పార్వతీపురం పొలిమెరలో దట్టమైన చెట్లు వాటితో పాటు నేలపైనా పచ్చటి గడ్డి ఉండడంవల్ల ఆ ఊరిలో పశువుల కాపరులు పశువులను మేపడానికి ఆ ప్రాంతానికి వెళతారు.
ఆ ఊరిలో ఉండే శంకరయ్య పార్వతమ్మల సంతానం రామయ్య. వారికి గొర్రెలతో పాటు రెండు బలిష్ఠమైన ఎద్దులు ఉన్నాయి వాటికి రామయ్య,గోపాల,గోవింద అని ముద్దుగా పేర్లు పెట్టుకొని కంటికి రెప్పలాగా చూసుకొనేవాడు.
వాటిని ఇతర గ్రామాలలో తిరునాళ్లకు పెట్టే బండలాగుడు పోటీలకు మరియు ఎడ్లబండి పోటీలకు మాత్రమే ఉపయోగించేవాడు.
రామయ్య ఆ ఎద్దుల వల్ల అనేక పోటీలలో ప్రధమ బహుమతులను గెలుచుకున్నాడు. గొర్రెలతో పాటు ఆ ఎద్దులను కూడా గడ్డి మేపడానికి ఇతర పశువుల కాపలాదారులతో పాటు ప్రతి రోజు ఉదయం వెళ్ళి మేపుకొని సాయంత్రంకల్లా ఇంటికి తిరిగి వచ్చేవాడు.
మధ్యాహ్నం సమయంలో రామయ్య తోటి వారితో కలసి రొట్టెలను తిని కాసేపు విశ్రాంతి తీసుకొనేవాడు సమయం చిక్కినపుడల్లా అందరితో ఆటలు ఆడుకునేవాడు.
ఒక రోజు రామయ్య ఆడుకొంటున్న సమయంలో నాలుగు గొర్రె పిల్లలు గడ్డి మేస్తూ తప్పి పోయి వెళ్లి వెళ్లి పులి గుహలో చిక్కుకున్నాయి.
పులి కోసం ఎదురు చూస్తూ ఒక నక్క ఆ గొర్రె పిల్లలు గుహలోకి వెళ్ళడం బయటనుండీ చూసి ఎగిరి గంతేసింది.
గుహలోకి చేరుకున్న నక్కను చూసి గొర్రె పిల్లలు “మే..మే..” అని బయపడి అరవసాగాయి.
ఒక గొర్రె పిల్ల బయటకు రాబోతుండగా నక్క అడ్డుకొని లోపలికి తరిమింది.
పులి వస్తే బాగుండును ఈ రోజు ఒక గొర్రె పిల్లను చంపి తిన్నంతా తింటే మిగతాది తను తిన వచ్చని లొట్టలు వేయసాగింది.
గొర్రె పిల్లలు అలా గుహలో చిక్కు కోవడాన్ని చెట్టు పైన ఉన్న కొన్ని పక్షులు చూశాయి అందులో ఒక చిలుక “ఆ గొర్రె పిల్లలను ఎలాగైనా కాపాడాలి!” అని మిత్రులతో అంది.
“ఎలాగ?” అని అంది కాకి.
“నేను వెళ్ళి ఈ విషయాన్ని అక్కడ కాపలాదారులకు చేరవేస్తాను...అవి ఎవరివైతే వారు ఇక్కడకు వస్తారు” అని ఎగిరిపోయింది.
ఈలోగా గుహ వద్దకు పులి రానే వచ్చింది.
“మహారాజా! మీకు పండగే పండగ మన గుహలోకి లేత గొర్రె పిల్లలు నాలుగు చిక్కుకున్నాయి” అంది నక్క.
“ఇప్పుడే ఒక జింకను చంపి బాగా ఆరగించాను ఇంక తినలేక నీకోసం కొంత వదిలాను తినేసి రాపో... నేను బాగా అలసిపోయాను నిద్ర ముంచుకొస్తోంది వీటి సంగతి రేపు చూద్దాము” అంది పులి.
“చిత్తం!” అని నక్క వెళ్లిపోయింది.
పశువులు మేత మేస్తున్న ప్రాంతానికి చిలుక చేరుకొని ఒకతని భుజంపై వాలి విషయాన్ని చెప్పి “ఆ ప్రాంతం ఎక్కడుందో దారి చూపిస్తాను పదండి!” అని అంది.
“అయ్యో! అవి నా గొర్రెలే” అని రామయ్య బయలుదేరుతుంటే “నీ వెంట మేమూ వస్తాము” అన్నారు అక్కడి మిత్రులు.
అందరి చేతులలో ముళ్ల కర్రలు వున్నాయి వాటితో బయలు దేరారు.
చిలుక చెప్పిన విషయాన్నిగడ్డి మెస్తున్న గోపాల,గోవింద విన్నాయి.
“ఈ రోజు ఆ పులి పని పట్టాలి” అని గోపాల అంది.
“అవును మన ప్రతాపమేంటో ఈ రోజు చూపిద్దాము” అని గోవింద అంది.
అవి కూడా వాళ్ల వెనకాల బయలుదేరాయి.
చిలుక పులి గుహను చూపించింది. పులి బాగా ఆదమరచి నిదురపోతోంది.
గుహ బయట రామయ్య పులిని ఎలా ఎదుర్కోవాలో మిత్రులతో చర్చిస్తున్నాడు.
ఈ లోగా గోపాల నిదుర పోతున్న పులిని లేపింది.
పులి గర్జించి ఎద్దు మీదకు దూక పోయింది. ఈలోగా గోవింద తన వాడైన కొమ్ములతో పులి పొట్టలో గట్టిగా పొడిచింది.
రామయ్యతో పాటు అందరూ అది చూసి నిశ్చేష్టులయ్యారు.
ఆ దెబ్బకు పులి ఒక్కసారి కింద పడిపోయింది.పులి పొట్టలో కొమ్ములు లోతుగా గుచ్చు కోవడం వల్ల రక్తం కారసాగింది. పులి శక్తిని కూడా దీసుకొని లేచే లోపల వెంటనే గోపాల కూడా తన కొమ్ములకు పని చెప్పి పులిని కుమ్మింది.
పులి గర్జిస్తూ కోపంతో పంజా విసరబోయింది. అది చూసి వెనుక నుండి గోవింద ఒక్కసారి మళ్లీ కొమ్ములతో దాడి చేసింది.
పులికి బాగా గాయాలయ్యాయి. కారుతున్న రక్తంతో గుహ నుండి బయటకు వచ్చి పడుతూ లేస్తూ పారిపోయింది.
మూలకు ఉన్న గొర్రెపిల్లలు బిక్కు బిక్కుమంటుంటే రామయ్య వాటిని ప్రేమగా చేతులలోకి తీసుకోగానే అవి సంతోషంతో రామయ్య చేతులను నాకాయి.
గోపాలకు గోవిందకు చిన్న చిన్న గాయాలయ్యాయి. కానీ అవి రామయ్యవద్దకు వెళ్ళి గర్వంగా నిలబడ్డాయి.
రామయ్య కళ్లలో ఆనందబాష్పాలు జలజలా రాలుతుండగా ఆ రెంటినీ ప్రేమతో మూపురాలను నిమిరాడు.
ఇలాంటి సంఘటన మేము ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాము నిజంగా నీ ఎద్దులు పులికన్నా చాలా గొప్పవి అన్నారు మిత్రులందారు.
“అవును నీ ఎద్దులు చాలా సాహసం చేశాయి” అని చిలుక కూడా మెచ్చుకుంది.
“విషయం చూసిన వెంటనే మాకు వచ్చి చెప్పినందుకు నీకు మేమంతా ధన్యవాదాలు తెలుపుకొంటున్నాము అన్నాడు రామయ్య.
“మా చిలుక ఎప్పుడూ మంచి పనులు చేస్తుంటుంది అంది ఒక కాకి”
“ఇలాగే కష్టాలలో ఉన్న వారికి సాహాయం చేస్తుండు” అని భుజం మీద వాలిన చిలుకను చేతులలోనికి తీసుకొని తలను ప్రేమతో నిమిరాడు.
దూరం నుండి ఇదంతా చూసిన నక్క బ్రతుకు జీవుడా అని పారిపోయింది.
అందరూ పశువులతో ఎవరి ఇళ్లకు వారు క్షేమంగా చేరుకున్నారు.
మరుసటి రోజు రామయ్య ఎద్దులు పులితో పోరాడిన విషయం ఊరంతా పాకింది.
మన పార్వతీపురంలోని రామయ్య ఎద్దులు పులిని ఎదుర్కొన్న సంఘటన చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది అని ప్రతి ఒక్కరూ అనుకున్నారు.
ఎలాంటి క్రూర జంతువునైనా ఎదుర్కోగలము అనే ధైర్యం ఉంటే చిన్న జంతువులైనా విజయం సాధిస్తాయి.