తీర్పు (బాలల కథ) - పద్మావతి దివాకర్ల

Judgment moral story

బ్రహ్మపురం అనే గ్రామంలో నివసించే రామయ్య అనే వ్యాపారస్థుడు తన కుమార్తె పెళ్ళి కోసం బంగారు ఆభరణాలు కొనడానికి పట్నం వెళ్ళాడు. పట్నంలో కావలసినవి కొనుగోలు చేసిన తర్వాత చూసుకుంటే బాగా పొద్దుపోయింది. అంత రాత్రివేళ విలువైన నగలతో తమ గ్రామానికి వెళ్ళడం క్షేమం కాదని తలచి సత్రవులో రాత్రిపూట గడపడానికి నిశ్చయించుకున్నాడు.

అయితే రామయ్య వద్ద విలువైన ఆభరణాలు ఉండటం పసిగట్టిన రంగడు అనే దొంగ వాటినెలాగైనా అపహరించాలనుకున్నాడు.

చూడటానికి పెద్దమనిషిలా వేషం వేసుకుని రంగడు కూడా అదే సత్రంలో బస చేసాడు. ఆ తర్వాత రామయ్యని పరిచయం చేసుకున్నాడు.

"అయ్యా! నేను రామాపురంలో నివసించే వ్యాపారిని. నేను నా కుమార్తె పెళ్ళికి నగలు కొందామనుకుంటున్నాను. ఈ పట్నంలో ఎవరివద్ద బంగారం నగలు బాగుంటాయో కాస్త చెప్పగలుగుతారా?" ఏమీ తెలియనట్లు అడిగాడు రామయ్యని. రంగడి మాటల్లోని మాయామర్మం తెలియని రామయ్య తను కొన్ననగల దుకాణం పేరు చెప్పి అక్కడ తనేమి కొన్నాడో కూడా వివరంగా చెప్పాడు.

ఇంకేం, రంగడికి కావలసిన సమాచారం అంతా సులభంగానే దొరికిపోయింది! రామయ్య నగలు తస్కరించడానికి ఓ ఉపాయం పన్నాడు. అ మరుసటి రోజు ఉదయం రామయ్య తన నగలు ఉంచిన సంచీ తీసుకొని ఊరికి ప్రయాణమయేంతలో, "బాబోయ్! నా నగలు అపహరించి పట్టుకుపోతున్నాడు. దొంగ! దొంగ!!" అంటూ బిగ్గరగా అందర్నీ పిలిచి గలాటా చేసాడు. రామయ్య ఈ హఠాత్ పరిణామానికి బిత్తరపోయి చూసేసరికి, చుట్టుపక్కల మూగిన జనంతో రంగడు, "చూడండి, చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నా ఇతను ఓ పెద్ద దొంగ. నేను నా కుమార్తె పెళ్ళికి బంగారు నగలు కొని ఈ సంచీలో ఉంచాను. నా నగలన్నీసంచీతో సహా ఇతను దొంగిలించాడు." అని ఫిర్యాదు చేసాడు.

అప్పటికి రంగడి దురుద్దేశం అర్థమైన రామయ్య వెంటనే తేరుకొని, "ఈ నగలన్నీ నావి, నేనే నిన్న నా కుమార్తె పెళ్ళి కోసం కొన్నాను. ఇతనే నా నగలు కాజెయ్యలని చూస్తున్నాడు." అన్నాడు.

"శుద్ధ అబద్ధం. అందులో ఏమేం నగలు ఉన్నాయో చెప్పగలను నేను కావలిస్తే!" అని ఆ ముందు రోజు రాత్రి రామయ్య నుండి సేకరించిన నగల వివరాలు అక్కడున్నవాళ్ళకి వివరించాడు.

నగల వివరాలన్నీ సరిగ్గా చెప్పడంతో ఇప్పుడు అందరి దృష్టి రామయ్య వైపు మరలింది. అక్కడ మూగిన జనమంతా రామయ్యని అనుమానంతో చూసారు. అప్పుడు రామయ్య, "ఈ నగలు నేను నా కుమార్తె వివాహం కోసం కొన్న నగలు. ఈ పట్నంలో వరహాల శెట్టి దుకాణంలో నిన్నే కొన్నాను. కావలిస్తే విచారించండి." అన్నాడు.

"అలా అయితే వరహాల శెట్టిని అడిగితే నిజమేమిటో తేలిపోంది." అని సత్రవు నిర్వాహకుడు తన పనివాడిని వరహాలశెట్టి ఇంటికి పంపించాడు.

ఆ మాట వినగానే దొంగ అయిన రంగడి గుండెల్లో రాయిపడింది. నగల వివరాలు అన్నీ సరిగ్గా చెప్పి వాటిని కాజేయాలని అనుకున్నాడు కానీ, సత్రవు నిర్వాహకుడు ఇలా వరహాలశెట్టిని పిలిపిస్తాడని అనుకోలేదు రంగడు. కథ అడ్డం తిరగడంతో అక్కణ్ణుంచి మెల్లగా తప్పించుకు పోదామని చూసాడు కానీ వీలుపడలేదు.

ఈ లోపు సత్రవు నిర్వాహకుడు పంపిన పనివాడు తిరిగి వచ్చి, వరహాల శెట్టి ఏదో పనిపడి ఆ ఉదయమే రాజధానీ నగరం వెళ్ళాడని, వారం రోజులవరకూ తిరిగిరాడని తెలిపాడు. ఆ సంగతి విని రామయ్య కంగు తిని విచారించగా, రంగడు మాత్రం సంతోషించాడు అదృష్టం తనవైపు ఉండి తనకు ఆ నగలు దక్కబోతున్నందుకు.

అయితే రామయ్య, "ఇది అన్యాయం! నేను కొన్న ఆభరాణాల వివరాలన్నీ నా నుండే నిన్న రాత్రి సేకరించి ఇప్పుడు నన్ను మోసం చెయ్యాలని చూస్తున్నాడితను." అని ఆరోపణ చేసాడు.

"కాదు! ఈ ఆభరణాలు నావే! నేను వరహాల శెట్టి దుకాణమునుండి కొన్నవి ఇతనే తస్కరించాడు. నా నగలు నాకు ఇప్పించండి." అని పట్టుపట్టాడు రంగడు.

ఇదిలా తేలే వ్యవహారం కాదని ఆ ఇద్దర్నీ న్యాయాధికారి వద్దకు తీసుకువెళ్ళాడు ఆ సత్రవు నిర్వాహకుడు.

న్యాయాధికారి న్యాయపతి రామయ్య, రంగడు ఇరువురి వాదనలు విన్నాడు.

రామయ్య వాలకం చూస్తూంటే అతను అబద్ధం చెప్తున్నట్లు అనిపించలేదు న్యాయపతికి. అయితే రంగడు మోసగాడు అని నిర్ధారించడానికి ఏ ఆధారాలు కూడా లేవు. రామయ్య, రంగడూ, ఇద్దరూ కూడా నగలవివరాలు సరిగ్గానే చెప్పగలగుతున్నారు. సాక్ష్యం చెప్పగలిగే వరహాలశెట్టి వారం రోజులదాకా రాడు. ఏం చేయాలో న్యాయపతి వెంటనే నిర్ధారణ చేయలేకపోయాడు. కొద్దిసేపు ఆలోచించిన మీదట అతనికి ఓ ఉపాయం తట్టింది. వాళ్ళిద్దరివైపు చూసి, "ఈ నగలు ఎవరివన్నది తేల్చడానికి నాకు కొంత వ్య్వవధి కావాలి. ప్రస్తుతం ఈ నగల సంచీ నా వద్దనే ఉంటుంది. ఈ రోజు మీరిద్దరూ సత్రవులో బస చేసి, రేపు ఉదయం కనిపించండి. నా తీర్పు చెబుతాను." అన్నాడు న్యాయపతి.

ఇద్దరూ తిరిగి సత్రవు చేరుకున్నారు. రామయ్య తన దురదృష్టాన్ని తాను నిందించుకుంటూ విచారంగా ఉంటే, రంగడు మాత్రం తీర్పు తనపక్షానే ఉండవచ్చన్న ఆనందంలో ఉన్నాడు.

ఆ రాత్రి రంగడ్ని ఒక వ్యక్తి రహస్యంగా కలిసి, "నీకు అనుకూలంగా రేపు న్యాయాధికారి తీర్పు ఇవ్వాలంటే నువ్వు అతనికి వందవరహాలు కానుకగా సమర్పించుకోవలసి ఉంటుంది. అది నీకు సమ్మతమేనా? న్యాయాధికారి పంపగా వచ్చాను. నీకు సమ్మతమైతే ఆ వంద వరహాలూ ఇస్తే రేపు తీర్పు నీకు అనుకూలంగా ఉంటుంది." అన్నాడు.

రంగడు సంతోషంగా అందుకు ఒప్పుకుని వందవరహాలు ఆ వ్యక్తికి ఇచ్చాడు.

అలాగే ఇంకోవ్యక్తి, రామయ్య వద్దకు రహస్యంగా వచ్చి రంగడికి చెప్పినట్లే చెప్పాడు. ఆ వ్యక్తి అన్నమాటలకు రామయ్య దుఃఖిస్తూ, "ఈ లోకంలో న్యాయం ధర్మం ఉన్నాయని ఇంతవరకూ అనుకున్నాను. ఆ నగలు నావేనని నిరూపించటంకోసం న్యాయధికారికి కానుకలివ్వాలా? ఇంతకన్న అన్యాయం, ఘోరం ఇంకేమైనా ఉందా? న్యాయాధిపతే ఇలాంటి అన్యాయం చేస్తే నాలాంటివారు ఎలా బ్రతకాలి?" అని ఆక్రోశించాడు.

అంతవరకూ చాటుగా ఉండి ఆ మాటలు వింటూన్న న్యాయాధికారి న్యాయపతి తన అనుచరులతో వెంటనే సత్రవులోపలకు వచ్చాడు. రామయ్యని, రంగడ్ని పిలిచాడు.

రంగడ్ని ఉద్దేశించి, "నువ్వు మోసగాడివి కనుకనే ఆ నగలు కాజేయటానికి వందవరహాలు కానుకగా ఇచ్చావు. ఆ నగలు రామయ్యవి కావటం మూలాన అతను కానుకలు అడిగినందుకు నన్ను నిందించాడు. ముందునుండీ నాకు నీపైన అనుమానం ఉన్నా, పరీక్షించి నిజం తెలుసుకోవటానికి నా మనిషిని పంపాను. నువ్విచ్చిన వంద వరహాలు జరీమనా కింద జమపరచబడుతుంది. అంతేకాకుండా రామయ్యలాంటి వ్యక్తిని మోసగించడానికి ప్రయత్నించినందుకు మూడు నెలల కారగార శిక్ష విధిస్తున్నాను." అని తీర్పు ఇచ్చాడు.

న్యాయాధికారి నుండి నగల సంచీ అందుకున్న రామయ్య అతన్ని నిందించినందుకు నొచ్చుకొని తన కృతఙతలు తెలియజేసాడు.

రంగడ్ని ఊరి కొత్వాలు బంధించి కారాగార శిక్ష అమలుజేయడానికి తీసుకువెళ్ళాడు.

న్యాయధికారి న్యాయపతి తీర్పుని చూసినవారందరూ హర్షించారు. సరైన తీర్పుకు అందరూ న్యాయపతిని వేనోళ్ళ కొనియాడారు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.