హంతకుడు ఎవరు? - గొర్తి.వాణిశ్రీనివాస్

Who is the killer

వాణీశ్రీనివాస్ ఎర్రటి ఎండ.. గ్రీష్మ ఋతువు.. సర్రున కాలే రోడ్డు.... ఈ చెవులోంచి ఆ చెవులోకి కొట్టే వడగాడ్పు. ఒకటే ఉక్కపోత.. ఆకు అల్లల్లాడటం లేదు.. కాకులు కూడా ఎక్కడా మెసలట్లేదు.. ఎన్ ఏ డీ నుంచి సింహాచలం వెళ్లే రోడ్డు గోపాలపట్నం రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదురుగా నరవ వెళ్లే రహదారి నిర్మానుష్యంగా ఉంది. డుర్....ర్.అంటూ సైలెన్సుర్ పనిచేయని మోపెడ్ మీద సంహిత. ఒళ్ళంతా చున్నీతో కప్పుకుంది. కళ్ళకి గాగుల్స్ పెట్టుకుంది. హెల్మెట్ మొత్తం వేడిని భరిస్తూ సెగలు కక్కుతోంది... నరవ శివాలయంలో పూజారి చెప్పిన పూజా సామాన్ల సంచి బండికి ముందు తగిలించుకుని ,ఎగుడు దిగుడు రోడ్లో కుంటెద్దులా ఎగిరెగిరి పడుతున్న మోపెడ్ హ్యాండిల్ ని తిప్పుతూ నెమ్మదిగా వస్తోంది... సంహితకు పెళ్లి కాలేదు... త్వరగా కావాలని ఆమె తల్లీ తండ్రీ ఆరాటం.. నరవ శివాలయానికి చాలా చరిత్ర ఉంది.. పురాతన శివలింగం. స్వయంభువుగా కొలుస్తారు.. నూటొక్క కొబ్బరికాయలు కొడితే కోరిన కోర్కెలు నెరవేరుతాయట... గుడిని ఈ మధ్యే గ్రామస్తులంతా పూనుకుని బాగు చేశారు... ఆలయం వరకూ బాగుచేసినా చుట్టూ జీబురుమంటూ తుప్పలు.. పాడు బడిన పాత ఇళ్లు శిథిలావస్థలో.. చుట్టూ మొక్కలు తుప్పలతో ఒంటరిగా రావాలంటే ఎవరికైనా గుండె బితుకు మంటుంది.. సంహిత మోపెడ్ యాక్సిలేటర్ ని రైజ్ చేసి వేగం పెంచింది.. ఇక నావల్ల కాదు బాబోయ్ అన్నట్టు పెద్ద చప్పుడు చేస్తూ మోపెడ్ ఆగిపోయింది.. సంహిత మోపెడ్ దిగి పెట్రోల్ చూసింది.. మీడియంలో వుంది.. బండిని అటూ ఇటూ ఊపింది..ఊహూ.. బండి నడిరోడ్డుమీద మఠం వేసుకుని కూర్చుంది .. సంహిత పెదనాన్న కూతురు కూడా ఒకసారి ఈ దారిలోనే వస్తుంటే సరిగ్గా ఇక్కడే కొత్త యాక్టివ్ బండి ....బడికి పోనని మొరాయించే పిల్లాడిలా కాళ్ళు నిగడదన్నుకుని మరీ ఆగిపోయింది. ఈ విషయం ఆమె చెప్పినప్పుడు భయం వేయలేదు సంహితకి.. ఇప్పుడు గుర్తు చేసుకుంటుంటే గుండె గుభేలుమంటోంది. ఎందుకు ఆగింది ఇది ..సరిగ్గా ఇక్కడే ? అనుకుంటూ బండి కిందకు ఒంగి చూస్తోంది. ఆమె వేనక అడుగుల చప్పుడు అయ్యింది.. ఎండు ఆకులు అప్పడాల్లా కరకర మని నలుగుతున్న చప్పుడు.. అడుగులు ఆమెను సమీపించాయి.. దిగ్గున తలెత్తి లేచి నిలబడింది.. ఒక మగ మనిషి..చేతిలో ఉన్న గుడ్డ సంచిలో ఏదో పెద్ద బరువు ఉన్నట్టుండి.. సంచి వేలాడే పక్కకి కాస్త ఒరిగిపోయి నడుస్తున్నాడు అతి సమీపంలోకి వచ్చేశాడు.. ఆ నిర్మానుష్య ప్రదేశంలో ఆపదలో ఆమె... ఆమెనే నిశితంగా చూస్తున్న అతను.. ఆమె కాళ్ళు ఒణికాయి... వెన్నులో ఏదో జరజరమని పాకుతున్నట్టు ఒక్కసారిగా ఒళ్ళంతా భయంతో కంపించి పోయింది .. ఆమె మొహానికి అతి దగ్గరగా అతని మొహం.. వికారం కలిగించే దుర్వాసన అతని దగ్గరనుంచి.. చటుక్కున మొహం పక్కకి తిప్పకుంది.. ఒక్క తోపు తొయ్యటానికి అనువుగా చేతుల్ని సిద్ధం చేసుకుంది... ధైర్యాన్ని కూడదీసుకుని తనను తాను రక్షించుకునే వ్యూహ రచన మనసులోనే చేసుకుంది.. గట్టిగా కళ్ళు మూసుకుని ,కెవ్వున అరిచింది.. బలంగా ఊపిరి తీసుకుని కాళ్ళు లేపి ఒక్క తన్ను తన్నింది... ఆమె కాలు గాలిలోనే ఊగి నేలకు తగిలింది... అబ్బా...అంటూ మూలుగుతూ కళ్ళు తెరిచింది.. ఆ బాటసారి తనను దాటుకుంటూ నడిచి చాలా దూరం వెళ్లిపోయాదని అప్పుడు గ్రహించింది. బ్రతికించావు దేవుడా అంటూ దండం పెట్టింది.. మొరాయిస్తున్న బండి వంక చూసేసరికి ఒక్కసారిగా శక్తిని ఏవరో లాగేసినట్టయి నేల మీద కూలబడింది.. తనను దాటి వెళుతున్న ఆగంతకుడు కనుచూపు మేరలో ఇంకా కనిపిస్తున్నాడు.. ఇంత ఎండలో వీడికి ఇక్కడ ఏం పనో.. నాలాగే గుడికి వెలుతున్నాడేమో... అనుకుంటూ అతని చేతి సంచి వైపు యాధాలాపంగా చూసింది... అప్పటి వరకూ ఆమె గమనించలేదు.. రక్తం...రక్తం.. సంచిలోంచి బొట్లుగా కారుతోంది ఎర్రటి రక్తం... రోడ్డంతా అక్కడక్కడా చిక్కటి రక్తపు బొట్లు.. ముదురు నలుపు రంగు సంచి అడుగు భాగం నీళ్ళలా, తడి తడిగా ఉంది... ఒక్క ఉదుటున పరిగెత్తి అతడిని అనుసరించింది ఆమె... అతడు వెనక్కి తిరిగి చూసాడు.. చటుక్కున తుమ్మ చెట్టు చాటుకి నక్కింది ఆమె.. అతను మళ్లీ నడుస్తున్నాడు.. అరచేతికి గుచ్చుకున్న తుమ్మ ముల్లుని పళ్లతో లాగుతూ అతడిని అనుసరిస్తోంది ఆమె.. ఆమె సెల్ తీసి వెనకనుంచి అతడినీ, సంచినీ ఫోటోలు తీసిన సంగతి అతనికి తెలీదు... అతని దగ్గరగా వచ్చేసింది.. అతనిని దాటి ముందుకు వచ్చి నుంచుంది ఆమె.. "ఏముంది సంచిలో అంది".. ఆమెకేసి నిర్లక్ష్యంగా చూసి తప్పుకుని ముందుకు మడిచాడు.. "ఏయ్..ఆగు ..నిన్నే..చూపించు ఏముందో.. సంచిలోంచి రక్తపు చుక్కలు పడుతున్నాయి.." అంది అతను ఆమె మొహం కేసి క్రూరంగా చూసాడు.. ఆమె ఒక్క క్షణం బెదిరింది... అతను సంచిలోంచి గొర్రె మాంసం చుట్టిన తువ్వాలు తీశాడు గొర్రె తలకాయని బయటకు తీసి పైకెత్తి చూపించాడు.. రెండు కొమ్ములతో,గుడ్లు బయటకు వచ్చి భయంకరంగా ఉంది గొర్రె మొహం... ""ఛీ.....ఇక్కడినించి పో ముందు.."అంది అతను గొర్రె తలను మళ్లీ సంచీలో పెట్టుకుని వంగి కుంటుతూ ముందుకు నడిచాడు..... సశేషం.. ....................... 2 వ భాగం అతను వెళ్లే వైపు కాసేపు చూసింది సంహిత.. కొందరు మనుషులు భలే చిత్రంగా వుంటారు.. అమాయకులే అనుమానాస్పందంగా కనబడతారు.. అనుకుంటూ బండి దగ్గరకు నడిచింది ఆమె.. సమయం సాయంత్రం నాలుగు కావస్తోంది.. సూర్య ప్రతాపం తగ్గింది... నీరెండ పరుచుకుంది.. విశాఖ వాతావరణం ప్రత్యేకంగా ఉంటుంది.. సముద్ర తీరం కావడం వల్ల ,ఎంత ఎండకాచినా సాయంత్రానికల్లా చల్లబడి పోతుంది.. తెప్పరిల్లిన చెట్లు గాలికి ఊగుతుంటే పక్షులకు కాస్త ప్రాణం వచ్చి గొంతులకు పని చెప్పాయి... సంహిత బండికి తాళం వేసి కాలి నడకన గుడి దగ్గరకు బయలు దేరింది... కాస్త దూరం తుప్పల మధ్యగా నడిచింది. గుడి ధ్వజ స్థంభం దూరంగా కనబడుతోంది.. నడక వేగం పెంచింది... ఇందాక చూసిన వ్యక్తి గుర్తొచ్చాడు ఆమెకు.. అతనేడీ... ఇక్కడ ఇళ్ళు కూడా లేవు.. ఎలా మాయం అయ్యాడు.. తుప్పల్లోకి దూరితే గానీ మనిషి కనపడడు.. తుప్పల్లో ఇతనికేం పని... గొర్రె తలని ఏం చేస్తాడో... మాంసం అయితే తింటారని తెలుసు. గొర్రె తలలో మాంసం ఉంటుందా?.. శాఖాహారిని కాబట్టి నాకు తెలియక పోవచ్చు... అనుకుంటూ గుడి దగ్గరకొచ్చింది...కొద్ది దూరం వెళితే పూజారి వుండే చిన్న గుడిసె ఉంది.. గుళ్ళో ముఖ్యమైన పూజలు జరుగుతున్నప్పుడు మాత్రమే అతను అక్కడుంటాడు.. మిగిలినప్పుడు ఫోన్ చేసి రమ్మని చెపితే కానీ రాడు.. సంహిత ముందుగానే అతనికి ఫోన్ చేసి చెప్పింది గుడి ఆవరణలోకి ప్రవేశించింది... పూజారి అప్పటికే అక్కడ వున్నాడు.. ఆమె కోసం ఎదురు చూస్తున్నట్టు గుళ్ళో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఇదిగో వస్తున్నా అంటాడు కానీ ఒక పట్టాన రాడు... అలాంటిది సంహిత కంటే ముందే వచ్చేశాడు.. "నేను తెచ్చిన కొబ్బరికాయలు,పూజా సామానూ బండికే ఉన్నాయండీ...బండి ఆగిపోయింది అక్కడే వదిలేసి వచ్చాను.. మీరు నాతో వస్తారా?"అంది.. "అయ్యో బండి పాడయ్యిందా.. రండి నా బండి ఎక్కండి.. వెళదాం"అన్నాడు హుషారుగా.. "ఇక్కడ మెకానిక్స్ దొరకరు కదా!"అంది.. "ఇక్కడ ఎవరూ ఉండరు..రోడ్డు దాకా వెళ్ళాలి.. అక్కడ ఒకడున్నాడు.ఈ రోజు తెరిచాడో లేదో చూద్దాం రండి.."అంటూ బండి స్టార్ట్ చేసాడు.. దేవిడికి దణ్ణం పెట్టుకుని ...తటపటాయిస్తూనే అతని బండి మీద ఒదిగి కూర్చింది.. "సరిగ్గా పట్టుకుని కూర్చోండి ..పడిపోతారు.. నా భుజం మీద చేయి వేయండి ..ఫర్వాలేదు.."అన్నాడు "బళ్ళు నడపటం నాకలవాటే...మీరు ముందుకు చూస్తూ నడపండి'"అంది కాస్త విసురుగా అక్కర్లేని చోట్ల కూడ బ్రేకులు వేస్తూ బండిని పోనిచ్చాడు అతడు... అతని మీద పడకుండా నిలదొక్కుకుంది ఆమె. బండి ఉన్న చోట ఆమెను దింపి ,బండి రిపేరర్ దగ్గరకు వెళ్లి అతడిని వెంట తీసుకునివచ్చాడు. సెల్ఫ్ స్టార్టర్ పోయింది.. బండిని కిక్కు కొట్టి స్టార్ట్ చేసాడు. పూజ సామాను పూజారికి ఇచ్చింది.. కాసేపు వుండొచ్చుగా అన్నాడు... అతనికేసి ఏదోలా చూస్తూ బండిని ముందుకు ఉరికించింది.. ...................... "గుడిని ఫోటో తీశావుటే"అంది సంహిత తల్లి "ఆ గుడినీ, గుళ్ళో లింగాన్నీ,పూజారినీ,ఆ గొర్రె తల వాడినీ అందర్నీ ఫోటో తీసా"అంది "గొర్రె తల వాడా !ఎవరే?"అంది "నరవ దారిలో కనిపించాడు..వామ్మో ఎంత భయపెట్టాడో..ఇదిగో చూడు వాడి ఫోటో"అంటూ సంహిత ఫోన్ లో ఫోటో చూపించింది.. "అబ్బ వీడెవడే..పగలు చూస్తే పగలే కల్లోకొచ్చేట్టుగా వున్నాడు...ముందు ఆ ఫోటో ఫోన్ లోంచి తీసేయ్.."అంది "తీసేస్తా"అంటూ లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ చేయబోతూ ఆగింది... ఫొటోలో సంచి పరిమాణం చాలా పెద్దగా ఉంది.. బరువైన వస్తువేదో ఉన్నట్టు అతను చూపించింది చిన్ని గొర్రె తల మాత్రమే.. అంత బరువు ఎందుకుంది..పక్కకి ఒరిగి నడిచేంత బరువు...? ఎందుకైనా మంచిది అని ఆమె స్నేహితుడు హరి కి ఫార్వార్డ్ చేసి ..తన ఫోన్లో తీసేసింది... అతను ఆన్లైన్ లో లేడు.. ఇంకా చూడలేదు మర్నాడు టి వి లో ఒక వార్త.. అక్రమ సంబంధం అనే అనుమానంతో భార్య తల నరికి నరవ శివాలయం వెనుక గోతిలో పాతి పెడితే...కుక్కలు తవ్వగా బయట పడ్డ ఒక స్త్రీ తల భాగం... అంటూ టి.వి లో వస్తున్న వార్తకి ఉలిక్కి పడింది సంహిత.. "అమ్మా!నేనిప్పుడే వస్తాను"అని చెప్పి హరి ఇంటికి వెళ్ళింది... "నీ వాట్సాప్ కి నేను పంపిన ఫోటో ఒక సారి చూపించు"అంది "ఆ ఫోటో..ఏదో పొరపాటున పెట్టావని తీసేసాను "అన్నాడు.. "ఈ రోజు టి.వి లో చూపించిన మహిళ హత్యోదంతంలో అది అతి ముఖ్యమైన క్లూ..అయ్యో తీసేసావా.."అంది బాధపడుతూ "ఆ ఫోటో మా సాహిత్య గ్రూప్ అడ్మిన్ కి పంపాను.. బరువును మోస్తున్న బడుగు జీవి అనే కాప్షన్ తో.." "ఆయనకి మెసేజ్ చెయ్యి...నీకు రీ ఫార్వార్డ్ చేయమని" అంది ఆదుర్దాగా "అక్కర్లేదు..ఇదిగో బతుకు జట్కాబండి గ్రూప్ లో చిత్ర కవితగా కవుల్ని రాయమని చిత్రం పెట్టారు." "దొరికాడు దొంగ,వెళదాం పద పొలిస్టేషన్ కి . ఈ క్లూతో భార్యను కసాయి వాడిలా చంపి.పట్ట పగలు,మిట్ట మధ్యాహ్నం గుడి వెనకాల పాతి పెట్టిన ఆ హంతకుడి ఆట కట్టిద్దాం పద"అంది సంహిత

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.