నిర్ణయం (బాలల కథ) - పద్మావతి దివాకర్ల

Decision (children's story)

జనావాసాలకి దూరంగా గురుకులం నిర్వహిస్తున్నాడు విద్యానందుడు అనే గురువు. సుదూర ప్రాంతాలనుండి వచ్చిన శిష్యులు అతనివద్ద శిష్యరికం చేసి విద్యాబుద్ధులు అభ్యసిస్తున్నారు. కొన్నాళ్ళకి విద్యానందుడు వృద్ధుడైనాడు. తన తదనంతరం తన శిష్యులలో గురుకులం నడిపే యోగ్యుడెవరా అని యోచించాడు. అతని శిష్యులలో ముగ్గురు రామానందుడు, శివానందుడు, వాసుదేవుడు మిగతావారికన్నా తెలివైన వాళ్ళు. వాళ్ళ విద్యకూడా దాదాపు పూర్తైంది. ఆ ముగ్గురు శిష్యులలో ఒకరిని వారసుడిగా ఎన్నుకొని తన తదనంతరం ఆశ్రమ బాధ్యతలు అప్పగించాలని నిశ్చయించుకున్నాడు. వాళ్ళలో గురుకులం నడపటానికి ఎవరు యోగ్యులో తెలుసుకోవటానికి ఒక చిన్న పరీక్ష పెట్టాలని అనుకున్నాడు.

ఒకరోజు తన శిష్యులందరినీ పిలిచి, "మనదేశ మహారాజుగారు రాబోవు గురుపౌర్ణమి నాడు మన గురుకులానికి వస్తున్నారు. మహారాజు విజయవర్మ కూడా మన గురుకులంలోనే సకలవిద్యా పారంగతుడైన సంగతి మీకందరికీ తెలుసుకదా! విజయవర్మకి యుద్ధవిద్యల్లోనే కాక సాహిత్యం, తర్క శాస్త్రం, ఇలా అన్ని శాస్త్రాల్లోనూ మంచి పాండిత్యం ఉంది. ఆయన మిమ్మల్ని పరీక్షించడానికి ప్రశ్నలు వేయవచ్చు. మీరందరూ సరైన సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి." అన్నాడు.

శిష్యులందరూ మహారాజు రాకకోసం ఏర్పాట్లు చేయడమే కాక, ఎదుర్కోబోయే పరీక్షకోసం సిద్ధమవసాగారు. విద్యానందుడు తన శిష్యులనందరినీ, ప్రత్యేకంగా తన ముఖ్య శిష్యులు ముగ్గుర్నీ కూడా పరిశీలించసాగాడు. రామానందుడు తన మట్టుకు తను మహారాజు పెట్టబోయే పరీక్షను ఎదుర్కోవడానికి గ్రంధాలన్నీ తిరగేస్తున్నాడు. ఇంకెవర్నీ కలవకుండా ఒంటరిగా కూర్చొని తన చదువు కొనసాగిస్తున్నాడు. శివానందుడు గ్రంధాలు చదువుతూ, అందులోని సందేహాలు వచ్చినప్పుడల్లా విద్యానందుడ్ని అడుగుతున్నాడు. అయితే సహదేవుడు మాత్రం తను పరీక్షకి సిద్ధమవడమేకాక తోటి శిష్యులకి సహాయం చేస్తూ వాళ్ళ సందేహాలు కూడా తీరుస్తున్నాడు. అంతేకాక మహారాజు రాకకోసం జరిగే ఏర్పాట్లలో విద్యానందుడికి తన సహకారాలు అందిస్తున్నాడు. ఆ ముగ్గుర్నీ నిశితంగా పరిశీలించిన విద్యానందుడు ఒక నిర్ణయానికి వచ్చాడు.

గురుపౌర్ణమినాడు వచ్చిన మహారాజు విజయవర్మ ముందుగా తన గురువు విద్యానందుడికి గురుపూజ చేసి గురుదక్షిణ సమర్పించాడు. అనంతరం శిష్యులతో చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అతను వేసిన ప్రశ్నలకు శిష్యులందరూ సరైన సమాధానాలు చెప్పడంతో సంతృప్తి చెందాడు. ఇంతలో విద్యానందుడు తన తదనంతరం గురుకులం నడపబోయే వారసుడ్ని ప్రకటించాడు.

"నా శిష్యుల్లో వాసుదేవుడు నా తదనంతరం గురుకులం నడపటానికి యోగ్యుడు. ఇతర శిష్యుల మాదిరిగా కాకుండా వాసుదేవుడు తను చదువులో శ్రద్ధ చూపడమేకాక, తన తోటివారి చదువు విషయంలో కూడా శ్రద్ధ వహిస్తున్నాడు. ఈ విధంగా వాసుదేవుడు ఇతరులకు విద్యాబుద్ధులు నేర్పడంలో కూడా దిట్ట. అందుకే వాసుదేవుడు నా తర్వాత గురుకులం నిర్వహించడానికి తగినవాడు." అని విద్యానందుడు తనెందుకు సహదేవుడికి గురుకులం బాధ్యత అప్పగిస్తున్నాడో సహేతుకంగా వివరించాడు.. అతని నిర్ణయాన్ని మహారాజుతో సహా శిష్యులందరూకూడా హర్షించారు.

-పద్మావతి దివాకర్ల

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.