మనం ఎంతో ప్రగతి సాధించాం అని రాజకీయ నాయకులు అంటుంటే సాధించామేమో అనుకునేవాడ్ని, నా చిన్నప్పటి కంటే ఎంతో మెరుగైన రోడ్లు, కంప్యూటర్లు, కార్లు, బైకులు, సీడీలు, డీవీడీలు, నెట్, స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ కెమెరాలు అందుబాటులోకి రాగానే. కానీ నా కళ్ళు తెరిపించి మన ప్రగతి ఎక్కడుందో! ఎలా వుందో చూపించి నన్ను తీవ్రంగా కదిలించిన ఒక సంఘటన మీకు చెబుతాను.
ఈ మధ్యే ఇంజనీరింగ్ ఫైనల్ పరీక్షలు అయ్యాక మా అమ్మమ్మ గారి వూరు కలమళ్ళ అనే గ్రామానికి వెళ్లాను నా స్నేహితులతో కలిసి ఆవూరికి చాలా దగ్గరలోనే వున్న థర్మల్ పవర్ స్టేషన్ చూడటానికి. థర్మల్లో బాగా తిరిగాం, మళ్ళీ సాయంత్రం కలమళ్ళ కు 10 కిలోమీటర్ల దూరంలో వున్న ప్రొద్దుటూరు కు వెళ్లి మామయ్య కొడుకు ప్రశాంత్ నా స్నేహితులు కలిసి సినిమా చూసి, అక్కడే హోటల్లో భోంచేసి వచ్చాం. బాగా రోజంతా తిరగడం వలన బాగా అలిసి నిద్రపోయాం. నిద్రలో ఎవరిదో ఏడుపు వినిపించి లేచా... కలలోనేమో అనుకున్నా కానీ అది నిజం అని మరింత బిగ్గరగా వినిపించిన ఆ ఏడుపు ఒక చిన్న అబ్బాయిదిలా అనిపించింది. అక్కడ కరెంటు రోజుకి 6 గంటలు మాత్రమే ఉంటుంది. రాత్రి ఎప్పుడో కరెంటు పోయింది మొద్దు నిద్రలో తెలియలేదు. ప్రశాంత్ ను నిద్రలేపి అడిగా "ఎవరిదో ఏడుపు వినపడుతోందిరా !" ఇద్దరం బయటికి వచ్చాం.
మామయ్య ఇంటి ప్రక్కనే వున్న ఇంట్లో నుండి వస్తున్నఏడుపు విన్నాం, ఇద్దరం తలుపు కొట్టాం... ఒక ముసలావిడ తలుపు తీసింది... చీకట్లో మాకేమీ కనపడలేదు కానీ అబ్బాయి కేకల్లాంటి ఏడుపు వినపడింది. "ఎవరు ఏడ్చేది అవ్వా?" ప్రశాంత్ గట్టిగా అరిచాడు.
"మధుసూదన... ప్రశాంతు... మధ్యానం మాంసం దండిగా తిన్నాడు కడుపు నొప్పి అని అరుస్తున్నాడు. వీడికిది మామూలే పో నాయనా కాసేపుంటే తగ్గిపోతాది... అదుపులేకుండా మెక్కుతాడు... ఏడుస్తాడు... మీరు పొండి పడుకో పొండి" అంది ముసలామె. అంతలోపల వాడి ఏడుపు కూడా ఆగిపోయింది.
మేము వచ్చి పడుకున్నాం... బాగా వేడిగా వుంది నిద్రపట్టలా... రెండేళ్ళ క్రిందట మా ప్రక్కింట్లో కడుపు నొప్పని... హాస్పిటల్ కు తీసుకుపోయే లోపల చనిపోయిన పాతికేళ్ళ వ్యక్తి గుర్తుకొచ్చాడు, మనసు అలజడిగా వున్నా... మామూలు కడుపు నొప్పేలే ఉదయం కూడా అలాగే వుంటే డాక్టర్ దగ్గరకు తీసుకుపోవచ్చులే అని సర్ది చెప్పుకుని నిద్రలోకి జారుకున్నానో లేదో... మళ్ళీ పిల్లాడి ఏడుపు... ఈ సారి నేను ప్రశాంత్ ను లేపకుండా వెళ్లి పోయా... తలుపులు తీసి వున్నాయి... గుడ్డి వెలుతురులో మంచంమీద పిల్లాడు మెలికలు తిరుగుతున్నాడు. కేకలు కూడా గొంతు దాటి రాకున్నాయి. నా మనసేదో కీడు శంకించింది. ఇద్దరు పదేళ్ళ లోపు ఆడపిల్లలు బిక్క మొహాలు వేసుకుని చూస్తున్నారు. ముసలామె గ్లాసుతో నిమ్మకాయ నీళ్ళు పట్టుకుని వుంది... పిల్లాడు ఒక రకమైన మగతలో వున్నాడు.
"వీళ్ళ అమ్మానాన్న ఎక్కడున్నారు?" అడిగా ముసలామెను.
"వాళ్ళూర్లో వున్నారు... నా కూతురు పిల్లలు, పండక్కి పిలుచు కొచ్చా... వీడికి మాంసం అంటే మహా ఇది... అందుకని తెచ్చి పెట్టా" ఏడుపు గొంతుతో అంది ముసలామె.
వాడ్ని భుజానికి వేసుకుని "ప్రశాంత్... కారు తీరా "అన్నా.
చీకటి వున్నా నా సెల్ లైట్ వేయడం తో ప్రశాంత్ లేచి కూర్చున్నాడు. మా హడావుడికి మిగతా స్నేహితులు లేచారు. అత్తయ్య ఇనో త్రాపించేదానికి ప్రయత్నించింది ... కానీ వాడు త్రాగలేకపోయాడు. ఇంకా లాభం లేదనుకుని నలుగురం మామయ్య ఇన్నొవాలో ప్రొద్దుటూరు బయలుదేరాము. "ప్రశాంత్... అట్ మోస్ట్ స్పీడ్" అన్నా. నా చేతుల్లో పిల్లాడు మూల్గుతున్నాడు వాడి కళ్ళు తెలిపోతున్నాయి. నాకు దు:ఖం ఆగడం లేదు. ఏదో జరుగుతోందని అన్పిస్తోంది. చిమ్మ చీకట్లో ప్రశాంత్ సాధ్యమైనంత వేగంగానే ప్రొద్దుటూరు తీసుకొచ్చాడు. కనిపించిన ఒక హాస్పిటల్లోకి పోయాం. అందరు నిద్రలోవున్నారు పిల్లాడ్ని గదిలోకి తీసికెళ్ళి ఏదో ఖాళీగా వున్న మంచం పై పడుకోబెట్టి "డాక్టర్ ఎక్కడ?" అడిగాం.
"డాక్టర్ ఇంటికి వెళ్ళాడు", చెప్పాడు అక్కడి కాంపౌండర్.
"అత్యవసర కేసులు అన్ని వేళల చూడబడును అని బోర్డ్ పెట్టారు కదా డాక్టర్ ను పిలు" అన్నాను.
"తిడతాడు సార్" అన్నాడు వాడు నిర్లక్షంగా.
"నేను చంపుతాను... పిలవకపోతే, పిల్లాడికి ప్రాణం మీదికొస్తే డాక్టర్ని పిలవ్వా?" ప్రశాంత్ వురిమాడు.
వాడు ఫోన్ చేసి "ఎత్తడం లేదు" అన్నాడు.
నంబర్ చూసి ప్రశాంత్ తన సెల్ తో చేశాడు ఆ నంబర్ నుండి సమాధానం లేదు, ఫోన్ ఎత్తడం లేదు.
"ఇది డాక్టర్ నంబరేనా?" వురిమాడు ప్రశాంత్ కాంపౌండర్ ప్రక్క చూస్తూ.
"అవును సార్" అన్నాడు వాడు వణికి పోతూ
"డాక్టర్ ఇల్లెక్కడ?"
"నాకు నిజంగా తెలియదు సార్... ఆయన ఉదయమే వస్తుంటాడు, రాత్రికి వెళ్లి పోతాడు" ఏడుపు గొంతుతో అన్నాడు.
"వురేయ్... దీపూ వాడ్ని ఎత్తుకోరా... వేరే హాస్పిటల్ కు పోదాం... గబ్బునా కొడుకులు వీళ్ళు డాక్టర్లు కాదురా ఛీ... ఛీ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడునా?... మా వానికి ఏమైనా గానీ... రేపు మీ డాక్టర్ వున్నప్పుడు... వస్తా వాడికుంది, నా చేతిలో" అని బయట వున్న బోర్డును కాలితో తన్ని విసిరేశాడు ... ఇంకో హాస్పిటల్లో అదే పరిస్థితి... బయట బోర్డ్ మాత్రం 'అన్ని వేళల చూడబడును' అనే వుంది. ఎక్కడా డాక్టర్ లేడు. పిల్లాడ్ని కనీసం చూసేదానికి ఎవరూ లేరు. నర్సు వుంది అడ్మిట్ చేసుకోమంటే వాడి పరిస్థితి చూసి "ఇది సీరియస్ కేసు అడ్మిట్ చేసుకుంటే ఏమైనా అయితే అమ్మో మా డాక్టర్ తిడతాడు" అంది.
గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకి వచ్చాం, కౌంటర్ ఏది, క్యాజువాలిటి ఏది, అని చూసుకోకుండా నా చేతులతో వాడ్ని ఎత్తుకుని పరిగెత్తా... అడ్డంగా ఒక నర్సు వచ్చి "ఎక్కడికి పరిగెత్తుతున్నారు?" అని అడిగింది, చాలా క్రిటికల్ గా ఉంది అబ్బాయికి, డాక్టర్ ఎక్కడ? అని అడిగాను.
ప్రశాంత్ వెంట వచ్చిన బక్క డాక్టర్ వచ్చి ప్రశ్న వేశాడు "ఏమయ్యింది?" అని ప్రశాంత్ ఏదో చెప్పాడు.
వెంటనే క్యాజువాలిటి లో అడ్మిట్ చేసి, ఆక్సిజన్ పంప్ చేసారు, ఒక ఇరవై సెకండ్లు కళ్ళు తెరిచి గట్టిగా మూలిగాడు, ఉన్నట్లు ఉండి రియాక్షన్ ఆగిపోయింది, నా చేతులతో వాడి కాళ్ళు పట్టుకుని రుద్దుతున్నాను, డాక్టర్ నాడి చెక్ చేసి పల్స్ ఆగిపోయింది అన్నాడు. చుట్టు పక్కన, అడ్మిట్ అయిన ఒక్కో పేషెంట్ కి ఒక్కో రోదన, ఆవేదన... నాకు మాత్రం సమయం స్థంబించిపోయింది.
మెదడులో... అంతులేని భావోద్వేగాలు ఒకేసారి పరిగెత్త సాగాయి. క్రోధం, ఆవేశం, అసహ్యం...
ఆక్సిజన్ మాస్క్ తీసి మాకు అప్పగించారు, కొన్ని క్షణాల ముందు నా చేతులకి వాడి స్పర్శ తెలిసేది. ఇపుడు తెలియకుండా అయిపొయింది.
పిల్ల వాడి కేసి చూశాను. పాల బుగ్గల మెరుపు తో వాడు రబ్బరు బొమ్మలా వున్నాడు. సాయంత్రం వరకు కేరింతలు కొట్టిన వాడు రాత్రికి శవం అయాడు. నేను నమ్మ లేకపోతున్నా.
పేదరికం తో తిండి లేక చచ్చేవాళ్ళు వున్నారు ఈ దేశం లో... ఎప్పుడో దొరికే మాంసం పై ఆశతో ఎక్కువ తిని కూడా చచ్చిపోతారా? వీడు నిజంగా చచ్చి పోయాడా? వీడి అవ్వకు ఏమి చెప్పాలి? ఆమె వీడి అమ్మా నాన్నకు ఏమి చెబుతుంది?
కళ్ళముందు ఒక పసివాడి ప్రాణం పోతుంటే ఏమీ చెయ్యలేక పోయాం... గట్టిగా అరిచాను... వీడు చావ లేదురా... డాక్టర్లు చంపారురా! మన వరకు వస్తే కానీ జరుగుతున్న అన్యాయాలు మనకు కనపడవు. అర్థరాత్రులు జబ్బులొస్తాయని కానీ, డాక్టర్ల దగ్గరికి పోతే వాళ్ళు లేకపోయినా, సరైన సమయంలో వైద్యం చేయకపోయినా ప్రాణాలుపోతాయి. డాక్టర్ల నిర్లక్ష్యం ఖరీదు "ప్రాణం".
నా చిన్నప్పుడు నాకు ఆస్తమా వస్తే మా అర్థరాత్రి చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి తీసికెళ్ళేది. అంటే డాక్టర్లు ఆ సమయానికి లేకపోతే నా ప్రాణాలు కూడా పోయేవి. వాడి అమ్మ వుంటే వెంటనే మా అమ్మలాగే వాడ్నికాపాడుకునేది... దు:ఖం కంటే ఆక్రోశంతో నా గుండెలు అదిరిపోయాయి. అప్పుడే వెళ్ళి ఆ డాక్టర్లను అరెస్టు చేసి ఉరిశిక్ష విధించాలని నాకు అనిపించింది.
ప్రశాంత్ అక్కడే కూలబడ్డాడు. వాడి గొంతులోనుండి గట్టిగా ఏడుపు. "వురేయ్ దీపు వాడు నిజంగా చచ్చిపోయాడా?" ప్రశాంత్ ఏడుస్తున్నాడు. మిగతా స్నేహితులు కాసేపు మౌనం వహించి, మళ్ళీ కదిలి మమ్మల్ని సమీపించి లేపి.
"ప్రశాంత్... ఫోన్ చేసి మీ నాన్నకు చెప్పి ఆ పిల్లాడి తల్లిదండ్రులకు చెప్పమను"
నేను ప్రశాంత్ ఏమీ ఆలోచించే పరిస్థితిలో లేము... ఏమీ చేసే స్థితిలో కూడా లేము.
వినోద్ ప్రశాంత్ ఫోన్ తీసుకుని ప్రశాంత్ నాన్నగారికి ఫోన్ చేశాడు.
మాకు ఆ దు:ఖంలో సమయమే తెలియలేదు. చూస్తుండగానే వరుసగా కార్లు, జీపులు, ట్రాక్టర్లు వచ్చాయి. వాడి అమ్మానాన్నల ఏడుపు, పల్లె నుండి ప్రశాంత్ నాన్న గారితో వచ్చిన ముసలావిడ ఏడుపు అక్కడ ప్రతిద్వనించింది.
పిల్లాడి శవాన్ని తీసుకుని వాళ్ళు వాళ్ళ వూరికి వెళ్లి పోయారు.
"రారా దీపు పోదాం, రండి రా" అని అందర్నీ ఇన్నోవా ఎక్కమన్నాడు ప్రశాంత్.
ప్రశాంత్ పిల్లాడ్నిఅడ్మిట్ చేసుకోని హాస్పిటల్ కు వెళ్ళి ఇన్నొవాలొ వున్న దుడ్డుకర్ర తీసుకుని హాస్పిటల్ అద్దాలు ద్వంసం చేశాడు. మిగతా వాళ్ళం కూడా చేయి కలిపాం. ఇంకో హాస్పిటల్లో డాక్టర్ కు ఫోన్ చేసినా రానందుకు అక్కడి డాక్టర్ క్యాబిన్ రూం ను ద్వంసం చేశారు ప్రశాంత్ వినోద్. అసలిలాంటివి నచ్చని నేను సైతం ఆవేశం లో ఆక్రోశం లో అక్కడున్న కుర్చీని తీసుకుని ఖాళీగా వున్న గదుల అద్దాలన్నీ పగల గొట్టాను. హాస్పిటల్లో వున్న పేషంట్లు కూడా వచ్చి మాతో చేరి సరిగ్గా వైద్యం చేయకుండా, వేలకు వేలు డబ్బు గుంజుతున్నడాక్టర్ను తిట్టి అక్కడున్న బెడ్లను లాగి, కర్టన్లను చించి బయట పడేసి నిప్పు పెట్టారు. అక్కడ మమ్మల్ని ఆపేవాళ్ళు కూడా లేకపోయారు. మా వివేకం ఆ క్షణాన నిద్రపోయింది. అప్పుడు ఆ పిల్లాడికి జరిగిన అన్యాయమే మాకు కనపడింది. చాలా చోట్ల ప్రయివేట్ హాస్పిటల్ లలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇలాగే ప్రజలు స్పందిస్తారు. ఎందుకంత తీవ్రంగా నాశనం చేస్తారు? అనుకునేవాడ్ని. నిజమే డాక్టర్ల నిర్లక్ష్యం తో ఆత్మీయుల ప్రాణాలు పోయినప్పుడు వచ్చే వేదన నుండి పుట్టిన ఆవేశం, ఆక్రోశం అలా చేయనిస్తాయోమో! త్రాగు నీరు, బడి తో పాటు ప్రతివూరికి 24 గంటలు పని చేసే హాస్పిటల్ వుండాలి. ఇకమీదట ఏ పల్లెలోను, ఏ పట్నంలోను, ఏ తల్లి కి పుత్ర శోకం ఉండరాదు. అమ్మ కడుపు చల్లగా లేకపోతే ఆ నేలపై అంతా అరాచకమే. ఆ సౌకర్యాలు తెచ్చిపెట్టే నాయకులకే వోటేయ్యాలని, డబ్బుకు వోటు అమ్ముకోరాదని ప్రజలు గుర్తించాలి. ఆ దిశగా ప్రజల్ని ప్రేరేపితులుగా చేయడానికి నేను ప్రయతిస్తున్నా... మీరూ మీ మీ వంతు ప్రయత్నించి... మరీ కనీస అవసరాలన్నా ఈ ప్రజలకు అందించే మార్గంలో అందరం నడుద్దాం.