రెండుమూడు రోజులనుండీ ఆకాశం మేఘావృత్తమై ఉంది కానీ ఒక్క చినుకు కూడా లేదు. బహుశా, అది రాబోవు భయంకర తుఫానుకి ముందు కనబడే ప్రశాంతత కాబోలు! టివిల్లోనూ, రేడియోల్లోనూ రాబోవు సైక్లోన్ గురించిన హెచ్చరికలు గత వారం రోజులనుండి వస్తున్నాయి. తుఫాను రాబోతున్నదని వాతావరణ శాఖ హెచ్చరించినందువల్ల ప్రభుత్వం పాఠశాలలన్నింటికీ రెండురోజులనుండి సెలవు ప్రకటించింది. ప్రజలనందర్నీ సురక్షిత ప్రాంతాలకిగాని, తుఫాను ఆశ్రయ కేంద్రాలకిగానీ తరలివెళ్ళాలని టివిలోనూ, రేడియోలోనూ ప్రతి అరగంటకొకసారి హెచ్చరిస్తూనే ఉన్నారు. ముందురోజు ప్రభుత్వ వాహనం మైకు ద్వారా హెచ్చరికలు చేస్తూ వెళ్ళింది.
రెండు రోజులనుండీ ఒక్క చుక్క వాన లేకున్నా, ఈ రోజు ఉదయం మాత్రం చిన్న జల్లు మొదలైంది. ఈ చిన్నజల్లే రాబోయే తుఫానుకి నాంది అని అందరికీ తెలుసు, ఇంతకు పూర్వం ఉన్న భయంకరమైన అనుభవాలవల్ల. రోజూ పొద్దున్నే పనికి పోవలసిన చంద్రి వీధిలోకి కూడా వెళ్ళలేదు. కూతురు పద్దుకి రెండురోజులనుండి ఎలానూ బడి లేదు. తను పనిచేసే ఓ ఇంట్లోవాళ్ళ మాటలు గుర్తుకు తెచ్చుకుంది చంద్రి.
"బంగాళాఖాతంలో అల్పపీడనం మొదలై రెండురోజుల్లో తుఫాను రావచ్చని హెచ్చరిక చేసారు. ఎందుకైనా మంచిది ఇంట్లో సరుకులు ఏవి ఉన్నాయో, లేవో చెప్పు? కావలసినవి తెచ్చి ఇంట్లో నిలువ ఉంచాలి, ముఖ్యంగా నిత్యావసర వస్తువులు. ఇంతకు ముందు కూడా ఇలాగే వాయుగుండం ఏర్పడి సూపర్ సైక్లోన్ వచ్చినప్పుడు దగ్గరదగ్గర నెలరోజులపాటు కరంటు కూడా లేదు. అప్పుడు మనకి సరైన వాతావరణ హెచ్చరిక లేకపోవడంతో చాలా అవస్థలు పడ్డాం గుర్తుందా! తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకలేదు. నిత్యావసర వస్తువుల సంగతి చెప్పేదేమి ఉంది? ఇక ఇంటి విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఏ కిటికీగానీ, తలుపుగానీ ఈ గాలికి ఎగిరిపోతే మన గతేంటి? తలుపులు, కిటికీలు కూడా గట్టిగా వేయాలి. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.” అని భార్య అనసూయతో చెప్పాడు ఆ ఇంటి యజమాని అయిన వాసుదేవరావు.
ఇంటి యజమానురాలు అనసూయ కూడా తనని హెచ్చరించింది, "ఏమే చంద్రీ! విన్నావా? తుఫాను రాబోతుందట! అసలే మీది లోతట్టు ప్రాంతం. జాగ్రత్తగా ఉండండి. తుఫాను రాకముందే జాగ్రత్త పడండి. ఎందుకైనా మంచిది ఇవి ఉంచు." అని కొన్ని తినుబండారాలు, కొంత డబ్బులు కూడా ఇచ్చింది.
తుఫాను గురించి వినగానే చంద్రి మనసులో గుబులు మొదలైంది. క్రితంసారి తుఫానుకి తోడు వరద కూడా తనుండే ప్రాంతాన్ని ముంచెత్తింది. చంద్రి ఇల్లు ఆ వరదలో పూర్తిగా మునిగిపోయింది. మోకాళ్ళవరకూ నీళ్ళు రాకముందే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇల్లు వదిలి పక్కవీధి స్కూల్ ఆవరణలో తల దాచుకున్నారు ఆమె, ఆమె భర్త రాములు. ఆ స్కూల్ ఎత్తైన ప్రదేశంలో ఉండటంవల్ల ముప్పు తప్పింది. భర్త గుర్తుకు రావడంతో చంద్రి కళ్ళు మసకబారాయి. భార్యాభర్తలిద్దరూ తమకు ఉన్నదానితోనే సంతృప్తిగా ఉండేవారు. భర్త రాములు రిక్షా నడిపేవాడు. తనేమో ఓ నాలుగు ఇళ్ళల్లో పని చేసి అతనికి చేదోడువాదోడుగా ఉండేది. చిన్న కుటీరంలాంటి ఇల్లు, అందులో కాపురం, జీవితం చాలా సుఖంగా ఉన్నటు అనిపించేది చంద్రికి. అలాంటి తమ జీవితంలో ఓ రోజు దురదృష్టకరమైన సంఘటన జరిగింది. రిక్షా నడుపుతున్న రాములు అతివేగంగా వస్తూన్న లారీ ఢీ కొనడంవల్ల అయిదేళ్ళ కిందట ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు చంద్రి కూతురు పద్దు వయసు సరిగ్గా ఒక ఏడాది. తన జీవితంలో జరిగిన ఆ పెను విషాద సంఘటనకి చలించిపోయిందామె. కూతురు పద్దే లేకపోతే తనేమైఉండేదో? తన పంచప్రాణాలన్నీ దాని మీదే పెట్టి బతుకుతోందామె.
కూతురుని బాగా చదివించి వృద్ధిలోకి తేవాలని చాలా కష్టపడుతోంది చంద్రి. ఆరేళ్ళ పద్దు ఇప్పుడే రెండవ తరగతికి వచ్చింది. కూతురి భవిష్యత్తు కోసం ఎక్కువ ఇళ్ళలో పాచిపని చేయడానికి ఒప్పుకుంది. అంతేకాక ఇంట్లో విస్తరాకులు అల్లడం, అప్పడాలు, వడియాలు పెట్టడం, వాటిని అమ్మడం ద్వారా కూడా కొంత డబ్బులు వెనకేస్తోంది. అలా కూడబెట్టిన డబ్బులు కూతురి చదువుకి పనికి వస్తాయన్న ఆలోచన ఆమెది. చంద్రి ఆశయాలకి అనుగుణంగానే పద్దు కూడా బాగా చదువుకుంటోంది. మధ్యమధ్య ఆమెకి చాలా సందేహాలొచ్చి తల్లిని అడుగుతోంది. చంద్రి పెద్దగా చదువుకోలేదు. తనకి సరైనవి అని తోచిన సమాధానాలు చెప్తోంది. ఇంటి ఆవరణలో చిన్న తోట పెంచింది చంద్రి. అందులో కాయగూరల చెట్లతో పాటు పూల మొక్కలు కూడా ఉన్నాయి. ఆ కాయగూరలు, పూలవల్ల కూడా కొంత ఆదాయం వస్తుందామెకి. ఆ చెట్లకి పద్దు నీళ్ళుపెట్టడం, అనవసరమైన కలుపుమొక్కలు ఏరడం నేర్చుకుందామె. చంద్రికి శ్రమ ఇవ్వకుండా అలాంటి చిన్న చిన్న పనులు చేయడం అలవాటైంది ఆమెకి. ప్రత్యేకంగా మల్లి చెట్లు, గులాబి చెట్లు అంటే ప్రాణం పద్దుకి. వాటికి ప్రత్యేకంగా సంరక్షణ చేస్తోంది.
రెండురోజల క్రితం చెట్లకు నీరు పోస్తున్నప్పుడు పద్దు తల్లిని అడిగింది, "అమ్మా! తుఫాను వస్తే మనం పెంచుతున్న ఈ మల్లి, గులాబి చెట్లు కొట్టుకుపోతాయా!" అని.
ఆమె కూడా స్కూల్లో వింది తుఫాన్ రాబోతున్నట్లు. తుఫాన్ మూలంగా తను ప్రాణప్రదంగా పెంచుతున్న ఆ చెట్లు ఎక్కడ కొట్టుకుపోతాయోనన్న భయం ఆ పసిపిల్లది.
"లేదే పద్దూ! గాలి తాకిడికి పెద్దపెద్ద చెట్లు అంటే మామిడిచెట్లు, మర్రిచెట్లు లాంటి పెద్ద చెట్లు వేళ్ళతో సహా పెకిలించబడతాయి. అంతేకానీ చిన్నచిన్న చెట్లకి ఏమీ అవదు. తుఫాను తాకిడి కేవలం పెద్దవాటికే! మన పూల చెట్లన్నీ సురక్షితంగా ఉంటాయి." అని కూతురికి చెప్పింది చంద్రి.
తన చెట్లకేమీ ఈ తుఫానువల్ల ఢోకా లేదని తెలియడంవల్ల పద్దుకి చాలా ద్యైర్యం వచ్చింది.
అంతవరకూ చిన్న జల్లుగా ఉన్న వాన క్రమేపీ పెద్దదవుతోంది. ఆ వానకి ఈదురుగాలి కూడా తోడైంది. రాను రాను గాలివేగం పెరుగుతోంది. తలుపులు బిగించి ఇంట్లోనే కూర్చున్నారు తల్లీ కూతుళ్ళిద్దరూ. కిటికి కొద్దిగా తెరిచి తన చెట్లు సరిగ్గా ఉన్నాయో లేవోనని మాటిమాటికీ చూస్తోంది పద్దు. అయితే గాలికి ఆ కిటికి జోరుగా కొట్టుకుంటోంది. ఇల్లు చిన్నదైనా సురక్షితేమనని భావించిన చంద్రికి ఇప్పుడు భయం పట్టుకుంది.
ఈ లోపున అంతవానలోనూ పక్కింట్లో ఉన్న మంగి తలుపుతట్టి చంద్రిని పిలిచింది.
"వాన అంతకంతకూ ఉదృతం అవుతోంది. ఇవాళ రాత్రి తుఫాను తీరం దాటుతుంది. మధ్యాహ్నం నుండి గాలి వేగం కూడా బాగా పెరుగుతుంది. ఈ సారి తుఫాను చాలా జోరుగా ఉంటుందిట. మనం వెంటనే తుఫాను ఆశ్రయకేంద్రానికి వెళ్ళిపోవాలి. ఇక్కడుంటే మన ప్రాణలకి ముప్పు ఉంది. వెంటనే బయలుదేరు. బండి వచ్చి బయట ఉంది." అని తొందరపెట్టింది.
అత్యవసరమైనవి అదరాబాదరాగా ఓ సంచిలో కుక్కుకొని పద్దుని వెంటబెట్టుకొని, తలుపులు కిటికీలు బాగా బిగించి మంగితో బయలుదేరింది చంద్రి. అప్పటికే ఆ బండిలో తన వీధివారందరూ ఉన్నారు. పద్దుని బండిఎక్కించి తనుకూడా ఎక్కింది. ఇంకొంతమంది ఎక్కిన తర్వాత ఆ బండి బయలుదేరింది. అందరూ తుఫాను ఆశ్రయకేంద్రానికి తరలింపబడ్డారు.
అక్కడంతా కిక్కిరిసి ఉన్నా ఎలాగో ఓ మూల చోటుచేసుకున్నారు తల్లీకూతుళ్ళు. అక్కడ నిర్వాహకులు పెట్టినది తిని ఎలాగో భోజనం అయిందనిపించారు. మధ్యాహ్నం రెండుగంటలనుండి గాలి తీవ్రత బాగా హెచ్చింది. మునుపెన్నడూ ఎరగని విధంగా తుఫాను తన ప్రతాపం చూపిస్తోంది. వర్షం కూడా గాలికి తోడైంది. భూమ్యాకాశాలు ఏకమైయ్యాయి. అతి భయంకరంగా ఉంది బయటి వాతావరణం. చెవులు చిల్లులుపడేట్లు ఉంది గాలి తీవ్రత పెరిగేటప్పుడు వచ్చే ధ్వని. బయట ఏం జరుగుతోందో తెలీని పరిస్థితి. భయంకరమైన శబ్దాలకి అందరూ ఉలిక్కిపడుతున్నారు. ప్రళయం సంభవిస్తోందా అన్నట్లుంది ఆ తుఫాను తీవ్రత చూస్తూంటే. చూస్తూండగానే పెద్దపెద్ద చెట్లు నేలకొరిగిపోతున్నాయి. కరెంటు స్తంబాలు గాలితీవ్రతకి వంగినవి వంగగా కొన్ని చెల్లచెదురయ్యాయి. అక్కడ ఉన్న అందరి ముఖాల్లోనూ గుబులు, అంతులేని దిగులు కనిపిస్తోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పైకి చూసి భగవంతుడ్ని ధ్యానిస్తున్నారు కొంతమంది ఏ ఆపదా రాకూడదని. రాత్రయ్యేసరికి తుఫాను తీవ్రరూపం దాల్చింది. తుఫాన్ తీవ్రం దాటినప్పుడైతే ఆ ఆశ్రయ స్థలంలో ఉన్నవాళ్ళు సైతం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నారు. తమ ఇల్లూ, వాకిళ్ళ పరిస్థితి ఏమిటో అన్న బెంగ అందరిదీ. రెక్కాడితే గాని డొక్కాడని పేదవారికి మళ్ళీ అన్నీ సమకూర్చుకోవాలంటే ఎంతకష్టమో మరి!
"అమ్మా! మన మల్లి చెట్లూ, గులాబి చెట్లు ఉంటాయి కదమ్మా? వాటికేమీ అవదు కదా?" అని మళ్ళీ గుబులుగా అడిగింది పద్దు తల్లిని. అలాంటి పరిస్థితిలో కూడా పద్దుకి తన మొక్కలే గుర్తుకు వస్తున్నాయి మరి! తన ఇల్లు, ఇంట్లో సామాన్ల పరిస్థితి గురించి దిగులుగా ఆలోచనల్లో ఉన్న చంద్రి కూతురి మాటలకి ఈ లోకంలోకి వచ్చి ఆమె తల నిమిరింది. "ఏం కాదమ్మా! పెద్ద చెట్లకే ఈ తుఫాను తాకిడి. మన చెట్లకి ఏమీ అవదమ్మా!" అంది లాలనగా ఆమెని అక్కున చేర్చుకుంటూ. పద్దు తల్లిదగ్గర ఒదిగికూర్చుంటూ దిగులుగా నలువైపులా చూస్తోంది.
తుఫాను తీరం దాటిన తర్వాత ఒక్కసారి గాలి స్తంబించింది. ఇప్పుడు మరి వానా గాలీ కూడా లేవు. అందరికీ ఒక్కసారి ప్రాణాలు తిరిగివచ్చినట్లు అనిపించాయి. అందరూ కోలహలంగా మాట్లాడుకోసాగారు.
అలా ఒక గంట సేపు ప్రశాంతంగా గడిచిందో లేదో ఒక్కసారి గాలి ఉదృతం మళ్ళీ రెండోవైపు నుండి మొదలైంది. ఇప్పుడు గాలి వేగం మునపటికన్నా తీవ్రంగా, భయంకరంగా ఉంది. అక్కడ ఉన్నవాళ్ళందరూ చిగురుటాకులా వణికిపోసాగారు. ఎప్పుడు పైకప్పు విరిగిమీద పడుతుందో అన్నంత భయంకరంగా ఉందా ఆ పరిస్థితి. పద్దు భయపడి చంద్రి ఒడిలో తలదాచుకుంది. చంద్రి ధ్యాసంతా ఇంటిమీదే ఉంది. తన ఇల్లు ఉందో, ఈ తుఫాను తాకిడికి కూలిపోయిందో అన్న ఆలోచన ఆమెకి భయాందోళనకు గురిచేస్తోంది. ఆ ఇల్లొక్కటే ఆధారం ఆమెకి. భర్తకి వారసత్వంగా వచ్చిన ఆ ఒక్కగది ఇల్లు తనని ఇన్నేళ్ళుగా ఆదుకుంది. ఆ ఇల్లే పోతే తన గతేమిటి అని మనుసులో గుబులుగా ఉంది. అక్కడున్న వాళ్ళందరి పరిస్థితి ఇంచుమించు ఒకేలా ఉంది. కొంతమంది తమ బంధువుల క్షేమ సమాచారాలు తెలియక దిగులుగా ఉన్నారు. రెండు గంటలసేపు అత్యంత బీభత్సంగా తన తడఖా చూపించిన తుఫాను మెల్లిగా సద్దుమణిగింది. ఒక్కసారి అంతటా మళ్ళీ ప్రశాంత వాతవరణం నెలకొంది. అలాంటి భీతావహ వాతావరణంలో చిక్కుకున్నవాళ్ళందరూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నారో మరి ఎవరికీ తెలియలేదు.
తెల్లారేసరికి ఆకాశమంతా నిర్మలంగా ఉంది. మచ్చుకి ఒక్క మబ్బు తునక లేదు. ఆ ముందురోజు అంత పెద్ద విధ్వసం జరిగిన సంగతి అప్పుడే తనకి తెలిసినట్లు లేత భానుడు తొంగి చూస్తున్నాడు. తుఫాను మూలంగా జరిగిన బీభత్సం ఛాయలు అన్నిచోట్లా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం అప్రమత్తత వల్ల ప్రాణనష్టం పెద్దగా లేకపోయినా విపరీతమైన ఆస్థినష్టం మాత్రం సంభవించింది. పంటపొలాలు నీటమునిగి రైతులు రేయింబవుళ్ళు పడిన శ్రమంతా నీళ్ళ పాలు చేసింది ఈ సైక్లోన్. కరెంటు స్తంబాలు నేలకూలాయి. చాలా చెట్లు కూకటివేళ్ళతోసహా పెకిలించబడ్డాయి. చిన్నాపెద్దా ఇళ్ళుకూడా బాగా దెబ్బతిన్నాయి. మరో రెండురోజులవరకూ ఆ పునరవాస కేంద్రంలోనే గడిపారు చంద్రి, ఆమె వీధి వాళ్ళు. వాళ్ళుండే వీధి బాగా లోతట్టు ప్రాంతంలో ఉండటంవల్ల నీళ్ళు ఇంకా తియ్యలేదు.
మూడు రోజల అనంతరం అక్కడ ఆశ్రయం పొందినవారందరూ తిరిగి తమ ఇళ్ళవైపు బయలుదేరారు. తమ ఇంటి వద్దకు చేరుకున్న చంద్రికి తన ఇల్లు నేలమట్టమై కనిపించి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఇప్పటివరకూ ఆధారంగా ఉన్న ఇల్లుకూడా కూలిపోవడంతో ఏమి చేయాలో దిక్కు తోచలేదు చంద్రికి. తన ఇంటి పక్కనున్న మంగిది అదే పరిస్థితి. వాళ్ళ ఇంటి గోడ ఒకటి కూలిపోయింది. దాదాపు చాలా ఇళ్ళ పరిస్థితి అంతేమరి. ఇంట్లో ఉన్నవస్తువులు కూడా దాదాపు నీళ్ళలో కొట్టుకుపోయాయి. అయితే, ఇంటికి రాగానే తను పెంచిన మొక్కలెలా ఉన్నాయో అని ఆత్రుతగా చూసిన పద్దుకి అప్పటివరకూ నీళ్ళు నిండి ఉండటంవల్ల నేలకి అంటుకొని ఉన్నవి ఎండ పడగానే లేచి నిలబడ్డాయి. ఇల్లు ఇంత దెబ్బతిన్నా ఆ చిన్న మొక్కలు తను చెప్పినట్లే ఏమాత్రం చెక్కుచెదరకపోవడం గమనించిన చంద్రి విస్మయం చెందింది. తన మొక్కలు సురక్షితంగా ఉండటం చూసిన పద్దు కేరింతలు కొట్టింది. ఆ తర్వాత పద్దు చూపు తమ ఇంటిపై పడింది. "అమ్మా! మన ఇల్లు..." అంది పద్దు.
"మన ఇల్లు కూలిపోయిందే పద్దూ!..." అంటూ ఏడుస్తూ కూతుర్ని హత్తుకుందామె.
"అమ్మా! మరి నువ్వు చెప్పావు కదా, చిన్న మొక్కలకి ఏమీ కాదు, పెద్ద చెట్లే తుఫాను బారిన పడతాయని. చిన్నవాటికి తుఫాను ఏమి చేయదని, పెద్దవాటికి మాత్రమే తుఫాను వల్ల నష్టం ఉంటుందని అన్నావు కదా! మరి మన ఇల్లు చిన్నదే కదా, అదెలా కూలిపోయిందమ్మా? ఆ పెద్ద పెద్ద ఇళ్ళకి ఏమీ అవలేదే?" అంది కొద్ది దూరంలో ఉన్న మూడంతస్థుల పెద్ద మేడని చూపుతూ.
"అంతేనమ్మా! మొక్కల విషయంలో మాత్రమే నేను చెప్పింది నిజం. ఇళ్ళ విషయంలో అలా కాదమ్మా! మనలాంటి పేదలుండే ఇళ్ళే తుఫానుకి ముందు బలైయ్యేది. పెద్దపెద్ద ఇళ్ళు మాత్రం తుఫానుకి తట్టుకొని నిలబడగలవు." అని కన్నీళ్ళతో చెప్తూన్న చంద్రివైపు విస్మయంగా చూసింది పద్దు ఏమీ అర్ధం కానట్లు మొహం పెట్టి. పద్దుని గుండెలకి హత్తుకుని విలపించింది చంద్రి.
తుఫానువల్ల ఇళ్ళు నష్టపోయిన వాళ్ళకి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. పునరావాసం ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వ యంత్రాంగం రంగలోకి దిగింది. ప్రజా ప్రతినిధులు, కేంద్ర బృందాలు కూడా తుఫాను నష్టాన్ని అంచనా వేయడానికి త్వరలో రానున్నారు. అయితే ప్రభుత్వ సహాయం చంద్రిలాంటి వారికి ఎన్నడు చేరనుందో మరి!