పెద్ద గుర్తింపు కావాలి - గంగాధర్ వడ్లమన్నాటి

Needs big recognition

రచయితగా కలంబాబుకి అంతో ఇంతో పేరు ఉంది. అయితే అతని మనసును ఇంకా ఏదో లోటు కాటేస్తోంది. సన్మానాలు, బిరుదులు లాంటివి పరిచయాల ద్వారా సంపాదించినా, ఇంకా తెగ గుర్తింపు కావాలనే అత్యాశ మాత్రం అంతర్గతంగా అతనిలో అలాగే మిగిలిపోయింది. ఓసారి ఇదే విషయం దీర్ఘంగా ఆలోచిస్తుండగా, కొత్త ముసలం పత్రిక నుండి, సంపాదకుడు పాతబ్బాయి ఫోన్ చేసి "ఏమిటి కలంబాబు గారు ఎలా ఉన్నారు. మీరు క్షేమమే అని నాకు తెలుసు.ఎందుకంటే,మీరు క్షేమంగా ఉండబట్టే కదా మా పత్రిక క్షేమంగా ఉంది. విసిగించక విషయానికి వచ్చేస్తాను. మీరు మా పత్రికకి ఓ సీరియల్ రాసి పెట్టాలండీ" అడిగాడాయన తెగ వినయం ఒలకబోస్తూ. "ఏడ్చినట్టు ఉంది. ఎన్ని రాస్తే మాత్రం ఏం ప్రయోజనం. రావాల్సిన ఆ పెద్ద గుర్తింపు రాలేదని నా బాధ నాది" చెప్పాడు కలం బాబు కాస్త అసహనంగా. "అదేవిటండీ అలా అంటారు. మీ పేరు కూడా అంతో ఇంతో మారుమోగింది కదా. ఇప్పటికే మీరు పెద్ద పేరున్న రచయిత లాగా చలామణి కూడా అయిపోతున్నారు. ఇంకా ఏం కావాలండి" అడిగాడాయన ఆశ్చర్యంగా. "కాస్త కొత్తగా ఆలోచించవయ్యా పాతబ్బాయి. 'నేను నీ పత్రిక్కి సీరియల్ రాస్తాను కానీ, నాకు ఓ ఉపకారం చెయ్యి. నా కథలు హిందీలోకి , ఇంగ్లీషులోకి అనువదించే వారు ఉంటే చూడు"అడిగాడాయన చిన్న స్వరంతో. "ఇప్పుడు ఎందుకండీ బాబూ" . "ఇంకెప్పుడయ్యా. ఇప్పటికే వయసు అరవై దగ్గర పడుతోంది. నేను కూడా నా కథలు పరాయి భాషలోకి వెళ్ళాయి అని చెప్పుకోవద్దూ. అలాగే పరాయి రాష్ట్రాలలో కూడా నాపేరు కొంత నలగాలి కదా. ఎవరెవరి కథలో అనువాదం అయిపోతున్నాయి. కానీ నా కథలను అనువాదం చేస్తానని ఒక్కడూ ముందుకు వచ్చిన పాపాన పోవడం లేదు. బహుశా ఇక రారేమో.అందుకే ఈ ప్రయత్నం". "అర్థమైంది. మీ ఉద్దేశం పూర్తిగా అర్థమైంది. తెలుగు కథలు అక్కడ వారికి చేరవేయడానికి కాదన్నమాట. మీ పేరు గొప్పకోసం. అంతేగా". "అంతే అనుకో". "సరే అయితే నాకు తెలిసిన అనువాదకులని అడుగుతాను లెండి. మరి ఈ సీరియల్ వేసినందుకు మా పత్రిక కి" అంటూ ఆపేశాడు పాతబ్బాయి. "సరేలే ఏడవకు. నా సీరియల్ మీ పత్రికలో వేస్తున్నందుకు గాను నీకు ఓ ఇరవై వేలు ఇస్తానులే. అలాగే నా సీరియల్ మీద మంచి అభిప్రాయం పంపిన పాఠకుడికి, ఒక చొక్కా పంపిస్తామని కూడా ప్రకటనలో ఇవ్వు". చెప్పాడు కలం బాబు. "మహా ప్రసాదం" చెప్పి ఫోన్ పెట్టేసాడు పాత అబ్బాయి. కొద్దిసేపటికి కలంబాబు గారి శ్రీమతి వచ్చి, "ఏవండీ మీ కోసం ఎవరో వచ్చారు" చెప్పిందామె కళ్ళజోడు పెట్టుకుని హాల్లోకి నడిచాడాయన. కలంబాబుని చూడగానే లేచి నిలబడి నమస్కరించాడా వచ్చిన వ్యక్తి. "మీరు" అడిగాడు కలం బాబు అతనిని ఎగాదిగా చూస్తూ. "నేను కథలని హిందీలోకి అనువదిస్తూ ఉంటాను. నా పేరు కులాస రావు. మా ఇల్లు ఇక్కడే మాధవధార. ముసలం పత్రిక ఎడిటర్ గారు మిమ్మల్ని ఒకసారి కలవమంటే ఇలా వచ్చాను". "మీరు అనువాదకులా, చాలా సంతోషం. నాది ఒకటే కోరిక.నా కథలు హిందీ, ఇంగ్లీషు లోకి అనువదించబడాలి. అదో గొప్ప. అందరివీ ఏదో ఒక భాషలోకి అనువాదమై పోతూనే ఉన్నాయి. నావి చేస్తానని మాత్రం ఎవరూ రావడం లేదు. అందుకే నేను పూనుకున్నాను" చెప్పాడు కొంచెం దిగులుగా. "ఆ విషయం నాకు వదిలేయండి. నేను అనువదించాక చూడండి, మీ పేరు తారాజువ్వలా ఎక్కడికెళ్లిపోతుందో. అనువదించన పుస్తకం కాపీలు అన్ని లైబ్రెరీలకీ పంపిద్దాం.పుస్తక ఆవిష్కరణకి పెద్ద సభ ఏర్పాటు చేసి పేపర్లో వచ్చేలా చేద్దాం. ఆ పుస్తక ఆవిష్కరణ సభకి వచ్చిన వారికి మన అనువాద పుస్తకాన్ని ఉచితంగా ఇచ్చేద్దాం. అడిగిన వారికీ, అడగని వారికీ పోస్టులో పంపిద్దాం. ఆ పుస్తకం మీద ముసలం పత్రికలో ఒక సమీక్ష వ్రాయిద్దాం. దాంతో ఈ పుస్తకం హైలెట్ అయిపోవాల్సిందే". "బావుంది కులాసరావ్. వింటుంటేనే హ్యాపీగా ఉంది". అని తెగ మురిసిపోయాడు. సభ పూర్తయ్యాక ఆ ఫోటోలను ముసలం పత్రికలో వేయించాడు. గొప్ప కథలు అంటూ వ్రాయించాడు. అలాగే నాలుగు సంస్థలతో మాట్లాడి కొన్ని సన్మానాలు కొనుక్కున్నాడు. డబ్బు ఇచ్చి సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొని తన పుస్తకాలను పంచాడు. కథల పోటీలు పెట్టి రచయితలలో నానాడు. మొహమాటానికి అందరూ వహ్వా అన్నారు. అప్పటికి అతని మనసు కొంత శాంతించింది మరి.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.