అక్షరాస్యత - పద్మావతి దివాకర్ల

literacy

పల్లెప్రాంతంలో ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకు శాఖ అది. బ్యాంకు ఖాతాదారులతో చాలా రద్దీగా ఉందావేళ. పల్లెటూర్లో, పైగా ఏజెన్సీలో ఉన్న బ్యాంకు శాఖ కావడం మూలాన ఖాతాదారుల్లో చాలా మంది నిరక్ష్యరాస్యులే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక సౌలభ్యం ఇంకా వినియోగించుకొనే పరిస్థితిలో లేరు చాలామంది. చివరికి నగదు లావాదేవీల కోసం కూడా ఇప్పటికీ బ్యాంకు పైనే ఆధారపడుతున్నారు ఆ పల్లె ప్రజలు. చాలా మందికి ఏటిఎం వాడటం కూడా రాకపోవటం వల్ల బ్యాంకుకే వస్తున్నారందరూ. ఇక వర్షాకాలం మొదలవుతుందనగా ఖరీఫ్ ఋణాలకోసం వ్యవసాయదారులు కూడా ఆ రోజు పెద్ద సంఖ్యలో బ్యాంక్‌కి వచ్చారు.

ఫీల్డ్ ఆఫీసర్ భార్గవ, మేనేజర్ కుమార్ తమతమ విధుల్లో చాలా బిజీగా ఉన్నారు. తనవద్ద ఉన్న రైతులనుండి వివరాలు సేకరించి ఋణ దరఖాస్తు ఫారాలు నింపి వాళ్ళ వేలిముద్రలు తీసుకోవడంలో నిమగ్నమయ్యాడు భార్గవ. వాళ్ళకి ఆ ఋణం గురించిన వివరాలు చెప్పి ఒకొక్కరి పని పూర్తి చేసేసరికి చాలా సమయం పడుతోంది. పైగా వేలిముద్రలు తీసుకునే కార్యక్రమానికి కూడా చాలా సమయం పడుతోంది. ప్రతీ వేలిముద్ర వద్ద అది ఫలానా వ్యక్తిదని ప్రతీపేజీలోనూ రాసి సంతకం పెట్టాలి. పైగా వివరాలు అన్నీ ఆ నిరక్ష్యరాస్యుడైన ఋణగ్రహీతకు పూర్తిగా అర్ధమైనట్లు చదువుకున్న వాళ్ళెవరిచేతనైనా సాక్షి సంతకం తీసుకోవాలి. ఇన్ని తతంగాలు ఉండటం వల్ల ఒక్కో వ్యక్తి పని పూర్తవడానికి చాలా సమయం పడుతోంది. ఋణం తీసుకోబోయే వ్యక్తి అక్షరాస్యుడై ఉంటే మాత్రం ఇంత తతంగం అవసరం లేదు. పని కూడా వేగవంతమై ఉండేది..

అలా సాయంకాలం వరకూ పని కొనసాగుతూనే ఉంది ఏ మాత్రం అంతరాయం లేకుండా. పూర్తి చేసిన ఋణ దరఖాస్తులు అన్నీ మేనేజర్ కుమార్‌కి అందించాడు భార్గవ. అన్ని దరఖాస్తులు పరిశీలించి చూసిన కుమార్, "ఒక్క దరఖాస్తులోనూ సంతకాలు లేవు, అన్ని వేలిముద్రలే. ఏమిటి ఈ ఊళ్ళో ఎవరూ అక్షరాస్యులు లేరా? అందరూ నిరక్షరాస్యులేనా?" అని అడిగాడు భార్గవని.

"అవును సార్! ఇది ఏజెన్సీ ప్రాంతమేకాక ఈ చుట్టుపక్కల ఊళ్ళలో కూడా ఎక్కువమంది గిరిజనులే ఉన్నారు. ఊళ్ళో బడి ఉన్నా పిల్లల చదువులు కూడా అంతంత మాత్రమే. చదువు పట్ల పిల్లలకి శ్రద్ధ, ఆశక్తి లేవు. వాళ్ళ తల్లితండ్రులు కూడా ఆ విషయం పట్టించుకోరు. అలా తర్వాత తరంవాళ్ళు కూడా నిరక్షరాస్యులుగానే మిగిలిపోతారు. ఊళ్ళో చదువుకున్న వాళ్ళు చాలా కొద్దిమందే ఉన్నారు. ఇక్కడ స్కూల్‌లో పనిచేస్తున్న శివరాం అని అద్భుదయవాది అయిన ఉపాధ్యాడొకరు, వయోజనులకు చదువు నేర్పడానికి శతవిధాలా ప్రయత్నించి విఫలమైయ్యాడు. సాయంకాలం పెద్దవాళ్ళందరికీ చదువు చెప్పడానికి ప్రయత్నించాడు. ఎవరూ చదువు నేర్చుకోవడానికి శ్రద్ధ చూపలేదు. ఒకరోజు వచ్చినవాడు రెండో రోజు మరి ఇక రాడు. ఆఖరికి విసిగిపోయి తన ప్రయత్నం అర్ధాంతరంగా విరమించాడు అతను." అన్నాడు భార్గవ.

"అన్నీ వేలిముద్రలైతే చాలా ఎక్కువ సమయం పడుతుంది కదా! అంతే కాకుండా నిరక్షరాస్యులకు తను వేలిముద్ర వేసిన కాగితాల్లో ఉన్న వివరాలు అన్ని పూర్తిగా చెప్పాలి కూడా, వాళ్ళకు సందేహం లేకుండా. కష్టమైనే పనే." అన్నాడు కుమార్.

"అవును సార్! ఉదయం నుంచి కుర్చీలోంచి లేవకుండా ఇప్పటివరకూ ఓ ముప్ఫై ఫారాలు మాత్రమే నింపి వేలిముద్రలు తీసుకున్నాను మరి. ఈ లెఖ్ఖన మనవద్ద ఇప్పుడున్న దరఖాస్తులకు చాలా రోజులే పట్టవచ్చు." అన్నాడు భార్గవ.

భార్గవ మాటలు విన్న కుమార్ చిరునవ్వు నవ్వుతూ, "ఇక మనకా కష్టంలేకుండా మనమొక పని చేద్దాం. నా వద్ద ఓ ఉపాయం ఉంది. ఆ ఉపాయం ప్రయోగించి ఇంతకుమునుపు నేను మేనేజర్‌గా ఉన్న ఊళ్ళో మంచి ఫలితం సాధించాను. అది ఇక్కడ ప్రయోగిద్దాం. దాంతో అందరూ సంతకాలు చేయడమే కాక చదువు కూడా నేర్చుకుంటారు! నెల రోజులలో అంతా అక్షరాస్యులుగా మారతారు." అన్నాడు.

"అదెలా సాధ్యం సార్? ఇంతమందిని నెలరోజులలో అక్షరాస్యులుగా మార్చడమా? అసంభవం సార్!" కుమార్ మాటలు నమ్మలేక విస్మయంగా చెప్పాడు భార్గవ.

కుమార్ ఆ తర్వాత తను ఇంతకు పూర్వం పనిచేసిన ఊళ్ళో చేసిన ప్రయోగం గురించి వివరించిన తర్వాత, ఇక్కడ కూడా ఆ ఉపాయం ఫలిస్తుందేమోనని కొద్దిగా నమ్మకం కలిగింది భార్గవకి.

**** **** **** **** ****

విచిత్రంగా కొన్ని రోజుల తర్వాత వ్యవసాయ ఋణాలకోసం వచ్చినవాళ్ళు దరఖాస్తులపై వేలిముద్రలు వేయడం మాని సంతకాలు చేయడం ప్రారంభించారు. నెల రోజుల్లో రుణాలన్నీ మంజూరైన తర్వాత, మొదట దరఖాస్తు చేసినప్పుడు వేలిముద్రలు వేసినవాళ్ళు కూడా ఇప్పుడు లోన్ డాక్యుమెంట్లపై వేలిముద్రల బదులు సంతకాలు చేయడం మొదలుపెట్టారు.

అది చూసిన భార్గవ సంతోషంగా మేనేజర్ రూంకి వెళ్ళి, "సార్! మీరన్నట్లే ఇప్పుడు అందరూ తమ దరఖాస్తులపైనా, లోన్ డాక్యుమెంట్లపైనా సంతకాలు పెడుతున్నారు. ఇప్పుడు ఒక్కరు కూడా వేలిముద్ర లు వేయడం లేదు. నా పని చాలా సులభమైంది ఇప్పుడు." అన్నాడు.

"అయితే, మనం ఈ ఊళ్ళో బాగా అక్షరాస్యత సాధించామన్నమాట. వాళ్ళ అక్షరాస్యత కేవలం సంతకం వరకేనా, లేక చదవడమేమైనా వచ్చిందా?" అని కూమార్ హాల్లోకి వచ్చాడు భార్గవ వెంట.

అయితే అప్పుడే లోన్ డాక్యుమెంట్ సంతకం పెట్టబోతున్న ఒక రైతు ఆ కాగితా ల్ని కూడబలుక్కొని చదవడం గమనించాడు.

"వెల్! ఒక్క సంతకమే కాక, ఈ నెల రోజుల్లోనూ కూడబలుక్కోనైనా మన లోన్ డాక్యుమెంట్ చదవగలుగుతున్నారు. ఇకముందు ఇంకా సులభంగా చదివే స్థాయికి ఎదుగుతారని ఆశిద్దాం. మనం ఇంకొన్నాళ్ళలో వందశాతం అక్షరాస్యత ఈ ఊళ్ళో సాధించినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. చూసారా, ప్రభుత్వం ఏళ్ళ తరబడి కోట్లు ఖర్చు పెట్టి సాధించలేని అక్షరాస్యత మనం ఎంత సులభంగా సాధించగలిగామో?" అన్నాడు కుమార్ ఆనందంగా.

ఇంతకీ జరిగినదేమిటంటే, వేలిముద్రలు పెడితే లోన్ ఇవ్వడం కుదరదనీ, సంతకాలు మాత్రమే చెయ్యాలని, అలా అయితేనే ఋణం మంజూరు అవుతుందని తమకు పై నుంచి అంటే, బ్యాంక్ హెడ్ఆఫీస్ నుంచి ఆదేశాలు అందాయని అందరికీ చెప్పడం జరిగింది. గ్రామ ప్రజలందరూ అది సులభంగానే నమ్మారు. అందుకే అందరూ స్కూల్ మాష్టర్లని ముఖ్యంగా శివరాంని కలుసుకొని అర్జెంట్‌గా సంతకం నేర్చుకున్నారు. ఆనక పనిలోపనిగా చదవడం రాయడం కూడా నేర్చుకున్నారు.

"నిజంగా సార్! మనం ఎవరూ ఊహించని విధంగా ఈ ఊళ్ళో అక్షరాస్యత సాధించాం. చదువు రాకపోవడంవల్ల ఎక్కడైనా మోసానికి గురవడానికి ఆస్కారం ఉందని చెప్పడంవల్ల కూడా సంతకంతో పాటు చదవడం, రాయడంకూడా నేర్చుకున్నారు. పనిలోపనిగా శివరాం మాస్టర్‌గారి ఆశయం కూడా నెరవేరింది." అన్నాడు భార్గవ్.

ఇప్పుడు ఆ ఊళ్ళో మరి చదువురానివారెవరూ లేరు. విద్యయొక్క ప్రాముఖ్యాన్ని గ్రహించి తమ పిల్లల్ని కూడా ఇప్పుడు స్కూల్‌కి సరిగ్గా పంపి వాళ్ళ చదువులో శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టారు ఆ ఊరివాళ్ళు. ఒకప్పుడు అక్కడికి వార్తా పత్రికలు వచ్చేవి కాదు చదివేవారు లేక, ఇప్పుడేమో పేపర్ చదవడానికి జనం ఎగబడుతున్నారు. ఈ విధంగా గ్రామప్రజలని మార్చినందుకు శివరాం మాష్టర్‌తో సహా పలువురు కుమార్‌ని, భార్గవని అభినందించారు. ఊరి వాళ్ళు కూడా తర్వాత నిజం తెల్సుకున్నా, అది తమ మంచికే జరిగిందన్న సత్యం గ్రహించి తమ కోసం పాటుబడిన వాళ్ళని అభిమానించారు. ముఖ్యంగా చదువు రావడంవల్ల దళారులు, మధ్యవర్తులు, చేసే మోసాలు గుర్తించగలిగి తమని తాము రక్షించుకున్నారు. శివరాం మాస్టారివల్ల, భార్గవ, కుమార్ వలన తమకు మంచి జరిగినందుకు సంతోషించారు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు