వంశీకి నచ్చిన కథ - తుఫాను - రావులపల్లి సునీత

thufaanu telugu story

అప్పుడప్పుడే తెల్లారుతోంది!

అందరూ ఆదమరచిన వేళ... సర్వమూ దోచుకున్న దొంగలా... సంతృప్తిగా నిశ్శబ్దంగా నిష్క్రమిస్తోంది చీకటి.

గుండెని దిటవు చేసికొంటూ ఇంట్లోంచి బయటికొచ్చాడు శ్రీనివాస్. మసక మసకగా వున్న చిరువెలుతురులోకి చూపులు జొప్పిస్తూ ఆవరణంతా కలియజూసుకున్నాడు.

ఏదీ సృష్టంగా కనబడకపోయినా అంతా సృష్టంగా అర్ధం అవుతూనే వుంది. అర్దరాత్రి భీభత్సం సృష్టించిన తుఫాను పచ్చని జీవితాలమీద దొంగదెబ్బ తీసింది? పరిమళించే సుందర స్వప్నాలని ముక్కచెక్కలుగా విరిచేసింది.

విశాలమైన పెరడులోంచి నింగికెగసి ఆకాశంతో నేస్తం కట్టినట్లుండే పాతిక కొబ్బరి చెట్లలో ఏ ఒక్కటీ నిలబడిలేదు. ఏ చేట్టుకీ వేళ్ళు భూమిలో లేవు.

పందిరిలా ఆకాశాన్ని అల్లుకుపోయి, అమ్మలా చల్లదనాన్నిచ్చే తాతల తరంనాటి రావిచెట్టు కూకటివేళ్ళతో పెళ్ళగించబడి తలని నేలకి వాల్చేసింది.

చిరకాల ఆప్తమిత్రుణ్ణి కోల్పోయినప్పటిలా బాధ అతని మనసుని కమ్మేసింది. బరువుగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. చావు భయంతో రాత్రంతా గడిపిన తన ఇంటిని
కలియజూశాడు.

ఎనిమిది గదులున్న డాబా యిల్లు అది. తలుపులన్నీ మూసివున్న ఇంట్లో ప్రతిగదిలోనూ మడమలు మునిగేంత నీరు నిలిచి వుంది. పరుపులు, మంచాలతో సహా తడవని వస్తువంటూ ఏదీలేదు.

పెనుతుఫాను పేరుతో అర్ధరాత్రి వాయుదేవుడు మొరటుబలంతో చేసిన విచ్చలవిడి విహారానికి వరుణుడు పిచ్చిపట్టిన రాక్షసుడిలా జనమ్మీద దాడిచేసిన జాడలవి.

"ఈ డాబా యిల్లే ఇలా వుంది. ఊరెలా వుందో, తోటలెలా ఉన్నాయో" అనుకొంటూ బయటపడ్డాడు శ్రీనివాస్.

కుటుంబ సభ్యులందర్నీ కోల్పోయిన పసివాడిలా కోనసీమలోని ఆ పల్లె బిక్కచచ్చిపోయి వుంది.

అభయమిస్తున్నట్లు తెల్లని వెలుగు ఊరిమీద వాలినా జనం ఇంకా ధైర్యం కూడగట్టుకొనే స్థితికి కూడా రాలేదు.

తన ఇరవై రెండేళ్ళ వయసులో ఎన్నడూ ఎరుగని భీభత్సం ఇది. స్నేహితుల్ని కలుపుకొని ఊరంతా తిరిగి చూశాడు శ్రీను.

కూలిపోయిన యిళ్ళూ, గోడలకిందా, దూలాల క్రింద పడి ఊపిరొదిలిన జీవాలు, కూలిపోయిన ఆస్తులూ, నేలవాలిన తోటలూ... దుఃఖం... దుఃఖం...! ప్రకృతి చేసిన
ధ్వంసరచనకి దుఃఖం అక్కడ ఏరులై పారుతున్నట్లుంది.

కర్తవ్యం గుర్తుకొచ్చిన ఉడుకునెత్తురుని మానవీయత వెన్నుచరిచింది! కరిగిన హృదయాలని పెనవేసుకొని, చేయీచేయీ కలిపారు మిత్రులు.

స్వంత బాధల్ని మరిచారు.

శిథిలాల క్రింద శవాలను కదిలించారు. కలిగిన కుటుంబాలనుంచి బియ్యం పప్పూ సేకరించి ఒండిపెట్టి ఓదార్పునిచ్చారు. ఆ ఊళ్లో... ఆ చుట్టుప్రక్కల సర్వం కోల్పోయిన వాళ్ళకి కన్నీటిబొట్టులా తోడై నిలిచారు.

మూడు రోజులు గడిచిపోయాయి. ప్రభుత్వం అందిస్తున్న సాయం అందరికీ అందడంలేదని పత్రికలు హోరెత్తుతున్నాయి. ఆపదలో వారిని ఆదుకోవడం కోసం ఎక్కడెక్కడి నుండో స్వచ్చందంగా జనం సరుకులతో తరలి వస్తున్నారు.

శ్రీనివాస్ బృందానికి శ్రమ తప్పింది. సహాయం అందరికీ అందేలా చూసుకొంటూ... విషయాలు తెలుసుకొంటున్నప్పుడు వినపడింది 'తొప్పలపల్లి' గ్రామం ఎక్కడో సముద్రపాయల్లో వుంది. ఇంతవరకూ ఆ వూరు వెళ్ళిన వాళ్ళు లేరు. దారులు లేవు' అని. ఎలాగైనా ఆవూరుచేరి సాయం అందించాలనే పట్టుదల!

వెంటనే ఓ అయిదొందలమందికి పులిహోర వండుకొని మంచినీళ్ళు క్యాన్ లలో నింపుకొని పడవల్లో ప్రయాణమయ్యారు.

ఒండ్రులో కూరుకుపోయి పడవలు కదలలేనిచోట బురదలో దిగి తోసుకుంటూ, తుప్పల్లో శవాలని తప్పించుకొని తెడ్లువేసుకొంటూ వెళ్ళగలిగినంత దూరం వెళ్ళాడు. ఇంక మార్గం అసాధ్యమనుకున్నచోట పడవని వదిలేసి పులిహోర సంచులూ, నీళ్ళూ వీపుమీద మోస్తూ బురదలో నాలుగు కిలోమీటర్లు నడిస్తే 'తొప్పలపల్లి' వచ్చింది. శవాలు కుళ్ళిన కంపు వాళ్ళకి ఆహ్వానం పలికింది!

కేవలం జాలర్లు నివసించే ఓ మోస్తరు పెద్ద ఊరది. కూలిపోయిన యిళ్ళూ, సగం... సగం కొట్టుకుపోయిన నీళ్ళ అంచున ఆగిపోయిన గుడిశలూ... శిథిలాల మధ్య కొద్దిపాటి ఇళ్ళు మాత్రమే మిగిలివున్నాయి.

బయట ఎక్కడా మనుషుల అలికిడి లేదు. ఆ ప్రక్కనే వున్న సముద్రం మాత్రం... కడుపునిండా మానవ శరీరాన్ని మింగి, విశ్రాంతిగా పడుకున్న కొండ చిలువలా వుంది.

అందరూ సముద్రంలోకి కొట్టుకుపోలేదు కదా' అనిపించిందో క్షణం గుడిసె దాకా వెళ్ళి తొంగి చూడ్డానికి కూడా జంకు కలిగింది.

పడిపోకుండా వున్న ఇళ్ళకి దగ్గర్లో నిలబడి వీపుమీది బరువులన్నీ క్రిందికి దించారు.

"ఇళ్ళల్లో వాళ్ళంతా బయటికి రండి." మీకోసం భోజనం, నీళ్ళు తెచ్చాం!" అంటూ పెద్దగా అరవడం మొదలెట్టారు.

గుడిశల్లో సన్నని కదలిక మొదలైంది. ముందుగా కొందరు పిల్లలు నీరసంగా అడుగులేస్తూ బయటికొచ్చారు. ఆ తర్వాత కొందరు పెద్దలు అడుగులో అడుగేసుకుంటూ సత్తువలేని నడకలతో వచ్చి నిలబడ్డారు.

"మీ కోసం పులిహోర, తాగేనీళ్ళూ తెచ్చాం, తీసుకొని తినండి" అన్నారు యువకులు వాళ్ళని జాలిగా చూస్తూ.

నిర్జీవంగా వున్న వాళ్ళ మొహాల్లో ఏ భావమూ లేదు. కళ్ళూ, మొహం పీక్కుపోయి... చూడగానే అర్ధం అవుతోంది వాళ్ళ పరిస్థితి.

"ముందు కాసిన మంచినీళ్ళు తాగండి" చేతిలో నీళ్ళ క్యాను అందించబోయాడు శ్రీను.

వాళ్ళు అందుకోలేదు.

"మా వూరు సగమ్మందిని గంగమ్మ పొట్టన పెట్టుకుంది." గొంతు పెగల్చుకొని అన్నాడు వాళ్ళలో ఒకతను.

"అయ్యయ్యో...!" సానుభూతిగా అన్నారు వీళ్ళు.

"మేం కూడుతిని నీళ్ళుతాగి ఇవాల్టికి నాల్రోజులు." మళ్లీ అన్నాడతను. మాట వినబడుతోందిగానీ, మోహంలో ఏ భావమూలేదు.

కానీ, అతని 'గొంతు'లో మాత్రం కోపమో... అసహాయతో... బాధో తెలీని అసృష్ట భావన.

"అది తెలిసి మీ కోసం భోజనం తెచ్చాం' ఈ బస్తాల్లో... పులిహోర ప్యాకెట్లను తీసుకొని అందరూ పంచుకుతినండి" అన్నాడో యువకుడు.

పిల్లలు ఆహారపు సంచులవైపు ఆశగా చూశారు. యువకులు తాముతెచ్చిన సంచుల మూతులు విప్పారు. ఇసుకమీద ఓ గుడ్డపరిచి, పులిహోర ప్యాకెట్లు కుప్పగా కుమ్మరించారు.

ఈ లోపల ఇంకొందరు బయటికొచ్చి చుట్టూ ముట్టారు. గడ్డమీద పోసిన ఆహార పొట్లాలవైపూ, అవి తెచ్చిన యువకులవైపు ఎగాదిగా చూస్తున్నారు వాళ్ళంతా. కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకుని చూస్తున్న వాళ్ళ చూపుల్లోని భావమేమిటో శ్రీనువాళ్ళకేం అర్ధం కాలేదు.

"ఎన్ని పొట్లాలు తెచ్చారు?" ముందుగా వచ్చి మాట్లాడినతను ప్రశ్నించాడు. ప్రశ్న కాస్త కటువుగా వుంది.

"అయిదొందలు" చెప్పాడు శ్రీను. క్షణం నిశ్శబ్దం!

"లం... కొడకల్లారా..." పళ్ళు పట పట కొరుకుతూ అరిచాడతను.

నెత్తుటి జీరలు చిట్లిపోయినట్టు అతని కళ్ళూ, మొహమూ కందిపోతున్నాయి.

ఉలిక్కిపడ్డారు యువకులు. విషయమేమిటో అర్ధం కాక తెల్లమొహం వేసుకొని నిలబడిపోయారు.

"నాలుగు రోజుల్నుండీ మా మొహం చూసినోడు లేడురా!" కొండరాయి బ్రద్దలవుతున్నంత కోపంతో మళ్ళీ అరిచాడతను. అంతే...! అందరూ కూడబలుక్కున్నట్లు అరుపులు మొదలెట్టారు.

"కడుపులో మెతుకులేక అల్లల్లాడుతుండాంరా...!"

"అయిదొందల మందికి తెత్తారా భోజనాలు! మీ కడుపు కొట్ట!"

"అయిదొందల మంది తింటావుంటే మిగతావోళ్ళేమైపోవాలా??"

"సగమ్మందికి కూడా సాలవీ బిచ్చం మెతుకులు!"

"సచ్చినోళ్ళతో పాటూ చావనన్నా చచ్చి నోళ్ళంకాదు. మాకు సగమ్మంది కన్నా సరిపోతాయంట్రా ఇయ్యి!"

"నువ్వు దెచ్చిన నాలుగు మెతుకులకోసం మాలో మేం పీక్కొని కొట్టుకొని సావాలంట్రా లం... కొడకల్లారా! మావూ... మావూ... కొట్టుకు సత్తంటే సూద్దావని వచ్చార్రా...!"

"అందరం సావుతో పోరాడి బతికినోళ్లమే...! కొనూపిరితో వుండమేం ఈ తిండితో సగమ్మందివి. బతికేసెయ్యాలి? మిగతా సగమ్మంది సత్తంటే సూత్తాకూకోని ఏడవడానికా మేం ఈ మెతుకులు తిని బతకాల??"

అందరం కలిసి ఎట్టా బయటపడ్డావో... అట్టాగే అందరం కలిసే సత్తాంగానీ. నీ బోడిమెతుకుల కోసం... పెద్ద శేపలు సిన్న సేపల్ని మింగినట్లు మేము పశులమైపోతావట్రా...! అందరం బతుకుతా మనుకున్నప్పుడే అందరినోళ్ళలో మెతుకు పడాల! నీ గుప్పెడు మెతుకుల కోసం గుండెల్లో పొడుసుకొం!

"అరె సూత్తారెంట్రా సవుద్రంలో పారేయండ్రా ఆ మాయదారి తిండి!"

అరుపులు... కేకలు... తిట్లు...!

అక్కడేం జరుగుతోందో అర్ధం అయేలోపలే ఆహారమంతా సముద్రం పాలయ్యింది.

ఆకలి కడుపులకు ఆశపెట్టి, భగ్నంచేసినందుకు కాబోలు. వాళ్ళ కోపం తారాస్థాయికి చేరింది. లేని ఓపికని కూడగట్టుకొని ఉగ్రంగా ఊగిపోతున్నారు.

"తరమండ్రా దొంగ నాయాళ్ళని..." అంటూ సముద్రంలో ఆహారాన్ని విసిరికొట్టిన గుంపు వేగంగా యువకులవైపు తిరిగింది.

నిశ్చేష్టులై నిలబడిన యువకులు ఒక్కసారిగా చలనం పుంజుకుని పరుగులు పెట్టారు.

అంత ఓపికలేని తనంలోనూ ఎంత కసిగా ఆ బాదుతులు తమని ఎంత దూరం తరుముకొచ్చారో తెలీదు... ప్రాణభయంతో పరిగెత్తి... పరిగెత్తి... ఇసుక తిన్నెలమీద వాలిపోయారు.

వెంటపడుతున్న వాళ్ళు ఎక్కడ ఆగిపోయింది కూడా చూసుకోలేదు. వాళ్ళది పిచ్చితనం కావచ్చు! వెర్రి ఆవేశం అనిపించవచ్చు!

కానీ...

తమలో కొందరైనా బ్రతకడానికి దొరికిన అవకాశాన్ని కాలదల్చుకున్నవాళ్లు 'ఐక్యత' మానవ సంబంధానికున్న ఔన్నత్యాన్ని బయటి ప్రపంచానికి తెలియచెప్పింది. ప్రకృతి భీభత్సం వాళ్ళని ఏకతాటిమీద నిలబెట్టింది.

ఉన్న కాస్త ఆహారం భీభత్సం బారిన పడిన అందర్నీ బ్రతికించలేనప్పుడు... అందరం కలిసే చావాలన్న నిర్ణయం... అపురూపంగా దొరికిన ఆహారాన్ని నీటిపాలు చేసింది. ఆ నాలుగు మెతుకుల కోసం కొట్టుకోవడం కన్నా... నలుగురం కలిసి కన్నుమూయడమే నయమనిపించిన వాళ్ళ ఐక్యతలోని ఔన్నత్యం ముందు... సహాయం అందించడానికి వచ్చిన తామెంతో చిన్న వాళ్ళుగా అనిపించారు వాళ్ళకు వాళ్ళే ఆ యువకులు!

(గోదావరి జిల్లాల్లో తుఫాను భీభత్సమప్పుడు ఇది నిజంగా జరిగింది.)

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు