పార్వతీపురంలో పరందామయ్య గురుకుల పాఠశాలను నిర్వహిస్తున్నాడు. ధనవంతులు,జమీందారులు సహాయం చేయడం వల్ల విద్యార్థులకు ఉచితంగా విద్యను ఇతర విషయాలను నేర్పించగలుగుతూ గురుకులాన్ని ఎంతో సమర్థవంతంగా నడపగలుగుతున్నాడు.
ఇందుకు పిల్లలకు శిక్షణ ఇవ్వడంలో శంకరయ్య కూడా ఎంతో సహకరిస్తున్నాడు.
పరందామయ్య భార్య శాంతమ్మ భర్తకు తగ్గ భార్యగా పిల్లలను సొంత బిడ్డలుగా చూసుకుంటోంది.
ఒకసారి నలభై మంది పిల్లలు విద్యను అభ్యసించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చారు.
పిల్లలు ప్రొద్దున కాలకృత్యాలు తీర్చుకుని దంతావదానం చేసిన తరువాత అందరికీ శాంతమ్మ గ్లాసుడు ఆవు పాలు ఇచ్చింది.
ఆ గురుకులంలో పది ఆవులు ఉన్నాయి. అన్నీ రెండుపూటల పాలిచ్చే ఆవులే వాటి ఆలనా పాలనా రామయ్య చూసుకుంటున్నాడు.
విద్యార్థులకు విద్యాతో పాటు ఇతర పనులు నేర్పించడంలో భాగంగా, ఆవు పాలు పితకడం కూడా ఒక శిక్షణ, దాని కోసం రెండు పూటలా ఇరవై మందికి, మరుసటి రోజు మరో ఇరవైమందికి శిక్షణ ఉంటుందని పరందమయ్య చెప్పారు.
దానికి అనుగుణంగా రామయ్య మొదటి రోజు శిక్షణ మొదలు పెట్టాడు. ఆవులకు మేత ఎలా వేయలో, నీటిలో ఎంత తవుడు కలిపి కుడితిని తయారు చేసి తాగించి పాలు ఎలా పితకాలో నేర్పించాడు.
తరువాత అందరూ చేదుడు బావి వద్ద చేరి నీళ్లు చేదుకుని స్నానం చేశారు.అనంతరం ప్రతి రోజు పదినిముషాలు దైవ ధ్యానం ఎలా చేయాలో పరందమయ్య నేర్పించారు. దాని తరువాత శాంతమ్మ అందరికీ ఫలహారం వడ్డించింది.
పిమ్మట పిల్లలందరూ వరుసక్రమంలో నిలబడి, చదువుల తల్లి సరస్వతీ మాత ధ్యానం, అనంతరం విద్యా తరగతులు ఒంటి గంట వరకు జరిపి భోజనానికి అరగంట విరామం,తిరిగి తరగతులు మూడు గంటల వరకు కొనసాగాయి. ప్రతి రోజు ఇదే విధానం కొనసాగుతుందని విద్యార్థులకు పరందమయ్య చెప్పారు.
మూడు మాసాలు గడిచాయి. అందరిలోకీ సుధాముడు చదువులోను ఇతర విషయాలలోనూ అందరికన్నా ముందున్నాడు. సుధాముడు ఆవుకు నాలుగు లీటర్ల పాలు పిండేవాడు. మిగతావారు రెండు లీటర్ల పాలను కూడా పిండేవారు కాదు. ఆవును మచ్చిక చేసుకొని తగినంత మేత వేయడంతో పాటు తవుడు కలిపిన నీళ్లను తాగించడం ఇవన్నీ ఎంతో పద్దతిగా చేసేవాడు కాబట్టి ఆవు అన్ని పాలు ఇచ్చేది.
“చూశావా!... సుధాముడు ఆవు పాలు పిండడంలోనూ ఉత్తముడు అనిపించుకున్నాడు” అన్నాడు శాంతమ్మతో పరందామయ్య.
“కాదండీ ఒక్క ఆవు మచ్చిక అవ్వడం వల్ల అలా పాలిస్తుందని నా అభిప్రాయం...అందుకని ఈసారి ఇంకో ఆవును ఇచ్చి పాలు పిండిస్తే సుధాముడి గొప్పతనం తెలుస్తుంది”
“నీవు చెప్పిందీ నిజమే రేపు ఇంకో ఆవును అతనికి అప్పగించమని రామయ్యకు చెబుతాను”
మరుసటి రోజు ఉదయం సుధాముడికి మరో ఆవును అప్పజెప్పాడు. ఆ ఆవును కూడా మచ్చిక చేసుకొని మళ్లీ నాలుగు లీటర్ల పాలు పిండాడు. అంతే కాదు సుధాముడు పాలు పిండిన ఆవును ఇంకో పిల్లవాడికి అప్పజెప్పినా వాడు కూడా రెండు లీటర్ల పాలు మాత్రమే పిండగలిగాడు.
అంతేకాదు మిగతా ఎనిమిది ఆవులను కూడా సుధాముడు అదే విధంగా మచ్చిక చేసుకుని నాలుగు లీటర్ల పాలను పిండాడు.
“అయ్యగారూ! నేను పిండినప్పుడు కొన్ని ఆవులు నాలుగు లీటర్ల పాలను మిగతా ఆవులు రెండు లీటర్ల పాలను ఇస్తాయి, కానీ సుధాముడు అన్ని ఆవులనుండీ సమానంగా పాలు పిండడం విచిత్రంగా ఉంది” అని పరందమయ్యతో అన్నాడు రామయ్య.
“విచిత్రమేముందీ సుధాముడు నీకంటే బాగా ఆవులను మచ్చిక చేసుకున్నాడు” అన్నాడు పరందామయ్య.
“సుధాముడు అన్ని విషయాలలోనూ ప్రధముడుగా ఉండడం మనకు గర్వకారణం మిగాతా వారు కూడా అన్ని విషయాలలో ముందుంటే బాగుంటుంది” అంది శాంతమ్మ”
“ఆవును” అన్నాడు శంకరయ్య కూడా.
“గురువు శిష్యుడికి నేర్పవలసిన విద్యను, ఇతర విషయాలను ఏ మాత్రం అరమరికలు లేకుండా అందించగలడు కానీ వాడి బుర్రలో దూరి సమర్థవంతుణ్ణి చేయలేడు! ఏ గురువుకైనా శిష్యుడు ఒక్కడే ప్రధముడు అవుతాడు.... మిగతా వారు అతని దారిలో ప్రయాణించడానికి ప్రయత్నిస్తారు... అలా కొందరు విజయం సాధిస్తారు మిగతవారికి మరికొంత సమయం పడుతుంది” అన్నాడు పరందామయ్య.
గురువుగారు చెప్పిన ఈ విషయాలను విన్న ప్రతి విద్యార్థీ శ్రద్ధగా చదవడమే కాకుండా ఆవుల నుండి నాలుగు లీటర్ల పాలు పిండగలుగుతున్నారు వారందరికి సుధాముడు మార్గదర్శి అయ్యాడు.
*****
యు.విజయశేఖర రెడ్డి