మనమిప్పుడు మాట్లాడుకుంటున్నది......
"అమ్మో మా ఆవిడ గయ్యాళి! ఆవిడ నోటికి ఎవరైనా దడవ వలసిందే! ఆవిడ కళ్ళల్లోకి చూసి మాట్లాడేంత ధైర్యమా! అనేవెంకట్రామయ్య ..మా ఆయన అలా అమాయకంగా "కాంప్లాన్ బాయ్" లాగా కనపడతారు కానీ! ముంగిలాగా సైలెంట్కిల్లర్ అని భర్త గురించి మాట్లాడే...దుర్గమ్మల గురించి కాదు!"
"సినిమాకి వెళదామంటే షికార్ కి"...."మా ఫ్రెండ్ ఇంటికి వెళదామంటే...ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వాళ్ళ హాస్పిటల్ కి వెళ్ళితన వేలు విడిచిన మేనమామ కూతురు అత్తగారిని చూసి రావాలని"...."గారెలు చెయ్యమంటే బొబ్బట్లే వండుతానుఅని"...."టీవీలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన "ఆనందో బ్రహ్మ" సీరియల్ చూద్దామంటే అర్ధం కాని హిందీ ఆర్ట్మూవీ చూద్దామనే" చండిక లాంటి భార్యతో కలిసి బ్రతుకుతున్న రాంబాబు దంపతుల గురించి అసలే కాదు!
"అబ్బా.... ఆయనని భర్తగా పొందటం నా పూర్వ జన్మ సుకృతం, ఏ బంగారు పువ్వుల పూజ చేశానో...మాటలో మాట, పనిలో పని శృతిలయల్లాగా...వాగర్ధాల్లాగా కలిసిపోయాము"అని భార్య ..."డబ్బైతే సంపాదించగలం కానీ అన్ని విధాలఅనుకూలవతి అయిన భార్య దొరకటం మన చేతిలో లేదు! నేను సరిగ్గా ఏది ఆలోచిస్తానో తన నోట్లోంచి అదే మాటవస్తుంది! అలాంటి భార్యని పొందే అదృష్టం ఉండాలోయ్, నేను ఆ కొద్దిమంది లో ఉన్నందుకు సంతోషిస్తున్నాను" అనిఆనందంగా చెప్పే భర్త! ...వీరి జంట చూడ ముచ్చట..కన్నుల పండుగ అని నలుగురూ అనుకునే శైలేష్-గిరిజల గురించికూడా కాదు!"
మరెవరి గురించి???
అదిగో అదే చెప్పబోతున్నా...సావధానంగా వినండి మరి!
******** *********
చంద్రవదన్.. మధులిక వివాహం, అంగరంగ వైభవంగా అని చెప్పలేము కానీ, బాగానే జరిగింది.
అలా ఎందుకన్నానంటే చంద్రవదన్ కి, మధులిక కి కూడా ఆఫీస్ లో కావలసినంత సెలవు పెట్టే వెసులుబాటూ లేదు. లీవూ లేదు. అప్పటి వారి పరిస్థితి అది.
మరి అలాంటప్పుడు వివాహం వాయిదా వేసుకోవచ్చు కదా..అని మీరడగచ్చు!
ఆ యేడు ముహూర్తాలు తక్కువ, మూఢాలు ఎక్కువ.
చంద్రవదన్ బామ్మ గారు పెద్దావిడ! 🤔🤔
ఆవిడగారు అటో ఇటో అయితే...ఆడపిల్లైతే చేసెయ్యచ్చు కానీ... మగపిల్లవాడి పెళ్ళి ఏడాది వరకు చెయ్యలేరు! ...ఏటిసూతకం సమస్య!
అంచేత ఇలా ఆదివారానికి కుదిరిన ముహూర్తానికి అటొక రోజు ఇటొక రోజు సెలవు పెట్టి ముచ్చటగా మూడు రోజులసెలవుతో పెళ్ళి చేసుకున్నారు! ...రిజిస్టర్ పెళ్ళి కాకుండా...సంప్రదాయపు పెళ్ళి కాబట్టి...జరిగిన పెళ్ళిని వైభవంగాజరిగిందనే చెప్పాలి మరి!
మొదటి రాత్రి...చంద్రవదన్ ముచ్చటగా భార్యతో..."మన కొత్త కాపురానికి నీ ఆఫీస్ కి దగ్గరగా ఇల్లు వెతికి భలే మంచి పనిచేశావ్. ఎల్లుండి ఇంచక్కా నీ బట్టల పెట్టెతో నువ్వూ, నా బ్రహ్మచారి సూట్ కేస్ తో నేను సింపుల్ గా కాపురంప్రారంభించచ్చు."
"పగలు నేను ఫ్యాక్టరీ లోనే భోజనం, ఓన్లీ రాత్రి భోజనమే ఇంట్లో! పగలు నీ ఒక్కదానికి వంట చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఎక్కువ సామాను అక్కరలేదు. నిదానంగా కొనుక్కుందాం. నా దగ్గర ఒక మంచమున్నది..ఒక పరుపు, రెండు దిళ్ళు, నాలుగు దుప్పట్లున్నాయ్" అని నిరాడంబరంగా బ్రతకటం తనకి వెన్నతో పెట్టిన విద్య అన్నట్టు భార్య మొహంలోకిసాలోచనగా చూసి సందేహంగా ఆగాడు చంద్రవదన్.
"ఏమిటి ఏదో చెప్పాలని సందేహిస్తున్నట్లున్నారు?"అన్నది.
పెళ్ళికి ముందు కలిసిన ఒకటి రెండు సార్లలో....తన పనేమో తనదే కానీ అన్ని విషయాలు లోతుగా పట్టించుకుని, ఘాటుగా విమర్శించే స్వభావం మధులికది కాదని పసికట్టాడు..చంద్రవదన్.
ఇప్పుడదే పాయింట్ మీద తను ముందుకెళ్ళచ్చు అని నిర్ధారించుకుని.. "ఆ(: ఏం లేదు... మా చెల్లిని మన దగ్గరపెట్టుకుని చదివిద్దాం. నీకు తోడుగా ఉంటుంది" అని నెమ్మదిగా తన అమ్ముల పొదిలో మొదటి బాణం బయటకితీశాడు.
అతని దగ్గర ఉన్న సామానుతో... అతను చెప్పే నిరాడంబర జీవితం అతని చెల్లితో సహా గడపటం సాధ్యమా అనేసందేహం అప్పుడు మధులికకి కలగలేదు మరి!
అందుకే అందులో పూర్వాపరాలు ఆలోచించే సమయం లేక (కాక) ఇదేం పెద్ద విషయం అని బేషరతుగా భర్తకి తనఅంగీకారం తెలియచేసింది... నిజాయితీతో భర్తననుసరించే భార్య లాగా!
ఆడపడుచు రావటం, కాలేజిలో చేరటం జరిగిపోయింది.
మధులిక-చంద్రాల కాపురం మాటా-మంతీ...ఏ పొరపొచ్చాలూ లేకుండా నడిచిపోతున్నది.
******** *********
వారానికో రకం షిఫ్ట్ లో పని చేసే మధులిక ...ఉదయం ముగ్గురికీ వంట చేసి ఆఫీస్ కి తయారయ్యే హడావుడి లోఉంటుంది. చంద్రవదన్ అంతకంటే హడావుడిలో ఉంటాడు.
వీరిరువురూ ఆఫీస్ కి వెళ్ళేవరకు ఆడపడుచు నిద్రే లేవదు కాబట్టి..ఎవరితో ఎవరూ...మాట్లాడుకునే అవకాశంఉండదు..నచ్చని విషయాల మీద పోట్లాడుకునే తీరికా ఉండదు!
ఆదర్శ కుటుంబమన్నమాట!
జనరల్ షిఫ్ట్ లో పని చేసే చంద్రవదన్ సాయంత్రం ఆఫీస్ నించి వచ్చేసరికి, మధు ఇంకా ఇంటికి రాదు! మధుతిరిగొచ్చేసరికి చంద్రవదన్ ఫ్రెండ్స్ తో బయటికెళ్ళిపోతాడు. అతను తిరిగొచ్చేసరికి ఉదయం నించీ ఉండే పనితోఅలిసిపోయిన మధు భోజనం చేసి పడుకుంటుంది.
ఇక వాళ్ళకి చెల్లెలి చదువు గురించి మాట్లాడుకునే టైమూ లేదు....ఇంటి పని సహాయం విషయంలో తనకున్న చిన్న చిన్న అసంతృప్తులు వ్యక్త పరుస్తూ..ఘర్షణ పడే అవకాశమూ లేదు.
వారమంతా పగలు చంద్రం ఇంట్లో భోజనం చెయ్యడు కనుక ఆదివారం "పాపం.. వారమంతా ఆఫీస్ లో ఏం తింటాడోరుచి పచి లేని భోజనం" అని మధు అతనికిష్టమైన వంటలు చేస్తుంది. వారానికి ఆటవిడుపు దొరికే ఒకే రోజు అనిఅతను ఫ్రెండ్స్ తో బయట తిరిగి వారితోనే భోజనం చేసి వచ్చేస్తాడు.
వారానికంతా కావలసిన సరుకులు, కూరలు తెచ్చుకోవటం, పిల్లల హోం వర్కులు చూస్తూ వారిని చదివించే పనిలో ఉన్నమధు, చంద్రం భోజనానికి రానందుకు నిలదియ్యదు..అతని తీరంతే...అని ఊరుకుంటుంది!
"పోనీలే ఈ పూట అతను తినకుండా మిగిలినవాటితో రాత్రి నడిచిపోతుంది" అని చేసేదేం లేక సరిపెట్టుకుంటుంది!
పిల్లలు పుట్టాక...వారికి వచ్చే చిన్నా చితకా అనారోగ్యాలు..డాక్టర్ల అవసరాలకి.."నాకీ రోజు అర్జెంట్ మీటింగ్ ఉంది! నీ పనిపాడు చేసుకుని నువ్వెళ్ళక ఎటూ తప్పదు...నాది కూడా పాడు చేసుకోవటం ఎందుకు? ఇద్దరం వెళ్ళి చేసేదేముంది? చదువుకున్న దానివే కదా.. నా కంటే నువ్వే బాగా పిల్లల అనారోగ్యం గురించి చెప్పగలవు. పక్కింటి ఆంటీ ని సాయంతీసుకెళ్ళు" అని ఉచిత సలహా పడేసే భర్తని రెండో సారి అడగకుండా ఒంటరిగా పిల్లలని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళకచేసేదేముంది మధులికకి!
భార్య ఉద్యోగం చేస్తున్నది కాబట్టి ఇంటి పనులు తనకీ బాధ్యతే అని స్వచ్చందంగా ముందుకు రాని భర్తని, అరిచిలొంగతియ్యటం కష్టమని అనేక అనుభవాలతో తేల్చుకున్న మధులిక "గోల పడ్డ కాపురం కోలుకోదు" అని చిన్నప్పటి నించీఅమ్మ చెప్పిన మాటలు వంటపట్టించుకుని..తన పని చేసుకుంటూ పోవటం అలవాటు చేసుకుంది.
ఇదంతా... ఇంట్లో వారికి ప్రతి పనికి కాళ్ళకీ..చేతులకీ అడ్డం పడకుండా తనకి నచ్చినట్లు బ్రతికే స్వేచ్చనివ్వటం చంద్రందృష్టిలో.
అదృష్టవశాత్తూ ఫ్రెండ్స్ తో బయటికెళ్ళకుండా.. ఏ ఆదివారమో అతను ఇంట్లో ఉండి ఇద్దరూ కాస్త తీరుబడిగా ఉండేఅవకాశం ఉంటే, ఇంట్లోకి ఏ ఫర్నిచర్ కొనాలి? ఎంత బడ్జెట్? తమ దగ్గర ఉన్న డబ్బు సరిపోతుందా..లోన్ తీసుకోవాలా? చెల్లెలి పెళ్ళి చెయ్యాలి కనుక..ఎలాంటి సంబంధం వెతకాలి? ఎంత బడ్జెట్ లో పెళ్ళి చెయ్యాలి? అని టూకీగామాట్లాడుకోవటానికే సరిపోతుంది.
మధులిక తన జీతంతో ఇల్లు నడపగలదు కనుక అతనికెంత జీతం అనిఎప్పుడూ అడిగి ఎరగదు! అతను చెప్పాలనీఅనుకోలేదు! నీ సంపాదన ఏం చేస్తున్నావు అని ఎన్నడూ ఆవిడ అడగలేదు, ఫలానాదిచేస్తున్నానని ఇతను చెప్పనూలేదు. అడిగితే కదా గొడవలు..తగాదాలు
"ఇల్లు నడపటానికి నీ జీతం సరిపోతోందా? పిల్లలకి నగలేమైనా చేయించావా?" ఏ పండగో వచ్చినప్పుడు "పిల్లలకి, నీకుపండక్కి బట్టలు కొన్నావా" అని ఎప్పుడూ అనవసర విషయాలు (అతని దృష్టిలో) అడిగి ఇంటి విషయాల్లో తలదూర్చనిఆదర్శ కుటుంబ యజమాని అతను.
"నీకీ చీర బాగా నప్పిందని" మెచ్చుకోవటం కానీ, "ఈ నగ నాకు బోనస్ వచ్చిన సందర్భంలో కొనాలనిపించిందని" కొన్నసందర్భాలు కానీ మచ్చుకి లేవు. అయినా ఆవిడ చిన్నపుచ్చుకోదు పాపం...అతని తీరు తెలిసి కోరికలు పెట్టుకుంటేమిగిలేది అసంతృప్తే అనే విషయం ఇప్పటికి బాగా జీర్ణమయింది మరి!
అవసరాన్ని బట్టి తనకి, పిల్లలకి నచ్చినవి కొనటానికి ఒంటరిగానే షాపింగ్ చేస్తూ ఉంటుంది...మధులిక.
వీళ్ళిద్దరూ గట్టిగా మాట్లాడుకోగా (అరుచుకోవటం అసలే లేదు) ఇంట్లో పిల్లలే వినలేదు..ఇక ఇలాంటి వీరు ఇరుగు-పొరుగు దృష్టిలోఅన్యోన్యమైన దంపతులేగా!
ఆదర్శ దాంపత్యం అనుకోవటానికి ఇంతకంటే కావలసిన లక్షణాలేముంటాయ్ చెప్పండి?
"మీ తల్లిదండ్రుల బాధ్యతలు మనమెందుకు తీర్చాలి అని అడగకుండా పెళ్ళి-పేరంటాలు ఒంటి చేత్తో పూర్తి చేసిందికాబట్టి.. "అనుభవజ్ఞురాలు..సమర్ధతతో ఎంతటి పనైనా చక్క పెట్టెయ్యగలదు అని పొగడ్తలతో జామ చెట్టెక్కించి ....తనపిల్లల పెళ్ళిళ్ళ విషయంలో కూడా ఏ మాత్రం కలగచేసుకోకుండా (అతని సహాయం అవసరమైన సమయంలో కూడా) ఆవిడకి కావలసినంత స్వతంత్ర్యం ఇచ్చేశాడు అతను..
భార్యా-భర్త గొడవపడటమనేది సర్వ సాధారణమైన పరిస్థితిలో... ఇలా గొడవలు..ఘర్షణా లేకుండా నలభయ్యేళ్ళుగడిచింది...మధులిక-చంద్రం జీవితాల్లో!
********* *********
ఇప్పుడు వారిద్దరూ రిటైర్ అయ్యారు.
ఇప్పుడు చంద్రం తన గదిలో తను లాప్టాప్ చూసుకుంటూ, సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ రోజంతా గడిపేస్తాడు!
"పెద్ద వయసొచ్చింది..ఒంట్లో ఎలా ఉన్నది అని అడగటం కానీ...ఈ రోజు పెద్ద హడావుడేం లేకుండా సింపుల్ గా ఏదోఒకటి వండెయ్ అని వెసులుబాటు ఇవ్వటానికి కూడా రూం లో నించి బయటికి రాకుండా... "వంటైంది...భోజనానికిరావచ్చు అని ఆవిడ పిలిస్తే కాని హాల్లోకి రాని "వినయ విధేయ రాముడు" ఆయన!
ఇంటి పనులయ్యాక ...పుస్తకాలు చదువుకుంటూ..."గడి-నుడి" నింపేసుకుంటూ కాలం గడిపేస్తూంటుంది ఆవిడ!
ఇంట్లో రెండు టీవీలు...
నచ్చిన ప్రోగ్రాం, నచ్చిన టైంలో ఎవరికి వారు చూసుకునే స్వేచ్చ!
ఇక గొడవలకి ఆస్కారమే లేదు.
"పిల్లలు ఫోన్ చేశారా?" అనడుగుతాడు చంద్రం.
"ఆ(: పొద్దున (అంటే వాళ్ళ రాత్రి అమెరికాలో) చేశారు. అప్పటికి మీరింకా నిద్ర లేవలేదు" అని మధులిక చెబితే "ఓహో" అని న్యూస్ పేపర్ లో తలదూర్చే ఘనుడాయన!
ఇప్పుడు చెప్పండి...
పెళ్ళైన మొదటి సంవత్సరం వారికి మాత్రమే వినిపించేటంత గుస గుసగా మాట్లాడుకుంటూ, ఓ ఏడాది గడిచేసరికిఊరంతా వినిపించేటంత గట్టిగా పోట్లాడుకుంటూ వినోదాన్ని అందించే భార్యా-భర్తలుండే రోజుల్లో
ఏ రోజూ, ఏ సందర్భానికి ఘర్షణ పడని వీరిది ఆదర్శ దాంపత్యం కాదంటారా?
వీరిని చూసి నేర్చుకోవటానికి ఏమైనా ఉందంటారా? లేదంటారా?