భారతదేశానికి చిరునామా - అఖిలాశ

Address to India

ఈ బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. మీటింగ్ కి వెళ్లగలనో లేదో టెన్షన్ టెన్షన్ గా ట్రాఫిక్ లైట్ వైపు చూస్తున్న. ఇంతలోనే ఒక అమ్మాయి కారు అద్దాలను కొడుతూ పెన్నులను చూపించింది. కారు అద్దాలు తెరవకుండానే వద్దు వద్దు అన్నాను. తానేమో తాజా నవ్వులను ముఖంపై ధరించి మరొక సారి కారు అద్దాలను తట్టింది. ఆ అమ్మాయి నవ్వు చూసి నా టెన్షన్ మొత్తం వెళ్ళిపోయింది. కారు అద్దాలు కిందికి దించి పెన్నులు వద్దు అన్నాను.

మేడం ప్లీజ్.., కనీసం రెండు పెన్నులైనా కొనండి. మీ పిల్లలకు ఉపయోగపడతాయని గుక్క తిప్పుకోకుండా ఇంగ్లీష్ లో మాట్లాడింది.

నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పెన్నులు అమ్ముకునే అమ్మాయి ఇంత చక్కగా ఆంగ్లం మాట్లాడటం నేనెక్కడా చూడలేదు. వెంటనే రెండు పెన్నులను తీసుకొని ఇరవై రూపాయలు డబ్బులు ఇచ్చాను.

‘నువ్వు ఇంత చక్కగా ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నావు? చాలా బాగా మాట్లాడుతున్నావు.’

మేడం నేను డిగ్రీ పూర్తి చేశాను. చదివింది మొత్తం ప్రభుత్వ బడిలోనే. నాకు ఆంగ్లం అంటే ప్రాణం, అందుకే నేనే స్వయంగా మాట్లాడటం నేర్చుకున్నాను. మీ లాంటి వారితో ఎక్కువగా మాట్లాడటం కూడా నాకు చాలా ఉపయోగపడిందని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పింది.

మరి నీవు.., ఏదైనా ఉద్యోగం చేయవచ్చు కదా అని అడిగాను.

మేడం నాకు అంత సమయం ఉండదు. పొద్దునే లేచి ఇంటి పనులు చేసి ఇలా బయటకు వస్తాను. కొద్ది పెన్నులు అమ్ముకొని మళ్ళీ నేను కోచింగ్ కి వెళుతున్నాను. సాయంత్రం పూట మా బస్తీలో చదువురాని పిల్లలకు, పెద్దలకు చదువు చెప్తానని ఏమాత్రం తడబడకుండా ఆంగ్లంలో సమాధానం చెప్పింది.

అవునా! నువ్వు ఏం కోచింగ్ చేస్తున్నావని అడిగాను. తాను సమాధానం చెప్పే లోపు గ్రీన్ లైట్ పడటంతో మేడం బై.., బై మరొక సారి కలిసినప్పుడు మిగిలిన వివరాలు చెప్తానని నవ్వుతూ సమాధానం చెప్పింది.

నేను.., ఆ అమ్మాయిని జీవితంలో మర్చిపోలేను. ఆ నవ్వు, ఆత్మవిశ్వాసం, సహాయ గుణం, తన చుట్టూ ఉన్నవారికి చదువు చెప్పడం లాంటి లక్షణాలు నన్ను ఆ అమ్మాయికి చాలా దగ్గరగా చేశాయి.

అటువైపు వెళ్ళినప్పుడల్లా ఆ అమ్మాయి వస్తుందేమోనని వెతుకుతూనే ఉంటాను. ఆ తర్వాత ఎప్పుడూ కనపడలేదు. అంత సేపు మాట్లాడి కూడా కనీసం ఆ అమ్మాయి పేరు కూడా అడగలేదని నన్ను నేను ఎన్నో సార్లు తిట్టుకున్నాను.

ఒకరోజు పత్రిక చదువుతూ ఉండగా పెన్నులు అమ్మే ధరణి IASలో తొమ్మిదవ ర్యాంకు సాధించిందని పెద్ద హెడ్డింగ్ తో చూశాను. ఒక్కసారిగా నా కన్నుల్లో సముద్రం పొంగింది.

తన చిరునామా అడగలేదని బాధపడ్డాను. ఇప్పుడు తన చిరునామా భారతదేశానికి తెలుసు.

ఆంగ్ల మూలం : నీతి చిబ్

స్వేచ్ఛానువాదం : అఖిలాశ

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.