ఆశ, అలవాట్లు మనిషిని - ఎడారిలో ఎండ మావుల్లా ఎంత దూరమైనా పరుగెట్టిస్తాయి. ఇది సుమారు ముప్పై ఎనిమిదేళ్ల క్రిందటి విషయం. ఉద్యోగం వస్తుందో రాదో తెలియదుగానీ, సుమారు ఎనిమిది వందల కిలోమీటర్లు, పదహారు గంటల ప్రయాణం. రిజర్వేషన్ దొరక్క జనరల్ భోగీలో కిటికీ ప్రక్క సింగల్ సీటులో నేనూ, దివాకరం వన్బై టూ చేసుకుని హైదరాబాదు చేరుకున్నాం. యాభై పైసల ఇన్లాండ్ లెటరుకి, శంకరం స్టేషనుకొచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. ఇద్దరికీ లగేజి లేదు. ఒక జత బట్టలు, లుంగీ, టవలూ షేవింగ్ సెట్టూ జోలీ లాంటి సంచిలో వేసుకుని "పదిహేను రోజుల కేంప్" అని ఇళ్లల్లో చెప్పి, బయలుదేరేము. "లగేజి లేదు కదరా, అలా నడుచుకుంటూ వెళదాం.? బోలెడు విషయాలు మాట్లాడుకోవచ్చు." అంటూ శంకరం మా ఇద్దరినీ స్టేషను బయటికి నడిపించెడు. ఓ టీ స్టాలు దగ్గర ఆగి, టీ ఆర్డరిచ్చేడు. టీ తాగుతూ పరామర్శలు చేసుకుని, అసలు విషయంలోకి వచ్చేం. "ఏం లేదురా శంకూ (మేం పిల్చుకునే ముద్దు పేరు), నాకు ఇంటర్వ్యూ వచ్చింది, ఈ సుబ్బులు గాడికి ట్రయల్. రికమెండేషను లెటరుతో వచ్చేడు. ఇంతకీ నీ కొత్త ఉద్యోగమెలా వుంది? " దివాకరం గడ గడ చెప్పేడు. శంకరం మొహం సీరియస్గా అయిపోయింది. "మనోడు కూడా తెలుగు మాట్లడడు. టైపిస్టు జాబే, కానీ ఒక్కో టైప్ మిషన్ కి నలుగురేసి టైపిస్టు మొగుళ్ళు. వారంలో రెండు రోజులు డ్యూటీ చేస్తే చాలు, తక్కిన ఐదురోజులూ కేంటీనుల్లో పడి ఏడవాలి. ఉద్యోగాలిచ్చే శాఖ ఇది." శంకరం ఉద్వేగభరితంగా చెప్పేడు. "మీరిద్దరూ ఇలా వుంటే రేపు నా పరిస్తితి ఏంటో?" దివాకరం నిట్టూర్పు. పబ్లిక్ గార్డెన్సు, అసెంబ్లీ హాలూ, లక్డీకా ఫూల్, దాటి ఖైరతాబాద్ జంక్షనుకొచ్చేము. కాస్త దూరం సోమాజీ గూడా వైపు నడుస్తూ ఓ పెద్ద భవంతి ప్రక్కనున్న సందులోకి నడిచేం. పదిహేను ఇళ్ళు దాటి ఓ ఇంటి దగ్గర ఆగేము. అయిదు ద్వారాలు ఐదు రూములుగా చేసేరు. ఒక పెద్ద రూము, దానికి అటాచ్డుగా బాత్రూం. బ్రహ్మచారి కొంపకి సరైన నిర్వచనంలా వుంది శంకరం గది. రూంనిండా వార్తా పత్రికలు, ఓ వారగా వత్తుల కిరోసిన్ స్టౌ, ప్రక్కనే బియ్యం, పప్పులు, ఓ నాలుగు గిన్నెలూ, మూడు మంచినీళ్ల బకెట్లూ, పక్క బట్టల చుట్ట, కాస్త దూరంగా చిన్న టేబులు కుర్చీ, వార పత్రికలు, తెల్లకాగితాల దొంతర, పెన్నుల స్టాండు, పది పేకెట్ల సిగరెట్లు దొంతర - ఇదీ వాడి రాజమహలు. బ్రహ్మచారి అందునా కధా రచయిత గది ఇలాగే వుంటుంది. "రేయ్, రోడ్లు గుర్తు పెట్టుకోండి, లేకుంటే వెతుక్కోవటం కష్టమవుతుంది." శంకరం అని, "మీరు రడీ అవుతుండండి మా ఓనరుని కలిసొస్తాను" అంటూ ప్రక్క గేటులోకి వెళ్లేడు. మేమిద్దరం లుంగీలు కట్టుకుని, రూంని సర్దటం మొదలెడుతుంటే శంకరం వచ్చేడు. "రూంకి ఎవరైనా వస్తే ఓనరుకి చెప్పాలి. మంచినీళ్ల ఎలాట్ మెంటు పెంచుతాడు. లేకుంటే ఇబ్బంది అవుతుంది." అంటూ తను కూడా శుభ్రం చేయటంలో ఓ చేయేసేడు. "స్నానాలు మన ఊర్లోలా జలకాలాడొద్దు. ముఖం కాళ్లూ చేతులూ కడుక్కోండి. వారంకి ఒకసారి మంచినీళ్ల కొళాయి వస్తుంది. అప్పుడే స్నానం." అంటూ శంకరం రీతి రివాజూ మాకు చెప్పేడు. మేం ముగ్గురం రడీ అయ్యి రోడ్డు మీద పడ్డాం. శెలవు రోజవటం వల్ల, రోడ్లన్నీ జన సంచారం తక్కువగా వున్నాయి. రోడ్ పాయింటు మలుపులో ఓ చిన్న పాకావిలాస్ వుంది. రుచికి ఏ స్టార్ హోటలూ సాటిరాదు, టిఫిను గట్టిగా దట్టించి, లక్డీకా ఫూల్ వైపు నడక సాగించేం. బిర్లా టెంపుల్ బాలాజీ దర్శనం అయిన తరవాత టాంకు బండ్ చేరేం. సాయంత్రం వరకూ పిచ్చాపాటి, శంకరం కధలు రెండు ప్రచురించబడ్డవాటి మీద చర్చ జరిగింది. హిమయత్ నగర్ సెంటరుకొచ్చి టీ తాగేం. నెమ్మదిగా రూంకి తిరుగు ప్రయాణమయ్యాం హోటలులో భోజనం చేసి, రాత్రి తొమ్మిదవుతుంటే రూంకొచ్చి పడ్డాం. నేలమీదే పడకకి, శంకరం ఏర్పాటు చేసేడు. మా అనుభవాలు, కాలేజీ రోజులూ, మాట్లాడుకుంటూ నిద్రలోకి జారిపోయేం. మధ్య రాత్రి కాలింగ్ బెల్లు, వెంటనే, 'పానీ ఆయా' అన్న అరుపు. టేబుల్ వాచీ చూసేను. మూడున్నర, ఆ అరుపు మా కోసమే అనుకుని, "ఆరహా హూఁ భయ్యా" అన్నాను. "సుబ్బూ, మంచి నీళ్ల బకెట్లు నింపు, నీ స్నానం అయ్యాక మమ్మల్ని లేపు." అంటూ శంకరం ప్రక్కకి తిరిగి మళ్లీ నిద్రపోయేడు. రేషన్ షాపు క్యూలా వుంది లైను. ఒక్కొక్క బకెట్టూ నీటితో నింపి రూంకి తెచ్చేను. "తుమ్హారా దోస్త్ బహుత్ సిగరెట్ పీతాహై. ఉన్ కో థోడా కమ్ పీనే కేలియె బోలో భాయ్. పూరా ఘర్ కార్ఖానా జైసా హోరహా హై" అష్రఫ్ భాయ్, ఇంటి యజమాని కంప్లయింట్ లాంటి రిక్వెస్టు చేసేడు. "అలాగే భాయ్" అని చెప్పి వచ్చేసా. పాపం ఆయనకి తెలీదు మేం ముగ్గురం దమ్ము బాబులమని. గంట లోనే నేను స్నానం ముగించి, స్టౌ వెలిగించి టీ కలపుతూ దివాకరాన్ని, శంకరాన్ని లేపేను. వాళ్లూ రడీఅయ్యాకా ముగ్గురం టీ తాగేం. టైం ఏడైంది. రూంలోంచి బయట పడి, పాకా విలాస్ కొచ్చేం టిఫిన్ కోసం. టిఫిన్ చేసిన తరువాత శంకరం ఆఫీసుకి బస్సు ఎక్కేడు. నేనూ, దివాకరం చెరొకవైపూ బయలు దేరేం, ఎవరు ముందొచ్చినా - సాయంత్రం ఇక్కడే కలవాలని. నా కంపెనీ సోమాజీ గూడావే. అడ్రస్సు కాగితం మీద రాసుకుని వెతుకులాట మొదలెట్టేను. అదృష్టం గంట తిరుగుడుకే దొరికిపోయింది. ఆఫీసులో కవరు చూపి, అడిగేసరికి రిసెప్షనిస్టు పాప, "ఎండీ గారు ఊరెళ్లారండి, బహుశా నాలుగు రోజులు పడుతుంది తిరిగొచ్చేసరికి" అంది. నా పేరు కేరాఫ్ రికమెండేషన్ ఉత్తరమిచ్చిన పెద్దాయన పేరూ ఓ కాగితం మీద రాసి, రి.పాపకి అందిస్తూ " నేను వచ్చేనని ఎండి గారికి చెప్పండి, ఆయన్ని కలిసి పర్సనల్ గా ఈ లెటరు ఇవ్వాలి. రేపు వస్తాను. ఏమన్నారో చెప్పండి" అంటూ బయటికొచ్చేను. నాకు రికమెండేషన్లు మీద నమ్మకం లేదు, ఏం సంపాదించినా మెరిట్ మీదే సంపాదించాలన్న మనస్తత్వం మా నాన్న ట్రయినింగ్. ఉద్యోగం ఏదో ఒకటి చేయాలి, తప్పదు. అవసరం కూడా. దివాకరం, శంకరం లా నాది వంటరి బ్రతుకు కాదు. నాన్న వ్యాపారం, నా డిగ్రీ చదువు, ఆయనకి చేదోడుగా వుండి సెటిల్ అయ్యే ఆలోచన వుంది అనగానే వారికి (నాక్కూడా) నచ్చిన అమ్మాయితో పెళ్లి జరిపించేరు. అనుకున్నవన్నీ జరగవు అందరికీ అనను, కొందరి విషయంలో మాత్రమే. పెళ్లయి నాలుగు నెలల తరవాత నాన్నకి సుస్తీ, సంవత్సరంలోగా అన్నీ ముగిసి పోయేయి. జీవితంలో మొట్టమొదటిసారి అలజడి అంటే ఎలా వుంటుందో తెలిసింది. ఎన్ని ఇంటర్వ్యూలకెళ్లినా అనుభవం అడిగే వారే, నాన్న వెనక వుండి చేసిన వ్యాపార అనుభవం వారు లెక్కలోకి తీసుకోలేదు. వాళ్లకి వ్యాపారం చేయించే వాడు వద్దు. ఆఖరికి అత్తగారి అమెరికా తమ్ముడిచ్చిన రికమెండేషన్ ఉత్తరం, చుక్కాని అయింది. దాని సత్తా చూడాలని అనిపించింది. ఎండిని ఎంత ఆలస్యమైనా కలవడానికే నిశ్చయించుకున్నా. చుట్టు ప్రక్కల ప్రాంతాలన్నీ, డైరీలో మేప్ గీసుకుంటూ తిరిగి సాయంత్రానికి పాకా విలాస్ దగ్గరకొచ్చేను. ఓ పది నిముషాలకి దివాకరం, మరో పావుగంటకి శంకరం వచ్చేరు. ఆరోజు విశేషాలు మాట్లాడుతూ రాత్రి టిఫిన్లు ముగించి రూంకి చేరేం. దివాకరం మొదటి వ్రాత పరీక్ష పాసయ్యేడు. మర్నాటికి ఇంటర్వ్యూ వాయిదా పడింది. శంకరం డ్యూటీ టైప్ మిషన్ ఖాళీలేని కారణంగా, రిజిస్టరులో సంతకం చేసి రోజంతా కాంటీన్లో గడిపేడు. రెండు రోజుల కర్చయిన సిగరెట్టు పేకెట్లు మళ్లీ పదికి భర్తీ చేసుకున్నాం. మర్నాటికి ఏంచేయాలన్న ప్లానింగ్ మాట్లడుకుంటూ నిద్రలోకి జారుకున్నాం. రెండురోజులు హాజరు తరవాత రిసెప్షనిస్టు పాప, చెప్పింది ఎండిగారు రేపు వస్తారని. దివాకరం గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలలో సెలక్టయ్యేడు. ఫైనల్ గా రేపు ముగింపు. శంకరం వారానికి రెండురోజుల్లో ఒకరోజు డ్యూటీ చేసేడు. ఉదయం పది గంటల నుండి కంపెనీలో కాపేస్తే, ఎండి మధ్యాహ్నం రెండు గంటలకి వచ్చేడు. ఓ అరగంట తరవాత ఎండి నుండి పిలుపొచ్చింది. "మా జగ్గడు ఎలా వున్నాడు. వాడిని చూసి చాలాకాలం అయ్యింది. ఇలా ఉత్తరాల్లోనే మా స్నేహం మిగిలిపోయింది" అంటూ నేనిచ్చిన ఉత్తరాన్ని ఆసాంతం చదివేడాయన. "నీ అప్లికేషను నా దగ్గర వుంచు, వారం పదిరోజుల్లో నిన్ను పిలుస్తా" అంటూ నన్ను సాగనంపేడు. కాస్త నమ్మకం వచ్చింది, పని జరగొచ్చని. జరిగిందానికీ జరగబోయేదానికీ చాలా తేడా వుంటుంది. నా అనుభవం లోని విషయం, విషగూళిక. నోట్లో కెళ్లిపోనంత వరకూ కంచంలోని ముద్ద కూడా మనది కాదు. మళ్లీ కొత్త కొత్త రోడ్లూ, సందులూ తిరిగి రూట్ మేప్ గీసుకుంటూ సాయంత్రానికి మీటింగ్ పాయింట్ కి చేరుకున్నా. రోజూలాగనే ముందు దివాకరం, ఇంకాస్త ఆలస్యంగా శంకరం వచ్చేరు. విశేషాలు చెప్పుకుంటున్నాం, కానీ నాదీ శంకరంది ఆలోచనంతా - దివాకరం ఇంటర్వ్యూ రిజల్టు మీదే. "వీళ్లకి బుర్రలెప్పుడు ఎదుగుతాయిరా శంకూ, అన్నిట్లోనీ టాప్ త్రీలో వున్న వాడ్ని. వాడడిగే తిక్క ప్రశ్నలకి సమాధానం ఇవ్వటం తప్పా?" అంటూ మా ముఖాల్లోకి చూస్తూ "తప్పిందిరా" అన్నాడు. శంకరం ఆతృతగా "ఏమైందిరా, దివాకరం" అన్నాడు. "సబ్జెక్టు వరకూ బాగుంది, సమాధానాలు బాగానే చెప్పేనన్నాడు. పర్సనాలిటీ విషయంలో తిరగ్గొట్టేడు." అంటూ మళ్లీ పొడిగింపుగా "నువ్వేంటి ఇలా వున్నావు? తల దువ్వలేదు, ముఖం కూడా జిడ్డుగా వుంది అన్నాడు. "నేను వచ్చింది జర్నలిస్టు ఉద్యోగానికి సార్, సినిమా ఏక్టరుగా కాదు మేకప్ లో వుండడానికి. మీరు మధ్యాహ్నం పిలిచేరు, కాళీగా ఇక్కడ వుండడమెందుకని అలా నాలుగు రోడ్లూ తిరిగొచ్చేను. ఎండా కాలం కదండి, సార్" అన్నా. "ఆయనకి నచ్చిందో లేదో తెలియదు. ఏ మైనా చల్లగా కానీ వేడిగా కాని తీసుకుంటావా? అంటూ అడిగితే 'ఓ గ్లాసు మజ్జిగ తెప్పించండి సార్," అన్నా. "సారీ ఇక్కడ మజ్జిగ దొరకదు. త్వరలో నీకు లెటరు రాస్తాం. ఆల్ ది బెస్ట్.అంటు బయటికి తగిలేశాడ్రా." దివాకరం నవ్వుతూ ముగించేడు. శంకరం, నేనూ పగలబడి నవ్వుకున్నాం. "రిపోర్టరు జాబ్ కే ఇలా వుంటే, సబ్ ఎడిటరు జాబ్ కి మరెలా వుంటాడో అనుకుని వుంటాడు. "మరేం పర్లేదురా దివాకర్, ఈ ప్రపంచం చాలా విశాలమైంది. మనల్ని భరించే వాడు దొరక్కపోడు. ఎక్కడో వున్నాడు, మన గురించి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తూ. కాకపోతే మనమే వెతకాలి వాడిని" నవ్వు ఆపుకుంటూ అన్నాను. టిఫిన్ ముగించి కర్చయిన సిగరెట్టు పేకట్లు కొనుక్కుని రూంకి బయలుదేరేం. అప్పటికే రాత్రి పదకొండయింది. దుఖాణాలు మూసి, రోడ్లు నిర్మానుష్యమయ్యాయి. ఎంత కావాలనుకున్నా నిద్రా దేవత దగ్గరికి రానీయలేదు. దివాకరం పరిస్తితి అదే. శంకరం మాత్రం ముసుగేసెశాడు. గంటలు నిముషాలులా దొర్లిపోతున్నాయి. పన్నెండు, ఒంటిగంట, రెండు అబ్బే నిద్రాదేవత అలుకమాన లేదు. "ఎరా నిద్రపట్టటం లేదా" దివాకరం పరామర్శ. చేతిలోకి సిగరెట్టు పేకట్ తీసుకుని అగ్గిపెట్టి కోసం వెతికేను, దొరకలేదు. రూం అంతా జల్లెడ పట్టేను కనీసం ఒకటి రెండు అగ్గి పుల్లలు అయినా దొరుకుతాయని. నాలిక పీకేస్తున్నాది, సిగరెట్టు కాల్చాలన్న ధ్యాస, కోరికా కలగనంత వరకూ పరవాలేదు. కలిగిందో ఆచరించటమే, మరో మార్గం లేదు. "పదరా దివా, అగ్గిపెట్టి కొనుక్కొద్దాం" అన్నాను. "మరి వీడో?" దివాకరం సందేహం. "బయట తాళం వేసుకుని వెళదాం, పది నిముషాల్లో వచ్చేయమా?" నా మాట పూర్తవకుండానే దివాకరం రడీ అయ్యేడు. రూంకి తాళం పెట్టి, నడక ప్రారంభించేం, నేనూ దివాకరం. ఈలోగా కరెంటు పోయింది, చిమ్మ చీకటి. అలా అలా నడుచుకుంటూ చాలా దూరం వెళ్లేం. నిశ్శబ్ధంగా వుంది. అక్కడ అక్కడ ఇళ్లున్నాయి. మిగిలినదంతా కాళీ ఇళ్ల స్తలాలే. "సుబ్బూ, అల్లక్కడ చూడు దీపం కనిపిస్తున్నాది. టీ దుఖాణమేమో" అంటూ దివాకరం నన్ను లాక్కుని పోయేడు. చాలా దూరం నడిచిన తరవాత ఓ చిన్న పురిపాక ముందు దీపం వెలుగులో ఒకామె కూర్చుని వుంది. "అమ్మా అగ్గి పెట్టి వుందా." దివాకరం అడిగాడామెని. "దీపం వుందయ్యా, అగ్గిపెట్టి లేదు" అందామె. ఆవిడ ముఖం కనిపించటం లేదు, జుత్తు వదులుగా చివర్లు ముడేసినట్టుంది. ముఖాన్ని తలవెంట్రుకలు కప్పేశాయి. "పోనీలే అమ్మా దీపం చూపెట్టు చాలు, సిగరెట్టు కాల్చుకోవడానికి" అన్నాన్నేను. సిగరెట్టు వెలిగించుకుని, గుండె నిండా పొగ పీల్చి తిరుగు ప్రయాణం అయ్యాం. ఎంత దూరం వచ్చేమో, వెనక్కి వెళ్తున్నప్పుడు దూరం పెరిగి పోతున్నట్టుంది. అప్పటికే ఒక సిగరెట్టు వెనకాల రెండోది ముట్టించేం. "నేరకి పోయి వచ్చేంరా బాబూ" అన్నాడు దివాకరం. అదృష్టం కరెంటొచ్చింది. వీధి లైటు వెలుగులో టైం చూసేను, నాలుగవుతున్నాది. రూం సెంటరుకి వచ్చేం. పాకా విలాస్ లో అలికిడి. "చాయ్ అయ్యిందా? సామీ" అడిగితే, 'ఓ పదినిముషాలు ఆగండయ్యా।' అంటూ సమాధానమోచ్చింది. టీ తాగి, అగ్గి పెట్టి కొనుక్కుని రూంకి చేరేం. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియ లేదు, శంకరం ఆఫీసుకెళుతూ మమ్మల్ని లేపేడు. "ఎక్కడికి రా మధ్యరాత్రి షికార్లు. కరెంటు పోయినప్పుడు తెలివొచ్చి చూస్తే మీరు లేరు. బయట గడియ పెట్టుంది నేనూ వద్దామనుకుంటే" అన్నాడు శంకరం. "అగ్గిపెట్టి కొందామని బయటికెళ్లేం" అన్నాన్నేను. దివాకరం జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పేడు. "కొంప ముంచేరు. మీరు వెళ్లింది శ్మశానానికి, ఓ వారం క్రితం ఎవరో అమ్మాయిని ఏదో చేసి, అక్కడ చంపి తగలపెట్టేరు" అన్నాడు శంకరం. "జాగ్రత్త, అలా రాత్రులు తిరగకండి" అంటూ ఆఫీసుకెళ్లిపోయేడు. దివాకరంకి మాత్రం నమ్మకం లేదు. అంత తొందరగా ఏదీ నమ్మడు. యధావిధిగా తయారై మళ్లీ ఇద్దరం రోడ్డెక్కేం. మాకు మతి పోయింది, మూడు కిలోమీటర్లు నడిస్తే కానీ రాత్రి మేం చూసిన ప్రదేశం రాలేదు. ఆశ్చర్యం, అక్కడ మనుష్య సంచారమే లేదు. పురి గుడిశ కానీ, ఏదీ వున్న జాడే లేదు. మా ఇద్దరికీ వెన్నులోంచి వణుకు ప్రారంభం అయింది. మేమిద్దరం మౌనంగా రూం చేరేం. శంకరం రాక కోసం ఎదురుచూడటం మొదలెట్టేం. సాయంత్రం వచ్చేడు. మేం వెంటనే లగేజీ సర్దుకుని తిరుగు ప్రయాణానికి సిధ్దమయ్యాం శంకరం ఉండమని ఎంత బ్రతిమాలినా ఉండకుండా, చాలా పన్లున్నాయని చెప్పి. * * * "దేముడు - దయ్యం వున్నాయని నమ్మక్కరలేదు. అనుభూతులకు సాక్ష్యాలు వుండవు." నా మనసులో మాట దివాకరం నోటి నుండొచ్చింది. రైలు మా గమ్యం వైపు పరుగు లంకించుకుంది. * * *