" వనజ గారూ! వనజ గారూ! " అసలే ఆఫీస్ సమయం అయిపోతోందన్న కంగారులో అష్టావధానం .. శతావధానం చేస్తున్న నాకు .. ఆ పిలుపు నెత్తిన పడబోయే పిడుగులా తోచింది. ఆవిడ ఎదురింటి సూరేకాంతం .. అమ్మతోడు అది ఆవిడకు నే పెట్టిన నిక్ నేం కాదు ,అసలు పేరే .. అయితే సార్ధక నామధేయురాలు.
అసలే టైం లేదని ఏడుస్తూ ఇప్పుడిది అవసరమా .. మనసుని మందలిస్తూ .. "ఏమిటండీ! ' బయటకు వస్తూ అడిగాను.
"ఏం లేదు .. సూర్య వచ్చిందా! ఏం వచ్చిందో వీళ్ళందరికీ ఒక్కసారే అటు అలివేలూ ..ఇటు సోమీ ఇద్దరూ ఒకేసారి ఎగొట్టి చచ్చారు! ఇప్పుడెలాగో .. కాస్త మీ సూర్య అన్నా ఉందేమోననీ " దీర్ఘం తీసిందావిడ.
" లేదండి! ఈ రోజు రాను, ఊరెడుతున్నా అని చెప్పింది .. అందుకే నాకూ హడావుడి అయింది, ఏమనుకోకండి నాకు ఆఫీస్ టైం అయిపోయింది .. ఇంకా లంచ్ బాక్స్ సర్దుకోవాలి " గిరుక్కున వెనక్కి తిరిగి ఇంట్లోకొచ్చేసా.
" సర్లెండి .. ఇదిగో అమ్మాయ్ ! కాస్త ఇంట్లో పని చేసి పెడతావా, ఈవేళ మా పనమ్మాయిలు రాలేదు, నీకు డబ్బులిచ్చేస్తాలే .."
"ఏటండీ మంచీ మర్యాదా లేకండా! నేను పని పిల్లని కానండి " విసురుగా వినబడిందో కంఠం. ఈవిడింతే బుద్ధి రాదు .. ఇదివరకైతే ఒకళ్ళు కొట్టడానికి కూడా వచ్చేరు .. ఒక్క రోజు పనిమనిషి రాకపోతే అదో 'అంతర్జాతీయ సమస్యే ' కాలనీ మొత్తం గందరగోళం చేసేస్తుంది .. పోనీ అంటే ఉద్యోగపు పరుగులు లేవు, ఆ మొగుడు కేంపులు తిరిగే ఉద్యోగం .. ఒక్క కొడుకు .. ఎనిమిదో తరగతి .. వాడు ఎప్పుడో స్కూల్ కి వెళ్ళిపోయేడు. ఇలా రోడెక్కి అరచి అల్లరిచేసి, అల్లరి పడే బదులు నెమ్మదిగా చేసుంటే ఈ పాటికి అయిపోయేది కూడా! ' ఆలోచిస్తూనే తలుపులన్నీ వేసి, లంచ్ బేగ్, హేండ్ బేగ్ తీసుకుని తలుపులు తాళం వేసి, స్కూటీ స్టార్ట్ చేసా ' అమ్మో! అప్పుడే తొమ్మిదిన్నర .. దేవుడా ట్రాఫిక్ తక్కువ ఉండేలా చూడూ. బయలుదేరబోతూ తలెత్తి చూసా .. ఆవిడ గుమ్మం ముందు కుర్చీ వేసుకుని బైఠాయించింది .. వెళ్ళే వాళ్ళనీ వచ్చే వాళ్ళనీ చూస్తూ .. ఆపుతూ, పనికోసం అడుగుతూ. నవ్వుకుంటూ బయలుదేరా., సుమారుగా అదే నా నిత్యకృత్యం , . కాలం శరవేగంతో పరిగెడుతోంది.
***
చూస్తూండగానే పాతికేళ్ళు గడచిపోయాయి .. నాలో చకచకలాడే వేగం తగ్గింది. బదిలీల మీద నాలుగైదు ఊళ్ళు తిరిగాం .. సూరేకాంతం గారు గుర్తొస్తున్నారు ఈ మధ్య తరచూ .. ఎందుకంటే 'చేసుకోలేనితనం ' వచ్చిపడింది నాకూ కొత్తగా .. ఇప్పుడు పూర్తిగా మా 'శ్రీదేవి ' మా పని పిల్ల లెండి .. మీదే ఆధారపడిపోతున్నా! తప్పడం లేదు. ఒక్క రోజు దేవి రాకపోతే బెంగపెట్టుకునేంతగా. ఈ రోజు దానికి పెళ్ళి చూపులు, నిన్ననే చెప్పింది రానని, లక్కీగా ఆదివారం. సో ఉరుకులు, పరుగులూ లేవు .. ఇప్పుడు పిల్లలూ దగ్గర లేరు,,పై చదువులకు వెళ్ళారు, నేను, శ్రీవారూ .. నిదానంగా పని మొదలుపెట్టా, ముందుగా టిఫిన్ సింపుల్ గా అయిపోయే ఉప్మా .. శ్రీవారు గొణిగినా వినిపించనట్టే ఉండిపోయా, బట్టలు స్కిప్, ఇల్లు తుడిచా, అమ్మయ్యా ! ఇదో పెద్ద గండం, ఎందుకో ఉన్నట్లుండి అమ్మా, అమ్మమ్మా జ్ఞాపకం వచ్చారు.
మా చిన్నప్పుడు చాలా రోజుల వరకూ పాపం అమ్మకు పనిమనిషే లేదు .. మా పెళ్ళిళ్ళు కూడా అయిపోయి ఆవిడ డభైయ్యో పడిలో పడేదాకా చేసుకోవడమే .. ఆ తరువాతైనా బయట పనీ, గిన్నెలూ అంతే. నలుగురి పిల్లలతో పాపం ఎలా చేసుకునేదో .. ఒక్కళ్ళం సాయం కూడా చేసేవాళ్ళం కాదు .. నాన్న గారు స్కూల్ టీచర్, స్తోమతా లేదు పైగా అమ్మకు బోలెడు మడీ, ఆచారం .. పైగా ఎప్పుడూ వచ్చిపోయే చుట్టాలూ .. అయినా ఓపికగా నవ్వుతూ చేసేది .. ఏమైనా వాళ్ళ ఓపికా, ఒద్దికలే వేరు.
" వనజా .. వనజా .. "
" ఆ అమ్మా! వస్తున్నా! " అంతలోకే తుళ్ళిపడ్డా, అదేమిటీ ..ఈవేళ అలా వచ్చేసింది! ఇంకెక్కడి అమ్మ, అప్పుడే పోయి పదేళ్ళు దాటుతుంటే, కళ్ళు చమర్చాయి ఆవిడ జ్ఞాపకాలతో.
"ఏమైంది నీకీవేళ, వంట్లో బాగా లేదా, పోనీ చేసుకోలేకపోతే ఈ వేల్టికి ఇల్లు తుడవకపోతేనే .. రా .. అలా ఫాన్ కింద కూచో .. నీరసంగా ఉందా, అలా చెమటలు పడుతున్నాయి " గబగబా కాస్త చల్లటి మజ్జిగలో ఉప్పూ, నిమ్మకాయ పిండి తెచ్చారు శ్రీవారు.
" వనజా! పోనీ ఈ వేల్టికి హోటల్ నుంచి తెస్తాలే .. బగాలేకపోతే బలవంతంగా చేసేయకు " ఆదరంగా అన్నారు.
" వద్దులెండి,కాస్త కూర తరిగి పెట్టండి, నే స్నానం చేసొచ్చి రైస్ కుక్కర్ పెడతా " లేవబోయి కళ్ళు తిరిగి కూర్చుండి పోయా.
" సరే ఈ పూటకి నే రైస్ కుక్కర్ పెట్టేసి, అరటి కాయ వేపుడు చేసేస్తా, నువ్వు కాసేపు పడుకో " పాపం ఆయనకొచ్చిన వంట అదొకటే మరి.
సరేనంటూ తలాడించి మెల్లిగా లేచి గదిలోకి వెళ్ళి పడుకున్నా. ఎందుకో ఈ రోజు వెనకటి రోజులు, ముఖ్యంగా అమ్మ, అమ్మమ్మ ..జ్ఞాపకం వస్తున్నారు పదేపదే.
ఆలోచిస్తే ఇంకా అమ్మకి కాస్త నయమే, పాపం అమ్మమ్మ, బామ్మ .. మట్టి పొయ్యలూ, కర్రలూ,పుల్లలతో వంటా, ఇంకా అమ్మమ్మకైతే పాడీ, పంటా ఉన్న ఇల్లు .. గొడ్ల సావడి పనికి మాత్రం పాలేరు కుర్రాడున్నా, మిగతా పనులన్నీ ఒంటి చేత్తో చేసుకోవడమే .. పైగా వచ్చే పోయే జనాలతో అదొక సత్రం లా ఉండేది.
బాగా జ్ఞాపకం ప్రతి వేసవికీ అమ్మమ్మ దగ్గరకు ప్రయాణం, ఒక్క తమ కుటుంబమే కాదు, పెద్దమ్మలూ, మామయ్యలూ అందరూనూ. ఎవరికీ ఏ పనీ చెప్పేది కాదు పైగా మీ ఇళ్ళలో మీకు తప్పదుకదా .. ఇక్కడ కూడా ఎందుకూ! అంటూ తెల్లవారు ఝాము మొదలు వంచిన నడుం ఎత్తకుండా ఎంత బండ చాకిరీ చేసేదో .. నిజంగా వాళ్ళతో పోలిస్తే ఇప్పుడు పనులేం పనులూ, కాకపోతే ఒకటి మాత్రం నిజం వాళ్ళకి అదే ప్రపంచం, అదే సర్వస్వం .. ఇప్పటిలా ఈ ఉద్యోగం ఒత్తిడులూ, ఉరుకుల పరుగులూ లేవు అంతే.
అలాగే నిద్రలోకి జారిపోయా, 'సుమారు రెండు కావస్తోంది లేవోయ్ .. స్నానం చేసి అన్నం తిని పడుకుందూ గానీ ' శ్రీవారి మేలుకొలుపుతో లేచా. ఏదో తిన్నాననిపించి మళ్ళీ పడుకున్నా.
కాలం పరిగెడుతూనే ఉంది. పిల్లల చదువులయి ఉద్యోగాలొచ్చాయి, మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసేసాం .. ఆయన రిటైర్ అయ్యారు, నేను పూర్తిగా టైర్ అయ్యాను .. తప్పదు ఇంక ఉద్యోగం మానేయాలి, ఇంకా ఆరేళ్ళు .. నా వల్ల కాదు. పిల్లలూ, ఈయనా ఒత్తిడితో నా పరుగులకు ఆనకట్ట వేసేసా.
***
ఇప్పుడు ఆ పరుగులు నా కూతురూ, కోడలూ పెడుతున్నారు .. కాకపోతే వాళ్ళు ముందే మేలుకుని ఇంట్లో అన్ని పనులకూ, వంటతో సహా మనుషులను పెట్టేసుకున్నారు, కాకపోయినా పాపం ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు మరీ దారుణం అయిపోయాయి .. కనీసం ఎవరో వండినది తినే తీరుబాటే ఉండడం లేదు, ఏం చేస్తారు? నేనూ, ఆయనా అటూ ఇటూ తిరుగుతూ అప్పుడప్పుడు విహార యాత్రలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాం. శ్రీదేవి పెళ్ళయి వెళ్ళిపోయాకా వాళ్ళ అమ్మ సత్తెమ్మే ఏదో చేస్తోంది.. ఎప్పటినుంచో చేస్తున్న ఇల్లు మానలేక, అదీ చేయలేని రోజు .. ఏమో! ఎలాగో! ఇప్పటి తరం ఎవరూ ఇళ్ళలో పనులకు వెళ్ళడం లేదు.
చూస్తూండంగా పిల్లలూ పెద్దవాళ్ళైపోయారు, మనమలూ, చదువులూ, పెళ్ళిళ్ళూ .. మేం కూడా దగ్గర దగ్గర ఎనభైయ్యో పడిలో పడిపోయాం. ఇప్పుడు మా అబ్బాయి దగ్గరే ఉంటున్నాం.
మనమరాలు శ్రీజ ఫోన్ .. కోడలు మాట్లాడుతోంది స్పీకర్ ఆన్ చేసి " అమ్మా! నేను కన్సీవ్ అయ్యాను, డాక్టర్ బెడ్ రెస్ట్ చెప్పారు, కొన్నాళ్ళు నువ్వు రా అమ్మా! ప్లీజ్ కొన్నాళ్ళు నువ్వుంటే, కొన్నాళ్ళు మా అత్తగారిని అడుగుతా .. నీకు తెలుసుగా ఇక్కడ ఎంత పే చేసినా మైడ్స్ దొరకరు .. అన్నింటికీ మెషీన్స్ ఉన్నాయి, అయినా అవి నడపడానికైనా మనిషి కావాలికదా .. నువ్వేం భయపడకు .. శ్రీ కాంత్ కూడా సహాయం చేస్తాడు .. సరేనా .. మరి టికెట్స్ బుక్ చేసి పంపుతా, నానమ్మ, నాన్న ఎలా ఉన్నారు .. నాకు తెలుసు మీకు ఇబ్బంది అవుతుందని కానీ తప్పదు కదమ్మా! ఓ.కే. మళ్ళీ కాల్ చేస్తా! బై! " కనీసం జవాబు కోసం చూడకుండా పెట్టేసిందా పిల్ల. అంతా స్పీడ్ యుగం, విదేశాలనుకునేరు చెన్నై నుంచి
" అత్తయ్యా! శ్రీ ... " చెప్పబోయింది నా కోడలు.
" అది మాట్లాడుతుంటే విన్నాగా, సరే వెళ్ళు .. ఏం చేస్తాం .. ఏదో తంటాలు పడతాం .. మీ ఆయనతో చెప్పు .. మాకు కాస్త సాయం చెయ్యమని, లేకపోతే ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టడు " నవ్వుతూ అన్నా.
" అమ్మా! అన్యాయం .. అది ఎప్పటి మాట! ఇప్పుడు అన్ని పనులూ చేస్తున్నాగా, చూస్తూ కూడా అలా అంటావేం? " ముఖం ముడుచుకుంటూ అన్నాడు అప్పుడే అక్కడకి వచ్చిన నా కొడుకు.
" అంటే నాన్నా! .. వాటితో బాటు ఇంకొంచెం, మీ ఆవిడ వాటా, మరి మేం ముసలాళ్ళం అయిపోయేం గా .. ఇంక లోడ్ లాగలేం .. " నవ్వుతూ అన్నా.
"ఏమిటో ఒకప్పుడు డబ్బుంటే చాలు, అన్ని సౌఖ్యాలూ అమరేవి, ఇప్పుడు అదున్నా లాభం లేదు, ఎవడి పని వాడు చేసుకోవలసిందే .. చెయ్యక చస్తానా! " నిట్టూర్చాడు వాడు.
" అంతేరా భూమి గుండ్రంగా ఉంటుందంటే అదే మరి, మా తాతల కాలం లో ఛాదస్తంతో పని చేసుకునే వారు, ఇప్పుడు గతిలేక చేసుకుంటున్నాం .. ఏదీ శాశ్వతం కాదు .. పరిణామక్రమం లో భాగమే అంతా. " నవ్వుతూ లేచాను చేతికర్ర సాయంతో.
***