అన్నదానం - చెన్నూరి సుదర్శన్

anna danam

మద్దనపల్లి ఒక పెద్ద తండా. నాలుగైదు కుటుంబాలు తప్ప అంతా కటిక పేదవారు. కొన్ని కుటుంబాలకు వ్యవసాయం ఆధారం. మరికొన్ని వలస కుటుంబాలు. బ్రతుకు దెరువు కోసం పట్టణాలకు వెళ్ళి వస్తుంటారు. ఈ మధ్య లాక్ డౌన్ మూలాన వలస వెళ్ళిన వారు తిరిగి వచ్చారు గాని తిండికి నక, నక లాడి పోతున్నారు. పైగా వేసవి కాలం వచ్చేసింది. ఊళ్ళో మంచి నీళ్ళు దొరకడమూ గగనమే. బావులు తాటి చెట్టంత లోతులు.. ఊరబెట్టుకుంటూ.. వంతుల వారిగా నీళ్ళు తోడుకుంటూంటారు.

ఆ రోజు ఆకాశంలో చంద్రుడు భువి మీద పిండి వెన్నెలను కురిపిస్తున్నాడు.. శ్రీ సాయిబాబా దేవాలయం వాడ వారంతా ఆరుబయట హాయిగా వేప చెట్టు కింద చల్లని గాలిలో ఆదమరచి నిద్రపోతున్నారు. అర్థరాత్రి దాదాపు రెండు కావస్తోంది. ఇంతలో ఎక్కడినుండో గావు కేకలు వినరాసాగాయి.

“అన్నయ్యా.. మీటూలాల్..! నన్ను పైకి లాగన్నా..! చందూలాల్ అన్నయ్యా.. నాప్రాణాలు పోతున్నాయన్నా.. మీకు దండం పెడ్తా.. అన్నల్లారా త్వరగా రండి.. నన్ను పైకి లాగండి.. హే భగవాన్..” అంటూ వాడంతా దద్దరిల్లేలా అరుపులు వినవస్తూండడంతో.. దిగ్గున లేచి కూర్చున్నాడు మీటూలాల్. పక్కింటి ముందు వాకిట్లో పడుకున్న అతని తమ్ముడు చందూలాల్ లేచి గాబరాగా పరుగుత్తుకుంటూ వచ్చాడు. అరుపులు ఎక్కడి నుండి వస్తున్నాయో! ఇద్దరికీ అర్థంకావడం లేదు. బిత్తిరి పోయి ఒకరి ముకం మరొకరు చూసుకో సాగారు.

ఆ కేకలు మళ్ళీ, మళ్ళీ విన వస్తున్నాయి. వాడ జనమంతా లేచి మీటూలాల్ ఇంటి దిక్కు పరుగెత్తుకు రాసాగారు..

“నాకు ఊపిరాడ్డం లేదన్నా.. దండం పెడతా.. ఎవలైనా పైకి వచ్చి కాపాడండయ్యా” అనే ఏడ్పు గొంతు జీర బోయి విన వస్తోంది. చందూలాల్ పైకి చూశాడు. మీటూలాల్ ఇంటి కప్పు పైన ఎవరిదో తల, పైకి లేచిన రెండు చేతులు మాత్రమే ఊపుతున్నట్లు వెన్నెల వెలుగులో అస్పష్టంగా కనబడుతున్నాయి.

చందూలాల్ నిచ్చెన వేసుకొని గబ, గబా ఇల్లు ఎక్కాడు. మీటూలాల్ గాబర పడుతూ.. తాళం తీసి ఇంట్లోకి వెళ్ళి అన్ని లైట్లూ వేశాడు. దొంగ కాళ్ళు నేలకు ఆనక.. ముందుకూ, వెనుకకూ.. ఊపుతూ.. గింజుకుంటున్నాడు. సాంబయ్య గబుక్కున వెళ్లి రెండు కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. దొంగ కాళ్ళు వణకి పోతున్నాయి.

“అన్నయ్యా.. పైకి లేపు వాణ్ణి” అంటూ చందూలాల్ గొంతు పైనుండి వినబడింది. చందూలాల్ ఇంటి కప్పుపై నుండి దొంగ రెండు చేతులు పైకి లాగుతుంటే, ఇంట్లో నుండి దొంగ కాళ్ళను పైకి లేపుతూ సహకరించాడు మీటూలాల్.

అతి కష్టంమ్మీద దొంగను పైకి లాగాడు చందూలాల్. దొంగ నడుమంతా గీరుకు పోయి రక్తసిక్తమయ్యింది. దొంగను కిందకు పట్టుకొని వచ్చాడు చందూలాల్. దొంగను చూసి వాడ జనమంతా నివ్వెర పోయారు. అతను అందరికీ తెలిసిన వాడే రామసింగ్. అందరూ అతణ్ణి నోట్లో నాలుక లేని వాడని జాలి చూపే వాళ్ళు. అలాంటిది రాంసింగ్ దొంగతనానికి రావడం అంతా ఆశ్చర్య పోయారు. ఎవరికీ నమ్మ బుద్ది కావడం లేదు.

రాంసింగ్ నేలపై గజ గాజా వణకుతూ అరికాళ్ళపై కూర్చున్నాడు. తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని వెక్కి, వెక్కి ఏడ్వసాగాడు.. కళ్ళు జలపాతాలయ్యాయి... అతని పాదాలు తడిచిపోతున్నాయి.

“నన్ను క్షమించండయ్యా.. పనులు దొరక్క పస్తులుంటున్నామయ్యా. గత రెండు రోజులుగా ఏమీ తినలేదు. పిల్లలు ఆకలికి తట్టుకోలేక నీళ్ళు తాగీ, తాగీ వాంతులు చేసుకుంటున్నారు. ఈ రోజు ఉదయం గడప, గడపా తిరిగాను. ఒక్క ముద్ద గూడా ఎవరూ పెట్ట లేదు. పిల్లలు నీరసించి శవాల్లా పడుకోవడం నా గుండె తరుక్కు పోయింది” అంటూ.. మళ్ళీ భోరుమన్నాడు కనుకయ్య. నోట మాట రావడం లేదు. తల కొట్టుకోసాగాడు.

మీటూలాల్ లేచి ఓదార్చుతూ తాగడానికి కాసిన్ని మంచి నీళ్ళు తెచ్చిచ్చాడు. వాడంతా విస్తు పోయి చూడ సాగింది. ఒక గుక్కెడు నీళ్ళు తాగి తిరిగి నోరు విప్పాడు రాంసింగ్.

“నాకు డబ్బుల మీద వ్యామోహ లేదయ్యా. కనీసం తినడానికేమైనా దొరుకుతాయని ఈ పాపపు పనికి ఒడిగట్టాను. ఇంటిపెంకులు తీసి కిందకు దిగుతుంటే.. ఇంటి వాసాలలో ఇరుక్కు పోయాను. పైకి లేవ లేక, కిందకు దిగ లేక పంచ ప్రాణాలు హరీ మంటుంటే.. అరవక తప్ప లేదయ్యా” అంటూ తెరలు, తెరలుగా ఏడ్వసాగాడు రాంసింగ్.

“రాంసింగ్.. ఇది నీ తప్పు కాదయ్యా. ఒక మహాను భావుడు అన్నట్టు మనిషికి బాగా ఆకలి అయినప్పుడు అభిమానం, కులము, విద్య, జ్ఞానము, తపస్సు, హోదా, అనురాగము అన్నిటినీ మర్చిపోతాడు.

ఈ కష్ట కాలంలో కలిగిన వాళ్లం.. నీలాంటి వారికి పట్టెడన్నం పెట్టక పోవుడు మా తప్పు. చందూలాల్.. రేపటి నుండి మనం అన్నదానం చేద్దాం. నేనొక నెల రోజులు నీవొక నెల రోజులు వంతుల వారిగా చేద్దామన్నాడు”

చందూలాల్ సంతోషంగా ఒప్పుకున్నాడు. ఇద్దరు కలిసి అందరి ముందు నిత్యం అన్నదానం చేస్తామని ప్రమాణం చేశారు.

“మేము గూడా ఈ పుణ్యకార్యక్రమంలో పాల్గొంటాం” అంటూ మరో మూడు కుటుంబాలు ముందుకు వచ్చాయి.

ఇంతలో మీటూలాల్ భార్య భోజనం మూట తెచ్చి ఇంటికి తీసుకు పొమ్మని రాంసింగ్ కు అందించింది.

అందరి కళ్ళూ చెమ్మగిల్లాయి.

ఆనాటి నుండి ‘శ్రీ సాయిబాబా ఆలయం’ ప్రాంగణంలో నిత్య అన్నదానం కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది.

అందులో భాగాస్వాములం కావాలని.. ఒకరిని చూసి మరొకరు ముందుకు రాసాగారు. *

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.