“అమ్మా! ఈ సారి పండక్కైనా కొత్త చొక్కా కొనియ్యవే” అడిగాడు పన్నెండేళ్ళ రవి.
లక్ష్మి వాడి వైపు నిస్సహాయంగా చూసింది.
“మా స్నేహితులందరూ పండక్కి అప్పుడే కొత్త బట్టలు కొనేసుకున్నారు తెలుసా?”
తల్లికొడుకులిద్దరూ చాకిరేవులో బట్టలు ఉతకడానికి వెళ్ళారు. తల్లి ఉతుకుతుంటే రవి వాటిని పిండి ఆరవేయటoలో ఆమెకు సహాయం చేస్తున్నాడు.
ప్రతి సారి ఉగాది పండక్కి అయినా వాడికి కొత్త బట్టలు కొనాలనుకుంటుంది కానీ తమ ఆర్ధిక పరిస్థితి అందుకు సహకరించదు. పల్లెకు ఎక్కువ, టౌనుకు తక్కువ అయిన ఓ పల్లెటూరిలో నాలుగిళ్ళలో బట్టలు ఉతికి ఇల్లు నెట్టుకొస్తోంది. దగ్గరుండే టౌనుకు ఆటో నడిపే భర్త, సంసారాన్ని లాగటంలో సహకరించకపోగా ఏ రోజు సంపాదన ఆ రోజు పూటుగా తాగి వస్తాడు. ఇంట్లో అత్యవసరానికి కూడా చిల్లిగవ్వ ఉండనివ్వడు. ఇక కొడుక్కి కొత్త బట్టలు ఎక్కడ కొనేది? ఒక్క సారైనా కొడుకు కోరిక తీర్చలేక పోయానే అని లోలోపల బాధ పడుతోంది లక్ష్మి.
పండక్కి తన స్నేహితురాలు మాలతి పుట్టింటికి వస్తుంది. వచ్చినపుడల్లా ఆమె కొడుకు బాబి కి పొట్టి అయిన బట్టలు తన కొడుకు కోసం తెస్తూ ఉంటుంది. వాళ్ళు వాడిన బట్టలు అన్నమాటే గానీ బాగానే ఉంటాయి. కాస్త పాతబడగానే కొత్త బట్టలు తెచ్చుకునే తాహతు ఉన్నవారు కాబట్టి ఇవి రవికి ఇచ్చేస్తూ ఉంటుంది మాలతి. నిన్న చాకలి బట్టలు వేస్తూ మాలతి వాళ్ళమ్మ చెప్పింది రెండురోజుల్లో వాళ్ళు వస్తున్నట్టు. అదే మాట రవికి చెప్పి అనునయించింది లక్ష్మి.
“ఎప్పుడూ ఒకరు వేసుకున్న బట్టలేనా అమ్మా! నాకేం వద్దు” బుంగమూతి పెట్టాడు రవి.
“నువ్వు పెద్ద వాడివి అవుతున్నావు. మన పరిస్థితి అర్థం చేసుకోలేవా రవి!” బ్రతిమాలింది లక్ష్మి.
రవి మౌనంగా ఉండిపోయాడు. ఇప్పుడిప్పుడే పసితనం వీడి టీనేజ్ లో అడుగుపెడుతున్న రవి మనసు ద్వైదీభావం తో ఉంది. అటు స్నేహితులేమో పండక్కి తాము కొనుక్కున్న కొత్త బట్టలు అందరికీ చూపించి ముందే పండగ చేసుకుంటున్నారు. తనకూ అలా కొత్త బట్టలు వేసుకోవాలని ఉంటుంది. ఇటు ఇంట్లో కనీసo మూడు పూటలా సరైన తిండి దొరకని పరిస్థితి. తల్లి దీన స్థితి. మరి రెట్టించలేక పోయాడు. దిగువ మధ్య తరగతి కుటుంబ పరిస్థితులు వాడికి ఇప్పుడిప్పుడే వయసుకు మించిన పెద్దరికాన్ని నేర్పుతున్నాయి.
మరేం మాట్లాడకుండా ఆరిపోయిన బట్టల్ని మడత పెట్టడంలో తల్లికి సాయం చెయ్యసాగాడు. ఒక్క మాటతోనే సంబాళించుకున్న కొడుకును చూసి లక్ష్మి మనసు బాధగా మూల్గింది.
అన్నట్టుగానే మాలతి కుటుంబం, పండుగ వారం రోజులు ఉందనగా ఊరికి వచ్చారు. ఆ రోజు ఉతికిన బట్టలు ఇవ్వడానికి వెళ్ళిన లక్ష్మిని పలకరించింది మాలతి. బాబి వచ్చాడని తెలియగానే రవి కూడా పరుగున వెళ్ళాడు. ప్రతిసారి సెలవులకు వచ్చినపుడు వాళ్ళిద్దరూ కలిసి ఆడుకోవడం మామూలే. వారి స్నేహానికి అంతస్తుల తారతమ్యం అడ్డుపడలేదు. ఎవరూ అడ్డు పెట్టలేదు. బాబి, రవి కంటే రెండేళ్ళు చిన్న వాడైనా మంచి పోషణలో పెరగడం వల్ల రవి కంటే లావు, పొడుగు ఎక్కువే ఉంటాడు.
స్నేహితుడిని చూడగానే బాబి కూడా సంతోష పడ్డాడు. తన ఆట వస్తువులు, పండుగకు కొనుక్కున్న కొత్త బట్టలు అన్నీ చూపించాడు. తెల్ల చొక్కా మీద నీలం రంగు కోటుతో బాబి కొత్త బట్టలు రవికి భలేగా నచ్చాయి. వాటినే తదేకంగా చూస్తున్న రవిని పిలిచింది మాలతి.
“ఇదిగోరా రవి! ఈ బట్టలు నీకే!” ప్రతిసారి లాగానే పాతబడిన బట్టలు వాడి చేతిలో పెట్టింది మాలతి.
కృతజ్ఞతగా ఆమె వంక చూసి వాటిని అందుకున్నాడు రవి.
ఇంటికి వెళ్ళబోతున్న రవిని బాబి పిలిచాడు.
“మళ్ళీ వచ్చేయ్ రవి! మనిద్దరం ఆడుకుందాం “ అన్నాడు.
అలాగేనంటూ తలూపి ఇంటి ముఖం పట్టాడు రవి.
“అమ్మా! బాబీ కొత్త బట్టలు ఎంత బాగున్నాయో తెలుసా! నాకు కూడా అలాంటి చొక్కా, కోటు ఉంటే ఎంత బాగుండునో కదా!” వాడి కళ్ళలో తొణికిసలాడుతున్న ఆశను గుర్తించక పోలేదు లక్ష్మి.
“ఏదీ! నీకు ఇచ్చిన బట్టలు చూడనీ! ఈ సారి ఎక్కువ జతలు ఇచ్చినట్టుందే! ఇంకో రెండేళ్ళు నీకు బట్టలతో బాధ లేదు. చూడు! ఈ మెరూన్ రంగు చొక్కా ఎంత బాగుందో. పండుగకు ఇదే వేసుకుందువు గానీ! ఆంటీ ఎంత మంచిదో కదా! శ్రమ అనుకోకుండా అక్కడి నుండి నీ కోసమే వీటిని మోసుకొస్తుంది.” మాట మార్చింది లక్ష్మి.
ఆమె అన్నట్టు ఆ మెరూన్ రంగు చొక్కా కూడా బాగానే ఉంది. వేసుకున్న షర్టు తీసేసి, అది వేసుకుని చూసుకున్నాడు రవి. ఎక్కువగా వాడినట్టు లేదు. అద్దంలో చూసుకుంటే బాగుందనిపించింది. అంతకు మించి ఆశించే అదృష్టం తనకు లేదు. మళ్ళీ మామూలైపోయాడు రవి.
“సరేనమ్మా! నేను ఆడుకోవడానికి వెళుతున్నా!” వెళ్ళిపోయాడు రవి.
సాయంత్రం వరకు పొలాల వెంబడి, చేల వెంబడి తిరిగీ, ఎగిరీ ఇళ్ళు చేరుకున్నారు రవి, బాబి.
“ఇక్కడికొస్తే వీడిని పట్టలేం!” ఒక్క పూటకే దుమ్ములో పొర్లి, రంగు మారిపోయి వచ్చిన కొడుకును బాత్రూంలోకి తోస్తూ విసుక్కుంది మాలతీ.
“పోనీలేవే! టౌన్ లో ఎలాగూ వాడికి ఆడుకునే అవకాశమే లేదు. ఇక్కడైనా వాడిని స్వేచ్చగా ఆడుకోనివ్వు. పెద్దయ్యాక ఇవే వాడికి తీపి జ్ఞాపకాలు అయ్యేది.” వాడిని సమర్థించాడు మాలతీ భర్త.
ఆ మాటల్లోని నిజాన్ని ఆమె కాదనలేకపోయింది. వాడికి స్నానం చేయించడానికి లోపలికి తీసుకు వెళ్ళింది.
పగలంతా రవితో కలిసి చెట్లమ్మటా, పుట్లమ్మటా తిరగడం, అమ్మమ్మ గారింట్లో కోళ్ళతో, కుక్కపిల్లలతో ఆడుకోవడం బాబి దినచర్య అయిపోయింది. వేళకు తిండి పెట్టాలన్నా వీళ్ళిద్దరూ ఎక్కడున్నారో వెదకి పట్టుకోవాల్సి వస్తోంది మాలతికి.
“రేపు నేను ఆడుకోవడానికి రాను బాబి “ చెప్పాడు రవి.
“ఏ! ఎందుకు?” అడిగాడు బాబి.
“ రేపు నేను అమ్మతో కలిసి చాకిరేవుకు వెళ్ళాలి. సాయంత్రం వస్తాను.” అన్నాడు రవి.
“ చెరువు దగ్గరికేనా. నేను కూడా వస్తాను రవి.”
“ వద్దులే బాబి! పగలంతా అక్కడే ఉండాల్సి వస్తుంది. నాకు పని ఉంటుంది. నీకేం తోచదు.”
“ ఏం కాదులే! నేను వస్తాను.” మొండి పట్టు పట్టాడు బాబి.
మాలతి చెప్పినా వినలేదు. మరుసటి రోజు రవి, లక్ష్మి తో పాటు బట్టలు ఉతికే చెరువు దగ్గరికి వెళ్ళాడు బాబీ. పగలంతా రవి తల్లికి సహాయం చేస్తుంటే, బాబి నీళ్ళతో ఆడుకున్నాడు.
“రవీ! నీకు ఈత వచ్చా!” అడిగాడు బాబి.
“వచ్చు”
“అయితే నాకు నేర్పవా!”అన్నాడు బాబి.
“నాకొచ్చు కానీ నీకు నేర్పడం రాదు. అయినా వద్దులే బాబీ! ఏమైనా అయితే మీ అమ్మ నన్ను తిడుతుంది.” అన్నాడు రవి.
“ఏం కాదులే! నేర్పు” మారాం చేసాడు బాబి.
అక్కడే ఉన్న లక్ష్మి వారించింది. బాబి అప్పటికి మౌనం వహించినా ఇంటికి వచ్చేటపుడు లక్ష్మికి వినిపించకుండా రవిని హెచ్చరించాడు..... మరుసటి రోజు ఈత నేర్పక పోతే తనతో మాట్లాడనని. బాబి మాట్లాడక పోతే తనకు తోచదే....అయిష్టంగానే ఒప్పుకున్నాడు రవి.
మరుసటి రోజు ఆడుకోవడానికి అని చెప్పి ఇద్దరూ నేరుగా చెరువు దగ్గరికి వెళ్ళారు.
“నాకు భయంగా ఉంది బాబి! నా మాట విను. ఈత వద్దు ఏం వద్దు.. ఇంటికి వెళ్ళిపోదాం.” బ్రతిమాలాడు రవి.
బాబి అప్పటికే నీళ్ళలో దిగాడు. రవి వారిస్తున్నా వినకుండా అలాగే ముందుకు వెళ్ళాడు. భుజాల వరకు వచ్చిన నీళ్ళలో కేరింతలు కొడుతున్నాడు. ఇక తప్పదని రవి తన చొక్కా తీయబోతుండగా “రవీ” అని గట్టిగా అరిచాడు బాబి. ఇంకాస్తా ముందుకు వెళ్లి లోపల పాచి పట్టిన రాయి మీద కాలు వేసినట్టున్నాడు. పట్టు తప్పి నీళ్ళలో పడిపోయాడు. అటుపక్కనే లోతు కాస్త ఎక్కువ ఉండటంతో బాబి ఒక్కసారిగా మునక వేసాడు. రవి చొక్కా పూర్తిగా తీసి ముందుకెళ్ళేoతలో మరో సారి పైకి తేలి మునిగిపోయాడు బాబి. రవికి ఒక్క క్షణం ఊపిరి ఆగినంత పనైంది. ఒక్క ఉదుటున నీళ్ళలోకి దూకాడు. మునక వేసిన బాబి లోపల ఒకవైపుకు జారిపోగా, రవి మరో వైపు వెతకసాగాడు. సమయం గడిచే కొద్దీ బాబి కనపడకపోవడంతో రవి గుండెలు అవిసిపోయాయి. ఎట్టకేలకు బాబి చొక్కా దొరకబుచ్చుకుని, గట్టుమీదికి లాక్కొచ్చాడు. అప్పటికే పూర్తిగా నీళ్ళు మింగేసాడు బాబి. చుట్టూ చూసాడు రవి. కనుచూపు మేరలో ఎవరూ కనిపించలేదు. పెద్దలుంటే వారిస్తారనే ఎవరూ లేనపుడు వచ్చారు వాళ్ళిద్దరూ. స్పృహ లేకుండా పడి ఉన్న బాబీ ని చేతులతో తట్టి లేపసాగాడు రవి. బాబి లో చలనం లేదు. తనకంటే బలంగా ఉన్న బాబి ని మోసుకెళ్ళడానికి విఫల యత్నం చేసాడు రవి.
ఇక లాభం లేదని పరుగున ఊళ్లోకి వెళ్లి మాలతి వాళ్ళ ఇంట్లో కబురందించాడు. విషయం వినగానే పెద్దలు, పిల్లలు అందరూ చెరువు వైపు పరుగులెత్తారు. కొందరు బాబి పొట్ట పైన నొక్కి నీళ్ళు బయటికి కక్కించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బాబి కి స్పృహ రాలేదు. ఆటో లో టౌన్ కు తీసుకెళ్ళినా ప్రయోజనం లేకపోయింది. బాబి ని మృత్యు కోరల్లోంచి కాపాడలేకపోయారు.
మాలతి కుప్పకూలిపోయింది. ఆమెని ఓదార్చటం ఎవరి వల్లా కాలేదు. ఒక్కగానొక్క బిడ్డాయే... రవి ఓ మూల బిక్క చచ్చిపోయి ఉన్నాడు. అప్పటికే ఊరిలో వాళ్ళు వాడిని మాటలతో తలో పోటు పొడిచారు. తాగొచ్చిన తండ్రి దీనికంతా తనే కారణం అని కుళ్ళ బొడిచాడు. కొడుకు గురించి తెలిసిన లక్ష్మి మాత్రం వాడిని కడుపులో దాచుకుంది. అయినా తన స్నేహితురాలి కొడుకు చనిపోవడం, ఆ సంఘటనలో తన కొడుకు భాగస్వామి కావడం ఆమెను కలచి వేసింది.
ఇది నిజమేనా! తన చిన్నారి నేస్తం ఇక లేడా! అందుకు నేనేనా కారణం?....... రవి కూడా భోరున ఏడుస్తున్నాడు.
ఎంతో సంతోషంగా పండుగ చేసుకోవాల్సిన ఆఇంట్లో విషాదం అలముకుంది. ముద్దులు మూటగట్టే బాబి ఇక లేడు అంటే ఊరు ఊరంతా కన్నీరు కార్చింది. బరువెక్కిన హృదయాలతో బాబి కి అంతిమ వీడ్కోలు పలికారు. జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిగి పోయాయి.
పండుగకు సంబరంగా పుట్టింటికి వచ్చిన మాలతికి కడుపు కోత మిగిలింది. అర్ధాంతరంగా అంతర్ధానం అయిన కొడుకును తలచుకుని ఆమె కుమిలి కుమిలి ఏడుస్తోంది.
నాలుగు రోజుల తర్వాత మాలతీ వాళ్ళు పట్నం బయలుదేరుతారనగా ఆమె రవిని రమ్మని కబురు పెట్టింది.
బాబి పోయాక వాడు ఆ ఇంటి వైపు రానే లేదు. బిక్కు బిక్కు మంటూ వచ్చాడు రవి.
“అమ్మా! నేను వద్దని చెప్పినా బాబి వినలేదమ్మా! ఇలా జరుగుతుందని తెలిస్తే అక్కడికి వెళ్ళే వాళ్ళమే కాదు. నన్ను క్షమించండమ్మా!” రాగానే మాలతీ పాదాలు చుట్టుకుపోయాడు వాడు.
“లేరా! బాబి ని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో నాకు తెలుసురా! అందుకే నీ వెంట ఆడుకోవడానికి ధైర్యంగా పంపేదాన్ని. విధి రాతను తప్పించడం ఎవరికి సాధ్యం? మా ఖర్మ ఇలా రాసిపెట్టి ఉంటే నువ్వేం చేయగలవు? లే! “ వాడిని లేపి కళ్ళు తుడిచింది మాలతి.
రవి ఇంకా వెక్కుతూనే ఉన్నాడు.
“ఇదిగో! బాబి కి పండుగకు కొన్న కొత్త బట్టలు. ఇవి వేసుకోవడానికి వాడెలాగూ లేడు. నువ్వైనా వేసుకో.” రవి చేతిలో పెట్టింది. వాటిని చూడగానే కొడుకు గుర్తుకొచ్చి మళ్ళీ దుఃఖం ముంచెత్తింది ఆమెని.
రవి వాటిని అందుకున్నాడు.
తెల్ల చొక్కా మీద నీలం రంగు కోటు. మొదటి రోజు వాటిని చూసినపుడు ఎంత మోజు పడ్డాడు? కొత్త బట్టలు కొనివ్వమని అమ్మను ఎన్నో సార్లు పోరి ఉంటాడు తను. ఇంత ఖరీదైన కొత్త బట్టలు తన జీవితంలో కొని వేసుకోగలడా? వాటిని చూస్తుంటే ఒక క్షణం బాబి నవ్వు ముఖం కనిపించింది. మరుక్షణం నీళ్ళలో మునిగిపోతూ బాబి పెట్టిన కేకలు....వాడి అచేతనమైన శరీరం గుర్తొచ్చింది. దూరమైన తన చిన్నారి స్నేహాన్ని అనుక్షణం గుర్తు చేసే ఈ బట్టలు తను తీసుకోగలడా....ఊహు.... అసలు ఇక ఎప్పటికీ ఉగాది అంటేనే తన వల్ల దూరమైన బాబి గుర్తొచ్చి పండుగ జరుపుకోలేడేమో ....షడ్రుచుల మేళవింపు అయిన ఉగాది తనకు మాత్రం చేదు జ్ఞాపకం మిగిల్చింది....మనసులో అనుకున్నాడు.
కన్నీళ్ళతో మసకబారిన కళ్ళను తుడుచుకున్నాడు. ఒక్క క్షణం వాటి వైపు చూసి, వాటిని అక్కడే బల్ల మీద ఉంచి వెనుతిరిగాడు రవి.