రైలు ప్రయాణం - వీణాధరి సూరపరాజు

train journey

యువర్ అటెన్షన్ ప్లీజ్ అన్న అనౌన్స్మెంట్ తో ఏదో ఆలోచిస్తున్న నేను ఈలోకంలోకి వచ్చాను. ఎయిర్పోర్ట్ లో కుర్చునిఉన్ననాకు నా మనసు పుటల్లో పాతుకుని ఉన్న ఒక అందమైన జ్ఞాపకం తళుక్కున మెరిసింది. షుమారు ఇరవై సవంత్సరాల క్రిందట చిన్నప్పుడు మా నాన్నగారి ఉద్యోగరీత్యా మేము రంగాపురం అనే గ్రామంలో ఉండేవాళ్ళం. అక్కడ మా నాన్నగారు ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన అధ్యాపకులు గ పనిచేసే వాళ్ళు. నేను మా చెల్లెలు కూడా అదే పాఠశాలలో చదువుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు నా వయసు తొమ్మిది సంవత్సరాలు.

రంగాపురం ఎంతో అందమైన గ్రామం. ఒక అందమైన సరస్సు , ఒడ్డునే ఒక శివాలయం గ్రామం లో ప్రత్యేక ఆకర్షణలు. ఆ ఆలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగేవి.ఆ ఉత్సవాలు చూడటానికి అందరి ఇళ్ళకి బంధువులు వచ్చేవారు. ఆ సమయం లో గ్రామంలో ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం వెల్లివిరుస్తు ఉండేది. పదిరోజులు జరిగేవి ఉత్సవాలు. పదిరోజులు గ్రామంలో వీధులన్నీ విద్యుత్ దీపాలంకరణ తో కళకళలాడుతూ ఉండేవి. ఇక శివాలయం సంగతి చెప్పనే అఖ్ఖర్లేదు. ఆలయం ఆవరణ అంతా శివనామ సంకీర్తనలతో , భజనలతో భక్తి భావం పెల్లి ఉబుకుతూ ఉండేది. ఆలయం బయట వీధి పొడవునా చిన్న చిన్న బొమ్మల అంగళ్ళు మరియు తోపుడు బండ్లపై తినుబండారాలతో జన సంద్రంతో నిండి ఉండేది. సాయంత్రం పూట మేము అమ్మ వాళ్ళతో , పిన్నులతో, అత్తలతో కలసి గుడికి వెళ్లే వాళ్ళం.వాతావరణం సందడిగా ఉండేది. పెద్దలు భజనలు, పూజలు చేస్తుంటే పిల్లలం ఆడుకుంటూ ఉండేవాళ్ళం.

ఆ సమయం లో మా స్నేహితుడు రాహుల్ వాళ్ళ అత్తయ్య ,మామయ్య ,వాళ్ళ పిల్లలు ఉత్సవాలు చూడటానికి వచ్చారు.సాయంత్రం రాహుల్ కూడా వాళ్ళ మామయ్య పిల్లలతో కలసి గుడికి వచ్చాడు. ఆట పాటలతో మేము కాళక్షేపం చేస్తుంటే మాటల్లో రాహుల్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ గురించి చెప్పటం మొదలు పెట్టాడు. మా అత్తయ్య వాళ్ళు చాలాదూరం లో ఉంటారు తెలుసా, అక్కడినుంచి రావాలంటే మొదట రైలు ప్రయాణం చేయాలి , ఓరోజంత రైలు లోనే ఉండాలి అని చెప్పాడు. నేను కుతూహలంగా వింటుంటే వాళ్ళ మామయ్య కొడుకు సౌరవ్ రైలు ప్రయాణం గురించి వర్ణించసాగాడు. మేము రైలు లో ఎప్పుడు ప్రయాణం చేయలేదు. మాకు ఆ అవసరం రాలేదు. సౌరవ్ రైలు ప్రయాణం గురించి చెప్తూ రైలులో పడుకోటానికి సౌకర్యంగా చిన్న మంచం లాంటి పొడవైన సీట్లు ఉంటాయని, కిటికీ లో నుంచి చూస్తుంటే అడవులు ,చెట్లు, కొండలు అన్ని భలే కనిపిస్తాయని , అవి చూస్తుంటే సమయం యిట్టె గడిచిపోతుందని చెప్పాడు. అది విన్న నా మనసులో ఎలాగైనా రైలు ప్రయాణం చేయాలని అనిపించింది. శివరాత్రి ఉత్సవాల తరువాత మేము మా పరీక్షలకు చదువుకుంటూ ఉన్నాము. ఈ వేసవి సెలవులలో ఎలాగైనా రైలు ప్రయాణం చేయాలి అని మనసులో బలంగా అనుకొని మాకు బంధువులు ఎవరైనా ఉన్నారా అని ఆలోచించసాగాను. మేము ఎప్పుడు వెళ్లే అమ్మమ్మ ,మామయ్య, పిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళాలి అంటే బస్సులో వెళ్ళవచ్చు , దగ్గరే మరి వాళ్ళ వూరు. మరి రైలు ప్రయాణం ఎక్కడకు చేయాలి అని మనసులో దిగులు పడసాగాను. మా అమ్మ దగ్గరకు వెళ్లి , అమ్మా! మనకు అమ్మమ్మ , పిన్ని, మామయ్య వాళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా బంధువులు ఉన్నారా అని అడిగాను. మా అమ్మ ఆశర్యంగా నా వైపు చూసి ఎందుకురా! అని అడిగింది. అయోమయంగా నేను చూస్తుంటే చిన్నగా భుజం మీద తట్టి పరీక్షలు ఇంకా పది రోజులే ఉన్నాయి శ్రద్ధగా చదువుకో పరీక్షలు అయిపోయాక మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెల్దాము అన్నది సంతోషంగా. నేను నిరాశగా వెనుదిరిగాను.

మరో పది రోజుల తరువాత మా పరీక్షలు మొదలు అయ్యాయి. ఆ సమయం లో ఒక ఉత్తరం మరియు పెండ్లి పత్రిక పోస్ట్ లో వచ్చాయి. ఆ సాయంత్రం మా అమ్మ నాన్నతో చెప్తుంటే విన్నాను, ఏమండోయి! మీ పెద్దమ్మ మనవరాలి పెండ్లి అట, బొంబాయి లో!! పత్రిక, ఉత్తరం వచ్చాయి రమ్మని మరి మరి రాసారు అన్నది. ఆ మాట వినగానే నా మనసు గాలిలో తేలి పోయింది. బొంబాయి అంటే చాల దూరం కదా రైలు లో ప్రయాణం చెయ్యొచ్చు అనుకున్నాను. ఇంతలో మా నాన్నగారు వాళ్లకు మనకు మాటలు లేక చాల రోజులు అయింది కదా , అయినా బొంబాయ్ కి ఏం వెళ్తాము చాల దూరం అని నిట్టూర్చారు. నా ఆశల పైన నీళ్లు చల్లినట్లైంది ఇంతలో మా పరీక్షలు అయిపోయాయి , వేసవి సెలవలు వచ్చేసాయి. మా అమ్మ ,చెల్లెలు బట్టలు సర్దుతూ ఉన్నారు. ఎప్పుడు ఉత్సాహంగా ఉండే నేను ఈసారి ఎందుకో నీరసంగా ఉన్నాను . మన బంధువులు అందరు దగ్గరలో ఎందుకు ఉన్నారు అని మనసులో బాధపడసాగాను. ఆ రాహుల్ గాడు ఈసారి వాళ్ళ మామయ్య దగ్గరికి రైలు లో వెళ్తున్నాడు అన్న సంగతి నన్ను బాగా ఉడికిస్తుంది. ఇదేమి తెలియని మా అమ్మ ఒరేయ్ నీ బట్టలు చూడు సర్దాను , మళ్ళి అక్కడికి వెళ్లి ఏడుస్తావు ఇవి తేలేదు అవి తేలేదు అని అంటూ నన్ను పిలుస్తోంది. ఇంతలో మా మామయ్య ఊరు నుంచి హఠాత్తుగా వచ్చారు. మా అమ్మా,నాన్న ఆశ్చ్యరంగా చూసి కుశల ప్రశ్నలతో స్వాగతం పలికారు. మా మామయ్య అక్కా! మీతో ఒక విషయం మాట్లాడుదాము అనుకుంటున్నాను. నాకు మధ్య ప్రదేశ్ భోపాల్ లో ఒక నెల రోజులు ట్రైనింగ్ వేశారు. అక్కడ చూడటానికి చాల ప్రదేశాలు ఉన్నాయట. అందుకని మీరు కూడా ఒప్పుకుంటే పదిరోజులు అక్కడ తిరిగి మీరు, మా ఆవిడా, పిల్లలు వెనక్కి వచ్చేద్దురు కానీ , నేను ట్రైనింగ్ అయిపోయాక వస్తాను, అంటూ మళ్ళి మళ్ళి రాదు ఇలాంటి అవకాశం అక్కా అంటూ బతిమిలాడాడు. అక్కడ వసతి కూడా ఇబ్బంది లేదు ఏర్పాటు చేసారు అని కూడా చెప్పాడు. మా మామయ్య మంచి ఉద్యోగం లో ఉండేవాడు. అదీ కాక మా అమ్మ అంటే ఎందుకో అభిమానం కూడా ఉండేది. మా నాన్నగారు కాసేపు అలోచించి ,ఎలాగూ వేసవి సెలవులు కదా అని ఒప్పుకున్నారు. నేను మా మామయ్యతో చిన్నగా మామయ్యా! మనం బస్సులో వెళ్తామా అని అడిగాను ,నాకు మనసులో ట్రైన్ అయితే బాగుండు అని అనిపిస్తూ ఉంది. మా మామయ్య నాతో లేదురా భోపాల్ చాల దూర కదా అందుకని ట్రైన్ లో వెళ్తాము మనం అన్నాడు. నా సంతోషానికి అవధులు లేవు . మా మామయ్య నాన్నగారు ఒప్పుకుంటే అందర్నీ తీసికొనిపోవడానికి వచ్చాడు. మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాక రిజర్వేషన్స్ అన్నీ చూసుకొని మా భోపాల్ ప్రయాణం అన్నమాట. సంతోషంతో మా వీధి అంతా తిరిగి చెప్పి వచ్చాను. ఒక రోజంతా ట్రైన్ లో నే ఉంటాము అని తలుచుకుంటేనే ఎంతో ఆనందంగా ఉంది. ఒక శుభ ముహూర్తాన మాకందిరికి భోపాల్ వెళ్ళటానికి రైలు రిజర్వేషన్ ఐంది. మామయ్య కు ఇద్దరు మగపిల్లలు. ఇక మా అల్లరి చూడాలి మామయ్య వాళ్ళ ఇంట్లో నేను, మా చెల్లెలు , వాళ్ళ పిల్లలు ఇల్లు పీకి పందిరి వేసాము. రాత్రి అంతా నాకు అవే ఆలోచనలు. రైల్వే స్టేషన్ కి బయలుదేరుతుంటే ఎదో విదేశానికి వెళ్తున్నట్లు సంతోషం. ఆ రోజుల్లో రైలు ప్రయాణమే గొప్ప. రైల్వే స్టేషన్ అంతా తెగ తిరిగాము. స్టేషన్ లో రైలు కోసం ఎదురుచూస్తూ వచ్చి పోయే రైళ్లని ఆశ్చర్యంగా చూస్తూ ఎన్ని డబ్బాలు ఉన్నాయి ఒక్కో ట్రైన్ లో అని పోటీలుపడి లెక్కలు పెట్టుకుంటూ గడిపాము. రైలు వచ్చేముందు అనౌన్స్మెంట్ చేసారు . మా మామయ్య , నాన్న మమ్మల్ని జాగ్రత్తగా పట్టుకొని రైల్ లో మా రిసర్వ్డ్ కంపార్ట్మెంట్ లోకి ఎక్కించారు . రైల్ లో కి ఎక్కగానే చల్లగా అనిపించింది. సెకండ్ ఏ సి కంపార్ట్మెంట్ నిజంగానే పడుకోటానికి పెద్ద సీట్స్ చూసి ఏదో లోకంలో విహరించినట్లు అయింది. రైలు కదిలిన తరువాత సంతోషం తో పిల్లలం కంపార్ట్మెంట్ అంతా తిరిగి ఆడుకున్నాము. రైలు ఆలా కదులుతూ ఉంటె కిటికీ దగ్గరే కూర్చున్నాను . నా చిన్న మనసుకు ఎంతో సంతోషం వేసింది. భోపాల్ దగ్గర పడుతుండగా పెద్ద పెద్ద గుహలు కనిపించాయి. ఆ గుహల లోపల నుంచి కూడా రైలు వెళ్ళటానికి సొరంగ మార్గం ఉంది. గుహలోకి రైలు వెళ్ళినప్పుడు అంతా చీకటి , అప్పుడు మా నాన్న రైలు లో లైట్ వేశారు. ఆ వయసులో అన్నీ అబ్బురాలే. ఆలా మా మామయ్య వల్ల నా రైలు ప్రయాణం కోరిక తీరింది. ఆ తరువాత నేను చదువు రీత్యా ఉద్యోగం రీత్యా చాల సార్లు రైలు, విమాన ప్రయాణాలు చేశాను. విదేశాలు తిరిగాను అయినా నాకెప్పుడూ అంత సంతోషం కలగలేదు. ఆ విధముగా తొమ్మిదేళ్ల వయసులో నా మొదటి రైలు ప్రయాణం, రంగాపురం గ్రామం మరియు శివరాత్రి ఉత్సవాలు నాకు ఎప్పటికి ఒక మధుర జ్ఞాపకం.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.