వారం రోజులుగా ఒకటే తెగని ఆలోచనలు నా మెదడులో. పోయిన శనివారం నా కూతురు వందన ఫోను చేసి గత నాలుగు నెలలుగా వాళ్ళ పాఠశాల వారు జీతాలు చెల్లించలేదని, మరో మూడు నెలల పాటు ఇచ్చే అవకాశం కూడ లేదని చెప్పింది. వాళ్ళకు ఇద్దరికీ కలిపి వచ్చేది పదహేను వేలు. దానిలోనే ఇంటి అద్దె కట్టుకోవాలి, కాపురం జరుపుకోవాలి. అలాగే ఎలాగోలా సర్దుకు వస్తున్నారు. ఏదైనా సహాయం చేయడానికి కూడ నాకు శక్తి లేదు. చేసేది బట్టల దుకాణంలో గుమాస్తా ఉద్యోగం. అష్టకష్టాలు పడి వందన చేత టీచర్ ట్రైనింగు పూర్తి చేయించి, అప్పుతెచ్చి మరీ పెళ్ళి చేసి బాధ్యత దించుకున్నాను. అల్లుడు కూడ బి. ఇడి. పూర్తి చేసి ప్రైవేటు స్కూలులో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్ళయిన తరువాత అమ్మాయికి కూడ అదే స్కూలులో ఉద్యోగం ఇప్పించుకున్నాడు. అబ్బాయి బుద్ధిమంతుడు కాబట్టి గుట్టు చప్పుడుగా కాపురం వెళ్ళదీసుకొస్తున్నాడు. కరోనా పుణ్యమా అని చదువులు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. కార్పొరేటు పాఠశాలలు ఆన్ లైన్ చదువులని ఫీజులు గుంజి నెట్టుకొస్తున్నా, అటుయిటు కాని చిన్న చిన్న పాఠశాలలు మాత్రం నెట్టుకురాలేక ఉద్యోగస్తులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఆ కోవలోకే చెందిన స్కూలు కావడంతో తీసేశామనకుండా జీతాలివ్వలేమని చెప్పారట, మా అల్లుడి పాఠశాల యాజమాన్యం. చేసిన అప్పు తీర్చలేక తంటాలు పడుతున్న నేను వాళ్ళకు ఏ రకంగాను సహాయం చెయ్యలేక పోతున్నాను. బాధపడటం తప్ప చేసేదిలేక ఆలోచనలతో బుర్రను వేడెక్కించుకుంటున్నాను. " ఏమండి పేపరు చూశారా. పాపం ఎవరో స్కూలు ఉపాధ్యాయుడట, నాలుగు నెలలుగా జీతాలు రాకపోయేసరికి కాపురం నెట్టుకురాలేక ఆత్మహత్య చేసుకోబోయాడట. డాక్టర్ల పుణ్యమా అని ఎలాగో బ్రతికాడట. అయినా ఏమి కోవిడోనండి మనుషుల జీవితాలతో ఆడుకుంటోంది. అక్కడ మన పిల్లకు కూడ జీతాలు రావటం లేదట. ఎలా ఇబ్బందులు పడుతున్నారో" బాధగా చెప్పింది నా భార్య వసుంధర. " నేనూ అదే ఆలోచిస్తున్నాను వసూ. కానీ మన బ్రతుకులే అంతంత మాత్రంగా ఉండె. మా ఓనరు కూడ కొత్తగా చేరిన పిల్లలందరినీ మాన్పించాడు. నేను పాతికేళ్ళుగా నమ్మకంగా పనిచేస్తున్నాను గనుక తీసెయ్యకుండా జీతం ఇస్తున్నాడు. ఇదే ఇంకొన్నాళ్ళు సాగితే మన పరిస్థితి కూడ అంతేనేమో. కానీ దాన్ని తలుచుకుంటే జాలివేస్తున్నది. మన కడుపున పుట్టి దేనికీ నోచుకోని దురదృష్టవంతురాలు అయింది" మనసు బాధగా మూలిగింది. " బాధపడకండి. మన మధ్యతరగతి బ్రతుకులన్నీ అత్తెసరు బ్రతుకులే. ఏంచేద్దాం. ఉన్నంతలో చదువు చెప్పించి, యోగ్యుడికిచ్చి పెళ్ళి చేశాం. అంతకంటే మనం మాత్రం ఏం చేయగలం చెప్పండి. అబ్బాయి మంచివాడు, కష్టపడే మనస్తత్వం ఎలాగోలా నెట్టుకొస్తాడులెండి" " నెట్టుకొస్తాడో, ఏదారీ దొరకక.." " ఏమిటండీ ఆ అపశకునపు మాటలు. పోనీ ఒక పని చేయండి. మీరు అప్పులకు బాగా అలవాటు పడిపోయారు కదా. ఎక్కడైనా ఒక పాతికవేలు అప్పు తీసిపంపండి. ఈ నాలుగునెలలు సర్దుకుంటారేమో" నా మాట మధ్యలోనే తుంచుతూ అన్నది వసుంధర. " పాతికవేలా. ఈ కరోనాకాలంలో పైసా కూడ అప్పు పుట్టడం లేదే. ఏరోజు ఎవరికి ఏమౌతుందోనని, అప్పిచ్చే వారు కూడా లేదంటున్నారు. అయిదో, పదో అంటే చూడగలను గానీ, మరీ పాతికవేలంటే కష్టమే వసూ. పైగా మనలను నమ్మి ఈ సమయంలో అంత సొమ్ము ఎవరిస్తారు?" నా అనుమానాన్ని బయటపెట్టాను. " అవతల ఉన్నది మన పిల్లండీ. దాని కష్టం మన కష్టం కాదా. అత్తగారింటికి పంపామని బాధ్యత వదిలేసుకుంటామా. పోనీ వాళ్ళేమైనా స్థితిపరులా అంటే, వారివి మనకంటే అధ్వాన్నమాయె ఎలాగోలా మీరే తంటాలుపడండి. లేకపోతే నా రెండు సవర్ల గొలుసుంది కదా దాన్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకురండి. చిన్నగా తీర్చుకుందాము" సలహా ఇచ్చింది వసుంధర. ఆ గొలుసు పెళ్ళప్పుడు వాళ్ళ అమ్మవాళ్ళు పెట్టింది. దాన్ని కుదవ పెట్టను ఎప్పుడూ ఒప్పుకోదు తను. అలాంటిది ఈ రోజు తనే ఇస్తానంటున్నది. తల్లి మనసు అంటే అదేనేమో. " సరే ఆలోచిస్తాను. ముందు ఎవరైనా అప్పు ఇస్తారేమో చూసి, చివరి దారిగా కుదవపెడదాములే" అంటూ వసుంధరకు మాట ఇచ్చి, ఆ వార్త చదువుదామని పేపరు తీసుకున్నాను. నలభై సంవత్సరాల వయసుట పాపం అతనికి. ఇద్దరు పిల్లలు. అసలే చాలీచాలని జీతం. ఊరంతా అప్పులట. నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వలేదట. వడ్డీ కట్టమని అప్పుల వాళ్ళ నుంచి ఒత్తిడి ఎక్కువయి ఒకవైపు, కుటుంబ పోషణ జరగక మరోవైపు అతడిని ఆత్మహత్యకు పురికొల్పాయట. ఒక గంట ఆలస్యమయివుంటే మనిషి దక్కేవాడు కాదట. గుండె జారిపోయింది నాకు. కరోన వ్యాధి కంటే భయంకరమైనది పేదరికం. అతని వంటి వారు ఎందరో ఉన్నారు లోకంలో. ఎంతమందిని ఆదుకోగలదు ప్రభుత్వం. మొదట్లో లాక్ డౌన్ పరిష్కారంగా కనిపించినా రాను రాను అది వికటించసాగింది. తిన్నగా అన్ని వ్యాపారాలు ఒక్కొక్కటిగా తలుపులు తెరుచుకుంటున్నాయి. ప్రజలలో అవగాహన పెరిగి స్వీయరక్షణలో పడ్డారు. కానీ విద్యకు సంబంధించి మాత్రమే సందిగ్ధత నెలకొన్నది. ఉపాధ్యాయులు వీధిన పడ్డారు. ఎప్పటికి దారికి వస్తుందో వారి పరిస్థితి. తెగని ఆలోచనలకు కళ్ళెం వేస్తూ తెలిసినవారికి ఫోను చేద్దామని లేచాను, ఒక్కరైనా మెత్తబడి ఓ పాతిక రాల్చకపోతారాయని. ****** ఆశలన్నీ అడియాసలయినాయి. ఇక మిగిలింది బ్యాంకు లోను. అదికూడ అంత సులభంగా అయ్యే సూచనలు కనబడడం లేదు, ఈ కరోనా మహమ్మారి మూలంగా. అసలు పిల్ల ఎలా వుందో, ఎన్ని ఇబ్బందులు పడుతుందో. పోనీ ఒక్కసారి పలకరించి ధైర్యం చెప్పిచూస్తే. పైగా ఫోను చేసి నాలుగు రోజులయింది. ఏ రోజు కూడ మేము ఎలా చేస్తున్నారమ్మా అని అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. ఎంతకాలమిలా. ఈ రోజు అడుగుతాను అనుకుంటూ, కాఫీ తాగి చేద్దాంలే అని పేపర్ చేతిలోకి తీసుకున్నాను. అందులో ఒక వార్త నన్ను ఉలిక్కిపడేలా చేసింది. " చదువులు చెప్పే గురువు దగ్గర పండ్లు కొంటున్న విద్యార్థి".... "జీతాలు చెల్లించలేక పాఠశాలలు ఉద్వాసన చెబితే, ఉదర పోషణార్ధం కూరలు, పండ్లు అమ్ముతున్న ఉపాధ్యాయుడు. కరోనా కాలంలో దిగజారుతున్న ఉపాధ్యాయుల బ్రతుకులు". ఫొటోను పాలించి చూశాను. అది మా అల్లుడుదిలా అనిపించి వసుంధరను కేకవేసి చూడమన్నాను. అదిచూసి భోరున ఏడ్చింది. నాకు చాలా బాధ వేసింది. 'పూలమ్మిన చోటే కట్టెలమ్మే స్థితి అంటే ఇదేనా' మనసు బాధగా మూలిగింది. వసుంధరను ఓదార్చి వందనకు ఫోను చేశాను. " ఆ. అమ్మా, నేనే చేద్దామనుకున్నాను. కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయాను. ఎలావున్నారు నాన్న?" " బాగానే ఉన్నానమ్మా. కన్నబిడ్డ కష్టాన్ని తీర్చలేని దౌర్భాగ్యుడిగా, ఇంకా బ్రతికే ఉన్నానమ్మా" " నాన్నా మీరా. ఏమిటి నాన్నా ఆ మాటలు. ఎందుకలా బాధపడుతున్నారు. ఏమయిందిప్పుడు. అందరం బాగానే ఉన్నాం కదా" " బాగానే ఉన్నామమ్మా, చావలేక బ్రతుకుతూ. అల్లుడిగారిని ఇలా చూడాల్సి వస్తుందనుకోలేదు. మీ అవసరానికి ఆదుకోలేని అభాగ్యుడమ్మా నీ తండ్రి. ఇక్కడ ఉన్నన్ని రోజులు గిరిగీసుకునే బ్రతికావు. ఏ ముద్దు, ముచ్చట తీర్చలేకపోయాను. పెళ్ళయిన తరువాత కూడ నీ కష్టాలు నిన్ను వీడలేదు" మాట బొంగురు పోయింది. " అయినా అంత ఖర్మ ఏంబట్టిందే అల్లుడికి. పండ్లు, కూరలు అమ్ముతున్నాడు" అడిగింది వసుంధర వందనను. " ఓ అదా. అందులో తప్పేముందమ్మా. నాలుగు నెలలుగా జీతాలు లేవు. మీ పరిస్థితి గాని, మా మామగారి పరిస్థితి గాని అంతంతమాత్రమే కదా. మరి అటువంటప్పుడు ఏం చెయ్యాలి. అప్పులు చెయ్యాలి. చేస్తాం, కానీ తీర్చేదెలా? అవి వడ్డీలు పెరిగి తడిసి మోపెడయితే, దారిలేక ఆత్మహత్య చేసుకోవాలా? చెప్పండమ్మా. అది సమస్యకు పరిష్కారమవుతుందా" వందన మాటలలో నిజం కనిపించింది. " అదికాదమ్మా. అంత చదువు చదివి, పదిమందికి విద్యాబుద్ధులు నేర్పించినవాడు, అలా బజార్ల వెంట తిరిగి కూరగాయలు అమ్ముకుంటుంటే తలవంపులు అనిపించటం లేదా" ఉండబట్టలేక అడిగాను. " ఎందుకు నాన్నా తలవంపులు. ఆయనేమి దొంగతనం, రంకుతనం చేయడం లేదు. ఎవరినీ మోసగించడం లేదు. కష్టపడి వీధి వీధి తిరిగి పండ్లు, కూరలు అమ్మి నాలుగు రూపాయలు సంపాదించి తెస్తున్నారు. అందులో సిగ్గుపడవలసినదేమి లేదు. పూట జరగడం లేదని పిరికితనంతో ఆత్మహత్య చేసుకుని భార్యను వీధిన పడేయలేదు. తను వీధుల వెంటబడి నిజాయితీగా సంపాదించి కుటుంబాన్ని వీధిన పడకుండా చేస్తున్నాడు. అందుకు మీరు గర్వపడాలి" వందన మాటలలో ఎంతటి పరిపక్వత అనుకున్నాను. ఎంత ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నది. అయినా మధ్యతరగతి మనసు అందుకు అంగీకరించలేదు. " నిజమేనమ్మా. నలుగురికి తెలిస్తే ఎంత చిన్నచూపు" అన్నది వసుంధర. " ఎవరికమ్మా మీకా, నాకా. నాకు ఆయనను చూస్తే చాలా గర్వంగా ఉందమ్మా. కలిసిరాని కాలానికి జడిసి బేజారయిపోకుండా, పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్నాడు. మధ్యతరగతి భేషజాలకు పోకుండా వాస్తవాన్ని తెలుసుకుని బ్రతుకుబండి నడుపుతున్నాడు. అటువంటివాడు మీకు అల్లుడుగా దొరకడం మీ అదృష్టం. అది తెలుసుకోండి." సమాధానం ఘాటుగానే ఉంది. ఆ మాటలకు వసుంధర అవాక్కయింది. " నిజమేనమ్మా నువ్వు చెప్పింది. కాలానికి ఎదురీది బ్రతికేవాడే గొప్పవాడు. ఏదో మధ్యతరగతి భేషజం ఒక్కక్షణం మమ్మల్ని అలా ఆలోచించేలా చేసింది. చాలా ఎదిగిపోయావమ్మా. నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు కూడ ఏదో ఒకటి చెయ్యమ్మా. వేడినీళ్ళకు చన్నీళ్ళలా ఉంటుంది" " నేను మీ కూతురిని నాన్నా. ఖాళీగా ఉండలేనని తెలుసుగా. మా వారి స్నేహితుడు ఒకతను బ్యాంకులో పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబం పుట్టింటికని మద్రాసు వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయారు. అతనికి వంట రాదట. భోజనమెలా అనుకుంటుంటే ఈయన నేను పంపుతానని అన్నారట. అదితెలిసి, అతని లాంటి వారు ఒక పదిమంది తయారయి క్యారేజి పంపితే డబ్బులిస్తామని అడిగారు. సరేనని ఒప్పుకున్నాము. మా ఇంటి ఓనరు కూడ చాలా మంచివారు. మాకు స్కూలు తెరిచి, మా పరిస్థితి బాగయేవరకు సగం అద్దె ఇస్తే చాలన్నారు. మా గురించి మీరేమి దిగులుపడకండి. హాయిగా ఉండండి. ఉంటాను నాన్నా పనుంది" అంటూ ఫోను పెట్టేసింది. వసుంధర నసుగుతూనే ఉంది. కానీ నా మనసు ఆనందంతో పొంగిపోయింది. చిన్న ఆర్థికలోటు వచ్చినా భార్యను హింసపెట్టి పుట్టింటికి డబ్బు తెమ్మని తోలే ప్రబుద్ధులు వున్న ఈ కాలంలో, కష్టాన్ని నమ్ముకున్నవాడు నాకు అల్లుడుగా దొరికాడు. ఇదే నా జీవితంలో నేను పొందిన మహద్బాగ్యం. చిరంజీవిగా వర్థిల్లు నాయనా అని మనఃస్పూర్తిగా మనసులోనే దీవించాను అల్లుడిని. "కోట్లను చూసి కూతురిని ఇవ్వకండి. కష్టపడయినా భార్యను పోషించగలిగే మగాడికి పిల్లనివ్వండి. గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రించండి" అని గట్టిగా అరవాలనిపించింది.