సహనం - జె. యు. బి. వి. ప్రసాద్

Patience

బియ్యే పరీక్షలు రాయకుండానే, పెళ్ళి కుదరడం, ముహూర్తాలు పెట్టేసుకోవడం జరిగి పోయాయి, సునీతకి.

“నాయనమ్మా! నేను ఆ వెధవ పరీక్షలు రాయనే. పెళ్ళి, ముందే అయిపోతుంది కదా? ఇక చదువు మానేసి, కాపురానికి వెళిపోతానే” అంటూ గారాలు పోయింది సునీత.

“ఛీ! నోరు ముయ్యవే! అంత పెద్ద చదువులు చదివి, ఇంజినీరు ఉద్యోగం చేసేవాడి పెళ్ళం, కనీసం బియ్యే అన్నా కాకపోతే, అందరూ నవ్వుతారే! బియ్యే పూర్తి చేస్తావని చెబితేనే, పెళ్ళికి ఒప్పుకున్నారు. వాళ్ళ కుటుంబంలో చదువుకున్న ఆడపిల్లలు లేరట. నోరు మూసుకుని, పెళ్ళి చేసుకుని పరీక్షలు రాసి, అప్పుడు కాపరానికి వెళ్ళు” అంటూ కేకలేసింది నాయనమ్మ.

“సరే లేవే” అంటూ అయిష్టంగానే ఒప్పుకుంది సునీత.

తల్లి దగ్గిర కన్నా, నాయనమ్మ దగ్గిరే గారం, చనువు ఎక్కువ సునీతకి. తండ్రి లేని సంసారం. ఇంటి పనీ, మిగిలిన పిల్లల పనీ తల్లి చూసుకుంటే, సునీత పెంపకం, ఇంటి పెత్తనం నాయనమ్మ చూసుకుంది.

అలా చూస్తుండగానే, సునీత పెళ్ళయిపోయింది ఇంజినీరు మోహన్‌తో.

పెళ్ళయిన సాయంత్రం, చుట్టాల మధ్యలో కూర్చుని మాట్టాడుకుంటున్నారు కొత్త పెళ్ళి కూతురూ, కొత్త పెళ్ళి కొడుకూ.

“బియ్యే అయ్యాక, మీరు ఎమ్మే చదువుతారా పెళ్ళయ్యాక?” అని మోహన్ పెత్తల్లి కొడుకు, నరసింహం అడిగాడు సునీతని.

ఒక్క సారిగా సునీత జడుసుకుంది. “ఇదెక్కడి తద్దినం” అని మనసులోనే విసుక్కుంది.

“లేదండీ! నాకు, ఇక చదవడం ఇష్టం లేదండీ” అంటూ తెచ్చి పెట్టుకున్న వినయంతో చెప్పింది సునీత.

“మరి ఉద్యోగం చేస్తారా?” అనడిగాడు నరసింహం, తన మరదలిని జీడి పాకంలా వదలకుండా.

దగ్గిర్లో కర్ర వుంటే, అది తీసుకుని నరసింహాన్ని ఒక్కటేసేదే, సునీత. కనీసం, మనసులో అలా వేసేసింది, తనను ఇరకాటంలో పెడుతున్నందుకు.

“లేదండీ! నాకు, ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేదండీ!” అంది ఇంకా ఎక్కువ వినయంతో.

“అబ్బ! రోజంతా ఎక్కడికో పోయి ఉద్యోగం చెయ్యాలా? దానికి పెళ్ళెందుకూ?” అని కూడా అనుకుంది మనసులో.

ఇంకేమడగాలో తెలియక, వూరుకున్నాడు నరసింహం.

“అమ్మయ్య! బాగా జవాబులు చెప్పాను” అనుకుంటూ సంతోషించింది సునీత.

“చదువూ లేకుండా, ఉద్యోగం లేకుండా ఏం చేస్తావూ?” అని అడగలేదు మోహన్. అలా అడగడం కుసంస్కారంగా భావించాడు.

“తన కిష్టమైనది తను చేస్తుంది” అని ఆ విషయం వదిలేశాడు మోహన్.

సునీత కాపరానికి వెళ్ళింది. ఆ ఇంట్లో వుండేది ముగ్గురే. అత్తగారూ, సునీతా, మోహన్.

అలవాటుగా ఇంటి పనులు, అత్తగారే ఎక్కువగా చేసుకునేది. సునీత పని కాస్త సాయం చేయడం, మోహన్ ఇంటికి రాగానే కబుర్లు చెప్పడం.

మధ్యాహ్నం భోజనాలు, సునీతా, అత్తగారూ కలిసే చేసినా, రాత్రి మాత్రం అత్తగారు ముందరే తినేసి తన గది లోకి వెళ్ళిపోయి, ఏదో పుస్తకం చదువు కుంటూనో, టీవీ చూసుకుంటూనో వుండేది.

భార్యాభర్త లిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ, రాత్రి భోజనాలు కానిచ్చే వారు, మోహన్ సాయంత్రం కంపెనీ నించి వచ్చాక. అప్పుడప్పుడు బయటకి షికారు పోయి, వెళ్ళొచ్చాక తినే వారు.

ఆ రోజు రాత్రి భోజనాలవుతున్నాయి.

“అబ్బ! ఈ వంకాయ కూరేమిటీ, బాగోలేదు?” అనడిగాడు మోహన్ మామూలుగా.

“ఏమో మరి! అత్తయ్య గారు చేశారు. నాకు తెలియదు” అంది తన తప్పేమీ లేనట్టు.

తెల్ల బోయాడు మోహన్.

“వంట ఇద్దరూ కలిసే చేస్తారుగా! కలిసి రుచి చెక్ చేసుకోరా?” అని అడగలేదు మోహన్.

అసలా అమ్మాయి దగ్గిర అంత చనువు లేదు మోహన్‌కి ఇంకా.

“బాగా జవాబు చెప్పాను” అని మనసులోనే సంతోషించింది సునీత.

మరో రోజు రాత్రి భోజనాల దగ్గిర సంగతి.

తన కిష్టమైన దోసకాయ పచ్చడి చూడగానే మొహం విప్పారింది మోహన్‌కి.

“ఎవరు చేశారీ పచ్చడి? నాకు దోసకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. మా అమ్మకి దోసకాయ అంటే ఇష్టం లేదు” అంటూ పచ్చడిని, ఇష్టంగా అన్నంలో కలుపు కున్నాడు.

“ఇంకెవరు? నేనే చేశా” అని గర్వంగా చెప్పుకుంది సునీత.

ఒక ముద్ద నోట్లో పెట్టుకుని, మొహం బాధతో ముడుచుకుని, బలవంతాన నీళ్ళ సహాయంతో మింగేశాడు.

“అమ్మో! అబ్బో! చేదు! చేదు! నువ్వు కూడా తినకు! పరమ చేదు!” అంటూ చెప్పాడు మోహన్.

ఖంగు తిన్నట్టయింది సునీతకి. మొహం గంటు పెట్టుకుంది.

“ఏమో బాబూ! నాకు వచ్చినట్టు చేశాను. ఇంతకన్నా చేయడం నాకు రాదు” అంది మొహం మాడ్చుకుని.

మళ్ళీ తెల్లబోయాడు. తనేమన్నాడు ఇప్పుడు?

“దోసకాయ పచ్చడి చేసేటప్పుడు, కాయ చేదు వుందో, లేదో చూడొద్దూ?” అని గట్టిగా అడగలేదు మోహన్.

మళ్ళీ తన సంస్కారం గుర్తు చేసుకుని వూరుకున్నాడు.

అత్తగారికి దోసకాయంటే అసలిష్టం లేదు. ఆవిడ దాన్ని ముట్టుకోలేదు. లేకపోతే, ఆ తప్పు ముందరే బయట పడేదే! సునీతకి కూడా దోసకాయంటే చాలా ఇష్టం. అలా జరిగింది ఆ తతంగం.

ఒక సారి, అత్తగారు ఏదో వూరెళ్ళింది. ఇక సునీతదే ఇంటి పెత్తనం. కంపెనీ నించి వొచ్చాక, ఇంటి పనిలో కాస్త సాయం చేశాడు.

కూరన్నం నోట్లో పెట్టుకుని, “కూరలో కాస్త కారం ఎక్కువయింది” అన్నాడు మోహన్.

“మా ఇంట్లో కారాలు ఎక్కువ తింటాం బాబూ! చప్పిడి తిళ్ళు మాకు అలావాటు లేవు” అని ఘాటుగా చెప్పింది సునీత.

పచ్చడన్నం నోట్లో పెట్టుకుని, “పచ్చడిలో కాస్త ఉప్పు తక్కువయింది” అన్నాడు మోహన్.

“మా ఇంట్లో అంత ఉప్పు కషాయాలు తినం బాబూ! మాకు అలవాటు లేవు” అంది నొసలు చిట్లిస్తూ సునీత.

“ఏమన్నా అంటే, దెబ్బలాటవుతుంది. అది సంస్కారం కాదు. వూరుకుంటే పోతుంది” అని అనుకుంటూ మాట్లాడలేదు.

“ఎంత బాగా జవాబిచ్చానో! ఇలా మాటకి మాట అంటేస్తేనే, నా విషయం అర్ధం అవుతుంది. నేనేం చచ్చు దద్దమ్మని కాను” అని మనసులోనే గర్వ పడింది.

ఆ శలవు రోజు మధ్యాహ్నం నిద్ర పోతున్న మోహన్‌కి సడన్‌గా మెలుకువ వచ్చింది.

సునీత ఎవరితోనో హాల్లో కూర్చుని ఫోన్‌లో మాట్టాడుతోంది. కొన్ని మాటలు విన్నాక, అది తన స్నేహితురాలు వరలక్ష్మితో నని అర్ధం అయింది.

“…. అలా అని జవాబులు గట్టిగా, బాగా చెప్పానే. ఇక నోరెత్తలేదు. అడిగితే జవాబు చెప్పలేక పోవడానికి, నేనేమన్నా బియ్యే చదవని పిచ్చి దాన్నా? నేనంత తెలివిగా, జవాబులు చెప్పబట్టే, తిరిగి నోరెత్త లేకపోయారాయన. బాగా చెప్పాను” అంటూ అతిశయంగా, తన స్నేహితురాలితో గొప్పగా చెప్పుకుంటోంది.

తన సంస్కారాన్ని సునీత, ఎలా అర్ధం చేసుకుందో, అప్పుడు అర్ధం అయింది మోహన్‌కి.

"నేను తిరిగి మాట్టాడక పోతే, తను బాగా జవాబు చెప్పానని అనుకుంటోదన్న మాట" అని మనసులోనే నొచ్చుకున్నాడు మోహన్.

ఆ రోజు రాత్రి, మామూలుగానే భోజనాలకి కూర్చున్నారు ఇద్దరూ.

కొంచెం నెయ్యి వేసుకుని, కూరన్నం కలుపుకున్నాడు.

"ఛీ! ఇదేంటీ?" అంటూ, మొహం అసహ్యంగా పెట్టి, కూరన్నం లోంచి ఒక వెంట్రుక తీశాడు.

"అబ్బ! ప్రతీ దానికీ ఎందుకింత రాద్ధాంతం? తీసేస్తే, పోతుంది" అంటూ, భర్త చేతి లోంచి ఆ వెంట్రుకని తీసుకుని, లేచి చెత్త బుట్టలో పడేసి, వచ్చి కూర్చుంది.

ఆశ్చర్య పోయి, మతి పోయినట్టు చూస్తున్నాడు.

"అలా దెయ్యం పట్టినట్టు చూస్తారేం? తినండి అన్నం" అంది సునీత, కాస్త గయ్యాళిగా.

అంతే! కొన ఊపిరితో వున్న సహనం చచ్చి పోయింది మోహన్‌కి.

"అంత బుద్ధి లేకుండా మాట్లాడతావేం? తిండిలో వెంట్రుకలంటే చాలా అసహ్యమని నీ కెప్పుడో చెప్పాను. వంట చేసేటప్పుడు, జుట్టు విరబోసుకుని చెయ్యొద్దని ఎన్నో సార్లు అన్నాను. నువ్వేమీ పట్టించుకోవు. ఏమన్నా అంటే, భర్త పురుషాహంకారంతో అంటున్నాడని, పెద్ద గొడవ. దేనికీ నోరెత్తకుండా వూరుకుంటే, అది నా చేతకాని తనం లాగా భావిస్తున్నావు. ఎంతకని వూరుకునేదీ?" అని గట్టిగా అన్నాడు.

ఎన్నడూ నోరు తెరవని భర్త, ఆ రోజు అలా అనేసరికి, తెల్లబోయింది సునీత.

ఆ విధంగా ఆ సంసారంలో గొడవలకి నాంది పడింది!

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.