నిశీధి నిశ్శబ్ధం - సువర్ణ మారెళ్ళ

mid night silence

"నిశీధి నిశ్శబ్దం" అది ఒక చిన్న పల్లెటూరు.ఆ ఊరికి సెంటరుగా చెప్పుకునే ఆ స్థలంలో ఒక టీకొట్టు, ఒక కిళ్లీ కొట్టు, వాటికి ఆనుకుని కూర్చోడానికి వీలుగా చప్టా ఉన్న పెద్ద రావి చెట్టు. అది బాగా గిరాకీ ఉండే సమయం అవడంతో టీ కొట్టు నిండా బెళ్ళం చుట్టూ చేరే చీమల్లా జనం మూగి ఉన్నారు. ఆ టీ కొట్టుకు ప్రక్కన కాస్త దూరంలో ఓ మూల మట్టి కొట్టుకుపోయిన బట్టలు, జడలు కట్టిన జుట్టు తో ఒక పాతికేళ్ల అమ్మాయి గాలిలో చేతులను వింతగా తిప్పుతూ, తనలో తనే ఏదో మాట్లాడుకుంటూ మధ్య, మధ్య బిగ్గరగా అరుస్తూ అందరి మధ్య ఉన్నా తన లోకంలో తాను ఉంది. దుమ్మ కొట్టుకు పోయినా కూడా, అక్కడక్కడ మబ్బుతునకలు అడ్డువచ్చిన నిండు చద్రుడిలా ఉంది ఆమె ముఖం. ఆడతనం ఉట్టిపడేలా సొగసులు, అమ్మతనంకి నిదర్శనంగా ఎత్తుగా తొమ్మిది నెలల కడుపు. ఎక్కడినించి వచ్చిందో,ఎప్పుడు వచ్చిందో తెలీదు కానీ వచ్చిన దగ్గర నుంచి ఆ ఊరు వాళ్లు ఆమెకు పెట్టిన పేరు పిచ్చితల్లి. అలా గంటలు గడిచాయి.టీ కొట్టు దగ్గర సందడి తగ్గింది. పనిలోకి వెళ్ళే వాళ్ళు వెళ్లి పోయారు.వయసు మళ్ళిన ముసలాళ్లు, పనికి పోనీ పోకిరిగాల్లు రావి చెట్టు చప్ట మీద చేరి కాలక్షేపం చేస్తున్నారు. ఉన్నట్టుండి పిచ్చి తల్లి గట్టిగా పొలికేకలు పెడుతూ బాధతో విలవిలాడటం మొదలు పెట్టింది. ఆ చుట్టు పక్కల జనాలుకు అవి పురిటి నొప్పులు అని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. క్షణాల్లో అక్కడకి ఇద్దరుముగ్గరు ఆడవాళ్ళునీ ,మంత్రసానిని పిలిపించారు. గడియారంలో పెద్ద ముళ్ళు అన్నీ అంకెలను పలకరించి మళ్ళీ తన స్థానం చేరేటప్పటికి ఆ పిచ్చి తల్లి ప్రసవం అయిపోయింది. బొడ్డుతాడు తో పాటు ఆ తల్లీ బిడ్డల బంధం కూడా తెగిపోయింది.ఆ పసికందు చక చక చేతులుమారి సంతు లేని వారికి సొంతమయ్యి పోయింది. ఋతువులు మారాయి. పిచ్చీతల్లి మళ్ళీ నెలతప్పింది. ఆమె వేవిళ్ళు ఎవరూ గుర్తించక పోవచ్చు కానీ వెలుపలికి వస్తున్న కడుపు ఎన్నాళ్ళు ఆగుతుంది. రోజూ ఆమెకు దయతలచి పెట్టే పట్టెడు అన్నం ఆమె కడుపులో నలుసు కోసం ఇప్పుడు పరిమాణం పెరిగింది. అస్తవ్యస్తంగా ఉన్న ఆమె మస్తిష్కం అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆ కారణంగా ఆమెకు, ఆమె మోస్తున్న మరో ప్రాణానికి ఆపద రాకుండా..కూడు,గుడ్డకి కడుపులో బిడ్డకి ఏ లోటు లేకుండా చూస్తున్నారు ఆ ఊరి జనం. ఆమె ఎవరికి ఏమి కాకపోయినా ఆ ఊరివారికి ఆమెతో ఏదో సాంగత్యం కుదిరింది. ఆమెకు ఎవరు చేయగల సాయం వారు చేస్తున్నారు."అయ్యో పాపం పిచ్చితల్లి!" అంటూ కరుణ రసం కురిపిస్తున్నారు. కానీ...కానీ ఒక్కరూ, ఒక్కరంటే ఒక్కరూ ఆమె అసహాయతని కాకుండా ఆడతనాన్ని మాత్రమే చూడగలిగిన ఆ మదాంధుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. చేయ్యాలనుకొలేదు. ఏ సడిలేని శరత్ రాత్రిలోనో, ఏ నిశీధి నిశ్శబ్దంలోనో ఆమె నిస్సహాయతను ఆసరాగా ఆమెను అనుభవించిన ఆ దుర్మార్గుడు ఎవరో ఎవరకీ అక్కర్లేదు. పాపం పిచ్చి తల్లి ఆ దుర్మార్గుడి చర్యలకు ఎంత పెనుగు లాడిందో, వదిలేయమని ఆమె మనసు ఎంత పరితపించి ఉంటుందో. ఆమె అనుభవిస్తున్నది అకృత్యమని తెలుసుకునే మానసిక స్థితి ఆమెకు లేక పోయినా, అంతరాంతరాలలో ఆమె ఆడ మనసు ఎంత కుమిలి పోయి ఉంటుందో ఎవరికీ అక్కరలేదు. మానవత్వం అంటే అవసరాలు తీర్చడం మాత్రమేనా? అసలు అవసరం అంటే ఏమిటి? కడుపు నిండా అన్నం, కప్పుకోవడానికి ఆస్ఛాదనం అంతేనా? ఆమె మనసుతో ప్రమేయం లేకుండా ఆమెను అనుభవించిన ఆ మానవ మృగాన్ని కనిపెట్టి శిక్షించడం, ఆమెకు ఆ స్థితి రాకుండా రక్షించడం అవసరం కాదా? కాదనే వారి ఉద్దేశం కాబోలు. ఎందుకంటే ఆమె మనసులో మధించే ఏ భావాలను వ్యక్తం చెయ్యలేని ఆమే దుస్థితి అందుకు కారణం కాబోలు. కనీసం కాలగమనంలో ఆమె కాలరాసి పోయె లోపు ఆమె మనసు అంతరాతరాల్లో నిగూఢంగా నిక్షిప్తమైన నిశ్శబ్దంని చేదించి, ఆమెకు స్వాంతన కలిగించే రోజు కోసం ఎదురు చూద్దాము. **** **** **** ప్రముఖ న్యూస్ పేపర్ లో "ఇది కథ కాదు" శీర్షికలో రాసిన ఈ కథనంని చదివి వాణి పేపరు మడిచి ప్రక్కన పెట్టింది. ఆ వార్త చదివిన ఆమెకు మనసు ద్రవించింది. ఎప్పటి నుంచో స్త్రీ పునరావాస కేంద్రమును సమగ్రంగా నడుపుతున్న ఆమెకు, ఆ పిచ్చి తల్లి ఉన్న ఊరుని కనుక్కొని, ఆమెను సురక్షితమైన స్థలం కి తీసుకు రావడం పెద్ద కష్టం కాలేదు. అలాంటి కథనం ప్రచురించడం ద్వారా ఇంత మంచి కార్యానికి దారి తీసిన ఆ జర్నలిస్టుకి, వాణీ ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందనలు అందించింది. ****** స్వస్తి******

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.