బహుమతి - శింగరాజు శ్రీనివాసరావు

the prize

గత నలభై సంవత్సరాలుగా సాహితీరంగంలో తడిసి లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న వందనరావు ప్రస్తుతం కథలు వ్రాయడం వదలిపెట్టి ఆధ్యాత్మిక వ్యాసాలు వ్రాయడం మొదలుపెట్టాడు. కానీ ఎటొచ్చీ పత్రికలను కొనేవారుగానీ, ఆసక్తిగా చదివేవారు గానీ చాలా అరుదైపోయారు. ఆ పరిస్థితులే ఇటు రచయితలను, అటు పత్రికా నిర్వాహకులను క్రుంగదీస్తున్నాయి. రాబడి లేకపోవటం వలన ఎవరూ ఈ వ్యాసంగానికి చేరువకాలేకపోతున్నారు. మంచి రచయితలు కూడ దాదాపు తెరమరుగయిపోతున్నారు. వందనరావు చాలా మార్లు ఈ విషయమై అకాడమీ ఛైర్మన్ ల వద్ద చర్చించి ఏదైనా పరిష్కారం ఆలోచించమన్నాడు. ఆ సమయానికి చేద్దాం, చూద్దాం అన్నవారే గానీ, చేసినవారు లేరు. " ఏమండీ మీకు ఫోను " అంటూ మా శ్రీమతి అంజన సెల్ తెచ్చి నా చేతికిచ్చింది. " హలో ఎవరూ " " సార్. నేను ప్రభాకరాన్ని. అదే సార్ 'మన భాష' మాసపత్రిక సంపాదకుడిని. బాగున్నారా" " ఆ ప్రభాకరం గారా. భేషుగ్గా ఉన్నాను. ఎలా వుంది పత్రిక రొటేషన్? ఈ మధ్య మీ పత్రిక తరఫున ఏవో కథల పోటి నిర్వహిస్తున్నారని విన్నాను. ఎలా వుంది స్పందన?" " ఫర్వాలేదు సర్. పాతవారు కాస్త మందగించినా కొత్తకలాలు పుంజుకుంటున్నాయి. పైగా మీ అభిమానులు రచయితలుగా మారి బాగా స్పందిస్తున్నారు" " మంచిదేకదా! కొత్తనీరు వస్తే కొత్త ఉరవడి రూపుదిద్దుకుంటుంది. ఇంతకూ కాల్ చేసిన విషయం " " అదేసర్. మేము నిర్వహిస్తున్న కథలపోటీకి అంతిమ న్యాయనిర్ణేతగా మిమ్మల్ని ఎంచుకున్నాము సర్. మీరు కాదనరనే ప్రగాఢ విశ్వాసంతో" " మావన్నీ పాత ఆలోచనలు. వచ్చే కథల తీరు ఎలా ఉంటుందో. యువతరం శైలి భిన్నంగా ఉంటుంది. పైగా ఎక్కువగా ఆంగ్ల పదాలని ఉపయోగిస్తారు. వద్దులెండి. కొత్తగా వస్తున్న రచయితలనెవరినైనా అడగండి" " అలాటివాటిని అన్నింటిని పక్కన పెట్టేశాం. మొదటి రెండు వడపోతలు పోగా మీ వద్దకు ఒక ఇరవై కథలు పంపుతున్నాను. వాటిలో అయిదు కథలను గుర్తించండి. వాటికే బహుమతులు" " సరే మీ ఇష్టం " అని తన అంగీకారాన్ని తెలిపాడు వందనరావు. " ధన్యవాదములు సర్. నింపాదిగా చదవండి. తొందరేమి లేదు. ఉంటాను సర్" అని ఫోను పెట్టేశాడు ప్రభాకరం. ************ పరిశీలనకు వచ్చిన కథలను చదువుతున్నాడు వందనరావు. కథకు సంబంధించిన నియమాలు ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. కాని రచనా శైలి మాత్రం ఒకరిని మించి ఒకరిది అద్భుతంగా ఉంది. ఎదురెదురుగా నిలబడి మాట్లాడుతున్నారా అన్నంత సహజంగా ఉంది. ఎక్కడా అతిశయోక్తి కనిపించలేదు. "మా కాలంలో ప్రతి రచనలో కొంత నాటకీయత ఉండేది. ఊహల్లో విహరించేవాళ్ళం. ఇప్పుడు అంతా సహజత్వం. నా ఊహ తప్పు. యువరచయితలు అభినందనీయులు" అనుకున్నాడు మనసులో. అన్ని కథలలోకి ఒక కథ అతని మనసును కలచివేసింది. అది " అమ్మకానికో అమ్మ ". శీర్షికే చాలా చిత్రంగా అనిపించింది. ఎవరైనా పోషించలేక పిల్లలను అమ్ముకుంటారు. ఇదేమిటి విచిత్రంగా అనిపించింది. కథ చదువుతుంటే అప్రయత్నంగా అతని కళ్ళవెంట కన్నీరు కదలాడింది. " తల్లిని సాకలేక కొడుకు ఆమెను అమ్మకానికి పెడతాడు. ఆ ప్రకటన చూసి ఒక ఇంజనీరు ఆమెను కొనడానికి ముందుకు వస్తాడు. అతనికి చిన్నతనంలోనే తల్లి చనిపోతుంది. బాధ్యతలేని తండ్రి పాలనలో పెరుగుతాడు. తన తెలివితేటలతో ఉద్యోగం సంపాదించుకుంటాడు. కాని అమ్మప్రేమ కోసం పరితపిస్తూ ఆ ప్రకటన చూసి ముందుకు వస్తాడు. ఆ ముగ్గురి మధ్య జరిగే సంభాషణ హృదయాలను కదిలించి వేస్తుంది. అంతర్మథనానికి గురయిన ఆమె ఎటూ తేల్చుకోలేక ఒత్తిడికి గురై కన్నుమూస్తుంది" ఆద్యంతం ఉత్కంఠ భరితంగా కథను నడిపించిన తీరు అమోఘం. వెంటనే రచయితకు ఫోను చేసి అభినందనలు చెప్పాలనుకున్నాడు. కానీ తన వద్దకు ఎవరి వివరాలు రావు. క్రమసంఖ్యతో కథలు తప్ప. దానికి మొదటి నెంబరు ఇచ్చాడు. తరువాత మరికొన్ని కథలను గుర్తించి వరుసగా పది నెంబర్లను ఇచ్చి ప్రభాకరానికి పంపించాడు వందనరావు. మంచి కథలను ఎంపిక చేశానని తృప్తిపడ్డాడు. 'మంచి కథలే వస్తున్నాయి ఇప్పుడు కూడ. వర్ధమాన రచయితలు మూసలో కాకుండా భిన్నంగా ఆలోచిస్తున్నారు. సాహిత్యానికిది మంచి పరిణామం' అనుకున్నాడు వందనరావు ******* ఉదయాన్నే ఫోను రింగవడంతో ఎవరా అని చూశాడు వందనరావు. ఎడిటర్ ప్రభాకరం. " హలో ప్రభాకరం. న్యాయనిర్ణయం బాగుందా. మంచి కథలనే ఎంపిక చేశానా?" అడిగాడు వందనరావు " నమస్తే సర్. మీరు చేస్తే ఇక దానికి తిరుగుంటుందా సర్. కాకపోతే మా వలన ఒక చిన్న పొరపాటు జరిగింది. మా పత్రికకు చందా కట్టినవారిని మాత్రమే పోటీలో పాల్గొనమన్నాము. కానీ మా ఆఫీసులో జరిగిన పొరపాటు వల్ల ఒక కథ ఎంపిక కావలసిన జాబితాలోకి వెళ్ళిపోయింది. ఆ కథను మీరు మొదటి బహుమతికి ఎంపిక చేశారు. ఆ రచయిత మా చందాదారుడు కాదు. ముందే గుర్తించివుంటే ఆ కథను పోటీకి తీసుకునేవాళ్ళం కాదు. ఇప్పుడు మా నియమం తప్పించి చేయకూడదు కదా. పైగా అతని పేరు ఎక్కడా ఇంతవరకు తగలలేదు. కొత్త రచయితలా వున్నాడు. మీతో ఒక మాట చెప్పి, దానిని తొలగించి, మిగిలిన కథలను మీరిచ్చిన వరుసలోనే మొదటి అయిదు కథలకు బహుమతి ప్రకటిస్తాం. మీ అభిప్రాయం" వినయంగా అడిగాడు ప్రభాకరం. ఒక్క క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు వందనరావుకు. ఏమిటీ నియమాలు విచిత్రంగా. అంటే చందాలు కట్టే స్తోమతు లేనివాడు కథలు వ్రాయకూడదా. ఏమిటీ వింత ధోరణి? ఎటు పోతున్నది సాహిత్యరంగం. ఏం చెప్పాలి? " సార్. ఏమంటారు" మరల అడిగాడు ప్రభాకరం. " మీరు చేసిన తప్పిదానికి ఒక రచయిత బలి కాకూడదు. అతని రచన జనాలకు అందకుండా ఆగిపోకూడదు. మీ పద్థతి ప్రకారం బహుమతులు ప్రకటించండి. కానీ అతని కథను న్యాయనిర్ణేత అందిస్తున్న బహుమతి కింద ప్రకటించండి. మీ మొదటి బహుమతి విలువతో సమానంగా నా బహుమతిని ప్రకటించండి. ఆ సొమ్ము నేను పంపుతాను. నా మీద గౌరవముంచి ఆ కథను మాత్రం ప్రచురించండి. ఇది మీ నిబంధనలకు వ్యతిరేకం కాదనుకుంటాను. పైగా ఇతర రచయితలకు తెలిసే అవకాశం ఉండదు. అతని చందా నేను కడతాను. ఇకనుంచి అతను మీ చందాదారుడే. ఎలాగైనా ఆ కథ వెలుగులోకి రావాలి " గడగడ చెప్పేశాడు వందనరావు అటువైపు నుంచి ఒక్క క్షణం నిశ్శబ్దం. " సార్. మీకు ఎందుకు నష్టం. మీరంతగా చెప్తున్నారు కాబట్టి, ఎలాగోలా మేనేజ్ చేస్తాను" " వద్దండి. మీరు నిబంధలను తప్పవద్దు. ఇది నా తృప్తికోసం. ఒక మంచి రచయితను లోకానికి పరిచయం చేస్తున్నాననే ఆత్మతృప్తి. అంతే. ఉంటాను." " మీరింతగా చెప్పిన తరువాత కాదంటామా సర్. మీ వదాన్యతకు శిరసువంచి నమస్కరిస్తున్నాను. ఇక భవిష్యత్తులో ఇలాంటి నిబంధన పెట్టము సర్. తప్పు తెలిసివచ్చింది. మీ నిర్ణయం మాలోపాన్ని ఎత్తి చూపింది. మీ సహాయానికి ధన్యవాదములు. ఉంటాను సర్." అని ఫోను పెట్టాడు ప్రభాకరం. 'నా నిర్ణయం తప్పు కావచ్చేమో గాని. నా ఆశయం తప్పుకాదు. మంచి కలాలెప్పుడూ అజ్ఞాతంగా ఉండకూడదు. అవి ఎప్పుడూ కదులుతూ సమాజాన్ని సరిదిద్దుతూ ఉండాలి' అనుకున్నాడు వందనరావు

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు