సుబ్బయ్య మాస్టారు - పి.వి.ప్రభాకర మూర్తి

subbiah sir

అద్దం ముందు నిలబడ్డప్పుడల్లా సుబ్బయ్య మాస్టారు నుదుటిమీద గాయపు మచ్చ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. కారణం చిన్నదైనా దాని తాలూకు మచ్చ మాత్రం గతాన్ని గుర్తుచేయడానికా అన్నట్లు అలాగే మిగిలిపోయింది. ఆమచ్చ వయసు సుమారు నలబై ఏళ్ళు .

సుబ్బయ్య మాస్టారు తరగతిలో పాఠం చెబుతున్నారు. ఇంతలో రామావతారంగారు ఉన్నపళంగా రమ్మన్నారని కబురొచ్చింది. హెడ్ మాస్టారు గదికివెళ్లి విషయంచెప్పి అనుమతి తీసుకుని బయలుదేరారు. రామావతారం ఆఊరిలో బాగా డబ్బుచేసిన వ్యక్తి. ఉబికి వస్తున్న అహంకారం, మీసం తిప్పటంలో పొగరు, చుట్టూ నిరంతరం పొగడ్తలతో ముంచెత్తే మనుషులు, ఎదుటి మనుషులను నీచంగా చూసే మనస్తత్వం, వీటితో ఆయన ముందుకెడుతున్నాడు.

“ రండి మాస్టారూ! కూర్చోండి “ అంటూ కాలితో చెక్కబల్లను ముందుకు తోశాడు రామావతారం. చదువు నేర్పే సుబ్బయ్య మాస్టారు ఇవేమీ పట్టించుకోలేదు. “ తమరు పిలిచారట “ బల్ల మీద కూర్చుంటూ అన్నారు. “ మా అబ్బాయి మీద తమరు చెయ్యచేసుకున్నారట, అంటే కుర్రాడెవరో తెలియక కొట్టారా, లేక మా అబ్బాయని తెలిసి కొట్టారా “ అడిగాడు రామావతారం. “ నేను చదువు చెప్పేది కుర్రాడికి, “ఆ” అనే అక్షరం మిగతా పిల్లలకి ఎలా నేర్పానో, మీ వాడికి అలాగే నేర్పాను, మీ అబ్బాయి అని అక్షరాన్ని సాగదియ్యలేదు, వేరే పిల్లవాడికి అక్షరాన్ని పొట్టిగా చేయలేదు. నాకు ఎవరైనా ఒక్కటే. సరిగ్గా రాయకపోతే బెత్తంతో ఒక్కటి ఇచ్చాను” సుబ్బయ్య మాస్టారు శాంతంగా చెప్పారు. మాస్టారి శాంతం, లెక్కలేనితనం రామావతారానికి బాగా కోపం తెప్పించాయి. అంతే ఉద్రేకతో ఊగిపోతూ, చేతిలోని వంకీకర్రతో మాస్టారి నెత్తిమీద ఒక్కటిచ్చాడు. రక్తం కారింది, ఐనా మాస్టారు శాంతంగానే ఉన్నారు. అంత గట్టి దెబ్బకి కనీసం చిన్నగానైనా “అబ్బా” అనకపోవడం రామావతారానికి ఏమీ అర్థం కాలేదు.

రామావతారంగారూ! మీరు ధనలక్ష్మిని మీ ఇంట్లో కట్టేసుకోవచ్చు , నాలుగు బీరువాల్లో పెట్టి నలభై తాళాలు, గొలుసులతో బంధిచవచ్చు, కానీ శాశ్వతంగా ఆవిడని అలా చేయడం ఎవరికీ చేతకాలేదు, అతి కొద్ది రోజులు మాత్రమే ఆవిదను పట్టుకోగలవు, కానీ గుప్పిటిలోని ఇసుకలా ఆవిడ జారిపోవడం తధ్యం. అప్పుడు మీ చేతుల్లో మిగిలేది శూన్యం. కానీ విద్యాలక్ష్మి అలాకాదు, ఆవిడను దాచడానికి బీరువాలు, గొలుసులు అవసరం లేదు. ఇసుమంత బుర్ర ఉంటే కొండంత ఉన్న ఆదేవత అందులో తిష్ట వేసుకు కూర్చుంటుంది, నువ్వు చచ్చేదాకా కదలదు, పైగా నీ మరణానంతరం నీకు విద్యావంతుడనే పేరు తెచ్చిపెడుతుంది. ధనలక్ష్మిని కాపాడుకోటానికి కర్ర అవసరమౌతుంది, కానీ విద్యాలక్ష్మిని సంపాదించడానికి కలం ఉంటే చాలు.

వెదురుకు కాల్చి కన్నాలు పెడితే వీనుల విందు చేస్తుంది. అయ్యో! కాల్చాలా అనుకుంటే సంగీతం ఎలా పుడుతుంది, గోపాలుని చేతికి ఎలాచేరుతుంది? తప్పదు, బంగారం కావాలంటే లోతుగా తవ్వ వలసిందే అని పెద్దలు చెప్పారు. గురువు రెండు దెబ్బలు సున్నితంగా వేసి భయపెట్టినంత మాత్రాన పిల్లవాడు పాడవడు. చక్కటి గురువు చేతిలో పిల్లవాడు చక్కటి విద్యార్ధిగా మారతాడు “ అని లేచారు సుబ్బయ్య మాస్టారు. “ మిమ్మల్ని కొట్టి క్షమించరాని తప్పు చేశాను “ అంటూ కాళ్లమీద పడ్డాడు రామావతారం.

అద్దం ముందునుండి పక్కకు జరిగారు సుబ్బయ్య మాస్టారు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.