రామరాజు,రమణీకుమారి దంపతులుకు ముగ్గురు కొడుకులు.ముగ్గుర్నీ ఉన్నత చదువులు చదివించి మంచి ప్రయోజకుల్ని చేశారు రామరాజు దంపతులు. "ముచ్చటగా ముగ్గురు కొడుకులు,ముగ్గురూ మంచివాళ్లే పైగా మంచి విద్యాబుద్ధులు,ఉద్యోగ ఉపాదులుతో వున్నారు,మీ కోడళ్లయితే సొంత కూతుళ్లు కన్నా మిన్నగా మిమ్మల్ని అభిమానిస్తున్నారు మీ రిటైర్మెంట్ జీవితం చక్కగా గడిచిపోతాది"అని బంధుమిత్రులు అంటుంటే ఆనందపడేవారు రామరాజు దంపతులు. రామరాజుకి ఉద్యోగ బాధ్యతలనుండి శాశ్వత విరమణ లభించింది.తాతతండ్రులు నుండి వచ్చిన ఆస్తి కొద్దో గొప్పో ఉంది.ఉద్యోగ విరమణ తరువాత కొంత సొమ్ము వచ్చింది. తమ ఆస్తి మొత్తాన్ని మూడు వాటాలు వేసేసి ముగ్గురు కొడుకులుకీ సమానంగా పంచేసారు రామరాజు దంపతులు."నెల నెలా నాకు వచ్చిన పెన్షన్ మా దంపతులకి చాలు కొత్తగా కట్టుకున్న మూడు ఇల్లులూ మీకు ఇచ్చేసినా... మాకు మన పూర్వీకుల వల్ల వచ్చిన పెంకిటిల్లు ఉంది అది చాలు"అని కొడుకులు కోడళ్లు వద్ద అన్నాడు రామరాజు. "మీకు సామాజిక సేవాభావం ఎక్కువ, కుటుంబపరమైన బాధ్యతలు వల్ల ఇన్నాళ్లూ మీరు మీ మనసు మెచ్చే సామాజిక సేవా కార్యక్రమాలు చేయలేకపోయారు,మీరు మీ పెన్షన్ ని మీ వ్యక్తిగత ఖర్చులకి లేదా సేవాకార్యక్రమాలకు వినియోగించుకోండి పర్వాలేదు,మీ దంపతులు ఇక ఒంటరిగా ఉండటానికి వీలులేదు.మీకు నచ్చినంతకాలం మా ముగ్గురులో ఎవరి ఇంటిలోవున్నా మాకు అభ్యంతరంలేదు,మేము మీ పోషణ,సంరక్షణ గురుంచి నెలలు,రోజులు,సంవత్సరాలు అని వాటాలు వేసుకొము,మీరు మా ముగ్గురు ఇళ్లల్లో ఎంతకాలం ఎలావున్నా మేము ముగ్గురం మీకు ఏలోటూ లేకుండా చూసుకుంటాం లేదా అందరమూ నాలుగు కుటుంబాలూ కలిసి ఉమ్మడిగా ఒకే ఇంట్లో వుందాం"అని మూకుమ్మడిగా చెప్పారు రామరాజు కొడుకులూ కోడళ్ళూ. "పిల్లలు చెప్పింది నిజమే,వాళ్లు మంచివాళ్ళు మనకి ఏ ఇబ్బందులూ రాకుండా చూసుకుంటారు,మనిద్దరి ప్రాణాలకు వేరే కుంపటి ఎందుకు,పిల్లలు చెప్పినట్లే అందరమూ ఒకే ఇంట్లో కలిసి వుందాం లేదా వాళ్ళు వేరువేరుగా ఉంటే అక్కడ అక్కడ అక్కడ కాలం గడిపేద్దాం"అని అన్నాడు రామరాజు."సరే మీ ఇష్టమే అలాగే చేద్దాం"అని అంది అతని భార్య రమణీకుమారి. మధ్యాహ్నం భోజనాలు ముగిశాక టీవీ ఆన్ చేసి "అక్కినేని అంతరంగాలు"అనే కార్యక్రమాన్ని చూస్తూ అతని సుదీర్ఘ జీవన విజయాలు తెలుసుకున్నారు రామరాజు దంపతులు.అక్కినేని నాగేశ్వరరావు తన అమూల్య అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు."నా పిల్లలు అందరూ మంచివారే మేము అందరమూ 'ఒకే ఇల్లు ఒకే వంట'అనే పద్ధతిలో ఉండవచ్చు,ఇందులో ఎవరికీ ఏ అభ్యంతరమూ లేదు,కానీ నేనే అలా ఉండవద్దు అన్నాను,కుటుంబాలుగా విడివిడిగా ఉంటూ మనుషులుగా,హృదయపూర్వకంగా కలిసి వుందాం,సెలవు రోజులు,పండగలు,శుభకార్యలు రోజుల్లో కలిసి హాయిగా సందడి చేసుకుందాం,విడివిడిగా ఉంటూ కలిసి మెలిసి ఉండటమే ఉత్తమం,అదే నా పిల్లలు,మనవులు పాటిస్తున్నారు,వారం పదిరోజులకు ఒకసారి కలిసి అందరమూ ఒకే ఇంట్లో భోజనాలు చేసే సరదాగా కాలక్షేపం చెయ్యడం బలే సంతోషాన్ని ఇస్తుంది,"అని చెప్పేసరికి,రామరాజు దంపతులు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి,మరునాడే కొడుకుల కుటుంబాలను పిలిచి. "మన నాలుగు కుటుంబాలూ విడివిడిగా వుందాం,ప్రతి పదిహేను లేదా నెల రోజులకు ఒకసారి అందరం నాలుగు ఇళ్లల్లో ఎక్కడో ఒక దగ్గర కలుసుకొని సరదాగా కాలక్షేపం చేద్దాం,ఒకే ఇంట్లో నాలుగు కుటుంబాలూ కలిసి వుండటం,లేదా మేము మా కాలమంతా మీ ఇళ్లల్లో కాలక్షేపం చేస్తూ...మనస్పర్థలు పెంచుకునే కంటే విడివిడిగా ఉంటూ హృదయపూర్వక ఆత్మీయులు పంచుకోవడమే మేలు"అని అన్నారు రామరాజు దంపతులు. తల్లిదండ్రుల నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు కొడుకులు,కోడళ్లు,అప్పటి నుండి అది మంచి కుటుంబం అన్న పేరు ప్రఖ్యాతులు పొందడం ఆరబించింది.