చిన్నప్పుడే తల్లితండ్రీ కోల్పోయిన సోమయ్యని వాడి బామ్మ పార్వతమ్మ అతి గారాబంగా పెంచింది. గారాబంగా పెరగడం వల్ల సోమరిగా తయారయ్యాడు సోమయ్య. బామ్మే కాయకష్టం చేసి మనవడిని పెంచి పెద్ద చేసింది. సోమయ్యకి చదువు అబ్బలేదు సరికదా ఏ పని కూడా చేతకాలేదు. తను ఉన్నంతవరకూ పర్వాలేదుకాని తన తదనంతరం మనవడి పరిస్థితి తలచుకొని బెంగ పెట్టుకునేది వాడి బామ్మ. చదువెలాగూ అబ్బలేదని, బామ్మ వాడిని ఊళ్ళోని పెద్ద కామందైన రాఘవయ్యని బతిమాలి అతని వద్ద పాలేరుగా పనిచేయడానికి ఒప్పించింది. ముందు పాలేరుగా పని చేయడానికి ఒప్పుకోకపోయినా బామ్మ బలవంతం మీద రాఘవయ్యవద్ద పనిలోకి చేరక తప్పిందికాదు సోమయ్యకి. అయితే వాడు అక్కడ పని సరిగ్గా చేయక, ఎప్పుడూ పశువుల సాలలో బద్ధకంగా నిద్రపోయేవాడు. వాడి పనితీరు చూసిన రాఘవయ్య రెండుమూడుసార్లు వాడిని మందలించాడు. అయినా వాడి తీరు మారకపోవడంతో వాడిని పనిలోంచి తీసేసాడు.
వాడి సోమరితనం ఎలా పోగొట్టాలో పార్వతమ్మకి తెలియలేదు. ఆ తర్వాత సోమయ్యని పాడిపనులు చూసుకొనే పానకాలు వద్ద పనికి పెట్టింది. ఆ ఊళ్ళో అందరికీ తెల్లవారే పాలు అందించే పని అప్పచెప్పాడు వాడికి పానకాలు. అసలే తెల్లవారి లేచే అలవాటే లేని సోమయ్యకి ఆ పని చాలా కష్టంగా తోచింది. రెండురోజులు అతి ప్రయాసమీద పని చేసిన తర్వాత మరి ఇక చెయ్యలేనని పానకాలు వద్ద కూడా పని మానుకున్నాడు సోమయ్య.
ఇలా లాభం లేదని, బామ్మ వాడికి అడివిలోకి వెళ్ళి ఎండుకట్టెలు కొట్టి తెమ్మంది, మధ్యాహ్నం తినడానికి చద్ది అన్నం మూట కట్టి ఇచ్చి. బామ్మ పోరు పడలేక గొడ్డలి పట్టుకొని అడవికైతే వెళ్ళాడు కాని, కాయకష్టం చేయడం అలవాటు లేని సోమయ్య ఓ అరగంటసేపు పని కూడా చేయకుండానే అలిసిపోయాడు. చద్ది మూట విప్పి భోజనం చేసి ఓ చెట్టుకింద విశ్రాంతి తీసుకున్న సోమయ్యకి వెంటనే కునుకు పట్టి గాఢనిద్రలోకి జారుకున్నాడు. అలా నిద్రపోయిన సోమయ్య నిద్రలేచేసరికి సాయంకాలమై చీకటి పడింది. ఆ కొట్టిన కొద్ది కట్టలే ఇంటికి తీసుకువెళ్ళాడు. అది చూసి వాడి బామ్మకి కోపం వచ్చింది.
"ఒరే! నువ్విలా సోమరిపోతుగా ఉంటే ఎలారా? అసలే నీకే పని చేతకాదు. నేనున్నాను కాబట్టి నీకు ఇప్పుడు ఇంత తినడానికి తిండి దొరుకుతోంది, నేను పోయాక నువ్వెలా బతుకుతావురా?" అంది.
"ఎలాగోలా దేవుడే ఇస్తాడు బామ్మా." అన్నాడు సోమయ్య బద్ధకంగా మంచంపై చేరబడి.
"అహాఁ...దేవుడే ఇస్తాడా! నువ్వు ఏ పనీ చేయకపోతే నీకు తిండి పెట్టను. దేవుడెలా నీకు ఇస్తాడో నేను చూస్తాను." అంది బామ్మ కోపంగా.
అయినా సోమరి అయిన సోమయ్య అదేం పట్టించుకోలేదు. అయితే వాడికి బుద్ధి చెప్పాలని ఆ రోజు రాత్రి సోమయ్యతో బాటు బామ్మకూడా పస్తు ఉంది.
అయినా సోమయ్యలో ఏ మార్పూ రాలేదు. ఆ తర్వాత రాత్రి తిండిపెట్టనందుకు బాధపడి ఆ మరుసటి రోజు ఉదయమే వాడికి వండిపెట్టింది. అయినా తన సూటిపోటీ మాటలనడం మానలేదు బామ్మ. కొన్నాళ్ళకు బామ్మతో విసిగిపోయి, కోపం తెచ్చుకొని ఒకనాడు ఇంటినుంచి వెళ్ళిపోయి అడవిదారి పట్టాడు సోమయ్య.
అలా అడవిలో నడుస్తూచాలా దూరం వెళ్ళిన తర్వాత వాడికి ఆకలి వేసింది. ఇంట్లో ఉంటే బామ్మ వాడికి ఈ పాటికి భోజనం పెట్టేది. ఆ కీకారణ్యంలో వాడికి తిండిపెట్టేదెవరు? ఆకలి తీర్చుకోవడానికి ఏ పండైనా కాయైనా దొరుకుతుందేమోనని చూసాడు. కానీ అలాంటివేవీ ఆ అరణ్యంలో లభించలేదు వాడికి. అంతకంతకూ వాడికి ఆకలి అధికమైంది. బామ్మపై అలిగి నేరకపోయి ఇంటి నుండి వచ్చేసానే అని మనసులో అనుకుంటూండగా ఎదురుగా ఒక కుటీరం కనిపించింది. కుటీరం వెలుపల ఒక ముని ధ్యానమగ్నమై ఉండటం చూసాడు. కొద్దిసేపు అక్కడ వేచిఉండేసరికి ఆ ముని కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచిన ముని తనకెదురుగా నిలబడ్డ సోమయ్యని చూసి మందహాసం చేసాడు. సోమయ్య అతనికి నమస్కారం చేసి నిలబడ్డాడు.
సోమయ్య ఆకలిగొని ఉన్నాడని గ్రహించిన ముని అతనికి తినడానికి ఫలాలు, తాగడానికి మంచినీరు ఇచ్చాడు. అప్పటికే బాగా ఆకలితో ఉన్న సోమయ్య వాటిని ఆవురావురుమని తిన్నాడు. ఆకలి తీరిన తర్వాత అతనికి నమస్కరించి తన కష్టం చెప్పుకున్నాడు. సోమయ్య సోమరితనం గ్రహించిన ముని నవ్వుకున్నాడు.
"నువ్వు సోమరితనం వదిలిపెట్టి ఏ పనైనా చేపడితే నీకీ కష్టం కలగదు కదా నాయనా! అయినా నీ బామ్మ నిన్నెంతకాలం పోషించగలుగుతుంది? ఎప్పటికైనా నీ కాళ్ళమీద నువ్వు నిలబడాలి కదా!" అన్నాడు మందహాసం చేస్తూ.
"మహాత్మా!...ఆకలి ఉండటం వల్లే కదా నాకీ కష్టాలన్నీ. తమరు తపస్సంపన్నపరులు. నాకు ఆకలి లేకుండా వరం ప్రసాదిస్తే నాకు పని చేసే అవసరమే కలగదుకదా స్వామీ! అలాంటి వరం నాకు ప్రసాదించండి స్వామీ" అన్నాడు. సోమయ్య కోరిక విన్న ఆ ముని, "నాయనా! ఆకలి ఉండటమే ఒక వరం. ఆకలి లేకపోవడం ఒక శాపమే కాని వరం కాదు. సోమరితనం వదిలిపెడితే నీకు కష్టమన్నదే రాదు." అన్నాడు.
కానీ సోమయ్యకి ఆ మాటలు రుచించలేదు.
"స్వామీ, ఆకలి లేకపోవడం నాకు వరమే! దయచేసి నా కోరిక మన్నించి నాకు ఆకలిలేని విధంగా వరం ఇవ్వండి." అన్నాడు.
ఆ ముని సోమయ్యకి వరం ప్రసాదిస్తూ, "నీకు ఇకనుండీ ఆకలి బాధించదు. అయితే ఎప్పుడైనా నీకీ వరం అనవసరమనుకున్నప్పుడు మాత్రం సోమరితనం వీడి కాయకష్టం చేస్తే ఈ వర ప్రభావం నశిస్తుంది. అయితే ఇది వరం కాదు! ఓ విధంగా నువ్వు కోరుకున్నది శాపమే! ఆ శాపానికి విరుగుడు మాత్రం సోమరితనం విడనాడడమే" అన్నాడు ముని.
అయితే తనకి వరమే లభించిందని నమ్మిన సోమయ్య అతని పాదాలకి భక్తిపూర్వకంగా నమస్కరించి తన ఊరికి తిరుగు ప్రయాణమైయ్యాడు.
ఇంటికి తిరిగివచ్చిన సోమయ్యని చూసి బామ్మ చాలా సంతోషించింది. సోమయ్య చెప్పాపెట్టకుండా ఇంటినుంచి వెళ్ళిపోయిన తర్వాత బామ్మ మనసులో చాలా బాధపడింది. మనవడ్ని పని చేయమని వేధించినందుకే ఇంటి నుండి వెళ్ళిపోయాడని, మనవడు తిరిగివస్తే ఇకముందు అలా చేయనని మధనపడసాగింది. అందుకే మనవడు తిరిగి రాగానే, "నిన్నింక ఎప్పుడూ ఏమీ అనను, మరెప్పుడూ నువ్వు ఇల్లు వదిలి వెళ్ళకు. ఎప్పుడనగా తిన్నావో, పద కడుపునిండుగా భోజనం చేద్దూవుగాని!" అని వంటిట్లోకి వెళ్ళబోయింది.
"బామ్మా! నాకు ఆకలిగా లేదు." అని చెప్పి బద్ధకంగా మంచంపై వాలాడు.
"అదేంటీ! నీ కిష్టమైన దుంపల వేపుడు, పప్పు చారు చేసాను. రా, భోజనం చేసిన తర్వాత నిద్రపోదువుగానీ." అంది మళ్ళీ.
తన కిష్టమైన దుంపలవేపుడు, పప్పుచారు అన్న మాట వినగానే నోట్లో నీరూరి లేచి కూర్చున్నాడు. అయితే అసలు తినాలని అనిపించలేదు, ఆకలి అస్సలు లేదు. మళ్ళీ మంచంపై వాలి, "ఆకలి లేకుండా అరణ్యంలో నివశిస్తున్న స్వామినుండి వరం పొందాను. నాకు ఇక ఆకలి కలగదు. నేనెలా భవిష్యుత్తులో బతుకుతానని నీకు బెంగ ఉండేది కదూ, ఇప్పుడు నీకు మరా చింత అక్కరలేదు. నాకు అసలు ఆకలే లేనప్పుడు నేను శ్రమ పడనవసరం లేదు. కష్టపడి పని చేయనవసరం లేదు." అన్నాడు.
సోమన్న మాటలు విన్న బామ్మ పార్వతమ్మ నిర్ఘాంతపోయింది. సోమరిగా జీవితం సాగించడానికి ఇష్టపడ్డ సోమయ్యకి ఏం చెప్పాలో అర్ధం కాలేదు బామ్మకి.
"హాయిగా కష్టపడి పనిచేసి, ఇష్టమైనవాటిని తినకుండా ఈ వరమేమిటిరా! నువ్వు ఎప్పుడు మారతావో ఏమో ఆ భగవంతుడికే తెలియాలి." అందామె కొద్దిసేపు తర్వాత.
"నేను హాయిగా ఉండటం నీకు ఇష్టం లేదా ఏమిటి?" అంటూనే నిద్రకి ఉపక్రమించాడు సోమయ్య.
అయితే సోమయ్యకి వరం కారణంగా ఆకలి లేకపోయినా, వండిన ప్రదార్థాలు, వాటి ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి. అయినా భోజనం చేయడానికి మాత్రం ఇష్టమవడంలేదు ఆకలి లేని కారణాన.
ఇలా ఉండగా, ఆ ఊరు జమిందారు తన కూతురి వివాహం సందర్భంగా ఆ చుట్టుపక్కల అన్ని ఊళ్ళలోని ప్రజలకి ఘనమైన విందు ఏర్పాటు చేసాడు. ఊరు ఊరంతా ఆ విందుకి తరలి వెళ్ళారు. బామ్మ బయలుదేరుతూ సోమయ్యని తోడు తీసుకెళ్ళింది. బద్ధకం మూలాన తోడు వెళ్ళడానికి మూలుగుతూనే మొత్తానికి బయలుదేరాడు సోమయ్య. విందులో రకరకాల పిండివంటలు చేయబడ్డాయి. వంటల సువాసనలు నలుమూలలా వ్యాపిస్తున్నాయి. బామ్మ వెంట వచ్చిన సోమయ్య ఇంక తనని తాను నిగ్రహించుకోలేకపోయాడు. తను కూడా బామ్మతోపాటు భోజనానికి కూర్చున్నాడు కాని వరం ప్రభావంవల్ల ఏమీ తినబుద్ధి కాలేదు.
అప్పుడు సోమయ్యకి ముని అన్న విషయం గుర్తుకువచ్చింది. అప్పుడు ఆకలిలేకపోవడం తనకి వరం కాక, శాపమని తెలియవచ్చింది. ఆ శాప ప్రభావం మూలానే ఇంతమంచి భోజనం తినడానికి తను అయోగ్యుడైయ్యాడని గ్రహించాడు. అప్పుడు దానికి ముని చెప్పిన విరుగుడు కూడా గుర్తుకి వచ్చింది. సోమరితనం వదిలితేనే కాని తనకి ఇక ఆకలి వెయ్యదని గుర్తుకి తెచ్చుకొని వెంటనే ఓ నిర్ణయానికి వచ్చాడు. అక్కణ్ణుంచి లేచి, వడ్డించే వాళ్ళకి, వంటవాళ్ళకి సహాయం చేసాడు. సోమన్న సోమరితనం ఎరిగిన వాళ్ళందరూ అదిచూసి ఆశ్చర్యపోయారు. బామ్మ కూడా ముందు ఆశ్చర్యపోయి ఆ తర్వాత చాలా సంతోషించింది. సోమరితనం వీడినందువలన సోమయ్యకు విపరీతమైన ఆకలి వేసింది. అయినా నిగ్రహించుకుని, ఆఖరి పంక్తిలో కూర్చొని తృప్తిగా, తనివితీరా విందుభోజనం ఆరగించాడు.
ఆనాటినుండి సోమయ్య సోమరితనం వీడాడు. సోమయ్యలో కలిగిన మార్పుకి అతని బామ్మ చాలా సంతోషించింది. సోమయ్య మారిన వైనం తెలిసిన రాఘవయ్య వాడిని తిరిగి పనిలో పెట్టాడు. సోమయ్య ఆ తర్వాత పెళ్ళి కూడా చేసుకొని సుఖంగా ఉన్నాడు.