సరోగసి- రసాభాస - లత పాలగుమ్మి

Surrogacy- Alchemy

హైదరాబాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగినప్పటి

నుండి శిరీష చిర్రు బుర్రులు మొదలవుతాయి భర్త మహేష్మీద......”అబ్బబ్బా!! ఎంత వేడో....... ఎంత హ్యూమిడ్ గా ఉందో...... అందుకే అమ్మా వాళ్ళు ఈ సమ్మర్ లో ఇండియా ట్రిప్ పెట్టుకోవద్దు అంటేవిన్నారు కాదు” అంటూ.

“అమ్మో, త్రీ వీక్స్ నా వల్ల కాదు మహీ, కుమార్ పెళ్లి అవగానే వెళ్ళిపోదాము, ప్లీజ్ టికెట్స్ ప్రీపోన్ చేసెయ్యి" అంటూ రిక్వెస్ట్ చేస్తుందిశిరీష.

“కొంచెం సేపు ఓపిక పట్టు సిరీ...... కుమార్ మనల్ని పిక్ అప్ చేసుకోవడానికి వచ్చే ఉంటాడు, కార్ లో ఏ. సీ ఉంటుంది కదా!! అప్పటి వరకు కాస్త భరించాలి...... అంటూ ఎంతో ప్రేమగా భార్యకి నచ్చ చెప్తాడు మహేష్”.

కుమార్ ని చూశాక ఇద్దరిలో హుషారొస్తుంది. అతనితో కలసి లగేజ్ అంతా ట్రంక్ లో పడేసి ఊసురోమని కార్ ఎక్కి కూర్చుంటాడు మహేష్ ఎండ వేడికి తట్టుకోలేక.

ఎప్పుడో ఊహ తెలీనప్పుడు అమ్మా వాళ్ళతో ఒకటి రెండు సార్లు ఇండియా వచ్చినట్లు గుర్తు!! ....... ఎండలు ఇంత దారుణంగా ఉంటాయని అనుకోలేదు అని శిరీష గురించి ఫీల్ అవుతాడుమహేష్.

రెండు, మూడు రోజులలో అక్కడి వాతావరణానికి అలవాటు పడతారని......ఎండల గురించి టెన్షన్పడవద్దని ..... వాళ్ళ ఊరిలో చాలా బాగుంటుందని వాళ్ళిద్దరిని ఉత్సాహపరుస్తాడు కుమార్.

మహేష్ తల్లితండ్రులు ఉద్యోగరీత్యా అమెరికాలో సెటిల్ అవ్వడం......

తల్లి , తండ్రి ఇరు వైపు వాళ్ళు కూడా చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం అక్కడే సెటిల్అవ్వడంతో మహేష్ కి ఇండియా రావాల్సిన అవసరమే లేకుండా పోతుంది.

శిరీష వాళ్ళ ఫామిలీ రెండు జెనెరేషన్స్ నుండి అమెరికాలోనే సెటిల్అవడంతో అదే వాళ్ళకి స్వస్థలం అనిపిస్తుంది. శిరీషకి జీవితంలోఒక్కసారైనా ఇండియా చూడాలని కోరిక. పచ్చని పంట పొలాలు, పల్లెటూరు చూడాలని సరదా పడటంతో వాళ్ళ ఫ్రెండ్ కుమార్ పెళ్ళికిఅటెండ్ అయితే అన్నీ కలిసి వస్తాయని బయలు దేరుతారు ఇద్దరూ.

సుమారుగా మూడు గంటలు ప్రయాణం చేసిన తర్వాత గోపాలపురంచేరుకుంటారు. దోవంతా పచ్చని పంట పొలాలు, పనులు పూర్తి చేసుకునిఅలసి సొలసి పోయి ఇంటికి చేరుతున్న రైతులు అలా ఎంత సేపైనాప్రయాణించవచ్చని అనిపిస్తుంది శిరీష, మహేష్ లకి.

ఇంటి ముందు పచ్చటి కొబ్బరి ఆకుల పందిరి, గుమ్మాలకి మామిడి ఆకులు, బంతి పూల తోరణాలతో పెళ్లి కళ ఉట్టి పడుతూ ఉంటుంది.

మహేష్ వాళ్ళు అంత దూరం నుండి ఎంతో శ్రమ తీసుకుని వచ్చినందుకుకుమార్ తల్లి తండ్రులు ఎంతో సంతోష పడతారు. వాళ్ళకి ఏ ఇబ్బందిలేకుండా దగ్గరుండి అన్నీ జాగ్రత్తగా చూసుకోవడానికి ‘రుక్మిణి’ అనే ఆమెనినియమిస్తారు.

కుమార్ పెళ్ళి అంగ రంగ వైభవంగా జరుగుతుంది. రెండు రోజుల్లో చుట్టాలు, పెళ్ళివాళ్ళు ఎక్కడివాళ్ళు అక్కడికి సర్దుకుంటారు. శిరీష వాళ్ళు, క్రొత్త జంట తో కలిసి తిరుపతి వెళతారు. మూడు వారాల తరువాత అందరూ కలిసి యూ. ఎస్ కి తిరిగి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు.

ఒక రోజు సాయంత్రం ప్రశాంతంగా డాబా పైన టీ త్రాగుతూ కబుర్లుచెప్పుకుంటూ కూర్చుంటారు నలుగురు. రుక్మిణి స్నాక్స్ సెర్వ్ చేస్తూఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆమె అంటే శిరీషకి ఎంతోఅభిమానం.......రంగు తక్కువైనా చక్కని ముఖ కవళికలు, నల్లని వత్తైనజుత్తు, చెరగని చిరునవ్వు, శుచి శుభ్రతతో కూడుకున్న ఆమెని చుస్తే శిరీషకిఎప్పుడూ ఆశ్చర్యమే.......ఆమెకి పూలు అంటే ఇష్టమేమో రోజూ ఏదో ఒకపూలు తలలో తురుముకుని వస్తుంది.

మేము వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాము ఈ అమ్మాయిని......విసుగువిరామం లేకుండా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది...... పనివాళ్ళు ఇలాఉండటం చాలా అరుదు.......అని శిరీష ఆశ్చర్యపోతుంటే..... “వాళ్ళు అల్పసంతోషులు శిరీషా, మన లాగా సేవింగ్ కాన్సెప్ట్ ఉండదు. ఏ రోజు కూలిడబ్బులు ఆ రోజే ఖర్చు పెట్టుకుని హ్యాపీగా ఉంటారని చెప్తాడు కుమార్”.

“ఆమెకి ముగ్గురు పిల్లలని కుమార్ చెపితే......’పట్టుమని పాతికేళ్ళు కూడాలేని ఆమెకి ముగ్గురు పిల్లలా....!?’ అని విస్తుపోతుంది శిరీష”.

అప్పటి నుండి శిరీష బుర్రలో పురుగు దొలిచేస్తూ ఉంటుంది......”ఆమెకి వివాహం అయి ఎనిమిదిఏళ్ళు కావస్తున్నా పిల్లలు లేరు. రెండు సార్లు ఐ. వీ. ఎఫ్ కి వెళ్ళినా ఫలితం కనిపించక పోవడంతోఇంక ఈ జన్మలో తనకి పిల్లలు కలిగే భాగ్యం లేదని బాధ పడుతుంది శిరీష”.

“సరోగసి ద్వారా బిడ్డని పొందవచ్చని సలహా ఇస్తుంది ...... శిరీష ఫ్రెండ్ డాక్టర్ మీనల్”.

“రుక్మిణిని తమ బిడ్డకి సరోగేట్ మదర్ గా ఎంచుకుంటేబాగుంటుందని...... మహేష్ కి తన మనసు లో మాట చెప్తుంది శిరీష”.

ఎందుకంటే "ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలు.....

వయసులో చిన్నది....... ఆమెకి

పుట్టిన పిల్లలందరూ ఆరోగ్యవంతులు....... ఇలా సరోగేట్ మదర్ కి కావలసిన లక్షణాలన్నీ ఆమెలోపుష్కలంగా ఉన్నాయని”

జ శిరీష.

అమెరికా చట్టంలో ఉండే నియమ నిబంధనల కన్నా ఇండియాలో అయితేఈజీ అనే ఉద్దేశ్యం తో పని అమ్మాయిని సరోగేట్ మదర్ గా ఎంచుకోవడం ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు మహేష్.

“ఇంక ఆమెని ఒప్పించడం ఎలా.....!? అనేదే పెద్ద సమస్య “.

కుమార్ తో, అతని తల్లి తండ్రులతో ఈ విషయమై చర్చిస్తారు.

ఆమెని ఒప్పించడానికి ఎంత డబ్బయినా ఖర్చు పెట్టడానికి సిద్ధ పడతారు ఇద్దరూ.

రుక్మిణి ని కూర్చోపెట్టి " సరోగసీ అంటే ఏమిటి!? సరోగేట్ మదర్ అనిఎవరిని అంటారు......!?" అన్నీ వివరంగా వీడియో వేసి చూపెడతారు.

ముక్కు మీద వేలేసుకుని “అయ్యబాబోయ్....!? ఇలా కూడా పిల్లల్ని కంటారా!?” అని వింతగాచూస్తుంది రుక్మిణి. ఆమెకిదేదో కొత్త ప్రపంచంగా అనిపిస్తుంది.

ఆమెకు తమ పరిస్థితి అంతా వివరంగా చెప్పి తమ బిడ్డకి సరోగేట్ మదర్ అవమని అభ్యర్థిస్తారు. “నువ్వు ఈ సహాయం చేస్తే జీవితాంతం నిన్నొక దేవతలా గుర్తు పెట్టుకుంటామనిఆమె చేతులు పట్టుకుని మరీ ప్రాధేయ పడుతుంది శిరీష”.

మొదట భయపడినా వాళ్లకి సాయం చేయాలనే ఉదేశ్యంతో “ఈ యాల రేతిరికి మా మావ నడిగిసెప్తానమ్మ" అంటుంది రుక్మిణి. ఆమె భర్త సుబ్బడు కుమార్ వాళ్ళ పొలంలో పని

చేస్తాడు.

మావా!! సినబాబు గారి లగ్గానికని అమెరికా నుండి ఆళ్ళ స్నేగితులువచ్చారు గందా....!! "ఆళ్ళ బిడ్డని నేను కనివ్వాలంటా" .... దానికి ఏదో పేరుసెప్పారు మావ...... గ్నాపకం రాడం లేదు ఇప్పుడు...... ఈడియో కూడా ఏసిసూపెట్టారు అంటుంది రుక్మిణి.

"ఆళ్ళ బిడ్డని నువ్వు కనివ్వడమేందే!?” నా కర్ధం గాక అడుగుతున్నా........ అని తలబరుక్కుంటాడు సుబ్బడు. అయన్నీ మనకెందుకే...... !? అయినా పెద్దాళ్ళతో ఎట్టుకోకూడదు, ఆనక ఏదయిన తేడా పాడా పడితే అందరూ మనల్నే అంటారు అంటాడు.

అయ్యగారు ఆళ్ళు “రేపు నిన్ను ఓమార జ కనపడమన్నారు" అంటుంది రుక్మిణి.

మర్నాడు ఉదయమే ఇద్దరూ కుమార్ వాళ్ళ ఇంటికి వెళతారు.

సుబ్బడుకి అన్నీ వివరంగా నచ్చ చెప్పి ఒప్పించడంలో సఫలీకృతులవుతారు కుమార్తల్లితండ్రులు.

విషయం పెద్దగా అర్ధం కాకపోయినా "వాళ్ళు ఇస్తానన్న పది లక్షల రొక్కం, పది ఎకరాల పొలంఆశ పెడతాయి" అతన్ని.

“పది జన్మలెత్తినా అంత డబ్బు....అన్ని ఎకరాల పొలం.....మనంసంపాదించలేమే!”అంటాడు మెుహం చాటంత చేసుకుని.

"అవును మావా!! ఆ డబ్బుతో పిల్లల్ని బాగా సదివించుకోవచ్చు గందా!?" అంటుంది ఎంతోఆశగా.

వాళ్ళు ఒప్పుకోవడమే తరువాయి రుక్మిణిని సిటీకి తీసుకు వెళ్ళి

మెడికల్ చెక్ అప్స్ అన్నీ చేయించి ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నదని నిర్ధారించుకున్న తర్వాతట్రీట్మెంట్ ప్రారంభిస్తారు.

“బైలాజికల్ పేరెంట్స్” అయిన మహేష్, శిరీషల “స్పెర్మ్ అండ్ ఎగ్ “ తో ‘ఎంబ్రియో’ తయారుచేసి రుక్మిణికి అమరుస్తారు.

అప్పటి నుండి ఆమెని తమతోనే ఉండమని కోరుతుంది శిరీష. అక్కడైతేనే ఆమెని జాగ్రత్త గాచూసుకోవచ్చు అని......

టైమ్ టు టైమ్ మెడిసిన్స్ ఇస్తూ.....డైట్ చార్ట్ కి అనుగుణంగా న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వచ్చని చెప్తుంది. దాని కొరకు ప్రత్యేకించి ఒక నర్సుని కూడా అప్పాయింట్ చేస్తారు.

రుక్మిణి కి ట్రీట్మెంట్ ఎంతో భయంగా అనిపిస్తుంది. బెడ్ రెస్ట్ అలవాటులేక....పిల్లల్ని, భర్తని వదిలి ఉండలేక రోజుకొక యుగంలా గడుస్తుందీ సమయం ఆమెకి.

నెల రోజులు భారంగా గడుస్తాయి. అందరూ ఎంతో ఉత్కంఠం తో ఎదురు చూస్తున్న సమయంరానే వస్తుంది.

రుక్మిణిని తీసుకుని క్లినిక్ కి వెళతారు. డాక్టర్ ఆమెని టెస్ట్ చేసి

‘కన్సీవ్’ చేసినట్లుగా శుభ వార్త అందిస్తుంది.

ఇంక శిరీష, మహేష్ ల ఆనందానికి అవధుల్లేవు. వాళ్ళ కళ్ళకి రుక్మిణి దేవతలా కనపడుతుంది. ఆమెని అడుగు క్రింద పెట్టనీయకుండా చూసుకుంటారు.

అంతకు ముందు మూడు కాన్పులు ప్రసవం ముందు రోజు వరకు పొలంపనికి వెళ్ళే అలవాటు ఉన్న ఆమెకి ఏ పనీ చేయకుండా కూర్చోవడం

పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది.

“రోజూ సాయంత్రం ఎప్పుడవుతుందా!? పిల్లల్ని తీసుకుని ఆమె భర్తఎప్పుడు వస్తాడా!?" అని ఎదురు చూస్తూ ఉంటుంది.

"తొందరగా సమయం గడిచి, వాళ్ళ బిడ్డని కని వాళ్లకి ఇచ్చేసి తనింటికి వెళ్ళిపోదామా!? " అని ఆరాటపడుతుంది రుక్మిణి.

"నెల వారీగా బిడ్డ ఎదుగుదల ఎలా జరుగుతుంది!? ఏయే అవయవాలు ఎప్పుడుఏర్పడతాయి!?" వీడియో వేసి ఆమెకి చూపెడుతూ ఉంటుంది శిరీష.

ఇవేమీ తెలీకుండానే ముగ్గురు బిడ్డల్ని కన్నానని, మొదటిసారిగా తన గర్భంలో ఉన్న బిడ్డఎదుగుదలని అనుక్షణం అనుభూతి చెందుతున్నానని సంతోషంగా చెప్తుంది శిరీషకి.

భారంగా ఐదు నెలలు గడుస్తాయి. రొటీన్ చెక్ అప్ లో పార్ట్ గా అయిదోనెలలో ఏ. ఎఫ్. పి. టెస్ట్ (Alpha-Fetoprotein) చేయించడం కోసంరుక్మిణిని క్లినిక్ కి తీసుకు వెళతారు.

చెక్ అప్ తర్వాత శిరీష, మహేష్ లతో ప్రైవేట్ గా మాట్లాడాలని పిలుస్తారు డాక్టర్. ఆమె చెప్పిందివిన్న దంపతులిద్దరూ హతాశులవుతారు. మెుహం రెండు చేతులతో కప్పుకుని వెక్కి వెక్కి ఏడుస్తుఅక్కడే కూలబడి పోతుంది శిరీష.

తిరుగు ప్రయాణంలో చాలా సేపటి వరకు నిశ్శబ్దం చోటు చేసుకుంటుందికారులో.

ఇద్దరూ ఇంగ్లీషులో ఏదో మాట్లాడుకుంటూ గట్టి గట్టిగా అరుచుకోవడంరుక్మిణికి చాలా భయంగా అనిపిస్తుంది. ఎంతో ప్రేమగా ఉండే ఇద్దరూఅలా ఘర్షణ పడటం....... హాస్పిటల్ లో ఏదో జరిగిందని మాత్రం అర్ధంఅవుతుంది రుక్మిణికి.

ఏం జరిగిందో తెలుసుకోవాలని ఎంతో ఆతృత గా ఉన్నా....... సీరియస్ గాఉన్న వాళ్ళ మొహాలు చూసి అడిగే ధైర్యం చేయలేక పోతుంది.

“అయిదో నెల వరకు జాగ్రత్త గా ఉంటే చాలని.......ఆమె తన ఫ్యామిలీతో ఉంటేనే సంతోషంగాఉంటుందని” రుక్మిణిని వాళ్ళ ఇంటికి పంపిస్తుంది శిరీష.

రుక్మిణికి ఏం జరుగుతోందో తెలీడం లేదు. తనకి చెప్పకుండా ఏదో దాస్తున్నారని మాత్రం అర్ధంఅవుతుంది.

వారం రోజులు తర్జన భర్జనల తర్వాత వాళ్ళ పిన్ని బాబాయిలని చూసివస్తామని బయలు దేరుతారు శిరీష వాళ్ళు.

రుక్మిణికి మిగతా నాలుగు నెలలు సులువుగా గడిచిపోతాయి తన పిల్లలఆలనా పాలనలో. డెలివరీ టైం దగ్గర పడుతున్నా శిరీష వాళ్ళ జాడ లేదు. వాళ్ళ నుండి కాల్స్ లేవు. వీళ్ళ కాల్స్ కి రిప్లై లేదు.

విషయం తెలుసుకుందామని కుమార్ కి కాల్ చేస్తే శిరీష వాళ్ళు అమెరికావచ్చేశారని........ ఏం జరిగిందని ఎంత అడిగినా తనకు కూడా చెప్పడంలేదని అనడంతో కుమార్ తల్లితండ్రులు నిర్ఘాంతపోతారు. విషయంఏమిటో తెలీక చాలా బాధ పడతారు. పది లక్షల రూపాయలు రుక్మిణికిఅంద చేయమని కుమార్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు శిరీష వాళ్ళు.

డెలివరీ అయ్యి పండంటి మొగబిడ్డకి జన్మనిస్తుంది రుక్మిణి. పచ్చని పసిమి ఛాయతో, చారడేసి కళ్ళతో, నల్లని వత్తైన గిరజాల జుత్తుతో మెరిసిపోతూ ఉంటాడు బిడ్డ.

కానీ వెన్నెముక సమస్య వలన పిల్లాడు జీవితాంతం మంచం లోనేఉంటాడని, అందుకే ఐదో నెలలోనే అబార్షన్ చేయించుకోమని సలహాఇచ్చామని చెప్తారు డాక్టర్స్.

కుమార్ వాళ్ళ తల్లి తండ్రులు ఎన్ని

వర్తమానాలు పంపినా ప్రయోజనం ఉండదు. అలాంటి బిడ్డని తెచ్చుకుంటే సంఘంలో తమకి

అమర్యాద అని..... పరువు పోతుందని...... ఎంత డబ్బైనా పంపిస్తామని ఆ బిడ్డని ఆమెనేపెంచుకోమని సలహా ఇస్తాడు మహేష్.

మా అబ్బాయి స్నేహితులని, మంచివాళ్ళనే నమ్మకంతో ఏ విధమైన లీగల్ అగ్రిమెంట్స్ లేకుండావాళ్ళని ఒప్పించామని..... బిడ్డలో లోపం ఉందని తెలిసినప్పుడు, డాక్టర్ అబార్షన్ కి సజెస్ట్ చేస్తేకనీసం మాతో సంప్రదించకపోగా...... కనీసం జరిగిన విషయం తెలియ చెప్పకుండా అమెరికాపలాయనం చిత్తగించడం పద్ధతి కలిగినవాళ్ళు చేసే పని కాదనీ........ వచ్చి వాళ్ళ పిల్లాడిని వాళ్ళుతీసుకు వెళ్ళవలసినదేనని ఖరా ఖండిగా మహేష్ కి కాల్ చేసి చెప్తారు కుమార్ వాళ్ళ ఫాదర్.

చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా..... వీళ్ళకి కంఠ శోషేమిగులుతుంది.

కనీసం వాళ్ళకి ఒప్పుకున్న పది ఎకరాల పొలమైనా ఇప్పిద్దామనుకుంటే రుక్మిణి ససేమిరావద్దంటుంది.

"పిల్లాడిని తీసుకువెళ్లనప్పుడు ఆళ్ళ పొలం మాకెందుకయ్యా!?" అంటుంది గాయ పడ్డమనసుతో. ఎంతో మంచి వాళ్ళనుకుని బిడ్డలు లేరని బాధ పడుతున్నారని సాయంచేద్దామనుకున్నా కానీ ఇలా మోసం చేస్తారని అనుకోలేదు పెద్దయ్యా అంటుంది.

శిరీష వాళ్ళు వచ్చి బిడ్డని తీసుకువెళతారనే ఆశ అడియాసే అవుతుందిరుక్మిణికి.

"జీవితాంతం ఈ అవిటాడిని మనమెందుకు సాకాలి!? ఆళ్ళ బిడ్డ ఆళ్ళకే బరువైతే మనకెందుకీజంజాటం!?". అయ్యగారొళ్లతో మాట్లాడి తాడో పేడో తేల్చుకుని వస్తానని, ఆళ్ళకి అక్కరలేకపోతే అనాధాశ్రమంలో పడేద్దామని కోపంగా అంటాడు సుబ్బడు.

"అయ్యో!! ఇంత సక్కటి బిడ్డని అనాధాశ్రమంలో పడేస్తాననడానికి నీకుమనసెలా ఒప్పిందయ్యా!? "

"అయినా సెట్టుకి కాయ బరువా మావా!? ఆళ్ళ సంగతి నాకెందుకు!? వస్తే వస్తారు, లేకపోతేలేదు!! మిగతా బిడ్డల్లాగానే వీడిని కూడా తొమ్మిది నెలలు కష్టపడి మోసి కన్నాను. నేనేపెంచుకుంటాను, నా బిడ్డల్లో ఇంకో బిడ్డనుకుని” అంటూ పిల్లాడిని ఆప్యాయంగా గుండెలకి హత్తుకుంటుంది రుక్మిణి.

ఎప్పుడు రైలు బండి శబ్దం వచ్చినా వాళ్ళు వచ్చారేమోనని ఏదో ఒక మూల ఆశతో అటుగా చూస్తూఉంటుంది రుక్మిణి.

నీ పిచ్చి గాని ఆళ్ళు ఎందుకు వస్తారే!? అవకరంతో ఉన్న బిడ్డడని మనకొదిలేసి పోయారు గానిబిడ్డ బాగుంటే హాస్పిటల్ నుండి అటు నుండి అటే అట్టుకుపోయేవారు, నువ్వు కంటి నిండాసూడకుండానే. “ఛీ!! ఈ డబ్బున్నోళ్లు అంతా ఇంతేనే!! కన్న పేగు అన్న మమకారం కూడా లేదుఈళ్ళకి” అని అసహ్యించుకుంటాడు సుబ్బడు.

పిల్లాడికి సంవత్సరం నిండిపోతుంది.

వాళ్ళు రారని తెలిసినా ఎదురు చూడటం మాత్రం మానలేదు రుక్మిణి. ఎప్పుడైనా మనసుమార్చుకుని వస్తారేమోనని ఓ మూల ఆశతో.

*************************

లత పాలగుమ్మి

Note:

నిజ సంఘటనని ఆధారంగా తీసుకుని వ్రాసిన కధ.

ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా మన సుప్రీం కోర్ట్

సరోగసి రెగ్యులేషన్ బిల్ - 2016 లో సరోగసి ద్వారా జన్మించిన బిడ్డని బైలాజికల్ పేరెంట్స్ వదిలేస్తేవారికి పది లక్షల రూపాయల జరిమానా, పది ఏళ్ళు జైలు శిక్ష విధిస్తారు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.