అగ్నిహోత్రుడు - చాగంటి ప్రసాద్

Agnahotrudu

సూర్యుడికి పొద్దు క్రుంగడమైనా ఉంటుంది గాని , మా ఏలేటిపాడు లో అగ్నిహోత్రశర్మ ఇంటి మండువా లోగిలి లో మాత్రం పేకాట జోరు రాత్రిపగళ్ళు సాగుతూనేఉంటుంది. పాపం ! ఇంటిల్లాలు భూదేవికి భూదేవంత సహనం. దానికి తోడుగా అమాయకత్వం. "పిల్లలు ఎదుగుతున్నారు! చదువుకునే పిల్లలముందు పేకాట ఆడకండి, అని మొగుడుకి ఒకరోజు చెప్పబోతే.,. "పిచ్చిదానా! పేక ఆడడం అంటే కాలాన్ని మన చేతులో పెట్టుకున్నట్టే. మనమే కాలపురుషులం, కాలాంతకులం. అడ్డుచెప్పకు. " అవునా అదెలా?" అదీ! అలా అడిగావు! బావుంది. నాకు నచ్చావ్! ఇలారా! ఇదిగో ఈ ముక్కల్లో ఉన్న ఎరుపు నలుపు పగలు రాత్రులు. ఇదిగోనే ఈ కలవర్, డైమండ్, ఇస్పేట్ , ఆఠీన్ లు నాలుగు వారాలన్నమాట. ఈ 52 ముక్కలు 52 వారాలు. అవన్నీ ఇలా కలిపితే , అని చేతుల్తో కలిపి చూపించాడు. సంవత్సరం తిరిగిపోయిందన్నమాట. ఇందులో ఈ కార్డులమీద ఉన్న చుక్కలన్నీ కలిపితే 365 రోజులు. ఇలా చాలా వివరంగా మన పూర్వీకులు మనకి "పేకోపదేశం " చేసారు. మనమే అజ్ఞానంతో దీన్ని వెధవ ఆట, జూదం, అని నిందిస్తూ పాపం మూటకట్టుకుంటున్నాం. మనమే కాలాన్ని చేతిలో పెట్టుకుని శాశించవచ్చు అర్థమైందా ? దీన్నిబట్టి నీకు ఏం తెలిసింది?" "పేక అంటే కాలచక్రం అని! అది ఆడేవాడు దేవుడని. అని అమాయకంగా, భక్తిగా సమాధానం చెప్పి కాళ్ళకు దణ్ణం పెట్టింది. మనవాడు పేకచేత్తో దీవించాడు. భేష్! నా కళావర్ రాణీవనిపించావు అని ముద్దెట్టుకున్నాడు. ఆమెలో ఒక్కసారిగా పదమూడు ము(క్క)ఖ కవళికలు కదిలాయి సిగ్గుతో. అలా మాటలతో పెళ్ళాన్ని బోల్తా కొట్టించిన అగ్నిహోత్రం, తన 'ఆట' నిరాటంకంగా సాగిస్తూ వాళ్ళ నాన్న చిదంబరశర్మ ఇచ్చిన ఇరవై ఎకరాల్నీ నాలుగు ఎకరాలకి 'డ్రాప్ ' చేసాడు. అసలు పుట్టిన వెంటనే అగ్నిహోత్రుడు " క్యార్" మని ఏడవ లేదని అందరూ కంగారు పడుతుంటే ఇంటరుగుమీద కూర్చుని "డంకాపలాసు" ఆడుతున్న మేనమామ చతుర్ముఖరావుకి ఎవరో ఉప్పందిస్తే, "ఓస్ ఇంతేనా! ఎవ్వడైనా క్యార్ మనాల్సిందే మనల్ని చూసి అని తన బుర్రమీసాలతో ఇంట్లో కి అడుగు పెట్టి ' మేనల్లుణ్ణి' చేతిలోకి తీసుకున్నాడు. అగ్నిహోత్రుడుకి మేనమామ చేతిలో పేకముక్క పిర్రమీద గుచ్చుకుంది ఆ దెబ్బతో వాడు క్యార్ మన్నాడు. ఎన్నిసార్లు కుదిపినా కదిపినా కదలని చంటాడు తమ్ముడి చేతులో పడగానే ఏడిచాడని ఆనందంలో "వీణ్ణి నువ్వే జాగ్రత్తగా పెంచాల్రోయ్! తమ్మాయ్ ! అని అగ్నిని అతనికి అప్పగించింది. చతుర్ముఖరావు పేకాట మీద రిసెర్చ్ చేసినవాడు. పక్కవాడి ముఖవళికలు పసిగట్టి వాడికి పడిన పేకముక్కలు చెప్పేయగల సత్తా ఉన్నవాడు. మామకన్న ఘనుడిగా తయ్యారయ్యాడు అగ్నిహోత్రం. పూవుపుట్టగానే పరిమళిస్తుందన్నది పాతమాటైతే , "చెయ్యిదురద దురద పుట్టీపుట్టకుండానే పేకతో గోక్కునేలా" తర్ఫీదయ్యాడు మేనల్లుడు. ఒకసారి మేనల్లుణ్ణి పెదపట్నం తోటలో పేకాటకి తీసుకెళ్ళాడు. పదిమంది కలిసి ఒళ్ళు తెలియకుండా ఆడేస్తున్నారు. పోలీసు రైడ్ జరిగింది. వాళ్ళు వచ్చేలోపు చతుర్ముఖం తన స్థానంలో అగ్నిహోత్రాన్ని కూచోపెట్టాసాడు. వాళ్ళు వీడు మైనర్ కదాని వదిలేసి మిగిలిన వాళ్ళని పట్టుకు పోయారు. అప్పుడు అగ్నిహోత్రానికి తెలిసింది పేకాట డబ్బులుతో బయట ఆడడం నేరం అని. అందుకనే ఇంటిలోనే ఆ "పేకాష్టాన్ని" అహోరాత్రులు కాలుస్తూఉంటాడు. అదీగాక, చతుర్ముఖం ఆడే ఆట లో మెలకువలు చూసి, "మావయ్య ! నీకు ఆటలో ఎలా తెలుస్తుంది అవతలివాడికి ఫలానా ముక్క అవసరమని ? . "అదేరా పేకాటలో కిటుకు, మన దృష్టి ఎప్పుడూ పక్కవాడి ఆటమీదే ఉండాలి. మనం చేతులో ముక్కలని చూసుకుంటూ కూర్చుంటే నువ్వు "షో" చూపించలేవు. జీవితమంతా డ్రాపులు, ఫుల్ కౌంటులు, మిడిల్ డ్రాపులుతో సరిపోతుంది. 'జోకరు ముక్క తెగి, డీల్ కొడితే ఆ కిక్కేవేరురా అల్లుడు" అంటూ "పేకోపన్యాసం"ఇచ్చాడు. " ఒరేయ్! అల్లుడు నువ్వు అదృష్టవంతుడివి, ఈ తోటలో చాలా పెద్దాళ్ళమధ్య మావిడి తోటలో నీకు "పేకాభ్యాసం" జరిగిపోయింది. నేనాముసలివాణ్ణయై పోయాను. నా ఆటకి వారసులు లేరనే బెంగ ఈ రోజుతోపోయిందిరా అల్లుడు! ఈ నా జీవితమంతా మూడుముక్కలు, ఆరు షోలతో గడిచిపోయిందిరా! శేష జీవితం నీ ఆటలు చూస్తూ గడిపేస్తారా! అని జేబులో రుమాలుతో కళ్ళుతుడుచుకున్నాడు. అలా తన వారసత్వాన్ని అగ్నిహోత్రానికి హోమంలో హవిస్సు ఇచ్చినట్టు తన హస్తాభరణమైన పేకదస్త్రాన్ని అతని చేతులో పెట్టి ' కార్డు తన్నేసాడు' **** పేకముక్కలు ఒక చేత్తో, సిగరెట్టు ఒక చేత్తో పట్టుకుని పట్టువదలని ' అగ్నిహోత్రుడు' పేకాట కాష్టాన్ని రగులుస్తున్నాడు. మాంఛి పట్టుదలగా ఆడ్తున్నాడు, చెమట్లు కక్కేస్తూ తీవ్రంగా ఆలోచిస్తూ డిస్ కార్డ్ చేస్తున్నాడు. ఆట మొదలై చాలా సేపైంది ఇద్దరిలో ఎవరు షో చూపిస్తారా అని అక్కడ నిలబడ్డ భూదేవి, కూతురు సంధ్య ఎదురు చూస్తున్నారు. " ముక్కెయ్యండి సారు! ఇక్కడ తడిసిపోతోంది ' ఆటాడుతున్న కొత్త కుర్రాడు విసుక్కున్నాడు. "ఉండెహ! నీ పేకలోకి ముక్క ఎక్కేత్తే షో చూపించేస్తావు". ఎకరాలు పోయినా పర్లేదు పేకలో డిఫెన్స్ చాలా ముఖ్యం అంటాడు మా చతుర్ముఖం మావయ్య, అంటూ పేకముక్కని గిరగిర విష్ణు చక్రంలా తిప్పి పడేసాడు. మీ ఇంటినిండా జోకర్లు నిండా! భలే ముక్కేసారండి ! అన్నీ ఉన్నా ఐదోతనం లేనట్టు అన్నీ ఉన్నాయి గాని లైఫులేదండి ! తమరు నన్ను ఇంటివాణ్ణి చేసారండి మావయ్య గారు! అని షో చూపించాడు. అబ్బ! ఫుల్ కౌంటు! అంటూ పేక ముక్కలు పడేసి నెత్తిమీద తువ్వాలేసుకుని దిగ్గున లేచాడు అగ్నిహోత్రం. ఆ కుర్రాడి మొహం కళావర్ కింగ్ లా వెలిగిపోయింది. అగ్నిహోత్రం చేతిలో కింగ్ సైజు సిగరెట్టు కాగడాల మండింది. అగ్నిహోత్రం తనకు మిగిలిన పొలం అంతా ఆటలో పోగొట్జుకుని రాంగ్ షో చూపెట్టినవాడిలా , నెయ్యి అనుకుని ఆముదం త్రాగిన వాడిలా వికారంగా ముఖం పెట్టాడు. క్షణ కాలం విషయం గుర్తొచ్చి మనిషి నీరుకారిపోయాడు.నిలువెల్లా వణికిపోయాడు. అగ్నిమీద ఆజ్యం బదులు నీళ్ళు పోసినట్టు చల్లారిపోయాడు. "ఐపోయింది! నా పరువంతా పోయింది. ఇంతకాలం పేకటలో కాలాన్ని, ధనాన్ని వృధాచేసాను., చేజేతులా! నా మీద ఆధారపడ్డ కుటుంబం ఏమై పోతుందో.. ! కన్నుమిన్ను కానక కన్న కూతుర్ని కూడా నీకు పణంగా పెట్టాను.. ఈ పాపానికి నిష్కృతి లేదు, అని ఏడ్చాడు. బాధపడకండి మామయ్య! అన్న పిలుపువినగానే ఉలిక్కిపడి తన కళ్ళు తనే నమ్మలేకపోయాడు. ఎవరు నీకు మావయ్య? "నేను వరుణ్ ని మామయ్య! చిన్నప్పుడే ఊర్లోంచి వెళ్ళిపోయిన నీ చెల్లెలు యమున కొడుకుని. ఆ రోజు అమ్మ పెళ్ళిచేసుకున్న మానాన్నని ఒప్పుకోక తాతగారు గెంటేస్తే ముంబయి వెళ్ళి సెటిల్ అయ్యాము. నువ్వు పేకాటలో ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకుంటున్నావని, తెలిసి నీతో పందెం కట్టాను. జూదం మత్తులో కన్నుమిన్ను కానక కన్నకూతురునే పణంగా పెట్టి ఈ యుగంలో మరో ధర్మరాజు అవతారమెత్తావు. మాకు భూదేవి అత్త నీ ధోరణి అంతా చెప్పుకుని ఏడ్చింది. అందుకనే ఈ నాటకం ఆడాం." "అందరూ క్షమించండి నన్ను! ఇంతలో ఎంత ఘోరం తప్పింది. నా చిట్టితల్లి ని ఈ వ్యసనం మత్తులో ఒళ్ళు తెలియక తాకట్టు పెట్టేద్దును" , అంటూ పేకముక్కలు విసిరికొట్టాడు. "నాన్న! నేను జువ్వలు చేసుకుంటానోచ్చ్! "అంటూ విసిరి పడేసిన పేకల్ని తీసుకుంటున్న పిల్లాణ్ణి ముద్దుచేసాడు. దీపావళికి జువ్వముట్టించాడు అగ్నిహోత్రుడు ఆనందంగా.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.