"హమ్మయ్య! వచ్చేరా సార్, మీరు ఊర్లో లేని ఈ నాలుగు రోజులూ మన కష్టమర్లు ఈ అయోగ్యరావు చేసిన పనికి నన్ను కాల్చుకు తినేసారు సార్ !" ఎంతో ఆవేదనతో చెప్పింది ఆందోళనాదేవి , అప్పుడే షాపులోకి అడుగు పెట్టిన తన యజమాని ఢాంబికరావుతో. "ఏం జరిగిందమ్మా, అసలేం జరిగిందో, ఆందోళన పడకుండా చెప్పు" లోపల ఆందోళన ఉన్నా, పైకి మటుకు ఢాంభికంగా అన్నాడు ఢాంభికరావు. "వారం రోజుల క్రితం ఆ అయోగ్యరావుని పనిలోకి తీసుకుంటున్నపుడే, మీకు చెప్పాను సార్, కారణం ఏమిటో తెలియదు కానీ, అతను స్త్రీ ధ్వేషిట అనీ, ఆడ పొడ అంటే గిట్టదుట అనీ ! కానీ, అవేమీ వినకుండా మీరు పనిలో పెట్టేసుకున్నారు. ఇప్పుడు చూడండి, ఆయనే మనకి ఎలా తలనొప్పిలా తయారయ్యాడో ?" కొంచెం ఆందోళనగానే చెప్పింది ఆందోళనాదేవి. "అసలు మేటర్ ఏమిటో చెప్పి, తరువాత ఆందోళన పడవమ్మా !"విసుక్కుంటూ అడిగాడు ఢాంభికరావు. "టీజర్ ఎందుకు లెండి. కొద్ది సేపట్లో ఆ మొత్తం సినిమా ఏదో మీరే చూస్తారుగా ! ఎందుకంటే, కంప్లైంట్ చేసిన వాళ్లందరికీ , మీరు ఈ రోజు షాపుకి వస్తారు, అంతవరకూ ఓపిక పట్టండని చెప్పి మరీ పంపించా! మీరు మీ రూమ్ లో కూర్చోండి. విషయం ఏమిటో మీకే తెలుస్తుంది." వెటకారంగా చెప్పి, తన సీట్లోకి వెళ్లి కూర్చుంది ఆందోళనాదేవి. ***** ***** ***** ***** "హలో, హలో, ఈ నెంబర్ ఢాం ఢకారం ఆర్ట్స్ షాపుదేనాండీ ???" "ఔనండీ, నేను దాని ఓనర్ ఢాంభికరావు ని మాట్లాడుతున్నా, చెప్పండి." "ఏం చెప్పమంటారు సార్, నా పిండాకుడు. నాది రియల్ ఎస్టేట్ బిజినెస్. మొన్న మీ షాపుకి వచ్చి , మేటర్ ఇచ్చి ఓ బోర్డు తయారు చేయమని ఆర్డర్ ఇచ్చా. నేను, "ఇక్కడ స్థలాలు 'అమ్మ'బడును అన్న మేటర్ రాయమని ఇస్తే, మీ ఆర్టిస్ట్ ఎవడో అయోగ్యరావట, "ఇక్కడ స్థలాలు 'నాన్న' బడును" అని. రాసి తగలడ్డాడు. ఓపెనింగ్ రోజున వచ్చిన అతిథులు అందరూ ఆ బోర్డు చూసి ఒకటే నవ్వడం. ఏమిటి సార్ నాకీ ఖర్మ" ఫోన్ లోనే చంటిపిల్లాడి కంటే దారుణంగా గుక్కపెట్టి ఏడ్చేస్తున్న అతనిని సముదాయించేసరికి ప్రాణం పోయినంత పని అయ్యింది ఢాంభికరావుకి. ***** ***** ***** ***** కాసేపటి తరువాత, "అయ్యా, ఢాంభికరావు గారూ, నమస్కారం. నేను జ్ఞాపకం ఉన్నానా ? తాపీమేస్త్రి......" "అయ్యో, జ్ఞాపకం లేకేం, మీరు తాపీమేస్త్రి సమ్మెటరావు గారు కదా ? రండి, కూర్చోండి. ఏమిటి, ఏదో పనిమీద వచ్చి నట్లున్నారు ?" "మీ వాడు చేసిన పనికి నన్ను భవిష్యత్తులో ఇంక ఎవరూ పనిలోకి పిలవరేమోనని అనుమానంగా ఉంది సార్ !" "ముందు మీరు ఈ "కాఫీ" తీసుకుని, "తాపీ"గా ఆ "సోఫా"లో కూర్చుని, "సాఫీ"గా జరిగిందేమిటో , "హేపీ"గా చెప్పండి." "ఇంక నా బతుక్కి "హేపీ" ఎక్కడుంది సార్ ? జీవితమే "మాఫీ" అయిపోయేలా ఉంటేను! సార్, మా ఇంటికి ఓ నేమ్ బోర్డు రాయమని ఆ అయోగ్యరావు కి చెపితే, పేరు బాగానే రాసాడు 'సమ్మెటరావు' అని. దానికింద "తాపీమేస్త్రి" అని రాయమంటే , అందులో 'మే' ఎగరగొట్టేసి, "తాపీపురుషుడు" అని రాసాడు. వినడానికే ఎబ్బెట్టుగా ఉన్న ఈ పేరును చూసి నాకెవరైనా పని పురమాయిస్తారా సార్ ? " చేతిలో ఉన్న తాపీతో తల బాదుకుంటూ ఘొళ్లుమన్నాడు సమ్మెటరావు. ఏదో సర్దిచెప్పి, అతన్ని సముదాయించి పంపేసరికి టేబుల్ మీద ఫోన్ రింగయ్యింది.. ***** ***** ***** ***** "హలో, హలో, ఢాం ఢకారం ఆర్ట్స్ షాపు ఓనర్ ఢాంభికరావు ని మాట్లాడుతున్నా, మీకు ఏం సహాయం కావాలో చెప్పండి." "సహాయం చేస్తానంటున్నారు కాబట్టి ఒకటి అడుగుతున్నా. కాదనకండి మరి. అదే, మీ దగ్గర పనిచేస్తున్న ఆ అయోగ్యరావుని ఉద్యోగంలోంచి తీసేయడానికి ఏం పుచ్చుకుంటారు?" "అయ్యో, అంత మాట ఎందుకు లెండి, మీరెవరు ? మీకు వచ్చిన కష్టం ఏమిటో కొంచెం చెపుతారా?" "సార్, నా పేరు పిండి మిల్లు. మాది నూకరాజు. సారీ సార్, మీ వాడు చేసిన పనికి బుర్రకూడా సరిగా పనిచేయడం లేదు. నా పేరు నూకరాజు. మాది పిండి మిల్లు. మొన్న మీ షాపుకి వచ్చి, "ఇక్కడ పిండి "ఆడ" బడును" అని ఓ ఫ్లెక్సీ రాయమంటే, మీ వాడు "ఇక్కడ పిండి "మగ" బడును"" అని రాసి తగలడ్డాడు. అసలు అలాంటి పదం ఎక్కడైనా ఉందా? ఏమిటి సార్ ఈ భావ దారిద్ర్యం?" ఫోన్ లో ఏవో కబుర్లు చెప్పి, నూకరాజుని లాలించి, బుజ్జగించి, మరిపించి, ఒప్పించి ఫోన్ లోంచి తప్పించే సరికి ఎదురుగా ఇద్దరు పెద్ద మనుషులు నిప్పులు కురిపిస్తూ తనవైపు చూస్తున్నారని గ్రహించిన ఢాంభికరావు.... ***** ***** ***** ***** "రండి సార్, రండి కూర్చోండి, నేనే ఢాంభికరావు ని. ఈ షాపు ఓనరుని. ఏదైనా ప్రాబ్లమా?" ""ప్రోబ్లామా ....అంటారేమిటండీ నా పాడె. నా పేరు సంచారరావు. నాది "అరుంధతీ" ట్రావెల్స్ అని ట్రాన్స్ పోర్టు వ్యాపారం. నాలుగు రోజుల క్రితం మీ షాపుకి వచ్చి ఓ బోర్డు రాయమని ఇచ్చా. మీ వాడు ఏం రాసాడో తెలుసా సార్ ?" "అర్థమైంది. అరుంధతి బదులు "అరుణ్ దత్" ట్రావెల్స్" అని రాసి ఉంటాడు, అంతేనా ?? " పొద్దుటి నుంచీ వింటున్న సంఘటనలు ఆధారంగా చెప్పాడు ఢాంభికరావు, తన తెలివితేటలకి తనే మురిసిపోతూ. "నా పాడె. అలా రాసినా బాగుండిపోను. కానీ మీ వాడు అరుంధతి గారి భర్త పేరు పెట్టి "వశిష్ట" ట్రావెల్స్"అని రాసి చచ్చేడు. ఏం చేసుకోను ఆ బోర్డు ?" కయ్యిమన్నాడు సంచారరావు. "సార్, అతని మీద చాలా కంప్లైంట్ లు వచ్చాయి. అందరితోపాటు మీకు కూడా కొత్త బోర్డు రాయించి ఇస్తా. కొంచెం ఓపిక పట్టండి" బతిమాలాడు ఢాంభికరావు. "సరే, అదీ చూస్తా"విసురుగా రూమ్ లోంచి వెళ్లి పోయాడు సంచారరావు. "సార్, సంచారరావు గారు వెళ్లి పోతున్నారు. మరి వారితో మీరు వెళ్లరా?" అడిగాడు ఢాంభికరావు కుర్చీలో సాఫీగా కూర్చొన్న రెండో వ్యక్తిని. ఈ రోజు కి ఇక వాయింపు సెషన్స్ క్లోజ్ చేసేయొచ్చు అన్న ఆనందంతో. "అబ్బే, ఆయనతో నేనెందుకు వెళ్తాను? మా కేసు వేరు. మేము పడ్డ కష్టాలు వేరు." "ఆ కష్టాలు చెప్పి చావండి, అబ్బే.... అదే కష్టాలు చెప్పి రావండి అంటున్నా. ఇంతకీ మీకొచ్చిన ఆ కష్టమేమిటో ? కొంచెం వివరంగా చెప్పండి. " "నా పేరు చిత్రాంగధరావు. కిషోర్ టాకీస్ మేనేజర్ని. రేపు విడుదల కాబోయే సినిమా కోసం మీ వాడిని ఓ స్లైడ్ రాయమన్నా. అన్నీ బాగానే రాసాడు." "హమ్మయ్య, బతికించేరు. ఇంకా ఏం రాసేడో అని హడలి చచ్చేను." "ఏంటా కంగారు ?? పూర్తిగా విని తగలడండి. అన్నీ బాగానే రాసాడు, కానీ హీరోయిన్ "అమలా" పాల్ పేరుకు బదులు "నాగార్జున" పాల్ అని రాసి తగలడ్డాడు. ఈ విషయం "అమలాపాలు" కి తెలిస్తే మా బతుకు "గంగపాలు" , ఆవిడ పరువు "రోడ్డు పాలు", మీ బతుకు "జైలు పాలు" అవ్వడం ఖాయం....."నాన్ స్టాపుగా చెప్పేస్తున్నాడు చిత్రాంగధరావు, ఏమీ "పాలు"పోకుండా చూస్తున్న ఢాంభికరావుతో. "చూడండి చింగరావు గారూ, ఈ షాపుని నేను ఈ మధ్యనే మా ఫ్రెండ్ అమ్మేస్తూంటే తీసుకున్నా. అంతేకాదు, పాపం ఈ ఆందోళనాదేవి చెపుతున్నా వినకుండా, మా ఫ్రెండ్ రికమెండ్ చేయడం వలన ఈ అయోగ్యరావు ని కూడా తీసుకున్నా. నాకు ఈ ఫీల్డ్ లో అంత అనుభవం లేదు. సాయంత్రానికల్లా మీ పని పూర్తి చేసి ఇచ్చే బాధ్యత నాది. నన్ను నమ్మండి.." అని చిత్రాంగధరావు ని సాగనంపి,...... "ఆందోళనాదేవి, ఆందోళనాదేవి.అర్జెంటుగా ఓ సారి ఇలారా."ఆందోళనతో అరవసాగేడు ఢాంభికరావు. "సార్, ఆందోళన పడిన తర్వాతైనా చెప్పండి. లేదా చెప్పిన తర్వాతైనా ఆందోళన పడండి. అంతేకానీ ఆందోళన పడుతూ చెప్పకండి." పొద్దున్న ఢాంభికరావు తనను ఉద్దేశించి చెప్పిన డైలాగ్ తిరిగి అతనికే అప్ప చెప్పేసింది ఆందోళనాదేవి. "చూడమ్మా, నువ్వు నన్ను ఎంత వెటకారం చేసినా నేనేమీ బాధపడను. ఎందుకంటే, పొద్దుట్నుంచీ వస్తున్న కంప్లైంట్స్ చూస్తూంటేనే తెలుస్తోంది, ఈ నాలుగు రోజులు నువ్వు ఎంత ఆందోళన చెందావో అని ! సరే, అసలు విషయానికి వస్తున్నా ! రేపటి నుండి ఆ అయోగ్యరావుని పనిలోంచి తీసేస్తున్నట్టు ఓ లెటర్ టైపు చేసి రెడీగా ఉంచమ్మా , రేపు అతను రాగానే ఇచ్చేద్దాం." ఆందోళనాదేవికి చెప్పేసి, రెట్టించిన ఆందోళనతో ఇంటి దారి పట్టేడు ఢాంభికరావు. ***** ***** ***** ***** "చూడండి, అయోగ్యరావు గారూ, మీరంటే మాకు అభిమానమే. కానీ పరిస్థితుల ప్రాభల్యం వలన మిమ్మల్ని పనిలోంచి తీసేయక తప్పడంలేదు" మరునాడు ఎంతో ఆవేదనతో చెప్పబోయేడు ఢాంభికరావు, తన ఎదురుగా నిలబడ్డ అయోగ్యరావుతో. "అంత పెద్ద మాటలెందుకు లెండి. నన్ను తొలగిస్తున్నట్టు ఓ లెటర్ పడేయండి. హేపీగా వెళ్లిపోతాను. నాకు ఇదేం కొత్త కాదు. నా ఇరవై రెండేళ్ల ఏళ్ల సర్వీసులో నాకిది అరవై రెండో ఉద్యోగం." బాధపడుతున్న ఢాంభికరావుకి 'ధైర్యం చెపుతూ' చెప్పాడు అయోగ్యరావు. ఆందోళనాదేవి ఇచ్చిన లెటర్ని తీసుకుని, పైకి చదవడం మొదలెట్టాడు అయోగ్య రావు. "శ్రీ అయోగ్యరావు గారికి, ఢాం ఢకారం ఆర్ట్స్ వారు వ్రాయునది ఏమనగా, మా షాపుకి మీరు చేసిన సేవలు అమోఘం. కానీ, మా వినియోగదారుల నుంచి మీ గురించి వచ్చిన స్పందన మాకు చాలా ఇబ్బందికరంగా ఉండడం వలన మిమ్ములను ఈరోజు నుంచి ఉద్యోగం నుంచి తొలగించడం జరిగిందని ఇందు మూలముగా తెలియ పరచడమైనది. ఇట్లు ఢాం ఢకారం ఆర్ట్స్ తరపున ఢాంభికరావు ప్రొప్రైటర్." "సార్, ఈ లెటర్ తీసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇందులో రెండు పదాలు తీసేసి ఇవ్వండి. వెంటనే సంతకం పెట్టేస్తా !" కండీషన్ పెట్టాడు అయోగ్యరావు. "ఆ రెండు పదాలు ఏవిటి నాయనా ? "ఉద్యోగం" "తొలగించడం". ఈ రెండు పదాలేనా ?" వెటకారంగా అడిగాడు ఢాంభికరావు. "అబ్బే కాదు, అవి.... ఒకటి "స్పందన" , రెండు "ఇందు" ." తాపీగానే చెప్పాడు అయోగ్యరావు, బిక్కుబిక్కుమంటూ తన వైపు చూస్తున్న ఢాంభికరావును ఉద్దేశించి. "ఇంత జరిగినా కానీ, అయోగ్యరావూ, నువ్వు మారేటట్టులేవు " అని మనసులో అనుకుంటూ లెటర్ మళ్లీ టైపు చేయించడానికి లేచాడు ఢాంభికరావు.