటున్నాం" అన్నాడు అయన

"అంటే మనం ఈ గ్లోబల్ డెలివరీ ఉచ్చు లో పడి మన ఆలోచన విధానం లిమిట్ చేసుకున్నామా" వాపోయాడు వీర్రాజు

"మన పెద్దలు పూర్తి నియంత్రణతో వ్యాపారం నిర్వహించలేదు...కస్టమర్ కి కోపం రాకుండా చూసు కోవడం వాళ్ళకి ఒక పెద్ద సమస్య అయిపొయింది. ఈ గొడవలో వాళ్ళు ఒక్కళ్ళ మీద ఆధారపడటం తగ్గించుకుని, సామర్థ్యం పెంచుకోవడం కూడా మానేశారు, నర సింహం గాడికి తెలిసిన టెక్నాలజీ ఎవ్వరు నేర్చుకోలేనిది కాదు...కానీ ఆపనికి వాడ్ని ఉత్సాహ పరచకుండా వాడ్ని సంతోష పెట్టి పని చేయించుకోవడానికి ప్రాధ్యానం ఇచ్చారు

నర సింహం గాడు ఎందుకు పనికిరాని వాడు అనటంలేదు...కానీ వాడి పీఠం కాపాడుకోవడానికి తనకి తెలిసిన టెక్నాలజీ లో జరుగుతున్న అభివృద్ధి, మార్పులు లాంటివి చూడడం వల్ల పెద్ద లాభం లేదని గుర్తించి ఒకరకంగా తన మీద కంపెనీ ఆధారపడేలా చూసుకునేవాడు...ఎవ్వర్నీ ఆ ప్రాంతంలో అడుగు పెట్ట నిచ్చే వాడు కాదు...దీని వల్ల వాడు పెద్దల చెప్పుచేతల్లో ఉండేవాడు ...అదీగాక ఎక్కువ మందిని తయారు చేస్తే, అందర్నీ నియంత్రించడం కష్టం" అన్నాడు రామరాజు

"అంటే అరచేతిలో అజ్ఞానాన్ని పోషిస్తున్నారా...ఇది ఒక సంఘటన మాత్రమేనా లేక ఒక పెరుగుతున్న ధోరణా?" అడిగాడు వీర్రాజు

"దేవుడి లీలల్లా కొన్ని మాత్రమే మానవులకి అందుతాయి. అరచేతిలో అజ్ఞానం ఒక

సార్వత్రిక విషయం ...ప్రతీ చోట నర సింహం లాంటి జంతువులు గొప్ప పేరు గడించేసుకుని కళ్ళు పైకెళ్ళి పోయి తిరుగుతుండడం నేను చూసాను"

మనం సాఫ్ట్ వేర్ లో ఉన్నాం కాబట్టి ఆ కథ చెప్పాను...ఇంతకు ముందు నేను ఒక ఫ్యాక్టరీ లో పని చేశాను..అక్కడ అంతే"అన్నాడు రామరాజు

"అయితే రామా, అయినా కూడా మనం అభివృద్ధి సాధిస్తున్నాం కదా, అదెలా?" అడిగాడు వీర్రాజు

"మనం ఒక విషయం అర్ధం చేసుకోవాలి....మొత్తం మన దేశం అంతా ఇలాగే ఉంది అనుకోకూడదు...ఇప్పుడు చాలామంది కుర్రాళ్ళు కంపెనీలు పెట్టి కొత్త కొత్త పరిశోధనలు చేస్తున్నారు ....ఇంకా మనకి ఒక గొప్ప ఆవిష్కరణ జరగక పోయినా, ఆ దార్లో వెళ్లడం వల్ల తొందర్లోనే మనకి మంచి విజయాలు దొరుకుతాయి....అయితే నేను చెప్పిన అజ్ఞానం కూడా దాంతో బాటు బతుకుతూ ఉంటుంది...భరించాల్సిందే...చేయగలిగేది ఏమీ లేదు" అన్నాడు రామరాజు

"ఏమోరా మొన్న చైనా మీద మనం ఎంత ఆధారపడ్డామో చదివాను...సౌర శక్తి రంగంలో అయితే

దాదాపు అందరు చైనావాళ్ళే" అన్నాడు వీర్రాజు

"తొందరగా ఏదోరకంగా విజయం సాధించేసి డబ్బులు సంపాదించేయాలి అనే ఆత్రుత కొంచం తగ్గించుకుంటే, మనవాళ్లు అద్భుతమైన ఆవిష్కరణలు చెయ్యగలరు..దారి తప్పకుండ ఉండాలి ఇంకా కొంచం సహనం ఉండాలి...ఆమధ్య మనం మణి భౌమిక్ గారి కథ చదవలే" అన్నాడు రామరాజు

"ఇంతకీ నరసింహం గాడు ఇప్పుడిచ్చిన వినోదం ఏమిటి?" కుతూహలం గా అడిగాడు వీర్రాజు

"ఇంటెగ్రేషన్ స్టాండర్డ్స్..అని వాడో పేపర్ రాసాడు...ఎవ్వరు పబ్లిష్ చెయ్యట్లేదుట ...నన్ను చూడమన్నాడు" నవ్వుతూ ముగించాడు రామరాజు

వీర్రాజు కూడా నవ్వందుకున్నాడు.

-------------------------------- సమాప్తం------------------------------------------------

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు