బ్రహ్మపురం అనే పట్టణంలో శివయ్య అనే ధనవంతుడుండేవాడు. అతనికి ఎంత సంపద ఉన్నా సంతానం లేకపోవడంతో ఎప్పుడూ తీవ్ర విచారంలో మునిగి ఉండేవాడు. ధనార్జనలో ఎప్పుడూ మునిగి తేలడంవల్ల ముందు ఏమీ తెలిసేది కాదు కానీ, కాలం గడిచేకొద్దీ ఆ లోటు బాగా తెలిసొచ్చింది శివయ్యకి. నడివయసులో ఉండగా భార్య గతించడంతో పూర్తిగా ఒంటరివాడయ్యాడు. కొన్నాళ్ళకి బాగా విరక్తి చెందిన శివయ్య తనకిక జీవితంలో ప్రశాంతత కావాలని భావించాడు. తనకున్న యావదాస్తిని అనాథ శరణాలయాలకి, తను నెలకొల్పిన వృద్ధాశ్రమానికి రాసిచ్చేసి ఆ పట్టణంవదిలి వెళ్ళిపోయాడు.
ప్రశాంత వాతావరణం వెదుకుతూ అరణ్యాలవెంట తిరుగుతూ చాలా దూరం వెళ్ళాక జనావాసాలకి దూరంగా ఉన్న ఓ ప్రదేశం శివయ్యని బాగా ఆకర్షించింది. రెండు ఎత్తైన కొండల నడుమ ఉన్న ఆ ప్రదేశానికి సమీపంలోనే గలగలపారే ఓ సెలయేరు ఉంది. నలువైపులా రకరకాల మహావృక్షాలు కనులకింపుగా కనిపించాయి. పక్కనే ఫలవృక్షాలు కూడా ఉన్నాయి. అక్కడ నెలకొన్న ప్రశాంతతకు ముగ్ధుడై అక్కడే తన నివాసం ఏర్పర్చుకొని శేషజీవితం గడప నిశ్చయించాడు శివయ్య.
మనసుని మైమరపించే ఆ రమణీయమైన ప్రదేశంలో ఓ చిన్న కుటీరం నిర్మించుకొని నివశించాడు శివయ్య. ప్రతీరోజూ వేకువఝామునే లేచి స్నానాదులు ముగించి చాలా సేపు ధ్యానం చేసేవాడు. ఆ అరణ్యంలో దొరికే కందమూలాలు, ఫలాలు తిని, సెలయేరు నీరు తాగి ఆధ్యాత్మిక జీవితం గడపసాగాడు. అయితే శివయ్యకి మాటిమాటికీ తన గత జీవితం గుర్తుకువచ్చి ధ్యానం సరిగ్గా సాగేది కాదు. కొన్నాళ్ళు అలా గడిపిన తర్వాత ఒకరోజు ఆ తోవంటే హిమాలయాల్లో తపస్సు చేసి తిరిగి వస్తూన్న వినయానందస్వామి ఆ నిర్జన ప్రదేశంలో కుటీరం ఉండటం చూసి ఆగాడు.
అతన్ని చూసి శివయ్య సాదరంగా అహ్వానించి అతిథి సత్కారం చేసాడు. అచ్చటి రమణీయమైన, ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడైన వినయానందస్వామి కొంతకాలం అక్కడ నివశించాడు. శివయ్య గత జీవితం తెలుసుకొని అతనికి వేదాంత బోధ చేసాడు. అంతేకాక అనేక ఆధ్యాత్మిక విశేషాలు ఉద్బోధించాడు. అలా అక్కడ కొంతకాలం నివశించిన తర్వాత వినయానందస్వామి లోక సంచారం చేస్తూ అక్కణ్ణుంచి బయలుదేరాడు.
వినయానందుడివల్ల ఆధ్యాత్మిక, వేదాంత ఙానం సముపార్జన చేసిన శివయ్య మనసు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతీరోజూ భగవధ్యానంలో నిమగ్నమైయ్యేవాడు.
ఇలా ఉండగా ఒక రోజు ఆ ప్రాంతానికి ఒక వేటగాడు జింకను తరుముతూ వచ్చాడు. ఆ జింక కుటీరం బయట శివయ్య ధ్యానం చేసుకునే చోటుకు వచ్చి అక్కణ్ణుంచి ఎటో మాయమైంది. జింకను తరుముతూ వచ్చిన వేటగాడికి జింక కనిపించలేదు కానీ అక్కడే ధ్యానమగ్నమై ఉన్న శివయ్య కనిపించాడు. అతని ముఖంలోని దివ్య తేజస్సుకి ఆ వేటగాడు చకితుడైయ్యాడు. తను వచ్చిన పని మర్చిపోయాడు. అంతే కాక శివయ్యని చూడగానే ఆ వేటగాడికి వేటాడాలనే ధ్యాసకూడా పోయింది. ఆ వేటగాడిలో మార్పు వచ్చింది. శివయ్య ధ్యానం ముగించి కళ్ళు తెరిచేవరకూ అక్కడే నేలపై కూర్చున్నాడు. శివయ్య కళ్ళు తెరిచిన తర్వాత ఆ వేటగాడు అతని పాదాలకు నమస్కరించి, "మహాత్మా!...మిమ్మల్ని చూడగానే నా జన్మ ధన్యమై పోయింది. ఇంతకాలం వేటగాడిగా జీవించిన నేను ఆ జీవితానికి స్వస్తి చెప్పదలిచాను. ఇకముందు సాత్వికంగా జీవించదలిచాను. నన్ను ఆశీర్వదించండి." అన్నాడు.
శివయ్య ఆ వేటగాడ్ని దీవించాడు. ఆ వేటగాడిద్వారా శివయ్య గురించి ఆ ప్రాంతానికి దూరంగానున్న ఊళ్ళోవారికి తెలిసింది. తన చూపులతో కఠినాత్ముడైన వేటగాడి మనసును మార్చిన మహాత్ముడిగా శివయ్యని అందరూ ఆరాధించారు. అతన్ని దైవాంశ సంభూతుడిగా భావించారు జనం. అతని దృష్టి తమమీద ప్రసరిస్తే తమ వేదనలన్నీ తొలగిపోతాయన్న నమ్మకం కలిగిందందరికీ. త్వరలోనే ఈ విషయం ఆ చుట్టుపక్కల గ్రామాలకి పాకింది. ప్రజలే అతన్ని శివానందస్వామిగా మార్చి అతనికి తమ ఈతిబాధలు, కష్టాలు విన్నవించుకోసాగారు. ఉపదేశాలు, సలహాలు పొందసాగారు. త్వరలోనే శివానందస్వామి ఆధ్యాత్మిక, తాత్విక ప్రబోధాలు దేశదేశాంతరాలు వ్యాపించాయి. అతని గురించి ఇప్పుడు తెలియనివారెవరూ లేరు. పెద్దపెద్దవారు, జమీందారులు సైతం అతని కరుణా కటాక్షంకోసం వేచి ఉండసాగారు. ఇప్పుడతని కార్యక్రమాలన్నింటినీ చూసుకునేందుకు స్వఛ్చందంగా చాలామంది శిష్యులు ముందుకొచ్చారు. ఇప్పుడు శివానందస్వామికి క్షణం తీరికలేదు. ఇంతకు పూర్వంలాగా ప్రశాంతంగా ధ్యానం చేయడానికి ఇప్పుడు మరి సమయం లేదు. రోజంతా ప్రజల కోరికలు, సమస్యలు వినడానికే సరిపోవడంలేదు.
కొంతమంది తమ దారిద్యం తీరేందుకు పరిష్కారమార్గం కోరితే, కొంతమంది సంతానప్రాప్తి, మరికొంతమంది ధనప్రాప్తిలాంటి కోరికలు స్వామికి విన్నవించుకునేవారు. శివానందస్వామిగా మారిన శివయ్య అన్నింటికీ తన వేదాంత ధోరణిలోనే సమాధానాలు చెప్పేవాడు. తమ కోరికలు తీరితే స్వామి అనుగ్రహంవల్లే తీరాయని ప్రజలు భావిస్తే, కోరికలు తీరనివారు మాత్రం తమలో ప్రయత్నలోపం ఉందని భావించేవారు. అయితే శివయ్య ఏ కారణాలవల్ల జీవితంలో విరక్తిచెంది ప్రశాంతతకోసం ఇలాంటి నిర్జన ప్రదేశానికొచ్చాడో, ఇప్పుడు మళ్ళీ ప్రజలందరినుంచి అవే సమస్యలు వినవలసి రావడంతో కలత చెందాడు. పైగా తను ధ్యానం చేసుకుంటూ ప్రశాంత జీవితం గడపడానికి ఇప్పుడు ఏ మాత్రం వీలవడం లేదు.
ఈ లోపు ప్రజలందరూ చందాలేసుకొని అక్కడో పెద్ద మందిరం, స్వామికి ఓ ఆశ్రమం నిర్మించారు. ఆశ్రమ వ్యవహారాలు, మందిరం వ్యవహారాలు చూసుకునేందుకు ఆ ఊరిపెద్దలు కొంతమంది ధర్మకర్తలుగా ఏర్పడ్డారు. ఆ చుట్టుపక్కల పూజాసామగ్రి అమ్మే అంగళ్ళు, కొబ్బరికాయలు అమ్మే అంగళ్ళు చాలా వెలిసాయి. ఆ నిర్జన ప్రదేశం కాస్తా జనసముద్రమైంది. ఆ ఆశ్రమం చుట్టూ జనావాసాలు, పూటకూళ్ళ ఇళ్ళు ఏర్పడి అక్కడ ప్రశాంత వాతావరణం కాస్తా కనుమరుగైంది. ఇప్పుడు శివానందస్వామిని దర్శించాలంటే అక్కడ కార్యాలయంలో రుసం చెల్లించాల్సిందే, గంటలకొలదీ వేచిఉండాల్సిందే! ఆ ఊరిపెద్దలు, ధర్మకర్తలు రాబోవు కార్తీకపౌర్ణమి నాటికి చాలా పెద్ద ఎత్తున జాతర, తిరనాళ్ళు చేయ సంకల్పించారు. అందుకోసం భారీ ఎత్తున ధనం సేకరించారు కూడా.
ఇవన్నీ చూసిన శివయ్యకి ఈ తరహా జీవితంపై విరక్తి కలిగింది. తన శేషజీవితం అక్కడ ప్రశాంతంగా ఇక ఏమాత్రం గడవదని త్వరలోనే గ్రహించాడు.
కార్తికపౌర్ణమి ఇంకా రెండు రోజులుందనగా ఉన్నట్టుండి శివానందస్వామి మాయమైయ్యారు. దైవాంశ సంభూతుడైన శివానందస్వామి రాత్రి శివధ్యానం చేస్తూ శివునిలో ఐక్యమయ్యాడనే వార్త అక్కడ వ్యాపించింది. ప్రస్తుతం అక్కడ శివానందస్వామి విగ్రహం ప్రతిష్టింపబడి ప్రజల పూజలందుకుంటోంది. ప్రజలు తమ కోరికలు ఆ విగ్రహానికి విన్నవించి ముడుపులు కడుతున్నారు, తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆ తర్వాత అదో పెద్ద తీర్థస్థలంగా విఖ్యాతిగాంచింది.
అయితే వీటన్నింటికీ కారణమైన శివయ్య మాత్రం ప్రశాంతతను వెతుక్కొని తిరిగి తన ఊరైన బ్రహ్మపురం చేరి అక్కడ తను ఏర్పాటు చేసుకున్న వృద్ధాశ్రమంలో ప్రశాంతంగా జీవితం గడుపుతున్నాడు. ఇప్పుడు అక్కడ అతన్ని పోల్చేవాళ్ళెవరూ లేరు. తోటివారి సమస్యలు తెలుసుకుంటూ, వాళ్ళకి స్వాంతన చేకూరుస్తూ ప్రశాంత జీవితం వెళ్ళదీస్తున్నాడు.