దాదాపు మూడు నెలల విరామం తర్వాత మళ్ళీ టివిలో సీరియల్స్ మొదలవుతాయని ప్రకటన విన్న సత్యభామ ఆనందం తట్టుకోలేక ఎగిరిగంతేసినంత పని చేసింది. విషయం అర్ధంకాని సత్యభామ భర్త సుందరమూర్తి ఆమె చర్యలకి బిత్తరపోయి ఆమెకి పిచ్చిగానీ పట్టలేదుకదా అని ఓ క్షణం యోచించాడు. ఆ వెంటనే మళ్ళీ తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. అమె తనకి తప్ప ఇంకెవరికైనా పిచ్చి ఎక్కించే సత్తాగలదని అనుభవపూర్వకంగా తెలిసినవాడైన సుందరమూర్తి, "ఏమైందే భామా నీకు? ఏమిటీ వెర్రి చేష్టలు?" అని ఆత్రంగా అడిగాడు.
"అబ్బ ఊర్కోండి! వెర్రి చేష్టలూ కాదు, వెకిలి చేష్టలూ కాదండి. రేపటి నుండి మళ్ళీ నా అభిమాన సీరియల్స్ అన్నీ టివిలో వస్తాయి. అందుకే సంతోషం పట్టలేకపోయాను." అంది ఆనందంగా సత్యభామ.
"ఆఁ..." అంటూ నోరుతెర్చాడు సుందరమూర్తి. ఒక్కసారిగా సుందరమూర్తికి తన గుండెజారి గల్లంతైనట్లు అనిపించింది.
ఇంతకాలం లాక్‌డౌన్ పుణ్యమా అని సీరియల్స్ రాకపోవడంతో టివిలో వార్తలు, భక్తి ఛానల్ చూసే అదృష్ఠానికి నోచుకున్నాడు. ఇకముందు మరి తనకా అదృష్టం లేదన్నమాట. అంతేకాక, సీరియల్స్ లేకపోవడంతో వేళకి భోజనం, టీ, కాఫీలు అందేవి. ఇప్పుడు మరి అవి కూడా సమయానికి అందే అవకాశం లేదు. అందుకే సుందరమూర్తికి ఈ వార్త అసలునచ్చలేదు. అయితే అతని ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా సీరియల్స్ అన్నీ ఉప్పెనలా అన్ని ఛానల్స్‌నీ ఒకేసారి ముంచెత్తాయి. ఆ ఉప్పెనతో కూడిన వరదలో కొట్టుకుపోతోంది సుందరమూర్తి సతీమణి సత్యభామ.
ఇప్పుడు సత్యభామకి క్షణం తీరిక కూడా లేదు. ప్రతి ఛానల్‌లోనూ ఇంతకు పూర్వం తను చూసిన సీరియల్స్ అన్నీ చూడటంలో మునిగిపోయి సుందరమూర్తిని పట్టించుకోవడం మానేసింది. అసలు ఆమెకి ఇప్పుడు ఆశ్చర్యం వేస్తోంది ఇన్నాళ్ళు తను సీరియల్స్ చూడకుండా ఎలా ఉండగలిగిందా అని. రోజంతా సత్యభామ బ్రేక్ లేకుండా సీరియల్స్ చూడటంలో మునిగిపోయినా, రోజుకి రెండుసార్లు ఉదయమొకసారి, సాయంకాలం మరొకసారి మాత్రం దయతలచి సుందరమూర్తికి వార్తలు వినడానికి అవకాశం ఇస్తుంది. అదీ ఆ సమయంలో ఏ సీరియల్స్ రాకపోబట్టి మాత్రమే, అంతేకాని భర్తపై జాలిపడి మాత్రం కాదు. పోనీ కొద్ది సేపైనా ఆ మాత్రం అవకాశం దొరికిందని అల్పసంతోషి అయిన సుందరమూర్తి బోలెడంత ఆనందపడిపోయాడు. సీరియల్స్ రాని వేళలో తప్పించి మిగతా సమయాల్లో ఆమె భర్త మాటకాదు కదా భగవంతుని మాట కూడా వినే స్థితిలో ఉండదు. కాఫీగానీ, టీగానీ, ఆఖరికి భోజనానికి కూడా ఆ సీరియల్స్ తోటే లింక్. వాన చినుకులు, రాధమ్మ వాకిట్లో చేమంతి చెట్టు, అమ్మమ్మ ఇంటికి దారేది, నీ పేరే కామాక్షి, బంగారు కొడుకు, రాధా కళ్యాణం- ఇలా ఏ సీరియల్ కూడా సత్యభామ చూడకుండా వదలదు.
మళ్ళీ ఓ వారం లాక్‌డౌన్, షట్‌డౌన్ విధించారు స్థానికంగా. వారం రోజులకి సరిపడా ఇంట్లో కూరలు తెచ్చేసాడు ముందురోజే. అఫీసుకెళ్ళే పనేలేదు. ఉదయం వార్తలు విని భార్య వండే వంటలో తన వంతు సహాయం అందించాడు. ఇంకా అదృష్టం ఆ సమయంలో సీరియల్స్ లేకపోబట్టీ మధ్యహ్నం భోజనమైనా దొరుకుతోంది. రాత్రి మాత్రం ఆత్మారాముడు ఏంత అరిచి గోలచేసినా ఎన్నిగంటలకి భోజనం దొరుకుతుందో మాత్రం ఆ పరమాత్ముడికే ఎరుక!
ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసి లాక్‌డౌన్ ఇచ్చిన అవకాశం వినియోగించుకొని సుఖనిద్రతీసాడు సుందరమూర్తి. నిద్ర లేచిన తర్వాత ముఖం కడుక్కొని సోఫాలో కూర్చున్నాడు భార్య ఇచ్చే టీ కోసం ఎదురుచూస్తూ. అయితే సత్యభామ మాత్రం ఎంతకీ టివి ముందు నుండి కదలనిదే! అప్పుడు సుందరమూర్తికి గుర్తొచ్చింది సీరియల్స్ పునఃప్రసారమవుతున్న సంగతి.
ఇంతకు మునుపు ప్రతీరోజూ అలవాటైన సంగతే అయినా లాక్‌డౌన్ తర్వాత ఈ మూడునెలలుగా అనుభవించిన ప్రశాంతత వలన ఆ విషయమే పూర్తిగా మరిచిపోయాడు. ఇప్పుడిక తనకి ఈపూటకి టీ తాగే యోగం లేదని ఉసూరుమనేలోగా ప్రకటనల రూపేణా వచ్చిన బ్రేక్ అతన్నికనికరించింది. ఆ ప్రకటనకర్తలకి మనసులోనే ధన్యవాదాలర్పించాడు సుందరమూర్తి. సత్యభామ వెంటనే వంటింట్లోకి వెళ్ళి టీ కలిపి తెచ్చి భర్తకొకటి ఇచ్చి, తనొకటి తీసుకొని తిరిగి చూడకుండా మళ్ళీ సీరియల్ చూడటంలో నిమగ్నమైంది.
టీ తాగిన తర్వాత కొద్దిసేపు పుస్తకం తిరగేసాడు సుందరమూర్తి, అయినా అందులో ఏమాత్రం ఎకాగ్రత కుదరలేదు. సీరియల్ నడుస్తూన్నంతసేపు వచ్చే చెవులు చిల్లులుపడే సంగీతానికి ఏకాగ్రత మాట అటుంచి తలనొప్పి వస్తోంది. పోనీ, వీధిలోకి వెళ్ళి కాసేపు తిరిగి వద్దామన్నా ఈ కరోనా పుణ్యాన అది కుదరదాయె! ఎలాగో ఇంట్లోనే అటూ ఇటూ తిరిగి మొత్తానికి రాత్రి వరకూ ఎలాగో గడిపేసాడు.
రాత్రి 'వానచినుకులు' సీరియల్ మొదలయ్యే సమయమైంది. సత్యభామ సీరియల్ మొదలవడానికి పది నిమిషాలముందే టివి, రిమోట్ తన ఆధీనంలోకి తీసుకుంది. ఇంకా ప్రకటనలు వస్తున్నాయి.
అప్పుడు సుందరమూర్తి, "భామా! నువ్వంత కష్టపడి సీరియల్ చూడాలా! నన్నడిగితే నీకు జరగబోయే కథ చెప్పనూ?" అన్నాడు.
సుందరమూర్తి వైపు సుదూర గ్రహాలనుండి వచ్చిన వింతజీవిని చూసినట్లు చూసింది.
"చాల్లెండి! మీరెప్పుడు ఈ సీరియల్స్ చూసేరు కనుకనా ఇప్పుడు నాకు చెప్పడానికి." అందామె.
అందుకు సుందరమూర్తి సున్నితంగా నవ్వి, "ఆ మాత్రం ఊహించడానికి సీరియలే చూడనవసరం లేదు. కాస్త బుర్ర ఉంటే చాలు. ఈ రోజు ఎపిసోడ్‌లో వారసుడెవరో కనుక్కోవాలని వందన, ఆమె తల్లి వేసిన ప్లాన్ బెడిసికొడుతుంది. కొత్త పథకం వేయాలనుకుంటారు. ఆ ప్రయత్నంలో ఎవరినీ వదలకూడని గట్టిగా నిర్ణయం చేసుకుంటారు. తనవల్ల అందరూ మాట పడుతున్నారని రాముడు రాత్రి అందరూ నిద్రపోయినప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. రాముడు ఎక్కడికెళ్ళాడో తెలియక శ్వేతాంబరి వాడి కోసం వెతుకుతుంది. కావలిస్తే చూడు. నేను చెప్పింది పొల్లుపోకుండా జరగకపోతే అప్పుడు నన్నడుగు!" అన్నాడు.
అతనంత నమ్మకంగా చెప్తూంటే ఆమె అతని వైపు వింతగా చూసింది. కొంపతీసి అతనికి దివ్యదృష్టేమైనా ఉందా అన్న అనుమానం వచ్చిందామెకి.
ఈలోపున ప్రకటనలు ముగిసి ఆమె ఎదురుచూస్తున్న 'వాన చినుకులు ' ప్రారంభవడంతో టివివైపు దృష్టి మరల్చి ఆమె ఆ వాన చినుకుల్లో తడిసి ముద్దవసాగింది. సీరియల్ చూస్తున్నప్పుడు రెప్పవాల్చకుండా చూడటం ఆమె ఘనత. అయితే ఆశ్చర్యం! అంతా సుందరమూర్తి చెప్పినట్లే సీరియల్ నడుస్తోంది. మధ్యమధ్య భర్తవైపు వింతగా చూసింది సత్యభామ, ఏనాడైనా సీరియల్ మొహం చూడనివాడు కొంచెం కూడా పొల్లుపోకుండా అలా ఎలా చెప్పగలిగాడోనని.
సీరియల్ పూర్తైన తర్వాత భర్తవైపు ఆశ్చర్యంగా చూసి, "అంత కరెక్టుగా చెప్పగలిచారు?" అని అడిగింది.
"ఆఁ...అందులో పెద్ద వింతేముంది? ఈ సీరియల్లో ఏముందో చెప్పడానికి ఇంతసేపు చూడాలా? ఉదయమో, మధ్యహ్నమో ఓ పదినిమిషాలు ఆ ఛానెల్ చూస్తే సరిపోదా! ఉదయం..." అంటూ ఇంకా ఏదో చెప్పబోతూంటే అడ్డుకుంది భామ, "ఉండండి, తర్వాత సీరియల్ 'నీ పేరే కామాక్షి’ మొదలవబోతూంది. మీరు చెప్పేదేదో అది పూర్తయ్యాక చెప్పండి." అంది.
"ఈ సీరియల్ కథకూడా చెప్పేయనా? ఇవాళ్టి ఎపిసొడ్‌లో శ్రీహరి కొత్త ప్రాజెక్ట్ ప్రారంభిస్తాడు. కామాక్షికి వచ్చిన టెండర్ కోసం ఫైనాన్సియర్ నుండి అప్పు కోరుతుంది. అతను తనకి సరితా సగర్వాల్ హెచ్చరించినట్లు ఫలిక డిజైన్ తాకట్టు పెట్టమని అంటాడు. ఇప్పుడు సీరియల్ చూడు, నీకే తెలుస్తుంది." అన్నాడు సుందరమూర్తి.
"ఆగండి! మీరిలా చెప్తూపోతూంటే నేను సీరియల్ చూసేదెలా?" అని విసుక్కొని, 'నీ పేరే కామాక్షి ' సీరియల్ చూడటంలో మునిగిపోయింది సత్యభామ. అయితే విచిత్రం! ఈ సీరియల్లో కూడా సుందరమూర్తి చెప్పినట్లే జరిగింది. అతనికేమైనా దివ్యదృష్టి ఉందా అని కలవరపడ్డదో క్షణం. నిజంగానే తన భర్తకి అలాంటి దివ్యదృష్టి గనుక ఉంటే తను యమడేంజర్‌లో పడుతుంది. భర్తకి తెలియకుండా తనేమో ప్రతీనెలా ఇంటిఖర్చుల్లోంచి కొంత డబ్బులు నొక్కేసి డైమండ్ నెక్లెస్ కొనుక్కోవాలని అనుకుంది. సుందరమూర్తి తన దివ్యదృష్టిద్వారా ఇలాంటివి కనిపెట్టేస్తే తనగుట్టు రట్టైపోదూ అని పరిపరివిధాల ఆమె మనసు అలోచించింది.
అదే విషయం సుందరమూర్తిని అడిగింది. ఆమె మాటలకి అతను విరగబడి నవ్వేడు.
"ఇలాంటివి చెప్పడానికి దివ్యదృష్టికూడా అవసరమా? ఏదో సమయంలో కొద్ది సేపు టివి చూస్తే ఆ రోజు ఎపిసోడ్ మొత్తం అర్ధమయిపోదూ? అసలు ప్రతీరోజూ వార్తల మధ్యలోనో, ఆ తర్వాతో సీరియల్ యొక్క ప్రకటన వస్తుంది. అందులోనే కథంతా ఉంటుంది. అంతేకాక స్క్రోలింగ్ కూడా వస్తుంది, కావలిస్తే చూడు. ఉదాహరణకి, 'వందన తన తల్లితో కలిసి పథకం వేస్తొందా? తనవల్ల అందరూ మాట పడుతున్నారని రాముడు ఇల్లు విడిచిపోతాడా? శ్వేతాంబరి అతనికోసం వెతుకుతుందా?' మరి ఇవిచూస్తే ఆ ఎపిసోడ్లో ఏమి వస్తుందో తెలియదా! అంతసేపు కష్టపడి సీరియలే చూడాలా? ఆలోచించు!" అన్నాడు.
అదా అసలు కిటుకు, ఇంకా సుందరమూర్తికే దివ్యదృష్టి ఉంటే తనకెక్కడ ఇబ్బంది కలుగుతుందోనని భయపడినందుకు మనసులోనే సిగ్గుపడింది సత్యభామ. 'అవును మరి! రోజంతా సీరియల్ ప్రకటనలే ఉంటే కథ ముందుగా తెలిసిపోదా! అయితే మాత్రం, అలాగనిచెప్పి తను సీరియల్ చూడకుండా ఉండగలదా! అమ్మో!' అనుకుంది.
"మీరు చెప్పేది నిజమే, అయినా కథ తెలిసినంత మాత్రాన అయిపోయిందా! వాళ్ళ అభినయం చూడొద్దూ! మీరెన్ని చెప్పండి, సీరియల్స్ చూడకుండా ఉండటం నేను మానలేను! ఇంకో విషయం, ఇలా ప్రతీరోజూ సీరియల్ మొదలైయ్యేముందు నాకు ఇలా కథ చెప్తే మాత్రం ఊరుకునేది లేదు. టీ, కాఫీ, భోజనానికి కూడా లాక్‌డౌన్, షట్‌డౌన్ విధించేయగలను జాగ్రత్త!" అని ఘాటుగా హెచ్చరించిందామె.
'అమ్మో! అసలే హోం డిపార్ట్‌మెంట్! అలా చేసినా చేయగలదు!' ఇంకేమంటే బుమేరాంగై మళ్ళీ తనమీదకు వస్తుందోనని మారు మాటాడక పుస్తకాల్లో తలదూర్చాడు పాపం సుందరమూర్తి. అవును! అంతేగా మరి!