మోహానికి  అవతల - బోడపాటి  రమేశ్

mohaniki avatala

స్కూటర్ పార్క్ చేసిన సుధాకర్ నెమ్మదిగా కాలింగ్ బెల్ నొక్కాడు.

కానీ ఎవరైనా తలుపు తీసిన లక్షణాలు కనబడటం లేదు.

దానితో లేని ఓపిక తెచ్చుకుని ఇంకొకసారి నొక్కాడు. బలంగా.

' ఆ వొస్తున్నా'' అన్న మాటలు దాని తర్వాత భార్య రజని తలుపు తీయటం కొద్ది క్షణాల తేడాలో జరిగిపోయాయి.

అప్పుడే స్నానం చేసి వచ్చినట్లుంది .ఒంటి తడి ఇంకా ఆరలేదు. స్నానం చేయటానికి ముందు చుట్టగా చేసుకున్న జడని విదిలించి '"మీరు తలుపు తట్టటం వినిపించింది అప్పటికింకా నా స్నానం పూర్తి కాలేదు. అని అతను అడగకుండానే సంజాయిషీ ఇచ్చుకుంది

"పోనీలే అలాగే వచ్చేయకపోయావా "అన్నాడు సుధాకర్ నవ్వుతూ..

ఆ క్షణంలో ఆమె చాలా అందంగా కనబడటంతో అతని నీరసం తగ్గు ముఖంపట్టింది

భార్య ఇచ్చిన టీ కప్పు అందుకుంటూ "ఉత్తరాలేమైనా వచ్చాయా"అన్నాడు అలవాటుగా..

"ఈ రొజుల్లో ఉత్తరాలు ఎవరు రాస్తున్నారండీ. . అసలు ఫో నుకు రెష్టు లేదు, ఉదయం నించీ" అన్నది రజని తన టీ కప్పు తెచ్చుకుని భర్త పక్కన సోఫాలొ కూర్చుంటూ.

"అవునులే బిల్లు కట్టేవాడికి తెలుస్తుంది "

"అంటే""

ఇంట్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఐక్య రాజ్యసమితి ఏకగ్రీవంగా వీళ్ళకి విజ+ప్తి చేసినా యుద్ధం ఆగదు.. రజని తొందరగా సంధికి ఒప్పుకోదు అని తెలిసిన ప్రాప్త కాలజు+డవటం వల్ల పరిస్ఠి తి శ్రుతి మించకుండా శాంతి చేసుకోవటం మంచిదని తెల్ల కర్చీఫ్ బయటకు తీసాడు.

“అంటే ఏం లేదు. ఈమధ్యటెలిఫొను వాళ్ళు బిల్లులు సరిగా వేయటంలేదు. దాంతో చికాకు పడుతున్నానంతే"రాజీ మార్గం.

ఆమె ముఖం కాస్త ప్రసన్నమైంది.

"బాబి గాడేడి. ఇంకా స్కూల్ నుంచి రాలేదా" అన్నాడు.

"వాడి కేమైనా స్కూటరుందా ఏమిటి ఆలస్యంగా రావటాని కి. స్కూలు నుంచి వాడుక రిక్షాలో వచ్చేసాడు. "

టీ తాగుతున్న సుధాకర్కి పలక మారింది, భార్య మాటల్లో వ్యంగ్యానికి.

"సర్లే బట్టలు మార్చుకుని వస్తాను. వాడిని కూడా తీసుకురా కాసేపు ఎక్కడైనా తిరిగొద్దాం. "

"స్కూటర్ మీదేనా ?"అన్నది ఆమె సంశయంగా..

"నీకేం భయం అక్కరలేదు.నా ప్రాణానికి నీ ప్రాణం హామీ సరేనా" అన్నాడు" గడుసుగా.

ఇద్దరూ నవ్వుకున్నారు.

"ఒరేయ్ బాబి తొందరగా తయారవ్వు. మీనాన్నగారి కేమొచ్చిందో ,మనందరిని షికారుకి తీసుకెళతారట""

"అదేంటమ్మా" అన్నాడు బాబి.

"ఏముందిరా. మీ నాన్నగారితో బయట కెళుతున్నాం""

"మా టీచర్ బోలెడంత హోమ్వర్కిచ్చింది ముందుగా తెలిస్తే ఇవాళ కుదరదని మా టీచర్ కి చెప్పేవాణ్ణి. ్

"అయితే ఇంట్లో ఉండి అది చేసుకో".

"మీరెక్కడికి వెళ్ళేది. మీరు వెళితే నా హోమ్ వర్కెవరు చేస్తారు.?"

"ఎవరు చేస్తారా నీ బాబు""

"కుర్రాడితో అవేంమాటలండీ""

"లేకపోతే వేలెడు లేడు వెధవ. వీడు నన్ను ఆరడి పెట్టేస్తున్నాడు"".

"అయినా ఈ హోం వర్క్ మనం తిరిగొచ్చింతర్వాత చేసుకోవచ్చు కదా అమ్మ రాజీ సూత్రం.

“వద్దమ్మా అంతగా అయితే నాన్నగారెళ్ళోస్తారు. నువ్విండిపో."

"……."

"కానీ నా మాటెప్పుడు విన్నావు . నీ పోలికే వాడికి కూడా వచ్చింది "అంటూ రుసరుసలాడుతూ అవతలికి వెళ్ళీపోయాడు.

రజని ఏ కళ నున్నదో భర్త మాటలు పట్టించుకోలేదు. ఆమె ధ్యాసంతా ప్రస్తుతం కొడుకు చదువు మీదే ఉంది.

తల్లీకోడుకు పుస్తకాలు ముందేసుకు కూర్చున్నారు.

" మీరొక్కరు మాత్రం ఎక్కడికి వెళతారు. కాస్త మనవాడికి చదువు చెప్పండి.ఆలికి అన్నం పెట్టటం కొడుక్కి చదువు చెప్పటం కూడా గొప్పే మీలాటి వాళ్ళకి"

రజనితో ఏమయితే అయందని గొడవ పెట్టుకుందామనుకున్నాడు కానీ అమాయకంగా కనిపించే కొడుకు ముఖం చూసి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు..

ఆమె వంటింట్లోకి వెళ్ళిపోయింది.

"ఏం పాఠాలు చెపుతున్నార్రా ?"అన్నాడు అభినవ హిరణ్యకశిపుడిలా

బాబి అనే వంశోద్ధారకుడు పుస్తకాలు ముందు పడేశాడు.

"ఇవన్నీ ఏమిటి?" అన్నాడు తండ్రి ఆఫీసులో గుట్టగా పడే ఫైళ్ళు గుర్తొచ్చి.

"ఇవేమో క్లాసు పుస్తకాలన్నమాట.వీటిల్లో హోంవర్క్ ఏం చెయ్యాలో చెపుతారు. ఇవన్నీ చూసి ఈ పుస్తకాల్లో హోంవర్క్ చెయ్యాలన్నమాట..ఏమిటొ నాన్నకు బొత్తిగా తెలీదు. అన్నీ నేనే చెప్పాలి" విసుక్కున్నాడు వంశోద్ధారకుడు/.

"ఇంతకీ హోవర్క్ నీదా నాదా?"

"మనందరిది "అన్నాడు తనయుడు ముందు చూపుతో.

"అయితే అమ్మను కూడా పిలుద్దాంకొన్ని తను కూడా చేస్తుంది" ్

"రోజూ అమ్మే చెస్తుందీవాళ మీ రేదో చేస్తారని సంబర పడుతున్నారని అమ్మను పిలవలేదు. సర్లెండి మీ వల్ల కాకపోతే చెప్పండి. అమ్మా…."

"'ఏమిట్రా' వంటింట్లోంచి కేక వినబడింది. తను అక్కడి నుంచి రావటానికి ఇష్టపడనట్లుగా గిన్నెలు కింద పడేస్తున్న శబ్దాలు కూడా విన బడ్డాయి. పరిస్థితి ఇట్లాగే ఉంటే అవన్నీ వీళ్ళు కూర్చున్న గదిలోకి గ్రహాంతర వస్తువుల్లా వచ్చే ఉపద్రవం ఉంద ని "ఏంలేదు లే నా దగ్గర చదువు చెప్పించు కోవటానికి భయపడుతున్నాడు వెధవ. చిన్న పిల్లాడు కదా'" అని సర్ది చెప్పబోయాడు.

"అదేం కాదు నాకు చదువు చెప్పటానికి నాన్నే భయపడుతున్నాడu" అని గాలి తీసేసాడు తనయుడు.

భార్యాభర్తలిద్దరూ కలిసి కొడుకు హోమ్వర్క్ పూర్తి చేసారు.

చదువు అలసట వల్ల కుర్రాడు తొందరగానే నిద్ర లోకి జారుకున్నాడు.

“ఫాపం చాలా కష్ట పడుతున్నాడండీ బాబి ఏంచదువులో ఏమిటో "అన్నది రజని కొడుకు తల నిమురుతూ.

తల్లి స్పర్శకు నిద్రలోనే నవ్వు ముఖంతో తల్లి వైపుకు జరిగాడు.

"ఇదేమిటొయ్ వీడు నాకు పోటీకి వచ్చేట్టున్నాడు " అన్నాడు సుధాకర్ ఉడుక్కుంటూ.

“వేలెడంత లేడు .వీడు మీకు పోటీ ఏమిటి "అన్నది రజని ఆశ్చర్యంగా.

"లేకపోతే ఏమిటి .నీ పక్కన పడుకోవాల్సింది నేనా వాడా. పైగా వాటెసుకుంటున్నాడు కూడానూ. "

"చాల్లెండి ఎవరైనా వింటే నవ్విపోతారు. అయినా చిన్న పిల్లాడిలాగా అవేం చేష్టలూ"

"నాన్నెప్పుడు అంతేనమ్మా"

బాబి ఒకసారి తండ్రి ముఖంలోకి చూసి నిద్ర లోకి జారుకున్నాడు.

"అయిందా అయ్యగారి పని. "

" అంతేలే మీ ఇద్దరికీ నేనంటే ముఖం మొత్తిపోయింది."

సుధాకర్ అవతలి వైపుకి తిరిగి పడుకున్నాడు.

సమయం పరుగెడ్తున్నా సుధాకర్ లో చలనంలేదు.

" ఏమండీ""

ఉలుకు లేదు.

"ఏమండి' "

ఈ సారి 'ఊ'అన్నాడే కానీ పరిస్థితిలో మార్పు లేదు.

తను పడుకున్న చోటు నుంచి మంచం మీద నుండి లేచి కొడుకును మంచానికి ఒక వైపుకి జరిపి భర్త పక్కన చేరింది

ఇవన్నీ జరుగుతున్నా సుధాకర్ ముఖం ముడుచుకునే. ఉన్నాడు.

రజని భర్త పొట్ట మీద చేయి వేసి నిమిరింది. చేయి విదిలించి కొట్టాడు.

" కోపమొచ్చిందా అయ్యగారికి"" కంఠం లో చిలిపితనం.

సుధాకర్ ఇటువైపుకి తిరిగాడు కానీ

“ఏమిటివ్వాళ ఇలా తయారయ్యారు"?"

"…….."

"హోం వర్క్ చేయించానని కోపమా"

"చాల్లే వెధవ జోకులూ నువ్వునూ""

"అమ్మయ్యాఇప్పటికి మౌనం చాలించారు. పడుకుందాం రండి. "

“పడుకునే ఉన్నాం కదా"

"" చీ బాబూ. ఇట్లా అంటే నేనేం చెపుతాను.. పెద్ద మీకేం తెలీనట్టు.

సుధాకర్ లో క్రమేపీ నవ్వు కనిపిస్తోంది.

"ముఖం మొత్తటమేమిటండి అన్నది భర్త చర్యలకు ప్రతిస్పందిస్తూ.

"………."

"ఆగిపొయారేం?

"మరి నీ ప్రశ్నకు సమాధానమీదే. "

"అంటే"?"

" ఏదయినా మనం కావాలనుకున్నది అనుభవం లోకి వచ్చిందనుకో, దాని మీద మనకు ఇష్టం తగ్గిపోవటమన్నమాట""

."అయితే మరి మీకు నా మీద ఇష్టం తగ్గిందన్నమాట"

"అని నేననలేదే""

"అనక పోయినా కనిపిస్తూనేఉంది.. నేనింతసేపూ మీ పక్కలోనే ఉన్నా ఉలుకుపలుకు లేకుండా ఉన్నారంటే నేనంటే ముఖంమొత్తినట్టే కదా. అదే పెళ్ళయిన కొత్థల్లో అయితే ఎలా ఉండేవారు"

అవును లెండి. పెళ్ళయిన కొత్త ల్లో అయితే నేను చాలా అందంగా ఉండేదాన్ని. ఇదిగో వీడు పుట్టాడు. నేను మీకు నచ్చటం లేదు. అదేగా మీరనేది. …..""

"నేనేం అనకుండానే నువ్వు అపార్ధం చేసుకుంటున్నావు. ఇక్కడ అందచందాల ప్రసక్తి అనవసరం. నేను మాత్రం పెళ్ళయిన కొత్త ల్లో ఉన్నట్టుగా ఉన్నానా. జుట్టు వెనక్కి పోతోంది. పొట్ట ముందుకు వస్తోంది"" అన్నాడు ఆమెను నవ్వించే ప్రయత్నం లో.

ఈసారి ముఖం ముడుచుకుని పడుకోవటం రజని వంతయ్యింది. సహజంగానే ఆమెను బతిమిలాడటం అతని వంతయ్యింది.

"ఫిచ్చి రజనీ ముఖం మొత్తటానికి కేవలం అందమొక్కటే కాదు . మన ప్రవర్తనను బట్టి ఉంటుంది. ఉదాహరణకు ఇది వరకు లాగే నేను ఆఫిసు నుండి వచ్చేసరికి నవ్వుతూ ఎదురొచ్చావనుకో, నువ్వు ఒళ్ళు చేసి అందం తగ్గిపోయింద నుకున్నా మనిద్దరి మధ్య ప్రేమలో తేడా ఉందదు.

నువ్వు పెళ్ళప్పుడున్నంత అందంగా ఒక వేళ ఉన్నా నీ ప్రవర్తనలో మార్పొచ్చిందనుకో నా మీద నీకు ముఖం మొత్తిందన్నమాట. "

రజని ఆశ్చర్యంగా చూస్తోంది.
"ఇక పడుకుందామా" అన్నాడు చిలిపిగా.

"అసలు మిమ్మల్నీ "అంటూ రజని గలగలా నవ్వుతూ భర్తకు దగ్గరయింది.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.